సినిమా దాని పుట్టు‌పూ‌ర్వో‌త్త‌రాలు−7
ప్యారిస్‌లో తొలి సినిమా ప్రదర్శన

article image

పారి‌స్‌లో గ్రాండ్‌ కేఫ్‌లో జరి‌గిన తొలి సినిమా ప్రద‌ర్శన ‌‘సూప‌ర్‌హిట్‌’‌ అయ్యింది.‌ ‌‘సినిమా’‌ పేరుతో తాము చూసింది ఎంత ఆశ్చ‌ర్యంగా ఉందో, అద్భు‌తంగా ఉందో కొందరు చెప్తే, మరి‌కొం‌దరు ఆ ఆస‌క్తి‌తోనే గ్రాండ్‌ కేఫ్‌కు వెళ్ళి‌మరీ చూశారు.‌ క్రమంగా అక్కడ రష్‌ పెర‌గ‌డంతో పోలీ‌సులు కూడా వచ్చి ప్రేక్ష‌కుల్ని అదు‌పులో ఉంచాల్సి వచ్చింది.

‌లండన్‌లో మరో ప్రయత్నం...
పారి‌స్‌లో షో జరి‌గిన రెండు నెల‌లకు లండ‌న్‌లో తొలి సినిమా షో జరి‌గింది.‌ రీజెం‌స్‌స్ట్రీ‌ట్‌లోని పాలి‌టె‌క్నిక్‌ సమీ‌పంలో ఉన్న ఒక భవం‌తిలో 1896 ఫిబ్రవరి 20న తొలి షో జరి‌గింది.‌ అయితే ఇంగ్లం‌డ్‌లో తొలి‌ సి‌ని‌మాను ఒక ఫ్రెంచి దేశీ‌యుడు వేయ‌డ‌మే‌మిటా అని ఎందరో బాధ‌ప‌డ్డారు.‌ అలా మన‌స్తాపం చెందిన వారిలో రాబ‌ర్ట్‌‌పాల్‌ ఒకడు.‌ అతను అప్ప‌టికే ‌‘థియే‌ట‌ర్‌గ్రాఫ్‌’‌ పేరుతో ఒక సినిమా యంత్రాన్ని రూపొం‌దిం‌చ‌గ‌లి‌గాడు.‌ ఎడి‌సన్‌ తన కినె‌టో‌స్కో‌పు‌లను ఇంగ్లం‌డుకు తెచ్చి‌న‌పుడు, ఇద్దరు గ్రీకులు లండ‌న్‌లో కూడా కినె‌టో‌స్కో‌పు‌లను పెడితే ఎలా ఉంటుందో ఆలో‌చిం‌చ‌ల్సిం‌దిగా రాబ‌ర్ట్‌‌పా‌ల్‌ను అడి‌గారు.‌ అచ్చం ఎడి‌సన్‌ రూపొం‌దిం‌చిన కినె‌టో‌స్కో‌పు‌ల‌ వం‌టివే రూపొం‌దిం‌చా‌ల్సిం‌దిగా వారు పాల్‌ను అడి‌గారు.‌ ఎడి‌సన్‌ యంత్రా‌లను అలా కాపీ కొట్ట‌డా‌నికి రాబ‌ర్ట్‌‌పాల్‌ ముందు ఒప్పు‌కో‌లేదు.‌ కానీ తర్వాత ‌‘కినో‌టో‌స్కోపు’‌లపై ఇంగ్లం‌డ్‌లో ఎడి‌సన్‌ పేటెంట్‌ రైట్స్‌ తీసు‌కో‌లే‌దని తెలు‌సు‌కు‌న్నాక పాల్‌ ‌‘సరే’‌నన్నాడు.‌ వెంటనే కొన్ని కినె‌టో‌స్కో‌పు‌లనూ తయా‌రు‌చేసి ఇచ్చాడు.‌ అయితే తన దగ్గర కినె‌టో‌స్కో‌పులు కొన్న‌ వా‌ళ్ళకే ఫిల్ము‌లను అమ్ము‌తా‌నని ఎడి‌సన్‌ స్పష్టం చేయ‌టంతో, గ్రీకుల కోసం పాల్‌ తయా‌రు‌చేసే కినె‌టో‌స్కో‌పులు దేనికీ పని‌కి‌రా‌కుండా అయి‌పో‌యాయి.‌ ఈ సమ‌స్య‌ త‌లె‌త్త‌గానే రాబ‌ర్ట్‌‌పాల్‌ ఫిల్ముల తయా‌రికీ నడుం‌క‌ట్టాడు.‌ ఒక కెమెరా తయారు చేసి దాంతో ఫిల్ములు తీయ‌సా‌గాడు.‌ ఈ కెమె‌రాకు, లుమి‌యర్‌ సోద‌రులు తమ ‌‘సిని‌మా‌టో‌గ్రాఫ్‌’‌కు పేటెం‌ట్‌రైట్స్‌ తీసు‌కున్న ఆరు వారా‌లకు, రాబర్ట్‌ పాల్‌ కూడా రైట్స్‌ తీసు‌కు‌న్నాడు.‌ తన ఫిల్ము‌లను తెర‌మీద చూపించే యంత్రాన్ని కూడా పాల్‌ రూపొం‌దిం‌చాడు.

