థామస్ ఆల్వా ఎడిసన్ సేవలు ఒక్క విజ్ఞానశాస్త్ర రంగంలోనే కాదు, అన్ని రంగాలకు విస్తరించి ఉండటం విశేషం. ఆయన స్వతహాగా శాస్త్రపరిశోధకుడు. విజ్ఞానరంగ విజయాలను ప్రజల వినోదాలకు విస్తరించాలనే ఆసక్తి ఉన్నవాడు. అప్పటికే ‘బొమ్మల్ని కదిలించే’ ప్రక్రియకు ప్రజాదరణ క్రమంగా పెరుగుతూ రావటంతో ఎడిసన్‌కి సైతం దృష్టి సైతం అటు మళ్ళింది. మగరిడ్జ్ (మైబ్రిడ్జ్) బొమ్మల్ని చూసి, వీటిని తన ‘గ్రామోఫోను’కు కూడా అమర్చే వీలుందా అనే ఆలోచనలోపడ్డాడు ఎడిసన్. ఎడిసన్ ‘ఫోనోగ్రాఫ్’ను 1877లో తయారుచేశాడు. నాటి ‘ఫోనోగ్రాఫే’ తర్వాత తర్వాత ‘గ్రామోఫోన్’ అయింది. పాటలు వినటానికి అవకాశం ఉంటే అటు పాటలు వింటూ, ఇటు బొమ్మల్ని చూస్తూ, అందరూ ఏకకాలంలో శ్రవణానందాన్నీ, నయనానందాన్నీ పొందే వీలుందని భావించాడు ఎడిసన్.

ఎడిసన్‌కు న్యూయార్క్‌లో ‘వెస్ట్ ఆరంజ్’ పేరుతో ఒక పెద్ద వర్క్‌షాప్, ప్రయోగశాల ఉండేవి. వెస్ట్ ఆరంజ్‌లో అయిదో నంబర్ గదిని ఆయన ఈ ప్రయోగాలకు కేటాయించాడు. అందులో జరుగుతున్న ప్రయోగాలేవీ ప్రపంచానికి తెలియకుండా ఎడిసన్ తగు జాగ్రత్తలూ తీసుకున్నాడు. తనకు ముఖ్య సహాయకుడిగా విలీయమ్డిక్సన్ను ఎంచుకున్నాడు ఎడిసన్.
ఎడిసన్ రూపొందించిన ఫోనోగ్రాఫ్లో స్తూపాకారపు రికార్డులు ఉండేవి. ఫోటోలను సైతం ఇదే పద్ధతిలో స్థూపాకారపు గ్లాసు డ్రమ్పైన తీసే వీలుందా అని ఎడిసన్ ఆలోచించాడు. 1888 నాటికి ఆ ఆలోచన కొంతవరకు ఆచరణ సాధ్యమైంది. ‘ఆఫ్టికల్ ఫోనోగ్రాఫ్’ పేరుతో ఎడిసన్, డిక్స్న్లు కొన్ని ఫోటోలను సైతం తీయగలిగారు. ఫ్రెడ్ ఆట్ అనే ఒక అసిస్టెంటును ఆ కెమేరా ముందు నిలబెట్టి చేతులు ఊపమని చెప్పి ఫోటోలు తీశారు. ఈ ఫోటోలను డెవలప్‌చేసి, డ్రమ్ము లోపల ఒక దీపం పెట్టి, ఆ డ్రమ్మును గిరగిర తిప్పితే ఇటు లెన్సులో చేతుల ఊపుతున్న ఫ్రెడ్ ఆట్ కనిపించేవాడు. అంటే కెమేరా ముందు తొలిసారి నటించిన వ్యక్తిగా ఫ్రెడ్ ఆట్నే చెప్పుకోవాల్సి ఉంటుందన్న మాట.
అయితే ఈ ‘ఆప్టికల్ ఫోనోగ్రాఫ్’ పరికరం చాలా పెద్దదిగా ఉండేది. దాంతో వచ్చే బొమ్మలు మాత్రం చాలా చిన్నవిగా ఉండేవి. ఇది ఎడిసన్‌కు చిరాకు తెప్పించింది. ఆ పరికరాన్ని ఆయన మూలనపడేసి వేరే ప్రయత్నాలు ప్రారంభించాడు.
