
అనుకోకుండా కెమెరా ఆగిపోవడంతో మిలిస్ తీస్తున్న సినిమా కొన్ని క్షణాలపాటు ఆగి మళ్లీ ప్రారంభమయింది. ఆ క్షణాకాలం జరిగిన ‘తప్పు’ ఫలితంగా మిలిస్కు చలనచిత్ర చరిత్రలో స్థానం స్థిరమయింది. బస్సు స్థానంలో ‘శవవాహిక’ కనపడటంతో మిలిస్ అలాంటి తప్పునే మళ్ళీ మళ్ళీ చేయదలిచాడు. ఫలితమే ‘ట్రిక్ ఫిలిమ్స్ ’ ఈ టెక్నిక్‌నే అంటే
కెమెరాను కొన్ని క్షణాలపాటు ఆపి, కెమెరా ముందు దృశ్యాన్ని మార్చి, మళ్ళీ షూటింగ్ ఆరంభించటమనే టెక్నిక్‌తో మిలిస్ ఎన్నెన్నో చలనచిత్రాలు తీశాడు. ఆయనే ‘ట్రిక్ ఫోటోగ్రఫీ’కి ఆద్యుడు.
ఆయన తీసిన అనేకానేక సినిమాల్లో చెప్పుకోదగ్గది ‘దివానిషిహ్ ఉమన్’. ఒక స్త్రీ మిలిస్ ఇంటి ముందు కుర్చీలో కూర్చొని ఉంటుంది. మిలిస్ వచ్చి ఒక మంత్ర దండంతో ఆమె పైన అలా అంటాడు. అంతే ఆ మంత్రం ఫలితంగా ఆమె కాస్తా మాయమవుతుంది. ఇది మిలిస్కెంతో మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఆ స్ఫూర్తితో మిలిస్ ఆరునెలల కాలంలోనే 80 ఫిల్ములు తీశాడు. అంతలోనే వేసవి వెళ్ళి శీతకాలం వచ్చింది. శీతకాలం అంటే సూర్యరశ్శి తక్కువగా ఉండటమే గదా! మరి తగినంత సూర్యరశ్శి లేకుంటే సినిమా తీయటం ఎలా? అనేది మిలిస్కు పెద్ద ప్రశ్న అయింది. తల బద్దలు కొట్టుకొనేంతగా మిలిస్ ఆలోచించాడు. అసలు సూర్యరశ్శి లేకుండా సినిమా తీయలేమా? అనుకున్నాడు. ‘సూర్యరశ్శికి బదులు చాలా శక్తిమంతమైన ఆర్క్ లైట్లను థియేటర్లో ఉపయోగిస్తే ఎలా ఉంటుంది’! అనుకొన్నాడు. అనుకోవటం తడవు దాన్ని ఆచరణలో పెట్టాడు. మిలిస్. అదేరోజుల్లో పాలస్ అనే ఒక గాయకుడు ఉండేవాడు. తను పాటలు పాడుతుంటే దాన్ని సినిమాగా తీయాలని పాలస్ మిలిస్ను కోరాడు. మిలిస్ దాన్ని ‘ఓకే’ చేశాడు. పాలస్ పాడుతుంటే, నిశ్శబ్ద చలన చిత్రాలను తొలిసారిగా తన థియేటర్ స్టేజీ మీద పెద్ద పెద్ద ఆర్క్లైట్లతో తీశాడు. అవి తెరమీద వస్తోంటే, పక్కనే నిలబడి పాలస్, తెరమీద పెదవులు కదిలించే తన బొమ్మతో పాటలు పాడేవాడు! ఇలా చూస్తే మిలిస్ తీసిన ఈ సినిమాయే తొలి ఇన్డోర్ షూటింగ్! తమాషాగా చెప్పుకోవాలంటే
పాలస్ తొలి ‘పార్శ¬్వ గాయకుడు’ (బ్యాగ్రౌండ్ సింగర్). ఎటొచ్చి పాలస్ తనకు తానే తొలిసారిగా పాట పాడుకోవడం విశేషం!
1900 నాటికి మిలిస్ దాదాపు వంద సినిమాలు తీశాడు.దీంతో ఆయన పేరు ప్రపంచ ప్రఖ్యాతమయింది. ఇప్పుడు మనం అనుకుంటున్న ‘ఫేడ్ ఇన్’, ‘ఫేడ్ అవుట్’, ‘మిక్స్’
అనే టెక్నికల్ పద్ధతులన్నిటినీ ఆయనే రూపొందించాడు. 1900− 1902 వరకు కూడా సినిమాలన్నీ ఒకటి రెండు నిమిషాలు పరిమితిలోనే ఉండేవి. అసలు మరికొంత సేపు
ప్రేక్షకుల్ని కూర్చోబెట్టలేమా అని ఆలోచించి మిలిస్ 1902లో ‘ఏ ట్రిప్ టుది మూన్’ పేరుతో ఒక సినిమా తీశాడు. ఇది దాదాపు 15 నిమిషాలుండే సినిమా, ఇందులో 30 వేర్వేరు సన్నివేశాలుండటం విశేషం. వీటిని ఆయన అతి జాగ్రత్తగా కూర్చి, ప్రేక్షకులకు అందించాడు. దాంతో ‘ఫిల్మ్ ఎడిటింగ్’ ప్రక్రియకు కూడా ఆయనే శ్రీకారం చుట్టినట్లు భావించవచ్చు.