article image
‌ 1895 డిసెం‌బ‌ర్‌లో ఒక‌రోజు రాత్రి ఒంటి‌గం‌టకు తొలి‌సా‌రిగా రాబ‌ర్ట్‌‌పాల్‌ తన ‌‘థియే‌ట‌ర్‌గ్రాఫ్‌’‌తో ఒక గోడ‌మీద బొమ్మ ప్రాజెక్ట్‌ చేశాడు.‌ అక్కడ బొమ్మ చూడ‌గానే వాళ్ళలో ఆనందం నిండి‌పో‌యింది.‌ తర్వాత, పది‌మం‌దిని పిల్చి రాబ‌ర్ట్‌‌పాల్, తన థియే‌ట‌ర్‌లో గ్రాఫ్‌ను చూపిం‌చాడు.‌ పది‌మందీ దాన్ని బాగుం‌ద‌ని‌చె‌ప్పాక, వెళ్ళి లుమి‌యర్‌ సిని‌మాలు చూశాడు.‌ తన థియే‌ట‌ర్‌గ్రాఫ్‌ కన్నా లుమి‌యర్‌ సోద‌రులు రూపొం‌దిం‌చిన ‌‘సిని‌మా‌టో‌గ్రాఫ్‌’‌ బాగుం‌దని, లుమి‌యర్‌ వాళ్ళ యంత్రంలో బొమ్మలు నిల‌క‌డగా ఉన్నా‌యని రాబ‌ర్ట్‌‌పాల్‌ గుర్తిం‌చాడు.‌

లుమియర్‌ అభిప్రాయం...
లూయీ లుమి‌య‌ర్‌కు తన ‌‘సిని‌మా‌టో‌గ్రాఫ్‌’‌ ప్రపం‌చ‌వ్యా‌ప్తంగా సృష్టి‌స్తున్న సందడి సంతో‌షాన్ని కలి‌గి‌స్తున్నా ‌‘ఇదెం‌దుకూ పని‌కి‌రా‌దన్న’‌ అభి‌ప్రా‌యమే అత‌నిలో పెరి‌గింది.‌ అమె‌రికా, రష్యా, ఆఫ్రికా, మెక్సికో, టర్కీ, ఆస్ట్రే‌లియా, జపాన్‌ దేశా‌ల‌తో‌బాటు మన దేశం‌లోని బొంబా‌యిలో సైతం లుమి‌యర్‌ సోద‌రులు తమ చిత్రా‌లను ప్రద‌ర్శిం‌చారు.‌ ప్రద‌ర్శి‌త‌మ‌యిన అన్ని‌చోట్లా ‌‘హిట్‌’‌ అవు‌తు‌న్నా‌ కానీ, లుమి‌యర్‌కు మాత్రం ‌‘ఇదో తాత్కా‌లి‌క‌మైన క్రేజ్‌’‌ అన్న అభి‌ప్రా‌యమే ఉండే‌ది‌గానీ, అది పది‌కా‌లా‌ల‌పాటు నిల‌బ‌డు‌తుం‌దనే ఆశ‌కానీ, నమ్మకం కానీ అత‌నిలో ఉండే‌ది‌కాదు.‌ అందుకే ‌‘నాకు కూడా సిని‌మా‌టో‌గ్రాఫ్‌ నేర్చు‌కో‌వా‌లనే ఆశ ఉందంటూ’‌ ఒక వ్యక్తి లుమి‌య‌ర్‌కు ఉత్తరం రాస్తే.. ‌‘నాయనా! జీవి‌తంలో పైకి రావా‌ల్సి‌న‌వా‌డివి ఈ సిని‌మాను నమ్ము‌కొంటే ఏముం‌టుంది భవి‌ష్యత్తు! దీని ‌కథ ఏడాది రెండే‌ళ్ళకు మించి ఉండదు!’‌ అంటూ లుమి‌యర్‌ జవా‌బి‌చ్చాడు. ఇప్పుడే గనుక లుమి‌యర్‌ సజీ‌వు‌డయి ఉంటే తను కని‌పె‌ట్టిన ‌‘సిని‌మా‌టో‌గ్రాఫ్‌’‌ ప్రపం‌చ‌మంతా ప్రజల్ని ఎలా గంగ‌వె‌ర్రు‌లె‌త్తి‌స్తు‌న్నది గ్రహించి ఆశ్చ‌ర్యంలో తల‌ము‌న‌క‌లయి ఉండే‌వాడు!!

