సినీ పరిశ్రమలో అందరూ జార్జెస్మిలిస్ వంటివారే ఉంటారనుకొంటే పొరబాటు. కొందరు, వ్యాపార రంగంలోని తమ తెలివితేటల్ని జతచేసి, సినిమాలు తీసి దాన్ని వ్యాపారంగా మలుచుకొని బాగుపడ్డవారూ ఉన్నారు. అలాంటివారిలో ఛార్లెస్వధె, ఎడ్విక్పోర్టర్ ముఖ్యులు.

ఛార్లెస్వధె ఫ్రాన్సు దేశస్థుడు. ఎడిసన్ రూపొందించిన కినిటోస్కోపులను ఫ్రాన్సులో ప్రవేశపెట్టిన ఘనుడు. ఇంగ్లండులో ప్రముఖ చలనచిత్ర నిర్మాతలు తీసిన సినిమాలను కొంచెం అటూఇటుగా కాపీ చేసి తనవిగా ఫ్రాన్సులో చలామణీ చేసుకొన్నాడు. చౌకలో సినిమాలను తీసి అమ్ముటం మొదలుపెట్టాడు. నిజానికి ఛార్లెస్వధెతోనే సినిమా ‘వ్యాపారం’ అయింది. ఒక ‘పరిశ్రమ’ అయింది. ఛార్లెస్వధె కారణంగానే ఫ్రాన్సు దేశం ఆ రోజుల్లో అత్యధిక సంఖ్యలో సినిమాలను నిర్మించే దేశంగా పేరుప్రఖ్యాతలు పొందింది. ఆయన కూడా చాలా సంపన్నుడయ్యాడు.
ఎడ్విన్ పోర్టర్ అమెరికా దేశస్థుడు. సముద్రాల మీద నౌకాయానంచేస్తూ దేశదేశాల్లో సినిమాలు ప్రదర్శిస్తూ ఆయన ‘ట్రావెలింగ్ షోమాన్’గా పేరుపొందాడు. తనను తాను ‘థామస్ఆల్వా ఎడిసన్’, ‘జూనియర్’గా చెప్పుకొనేవాడు. ఒక చిన్న దేశంలో అతను ఆ దేశాధ్యక్షుడిని పిలిచి సినిమా వేసి చూపించాడు. దేశాధ్యక్షుడికి సినిమా బాగా నచ్చిందికాని, తను రాగానే తన గౌరవార్థం ఎడ్విన్ పోర్టర్ ఫిరంగుల్ని పేల్పించలేదనిమాత్రం ఆయనకు కోపం వచ్చింది. ఆ కోపంతోనే ఆయన మర్నాడే పోర్టర్‌ను అరెస్టు చేయించాడు. సరే, ఆ జైల్లోంచి బయటపడ్డాక పోర్టర్ అమెరికాకు తిరిగొచ్చి, థామస్ అల్వా ఎడిసన్ (సీనియర్) దగ్గర ఉద్యోగానికి దిగి, సినిమా నిర్మాణం మీద దృష్టి నిలిపాడు. మిలిస్, రాబర్ట్‌పాల్, జివస్మిత్, జేమ్స్ విలియమ్సన్, సెసిల్ హెప్‌వర్త్, వధె వంటి వారి చిత్రనిర్మాణ పద్ధతులు అధ్యయనం చేశాడు.
