సినిమా దాని పుట్టు పూర్వోత్తరాలు 6
అసలు సినిమా కథ పారి‌స్‌లో అరం‌భ‌మ‌వు‌తుంది.‌ ఇంత‌వ‌రకు చెప్పు‌కొ‌న్న‌దంతా ప్రస‌వ ‌వే‌దన అయితే సినిమా జననం ఎలా జరి‌గిందో ఇప్పుడు చెప్పు‌కో‌వాల్సి వుంది.‌ మన సిని‌మాకు స్పష్ట‌మైన రూపాన్ని కలి‌గిం‌చి‌న‌వారు లూమి‌యర్‌ సోద‌రులు. 1895 డిసెం‌బరు 28న సినిమా జన్మిం‌చింది. అదే దాని పుట్టి‌న‌ రోజు.‌

article image
* ఖ్యాతి దక్కాల్సిందంతా లూయికే..
పారి‌స్‌లోని గ్రాండ్‌ కేఫ్‌లో తొలి‌సారి సినిమా ప్రద‌ర్శన జరి‌గింది.‌ తన కుమా‌రులు అగాస్ట్, లుయీలు రూపొం‌దిం‌చిన సిని‌మా‌టో‌గ్రాఫ్‌ యంత్రాన్ని నడి‌పిస్తూ తెర‌మీద కదిలే బొమ్మల చిత్రా‌లను చూపిం‌చ‌టా‌నికి ఆంటోని, లూమియర్‌ గ్రాండ్‌కే‌ఫ్‌లో సిద్ధంగా ఉన్నారు.‌ గదిలో వంద కుర్చీలు, వాటికి ముందొక పెద్ద‌తెర, కుర్చీల వెనుక ఒక మెషిన్, దాంట్లో అమ‌ర్చ‌టా‌నికి వీలుగా ఉన్న సెల్యూ‌లా‌యిడ్‌ ఫిల్మ్‌. ఇదీ ఎడి‌సన్‌ ఉప‌యో‌గిం‌చిన సెల్యు‌లా‌యిడ్‌ ఫిల్మ్‌‌వం‌టిదే అయినా, దీంట్లో ప్రతి బొమ్మ‌ప‌క్కన కేవలం రెండే రంధ్రాలు ఉండటం విశేషం.‌

అగాస్ట్, లూయీ సోద‌రు‌లి‌ద్ద‌రి‌లోనూ నిజంగా ఖ్యాతి దక్కాల్సిందంతా లూయికే.‌ అతడే ఈ యంత్రా‌నికి అస‌లైన సృష్టి‌కర్త. ప్రద‌ర్శించే చిత్రా‌లను సైతం లూయియే రూపొం‌దిం‌చాడు.‌ ఎటొచ్చీ అగాస్ట్, లూయీకి సహా‌యం‌ చే‌సే‌వాడు.‌ లూమి‌యర్‌ కుటుంబం పారి‌స్‌కు 250 మైళ్ల దూరం‌లోని లయోన్స్‌ నగ‌రంలో ఉండేది. ఫొటో‌గ్రా‌ఫర్లు ఉప‌యో‌గించే గ్లాస్‌ప్లేట్స్‌ తయా‌రు‌చే‌యటం ఆ కుటుంబం వృత్తి. ఎడి‌సన్‌ తయా‌రు‌చే‌సిన కిని‌టో‌స్కో‌ప్‌లను ఆంటోనీ చూశాడు.‌ ఒకే‌సారి వంద‌మంది చూడ‌గ‌లి‌గే‌ట్లుగా కిని‌టో‌స్కో‌ప్‌ను తయా‌రు‌చేస్తే బాగుంటుంది కదా అను‌కొని, ఆ మాట తన కుమా‌రు‌లతో అన్నాడు.‌ ఆయన కుమా‌రులు ఆలో‌చ‌న‌ల్లో‌ప‌డ్డారు.‌ లూయీ, అగా‌స్ట్‌‌లలో లూయీ ఆరోగ్యం ఏమీ బాగుం‌డేది కాదు. ఎప్పుడూ అత‌నికి వద‌లని తల‌నొప్పి. అందుకే అసలు స్కూలుకు వెళ్లే‌వా‌డు‌ కాదు.‌ మంచం ‌మీద పడు‌కుని ఏదో ఒకటి ఆలో‌చిస్తూ ఉండటం అతని పద్ధతి.‌ ఒక‌రో‌జున అలా ఆలో‌చి‌స్తుం‌డ‌గానే అత‌నికో మెరు‌పు‌లాంటి ఐడియా వచ్చింది.‌ మామూలు కుట్టు‌మి‌షన్‌లో బట్ట‌ ముం‌దుకు కదు‌లు‌తోంది పైన అయితే, కింద వుండే పళ్లు బట్టను ముందుకు జరు‌పు‌తుం‌టాయి.‌ అలాగే ఫిల్మ్‌ను కూడా ముందుకు జరి‌పేలా చెయ్య‌గ‌లి‌గితే.‌..‌ అను‌కొ‌న్నాడు.‌ అంతే.‌.‌ ఆ ఆలోచనను కార్య‌రూ‌పంలో పెట్టాడు.‌ అప్పుడే ఫిల్మును ముందుకు కది‌పే ‌వి‌ధంగా పని‌చేసే యంత్రం తయా‌ర‌యింది.‌