article image
ఒక హాలు నుంచి మరో హాలుకి...
లుమి‌యర్‌ తన సిని‌మా‌టో‌గ్రా‌ఫ్‌కోసం ‌‘ట్రెయిన్‌ ఎంట‌రింగ్‌ ఏ స్టేషన్‌’, ‌‘నాకింగ్‌ డౌన్‌ ఏ వాల్‌’, ‌‘వాట‌రింగ్‌ ది గార్డె‌నర్‌’‌ వంటి వాటి‌తో‌బాటు ఎన్నెన్నో సిని‌మాలు తీసాడు. అప్పట్లో సిని‌మాల ప్రద‌ర్శనలు ‌‘చిత్రం’‌గానే జరి‌గేవి.‌ సిని‌మాలు వేసే కొన్ని ‌‘మ్యూజి‌క్‌హాల్స్‌’‌ ఉండేవి.‌ ఒక మ్యూజి‌క్‌హాల్లో ప్రద‌ర్శన పూర్తి‌కా‌గానే ‌‘సిని‌మాటో గ్రాఫ్‌’‌ను భుజాన వేసు‌కుని, ఆప‌రే‌టర్‌ వేరే హాలుకు వెళ్ళే‌వాడు.‌ ఇప్పుడు పెద్ద‌పెద్ద పట్నాల్లో కొత్తగా విడు‌ద‌లయ్యే సిని‌మా‌రీ‌ళ్ళను వెంట వెంటనే వేర్వేరు టాకీ‌సు‌లకు చేర్చ‌డా‌నికి ఆటోలు, టాక్సీలు ఎలా ఉంటు‌న్నాయో, అప్పట్లో సిని‌మా‌టో‌గ్రా‌ఫ్‌లను వేర్వేరు హాళ్ళకు చేర్చ‌డా‌నికి టాక్సీలు సిద్ధంగా ఉండేవి.‌ ఇలా ఒకే‌రో‌జున ఒకే ఆప‌రే‌టర్‌ రెండు మూడు హాళ్లలో ప్రద‌ర్శ‌నలు ఇస్తుం‌డే‌వారు.‌

తొలి న్యూస్‌ ఫిల్మ్‌...
ఇంగ్లం‌డులో సిని‌మా‌లకు ఆద్యు‌డ‌యిన రాబ‌ర్ట్‌‌పా‌ల్‌కు ఎప్పుడూ ఏదో కొత్తది చేయా‌లనే తపన ఉండేది.‌ అందుకు ప్రజల్ని ఏది ఆక‌ట్టు‌కుం‌టుందా అని ఆయన ఎప్పుడూ ఆలో‌చిస్తూ ఉండే‌వాడు.‌ నిజ‌మైన సంఘ‌ట‌న‌లంటే ప్రజ‌లకు ఆస‌క్తిగా భావిస్తూ, రాబర్ట్‌ పాల్‌ 1896లో జరి‌గిన డెర్బీ గుర్రప్పం‌దా‌లను ఫిల్ము చేశాడు.‌ ‌‘ది డెర్బీ 1896’‌ పేరుతో ప్రద‌ర్శి‌త‌మ‌యిన ఆ ఫిల్మ్‌ తొలి న్యూస్‌ ఫిల్ముగా అను‌కో‌వచ్చు.‌ అలాగే 1901లో క్వీన్‌ విక్టో‌రియా మృతి తర్వాత ఆమె ఖన‌నాన్ని కూడా ఆయన చిత్రీకరించాడు.‌ ఈ చిత్రం చాలా‌మం‌దిని ఆక‌ట్టు‌కుంది.‌ ఇలాంటి ‌‘వార్తా చిత్రా’‌లతో‌ పాటు రాబ‌ర్ట్‌‌పాల్‌ స్వయంగా నటిస్తూ కొన్ని చిత్రాలు తీశాడు.‌ ‌‘ఫన్నీ‌ఫే‌సెస్‌’‌ పేరుతో నవ్వు పుట్టించే ఎక్స్‌‌ప్రె‌షన్స్‌ ఇస్తూ రాబర్ట్‌ పాత్రతో సిని‌మాలో కామె‌డీని ప్రవే‌శ‌పె‌ట్టాడు. జేమ్స్‌ విలి‌య‌మ్‌సన్‌ అనే మరో ఆంగ్ల చిత్రని‌ర్మాత సిని‌మాల్లో ‌‘షాట్‌ డివి‌జన్‌’‌ ప్రవే‌శ‌పె‌ట్టాడు.‌ ‌‘ఎటాక్‌ ఆన్‌ ఏ చైనీస్‌ మిషన్‌’‌ పేరుతో ఆయన ఒక చిన్న కథను ఆరు సెప‌రేట్‌ షాట్స్‌లో తీశాడు.‌ ఏక‌మొ‌త్తంగా ఒకే‌సారి కాకుండా కథను డివై‌డ్‌చేసి, వేర్వేరు షాట్స్‌లో తీయ‌ట‌మ‌నేది ఆయ‌నతో ఆరం‌భ‌మ‌యింది.‌ (సశేషం)

article image


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.