మిగిలిన సంగతులెలా ఉన్న 1903లో పోర్టర్తీసిన ‘ది గ్రేట్ ట్రైన్ రాబరీ’ చిత్రం గురించి మాత్రం చెప్పుకోవాలి. అన్ని విధాలా అది తొలి వెస్టర్న్ సినిమా. ఇప్పుడు మనకు చాలా సినిమాల్లో కనిపించే సన్నివేశాలు ఆ సినిమాలోకి తొలిసారి దర్శనం ఇవ్వటం విశేషం. పేరునుబట్టే తెలుస్తుంది, దానికథ ఎలా ఉండి ఉంటుందో! ట్రైన్‌ను ఆపడం, దోపిడీ చేయటం, ఫైటింగ్, షూటింగ్, గుర్రాల మీద ఒకర్నిఒకరు వెంబడించుకొనే ఛేజింగ్ సీన్లు, ఆఖరికి ఒక డాన్సు సన్నివేశం − అన్నీ ఉన్న సినిమా అది. ఒక వార్తా పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా తానా సినిమా తీసినట్లుగా పోర్టర్ చెప్పుకొన్నాడు. ‘దిగ్రేట్ ట్రైన్ రాబరీ’ అన్నివిధాలా హిట్ సినిమా. ఆరోజుల్లో అమెరికా మొత్తం మీద సుమారు ఒక పాతిక సినిమా హాళ్లు ఉండేవేమో (ఇప్పుడు వీటి సంఖ్య దాదాపు యాభైవేలు దాకా ఉంటుంది). ఎక్కడ ‘దిగ్రేట్...’ సినిమా వచ్చినా, జనం వేలంవెర్రిగా వచ్చి చూసేవారు. ఇదేదో మంచి వ్యాపారంలాగ ఉందే అనుకుంటూ ఎందరో సినిమా రంగంలోకి దూకటానికి ప్రేరేపించిన సినిమా ‘దిగ్రేట్ ట్రైన్ రాబరీ’. 5 సెంట్లు టిక్కెట్టు పెట్టి కొందరు సినిమా హాళ్లు కూడా కట్టించారు. 5 సెంట్లనడాన్ని ఆరోజుల్లో ‘నికెల్’ అనేవారు. అందుకే ఆ సినిమా హాళ్లకు ‘నికెల్ ఓడియన్’ అని పేరొచ్చింది. ‘నికెల్ ఓడియన్’లను నిర్మించిన హాలీవుడ్ ప్రముఖుల్లో ఆడాల్ఫ్ జుకోర్, మార్కస్ల్యూ కార్ల్లెమ్లె, విలియమ్ఫాక్స్, వార్నర్ బ్రదర్స్ ముఖ్యులు.
తొలి ‘నికెల్ ఓడియన్’ రూపొందిన ఏడాదిలోనే అమెరికా మొత్తంమీద ‘నికెల్ ఓడియన్’ థియేటర్లు వందల సంఖ్యలో వెలిశాయి. అమెరికా − సినిమా ప్రేక్షకుల దేశం అయింది. ఒక్కసారి మనం మళ్లీ సినిమా థియేటర్లలోంచి సినిమా నిర్మాణంవైపు చూపు మళ్లిద్దాం. ఇప్పుడు చెప్పుకోవల్సింది... ఫిల్మ్స్టూడియోల గురించి.
ఎడిసన్ సినిమాలు తీస్తున్న తొలిరోజుల్లో ఆయన అసిస్టెంట్ డిక్సర్ ఎడిసన్ లాబరేటరీ వెనక 1894లో ఒక ఫిల్మ్‌స్టూడియో కట్టాడు. దానికి ఆయన ‘కినిటో స్కోప్ థియేటర్’ అని పేరుపెట్టినా, అందరూ దాన్ని ముద్దుగా ‘బ్లాక్మేరియా’ అని పిల్చుకొనేవారు. చివరికి దానికాపేరే స్థిరపడింది. ఆ స్టూడియో పెద్ద ఉడెన్షెడ్లా ఉండేది. లోపల బయటా అంతా నల్ల రంగు పెయింట్ వేశారు. అందుకే దానికి ‘బ్లాక్మేరియా’ అనే పేరు వచ్చింది. పైనుండే కప్పు (రూఫ్)ను కొంత తొలిగిస్తేచాలు, పైనుంచి ఎండ లోపలికి పడేది. నటీనటులు అక్కడ నటించేవారు. ఆ నటీనటుల వెనుక భాగం నల్లగా ఉండటంతో బొమ్మ సృష్టంగా కనిపించేలా సూర్యుడు ఎటు ఉన్నా సూర్యరశ్మి లోపలికి పడేలాగ, స్టూడియోనంతా పట్టాల మీద పెట్టి, స్టూడియోను సూర్యరశ్మికి అనుగుణంగా తిప్పేవారు. ఎడిసన్ కెమేరా ఎలక్ట్రిసిటీ మీద నడిచేది. సినిమా తీస్తున్నప్పుడే ధ్వనికూడా ముద్రించుకొంటే ఎలా ఉంటుందనే ఆలోచనతోనే ఎడిసన్ ఈ ఫోనోగ్రాఫ్ పెట్టాడుగానీ ఆయన తీసినవన్నీ మూకీలే అయినాయి.
డిక్సన్ 1897లో న్యూయార్క్‌లో ఒక భవంతి మీద తొలి ‘ఓపెన్‌ఎయిర్ స్టూడియో’ కట్టించాడు. బ్లాక్మారియాలాగానే ఇదీ పట్టాలమీదే గుండ్రంగా తిరిగేది. సూర్యరశ్మికి అనుగుణంగా మొత్తం స్టూడియోను తిప్పగల అవకాశం ఉండేది. కేమేరాను మధ్యలో ఉంచేవారు. డైరెక్టర్ మాత్రం స్టేజీ మీదే ఉండేవాడు. ప్రపంచంలో తొలి సినీస్టూడియోలు ఇవే!! (సశేషం)