‘ఏ ట్రిప్ టుది మూన్’ లో ఒక వ్యోమనౌక భూలోకం నుంచి బయలుదేరి చంద్రుడ్ని చేరుతుంది. అక్కడ ఉండే ‘మూన్మెన్’ భూలోకవాసుల్ని పట్టుకొంటారు. అయినా భూలోకవాసులు ఎలాగో తప్పించుకొని, తమ వ్యోమనౌకలో తిరుగుప్రయాణం ఆరంభిస్తారు. దురదృష్టవశాత్తు వాళ్లు సముద్రంలో పడిపోతే, ఇక్కడి ‘భూలోక’ వాసులు వారిని
ఆదుకుంటారు. క్లుప్తంగా ఇదీ కథ. అయితేనేం జార్జెస్ మిలిస్ ఈ ‘ట్రిప్ టుది మూన్’లో ఒక కథను పెట్టాడు. కొన్ని సన్నివేశాలు సృష్టించాడు. కొందరు నటుల్ని పెట్టాడు. సన్నివేశ బలానికి కొన్ని ‘సీనరీ’లు పెట్టాడు. నటన బాగుండకపోవచ్చు. చిత్రీకరణ బాగుండకపోవచ్చు. అయితేనేం మిలిస్ మాత్రం ‘కథాచిత్రా’ల యుగాన్ని ఆరంభించాడు! కానీ అసలు సినీ రంగంలోని చిత్రమే అది కాబోలు! చరిత్రలో శిఖరాలెన్ని ఆధిరోహించినా వ్యక్తిగతంగా ఎన్నో కష్టాలు పాలుకావడం సినీరంగంలో చాలామందికి నుదుటనున్న గీత కాబోలు మిలిస్ జీవితమూ అంతే అయింది. ఎందర్నో నమ్మి మోసపోయినవాళ్ళెందరో సినీ రంగంలో ఉంటారు. మిలిస్ అలాంటివారిలో కూడా ఆయన ఆద్యుడే! ఎన్ని సినిమాలు తీసినా, వ్యాపారం సరిగ్గా చేసుకోవడం రాలేదతనికి, ఫలితంగా ఎందరో అతన్ని ఎన్నో విధాల నాశనం చేశారు. అతను తీసిన 300 సినిమాల నెగిటివ్‌లను ఎవరో దోచుకుపోయారు. దాంతో మిలిస్ ఆర్థికంగా పతనమయ్యాడు. గతిలేని స్థితిలో మిలిస్ 1914లో చలనచిత్ర నిర్మాణానికి స్వస్తి చెప్పి తన సినిమాలన్నీ అమ్మేశాడు. కొనుక్కున్నవారు ఆ సినిమాలన్నీ తర్వాత కరిగించేశారు. అదృష్టవశాత్తు ఒక్క బాక్స్ మాత్రం మిగిలిపోయింది. ఆ బాక్సులో మిగిలిన కొన్ని సినిమాలు ఇప్పటికీ సుస్థిరంగా ఉండటం నిజంగా మన అదృష్టం.
ఆ తర్వాత మిలిస్ను చిత్రరంగం మర్చిపోయింది. 1928లో పారిస్ రైల్వేస్టేషన్ మీద బొమ్మలు అమ్ముకొంటున్న మిలిస్ను కొందరు మిత్రులు గుర్తుపట్టి, తలా కొంత విరాళం వేసుకొని అతని జీవనం కోసం ఒక బడ్డీ కొట్టును కొనిపెట్టారు. కానీ అప్పటికే ఆరోగ్యాన్ని కోల్పోయిన మిలిస్ దాన్ని నడుపుకోలేకపోయాడు. ఆఖరికి తన జీవితంలోని చివరి అయిదేళ్ళు ఒక అనాథాశ్రమంలో గడిపి మిలిస్ కన్నుమూశాడు. అయితేనేం చలన చిత్ర చరిత్రలో మాత్రం ఆయన చేసిన సేవ సుస్థిరం, చరితార్థం. సినీ రంగంలో ప్రతివారికీ ఆయన ప్రాతఃస్మరణీయుడు. (సశేషం)