కానీ ఫిల్ములో బొమ్మ‌లుం‌డా‌లి‌ కదా.‌ అంటే ఈ పద్ధ‌తిని ముందు కెమే‌రాకు ఏర్పా‌టు‌ చే‌యడం తప్ప‌ని‌సరి అను‌కు‌న్నాడు.‌ ఒక కాగి‌తాన్ని కావ‌ల్సిన ఫిల్ము సైజులో కట్‌చేసి దానికి రెండు‌వై‌పులా రంధ్రాలు అమర్చి, అది కదు‌లు‌తుందో లేదో చూశాడు.‌ తర్వాత సెల్యు‌లా‌యిడ్‌ ఫిల్ముకు ఆ పద్ధ‌తినే పెట్టి‌చూ‌శాడు.‌ ఇలా చేసే‌స‌రికి ఏకంగా 50 అడు‌గుల సెల్యు‌లా‌యిడ్‌ ఫిల్మ్‌ సిద్ధ‌మ‌యింది.‌ వాళ్ల కెమే‌రాలో ప్రతి సెన‌కుకు 16 బొమ్మల్ని చేసే వీలుంది.‌ కెమేరా హేండి‌ల్‌ను వేగంగా తిప్పితే ఇంకొ‌కటో, రెండో బొమ్మలు ఎక్కువ వస్తాయి.‌ సెక‌నుకు 16 బొమ్మల చొప్పున 50 అడు‌గుల ఫిల్మ్‌తో తీసిన బొమ్మలు ఒక నిమి‌షంలో ముప్పా‌వు‌ వంతు (45 సెకన్లు) వస్తాయి.‌

article image

* కెమేరా ఆగింది.‌. తొలి చల‌న‌చిత్ర నిర్మాణం జరి‌గి‌పో‌యింది!
కెమే‌రాను ఇలా సిద్ధం చేసు‌కు‌న్నాక ఇక మిగి‌లిం‌దంతా సినిమా తీయ‌టమే.‌ 1894 సెప్టెం‌బరు నెలలో ఒక‌రో‌జున వాళ్లు తమ కెమే‌రాను తమ ఫ్యాక్టరీ గేటు‌ముందు పెట్టారు.‌ మధ్యాహ్నం 12 గంట‌ల‌యింది.‌ లంచ్‌టైం ఆరం‌భ‌మైంది.‌ ఫ్యాక్టరీ గేట్లు తెర‌చు‌కొ‌న్నాయి.‌ కార్మి‌కులు బయ‌టకు దూసు‌కు‌వ‌చ్చారు.‌ కొందరు స్త్రీలు తమ పెద్ద‌పెద్ద సైజు స్కర్టు‌లతో నడు‌స్తు‌న్నారు.‌ కొందరు పురు‌షులు సైకి‌ళ్లె‌క్కారు.‌ ఒక కుక్క రోడ్డుకు అడ్డంగా పరి‌గె‌ట్టింది.‌ లూయీ తన చేతి‌లోని కెమేరా హేండిల్‌ తిప్పు‌తూనే వున్నాడు. ఇంత‌లోనే ఫ్యాక్టరీ గేటును ఒక కార్మి‌కుడు మూసి‌వే‌శాడు.‌ లూయీ కెమేరా హేండి‌ల్‌ని తిప్పటం ఆపాడు.‌ కెమేరా ఆగింది.‌ తొలి చల‌న‌చిత్ర నిర్మాణం జరి‌గి‌పో‌యింది.‌



