‘ఫొటోగ్రఫీ’ అంటే ‘వెలుగుతో చిత్రాలు గీయటం’ అని అర్థం చెప్పుకోవచ్చు. ఫొటోగ్రఫీని 1840లో కనిపెట్టారు. మొదట్లో ఫొటోలు తీయటం అంటే − అతి నెమ్మదైన పని. ఒక వ్యక్తి గనుక తన ఫొటో తీయించుకోవాలని అనుకుంటే, ఎండలో కనీసం ఇరవై ముప్పయి నిమిషాలపాటు అటూఇటూ కదలకుండా కూర్చోవాల్సి వచ్చేది. ఆ సమయంలో అతను తన తల కదల్చకుండా వెనుక ఒక ‘క్లాంప్’ పెట్టి మరీ తలను బిగించేవారు.

అప్పటి ఫొటోగ్రఫీకి, ఇప్పటి ఫొటోగ్రఫీకి ఎంత తేడా! ఇప్పుడు ఇలా ‘క్లిక్’ చేస్తే చాలు, అలా ఫొటో వచ్చే పోలరాయిడ్ కెమెరాలు వచ్చేశాయి. అది కాస్తా మరింత నాజూకుగా మారి డిజిటల్ కెమెరాలుగా వచ్చాయి. నేడు ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ఫోనే ఓ కెమెరాగా మారిపోయింది. ఇక మూవీ కెమెరాలయితే చెప్పనే అక్కర్లేదు. అవి ఒక్క సెకనులో 24 ఫొటోలను తీస్తాయి. ఒక్కో ఫొటో తీయటానికి వాటికి సెకెనులో యాభయ్యవ వంతు సమయం చాలు!
మంచి ఫొటోలు తీయటంలో రహస్యమంతా ఎమల్షన్లోనే ఉంది. ఈ ఎమల్షన్ అనేది − కాంతికి ప్రభావమయ్యే రసాయనాలుండే జెల్లీ అనవచ్చు. తొలి రోజుల్లో ఫొటోగ్రఫీకి ‘ఎమల్షన్’ను గ్లాస్ ప్లేట్ల మీద పోసి అది తడిగా ఉన్నప్పుడే వాడాల్సి వచ్చేది. ‘డ్రై ప్లేట్స్’ వచ్చాక ఆ అవసరం తీరింది. ఆ తర్వాత ఏకంగా సెల్యులాయిడ్ రోల్స్ వచ్చేశాయి.
కెమెరాలోని లెన్సు తెరుచుకోగానే, కాంతి ఫిల్మ్ లేదా ప్లేట్ మీది ఎమల్షన్‌ను చేరుతుంది. ఈ ఫిల్మునో, ప్లేటునో కొన్ని రసాయనాలతో కడిగితే − దాన్ని డెవలప్ చేయటం అంటారు. బొమ్మ ‘నెగటివ్’ రూపంలో కనిపిస్తుంది. నెగటివ్‌లో అసలు తెలుపు రంగు నలుపులో, నలుపురంగు తెలుపులో కనిపిస్తుంటుంది. ఈ నెగటివ్‌ల నుంచి సరిగ్గా తెలుపు రంగు, నలుపు రంగులుండే విధంగా ‘పాజిటివ్ ప్రింట్లు’ వేసుకోవచ్చు.
ఫొటోగ్రఫీని కనుగొన్న 30 సంవత్సరాలకు కానీ వేగంగా ఉపయోగించుకోగల ఎమల్షన్‌ను శాస్త్రజ్ఞులు తయారుచేయలేకపోయారు. అప్పట్లో శాన్ఫ్రాన్సిస్కోకు లేలాండ్ స్టాన్‌ఫర్డ్ గవర్నర్‌గా ఉండేవారు. ఆయనకు గుర్రాలంటే బహుప్రీతి. 1872లో ఒకసారి ఆయన తన స్నేహితులు కొందరికి గుర్రాల బొమ్మల్ని చూపిస్తుండగా − ఒక స్నేహితుడు − ‘‘ఈ బొమ్మలన్నీ అర్థం లేకుండా ఉన్నాయి. మీ బొమ్మల్లో గుర్రాలన్నీ నాలుగు కాళ్ళు నేలమీద ఆనకుండా పరిగెడుతున్నాయి చూశారా!’’ అంటూ వేళాకోలం ఆడాడు. స్టాన్‌ఫర్డ్ ఆ బొమ్మల్ని చూశాడు. స్నేహితుడు అన్నది విన్నాడు. క్షణం ఆగి అన్నాడు − ‘‘నిజమే! గుర్రాలు అలాగే పరిగెడతాయి! నాలుగు కాళ్ళూ పైకెత్తుతాయి. ఒకే గిట్టమీద ఆనుతుంటాయి!’’ అన్నాడు నవ్వుతూ.

