
1903లో వచ్చిన ‘ది గ్రేట్ ట్రెయిన్ రాబరీ’ 15 నిమిషాల చిత్రం. ‘నికెల్ఓడియన్’ థియేటర్లలో రోజుకు 30, 40 షోలు వేసేవారు. దాంతో ఆ థియేటర్ల యజమానులు చాలా ధనవంతులయ్యారు. ‘దిగ్రేట్ ట్రెయిన్ రాబరీ’ చిత్రం కేవలం ఒకరీలు సినిమా. ‘రీలు’ అంటే దాదాపు వెయ్యి అడుగుల నిడివి ఉంటుంది. పది − పన్నెండు నిమిషాలపాటు వస్తుంది. తమాషా ఏమిటంటే − సౌండ్ ఫిల్మ్కన్నా సైలెంట్ ఫిల్మ్ రీల్స్ నెమ్మదిగా తిరుగుతాయి. కాబట్టి సైలెంట్ ఫిల్మ్ రీల్స్ 15 నిమిషాల వరకు వస్తాయి. ఇప్పటికీ మనం సినిమా నిడివిని రీళ్ళలోనే గుర్తించడం విశేషం. మన తెలుగు సినిమాలు 14 రీళ్ళ పరిధిలో ఉండగా, ఆంగ్ల సినిమాలు 9−10 రీళ్ళలో ఉంటున్నాయి. 1905 నుంచి 1915 వరకు సినిమాలు చాలా వరకు ‘ఒక రీలర్’ ఫిల్మ్‌లే! అయితే ఒక్క రీలు సినిమా చూడ్డం అప్పట్లో ప్రేక్షకులకు సంతృప్తినిచ్చేది కాదు. అందుకే ‘నికెల్ఓడియన్’ యజమానులు ఒకేరీల్ ఫిల్మ్¬్సను ఐదారు కలిపి ఒకేసారి చూపించేవారు.
బ్రిటన్‌లోని బర్మింగ్‌హోమ్‌లో ఒక థియేటర్ ఇలా ఉండేదట. (1908లో సిటీ సర్వేయర్ రాసిన నివేదికలోంచి సేకరించిన భాగం ఇది−)
‘‘షాపు పొడవు 20 అడుగులు, వెడల్పు 14 అడుగులు. షాపు తలుపు దగ్గర ఒక స్త్రీ కూర్చొని లోనికి వచ్చేవారి దగ్గర ఒక్కో పెన్నీ వసూలు చేస్తూ, ఒక్కోరినీ లోనికి అనుమతించేది. లోపల అరవైమంది కూర్చునే వీలుంది. వీళ్లంతా బీరు డబ్బాల మీద కూర్చుంటారు. షాపు కిటీకీకి గోధుమ రంగు కాగితాన్ని అంటించారు. షాపు లోపలివైపు గోడకు సున్నంవేసి దాని మీద బొమ్మవేస్తూ, గోడనే స్క్రీన్‌గా ఉపయోగించేవారు.’’
ఈ వర్ణన చదివిన ఎవరికైనా నవ్వురాకతప్పదు. ఇప్పటి సినిమా టాకీసులతో ఒక్కసారి పోల్చిచూసుకోండి. నేడు థియేటర్లలో స్క్రీన్ ఎంత పెద్దదిగా ఉంటుందో, సీట్లెంత బాగుంటున్నాయో, ఇక లిఫ్టులు, ఎస్కలేటర్లు వంటివి సరేసరి! ఇంతకీ ఒక పెన్నీ ఇచ్చి వారేం చూసేవారు?
మొదట జంతువుల గురించిన ఒక రీలు. స్క్రీన్ పక్కనే కూర్చుని టాకీసు యజమాని కామెంటరీ చెప్పేవాడు. తర్వాత ఒక కామెడీ క్లబ్బులో బీరో, విస్కీయో తాగే కస్టమర్ మీద అగ్గిపుల్ల పడి అతని మీసాలు అంటుకోవటం, అల్లరి పిల్లలు ఇంటిలోని నీళ్లకొళాయిని విప్పితే.. ఇల్లంతా నీళ్ళమయం అయిపోవటం, నల్లగా పుట్టిన పిల్లలను తెల్లగా చేయటానికి ఆ పిల్లల్ని బండకేసి నర్సులు ఉతకటం... ఇలా అన్నీ హాస్యాన్ని కలిగించే సన్నివేశాలే!! చేతిలో గుడ్లున్న సంచితో నడుస్తున్న ఒక స్త్రీని పొరపాటున ఒక కారు డాష్ ఇవ్వటం, దాంతో ఆ గుడ్లన్నీ చితికిపోయి కోడిపిల్లలు రావటం. ఒక కారు డాష్ ఇవ్వగానే రోడ్డుమీద నడుస్తున్న ఓ వ్యక్తి ముక్కలు ముక్కలయిపోవడం, దాన్ని చూసి మరోవ్యక్తి వచ్చి.. మ్యాజిక్ చేసి ఆ ముక్కలన్నీ ఒక్కటి చేయగానే ఆ దెబ్బతిన్న వ్యక్తిలేచి మామూలుగా ఏమీ జరగనట్లే వెళ్లిపోవటం... ఇలా ఉండేవి నాటి కామెడి రీల్స్.