ఇదే సమయానికి ఫోటోగ్రాఫర్లు, ఎమల్షన్ ఉపయోగానికి గ్లాసుకు బదులు సెల్యూలాయిడ్‌ను వాడడం మొదలుపెట్టారు. గ్లాసుతో పోల్చి చూస్తే సెల్యూలాయిడ్ మరీ తేలిక. అందుకే సెల్యూలాయిడ్నే ఉపయోగించాలని ఎడిసన్ నిర్ణయించుకోన్నాడు. ఎడిసన్ తయారుచేసిన సెల్యూలాయిడ్ బాగా దళసరిగా, పగిలిపోయేలా వచ్చింది. ఆ సెల్యూలాయిడ్ చివర్లన ఆయన చిన్నచిన్న అంచులు కట్ చేయించాడు. తర్వాత ఈ సెల్యూలాయిడ్ ఫిల్మును చిన్న చిన్న చక్రాలద్వారా తిరిగేటట్లు చేయడానికి ఒక యంత్రాన్ని సిద్ధం చేశాడు. ఎడిసన్ ఈ మార్పు చేర్పులన్నీ చేసేసరికి కొడక్ కంపెనీ రంగంలోకి దిగింది. మరీ పల్చగా ఉండే మంచి నాణ్యత సెల్యూలాయిడ్ ఫిల్మ్‌ను కొడక్ చాలా పొడవైన రోల్స్‌గా తయారుచేస్తూ వచ్చింది. ఎడిసన్ దీన్ని తీసుకొన్నాడు. అయితే వీటి చివర్లలో అంచులు కట్ చేయించటం కష్టం కావటంతో ఫిల్ము చివర్లలో రంధ్రాలు పెట్టడం మేలని నిర్ణయించుకొన్నాడు. అంతే.. అలా తయారయిందే నేటి ‘సెల్యూలాయిడ్ ఫిల్మ్’. ఒక్కో ఫిల్మ్ 35 మిల్లీమీటర్ల (35 య.యం) వెడల్పుండాలని, బొమ్మబొమ్మకు ప్రతివైపునా నాలుగేసి రంధ్రాలు ఉండాలనీ కూడా ఆయనే నిర్ధారించాడు. ఇప్పటికీ ఇంకా ఫిల్మ్ అలాగే ఉండటం విశేషం!!
1889 అక్టోబరు నెలలో ఎడిసన్ యూరోప్ వెళ్ళారు. అక్టోబరు ఆరో తేదీకి ఆయన తిరిగి అమెరికా వచ్చారు. ఎడిసన్ అమెరికాలో లేనప్పుడు కూడా డిక్సన్ ప్రభృతులు రూమ్‌నెంబర్ 5లో తమ ప్రయోగాలు కొనసాగిస్తూనే వచ్చారు. ఎడిసన్ రాగానే డిక్సన్ ఎడిసన్‌ను తీసుకెళ్ళి రూమ్ నెంబర్ 5లో ఒక మీట నొక్కమన్నాడు. ఎదురుగా తెరమీద డిక్సన్ బొమ్మ పడింది. ఆ బొమ్మలోని డిక్సన్ తన తలమీద టోపీని గౌరవసూచకంగా ఎత్తి ‘‘మిస్టర్ ఎడిసన్! గుడ్‌మార్నింగ్! ఈ ‘కినిఫోనోగ్రాఫ్’ మీకు పూర్తి సంతృప్తిని కలగజేస్తుందని ఆశిస్తున్నాం’’ అన్నాడు.
డిక్సన్ అలా అన్నాడు కానీ, ‘కిని ఫోనోగ్రాఫ్’ ఎవరికీ సంతృప్తినివ్వలేదు. అందులో బొమ్మ చిన్నది. బాగా కదులుతూ ఉండేది. దాంతో ఎడిసన్ కొత్తరకం యంత్రం తయారుచేయాలని నిర్ణయించుకొన్నాడు. చివరికి 1894లో కొత్తది రెడీ అయింది. అయితే అదీ మూకీ యంత్రమయింది. దీనిపేరు ‘కినిటోస్కోప్’ అన్నారు.
ఇది తెరమీద బొమ్మను ప్రొజెక్టు చేయదు. ఒకపక్క ఒక చిన్న రంధ్రంలోంచి కదిలేబొమ్మను చూడగల వీలుండే యంత్రం ఇది. ఇందులో కదిలేబొమ్మ కేవలం అర నిమిషం మాత్రమే ఉండేది. అమెరికా, యూరప్‌ల్లో ఇలాంటి ‘కినిటోస్కోప్’ పార్లర్లెన్నో వెలిసాయి. వీటి కోసం ఆయన ‘బ్లాక్మేరియా’ వంటి చిత్రాలను కూడా తీశారు. ఎడిసన్ నేటి 35 యం.యం ఫిల్ములకి ఓ రూపకర్త. ఇప్పటి సినిమా ఫిల్ములకు ఆయనే ఆద్యుడు. అయితే పూర్తిస్థాయి సినిమా రావటానికి ఇంకా కొద్ది సమయం ఉంది. .(ఇంకా ఉంది)