తన కుమా‌రులు చేసిన చిత్రాలు ఆరిం‌టిని ఆంటోనీ ఆరోజు పారి‌స్‌లో ప్రద‌ర్శిం‌చాడు.‌ ఆరోజు పారిస్‌ గ్రాండ్‌ కేఫ్‌లో ప్రద‌ర్శ‌నకు వచ్చి‌న‌వా‌రిలో జార్జెస్‌ మిలిస్‌ కూడా వున్నాడు.‌ అత‌నికి పారి‌స్‌లో ఒక థియే‌టర్‌ కూడా వుంది.‌ తెర‌మీద ఏం వస్తుం‌దో‌నని ఆస‌క్తిగా చూస్తు‌న్నాడు మిలిస్‌. తెర‌మీద బొమ్మ లయన్స్‌ నగ‌రంలో ఒక వీధి‌బొమ్మ నిశ్చ‌లంగా కన‌ప‌డింది.‌ క్షణం తర్వాత ఆ బొమ్మలో కద‌లిక మొద‌లైంది.‌ ఒక గుర్రపు‌బండి తర్వాత ఒక కుక్క ఫ్యాక్ట‌రీ‌లోంచి కొందరు రావటం.‌.‌ అన్నీ కదు‌లుతూ కని‌పిం‌చాయి.‌
మిలిస్‌ ఆశ్య‌ర్యా‌నికి అంతు‌లే‌కుండాపో‌యింది.‌
‌‘అరె.‌.‌ ఇవన్నీ కదు‌లు‌తు‌న్నాయే, తమా‌షాగా వుంది’‌ అను‌కు‌న్నాడు.‌

−‌ తర్వాత రెండో సినిమా ఆరం‌భ‌మ‌యింది.‌ ఒక గోడను కొందరు కూల‌గొ‌డు‌తు‌న్నారు.‌ అగాస్ట్‌ ఆ కార్మి‌కు‌లకు ఆజ్ఞ‌లిస్తూ బొమ్మలో కని‌పి‌స్తు‌న్నాడు.‌ క్షణం తర్వాత గోడ‌కూ‌లింది.‌ ప్రద‌ర్శన చూస్తు‌న్న‌వా‌రంతా కూలు‌తున్న గోడ‌ల‌లోని ఇటు‌కలు తమ‌ మీద పడ‌తా‌యే‌మో‌నని తలలు వంచు‌కొ‌న్నారు.‌ జార్జెస్‌ మిలిస్‌ నివ్వె‌ర‌పో‌యాడు.‌ ఇటు గోడ‌ల‌లోని ఇటు‌కలు కూలు‌తోంటే, అటు‌వైపు చెట్ల ఆకులు సైతం కదు‌లుతూ కని‌పి‌చాయి.‌ ఎంత అద్భుతం.‌



−‌ తర్వాత మూడో సినిమా. ఆంటోనీ లుమి‌యర్‌ ఇంటి బయట తోటలో ఒక వృద్ధుడు నీళ్లు పడు‌తు‌న్నాడు.‌ ఒక అబ్బాయి అటు‌వైపు నడుస్తూ ఆ పైపు‌మీద అడు‌గే‌శాడు.‌ నీళ్లు ఆగి‌పో‌యాయి.‌ ‌‘అరె పైపులో నీళ్లెం‌దుకు ఆగాయి’‌ అన్న‌ట్లుగా ఆ వృద్ధుడు పైపును పైకెత్తి చూశాడు.‌ ఆ అబ్బాయి అప్పుడే పైపు‌మీ‌ద‌నుంచి తన కాలు‌తీ‌శాడు.‌ పైపు‌లోంచి నీళ్లు ఆ వృద్ధుడి ముఖం‌ మీ‌దకు చిందాయి.‌ ప్రద‌ర్శన చూస్తు‌న్న‌ వా‌రంతా గొల్లున నవ్వారు.

* బొమ్మల రహస్యం  చెప్తే పదివేల ఫ్రాంకులు ఇస్తానన్నాడు!
సినిమా పూర్తవగానే జార్జెస్‌ మిలిస్‌ వెళ్లి ఆంటోనీని కలిశాడు. కదిలే బొమ్మల రహస్యం చెప్పమని అడిగాడు. ఆ రహస్యం చెప్తే పదివేల ఫ్రాంకులు ఇస్తానన్నాడు. మరొకవ్యక్తి యాభైవేలు ఇస్తానన్నాడు. కానీ ఆంటోనీ ఒప్పు‌కో‌లేదు.‌ ‘‌‘ఈ రహస్యం బయ‌ట‌పె‌ట్టేది కాదు.‌ ఈ టెక్నిక్‌ను నేను డబ్బుకు అమ్మను, ఇది నా సొంతం’‌’‌ అన్నాడు ఆంటోనీ.‌ జార్జెస్‌ మిలి‌స్‌కు నిరాశ కలి‌గింది.‌ కానీ.‌.‌ నిరా‌శతో ఓట‌మిని అంగీ‌క‌రిం‌చే‌తత్వం కాద‌త‌నిది.‌ మన‌సు‌లోనే ఒక నిర్ణయం తీసు‌కు‌న్నాడు.‌ గ్రాండ్‌కేఫ్‌ లోంచి బయ‌టకు నడి‌చాడు.‌ ఆ తర్వాత జార్జెస్‌ మిలిస్‌ ఏం చే‌శాడో మళ్లీ భాగంలో చూద్దాం...‌(ఇంకా ఉంది)


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.