తర్వాత.. ఒక డ్రామా రీలు. అంటే సాధారణంగా ఏదో క్రైమ్ గురించి రీలు ఇది. ఆఖరున ఇంకొక కామెడీ రీలు తర్వాత అసలు సినిమా. ఇది మాత్రం మిగిలిన వాటికన్నా అయిదారు నిమిషాలు ఎక్కువ సేపు ఉండటం విశేషం. అప్పట్లో కూడా కొందరు నిర్మాతలు మంచి సినిమాలు తీసే ప్రయత్నం చేశారు. జార్జెస్మిలిస్.. రాబిన్సన్క్రూసో కథను 10 నిమిషాల సినిమాగా తీశాడు. ఎడ్విన్పోర్టర్ ‘అంకుల్టామ్స్ కేమిన్’ను ఒక రీలు సినిమాగా తీశాడు. ఒక డికెన్స్ రాసిన ‘ఆలివర్ ట్విస్ట్’, వాల్టర్స్కాట్ రాసిన ‘కెనిల్వర్త్’ షేక్స్పియర్ రాసిన ‘హామ్లెట్’ వంటివన్నీ 10−15 నిమిషాల సినిమాలుగా రానేవచ్చాయి. వీటితో పాటు క్రైస్తవానికి సంబంధించిన కొన్ని మతపరమైన కథలూ వచ్చాయి.
అప్పట్లో వచ్చిన మంచి సినిమాల్లో ‘రిస్కూ¬్యడ్ బై రోవర్’ అనేది ఒకటి. సెసిల్హెప్వర్త్ 1904లో ఈ సినిమా తీశారు. నిజానికి ఈ చిత్రాన్ని.. సినిమా మొదలైన తొలి పదిపదిహేను సంవత్సరాల కాలంలోనే ఉత్తమ చిత్రంగా చెప్పవచ్చు. దీని నిర్మాణానికి 7 పౌండ్ల 13 షిల్లింగుల 9 పెన్నీలయింది. సినిమాలో మొత్తం 23 షాట్స్ ఉన్నాయి. కొన్ని షాట్స్ కేవలం ఒకటి రెండు సెకన్లు మాత్రమే ఉండటం విశేషం. వేర్వేరు యాంగిల్స్లోంచి షాట్స్తీసి వాటిని ఎడిట్ చేసి ప్రెజెంట్ చేయటం ఈ చిత్రంలో ప్రత్యేకత.
ఇప్పుడు సినిమా రంగంలో అందరికీ సుపరిచితమైన...
1) కెమేరా ఎక్కడ పెట్టి ఏ షాట్నెలా తీయాలనేది (షూటింగ్)
2) తీసిన షాట్‌ను తర్వాత ఎలా కలపాలనే (ఎడిటింగ్) ప్రక్రియలను సిసిల్ హెప్‌వర్త్ పొఫెషనల్ రీతిలో ప్రారంభించాడని చెప్పొచ్చు.
ఇలా సిసిల్ హెప్‌వర్త్ తీసిన ‘రిస్కూ¬్యడ్ బై రోవర్’ చిత్రాన్ని ప్రేక్షకులెంతో ఆదరించారు. 400 ప్రింట్లు తీసినా ఇంకా డిమాండు తగ్గలేదు. నెగటివ్ పూర్తిగా అరిగిపోవటంతో హెప్‌వర్త్ అదే సినిమాను మరో రెండు సార్లు అచ్చం అలాగే తీయడం ఆ రోజుల్లో విశేష వార్త అయింది. ఆ తర్వాత ఎన్నెన్నో సైలెంట్ ఫిల్మ్¬్స తీసిన హెప్‌వర్త్, సైలెంట్ ఫిల్మ్ యుగాంతానికి ముందే చలనచిత్ర నిర్మాణాన్ని మానుకొన్నారు. అయినా 1953లో చనిపోయేవరకు ఆయనకు ఏదో ఒక విధంగా చలనచిత్ర నిర్మాణరంగంతోనే సంబంధాల్ని కొనసాగిస్తూ వచ్చారు.
1908లో ఎమిలీకోల్ అనే ఫ్రెంచ్ నిర్మాత తొలిసారిగా కార్టూన్ చిత్రం తీశాడు. 1908లోనే సినిమాల్లో సీరియల్స్ రావడం మొదలైంది. ‘నిక్‌కార్టర్, ది కింగ్ ఆఫ్ డిటెక్టివ్స్’ పేరుతో ఆరు ఎపిసోడ్ల సినిమా సీరియల్ వచ్చింది. విక్టోరియన్ జెస్సెట్ తీసిన ఈ నిక్‌కార్టర్ చిత్రాలు చాలా పేరు ప్రఖ్యాతులు పొందాయి. 1914లో ‘ది పెరిల్స్ ఆఫ్ పాలైన్’ అనే అమెరికన్ సినిమా వచ్చింది. పెరవల్వైట్ తీసిన ఆ సినిమా సీరియల్, అన్ని సినిమా సీరియల్స్‌లోకి చాలా గొప్పదంటారు చరిత్రకారులు. (సశేషం)