స్నేహితుడామాట ఒప్పుకోలేదు. తప్పంటే తప్పు అనుకొన్నారు. పందెం అంటే పందెం అనుకొన్నారు. చివరికి పాతికవేల డాలర్ల పందెం వేశారు ఇద్దరూ.
స్టాన్‌ఫర్డ్ బాగా ఆలోచించాడు − ఏం చేస్తే తన బొమ్మలు నిజమేనని రుజువవుతాయా అని! ఆ రోజుల్లోనే శాన్ఫ్రాన్సిస్కోలో ఎడ్వర్డ్ మగరిడ్జ్ అనే ఫొటోగ్రాఫర్ ఉండేవాడు. ఒక గుర్రం పరిగెడుతోంటే దాని నాలుగు కాళ్ళు ఏయే తీరులో ఉంటాయో వివరించే విధంగా ఫొటోలు తీసి ఇవ్వమని ఎడ్వర్డ్‌ను స్టాన్‌ఫర్డ్ అడిగాడు.
మగరిడ్జ్ ‘‘సరే’’నన్నాడు. ప్రయత్నాలు ఆరంభించాడు. ఒక తెల్లని కంచె ముందు గుర్రాలను పరిగెత్తించి ఫొటోలు తీశాడు కానీ అవేవీ సరిగ్గారాలేదు. దాంతో ఆయన మళ్లీ ఆలోచనల్లో నిమగ్నమయ్యాడు. ఈసారి మరో ఐడియా − వరుసగా కెమేరాలను పెట్టి ఒక గుర్రం ఇట్నుంచి అటు పరుగెడుతుంటే ఫొటోలు తీయాలనుకున్నాడు. 1878లో ఈ ఆలోచనకు కార్యరూపం ఇచ్చాడు ఎడ్వర్డు. గవర్నర్ స్టాన్‌ఫర్డ్ పొలంలో ఎడ్వర్డ్ తన ప్రయోగం కోసం ఒక రోడ్డు వేయించాడు. రోడ్డుకు ఒక పక్క తెల్లని గుడ్డ కట్టించాడు. రెండో వైపు 12 చిన్న షెడ్లు కట్టించి ప్రతి దాంట్లోనూ ఒక్కో కెమెరా పెట్టాడు. ఈ కెమేరాలన్నిటినీ ఒకేసారి క్లిక్చేసేందుకు అసిస్టెంట్లను పెట్టాడు. ఇంత ప్రయత్నం చేసి ఫొటోలు తీసినా అవన్నీ ఒకేసారి తీసినట్లు రాలేదు. ‘ఇదికాదు పద్ధతి’ అనుకొంటూ ఎడ్వర్డ్ మళ్లీ అంతా సిద్ధం చేసి కెమెరాలకు తాళ్లు కట్టించి వదిలాడు. వేగంగా గుర్రం వెడుతోంటే, ఆ గుర్రం కాలి గిట్టలు తగిలి ఆ తాళ్లు ఒక్కొక్కటిగా తెగుతోంటే, ఒక్కో కెమేరా క్లిక్ అవుతూవచ్చింది. ఆ ఫొటోలన్నిటినీ సరిగ్గా కడిగి చూస్తే స్టాన్‌ఫర్డ్ చెప్పినట్లు పరిగెత్తే గుర్రం తన నాలుగు కాళ్లు ఒకేసారి ఎత్తుతోంది. ఒక గిట్టమీదే ఆనుతూ అది నేలమీద పరుగెడుతోందని తేలింది.
చిత్రం ఏమిటంటే ఈ విషయం తేల్చినందుకు స్టాన్‌ఫర్డ్ గెలిచింది 25 వేల పౌండ్లు అయినా ఖర్చయింది మాత్రం 40 వేల పౌండ్లు. ఎడ్వర్డ్ ప్రయోగాల మీద ఆసక్తి చూపినవారెందరో ఉన్నారు గానీ వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎటెనీమారీ. థామస్ అల్వాఎడిసన్లను మాత్రమే.
మూరీకి ఎగిరే పక్షులంటే ఇష్టం. అవి ఎగురుతున్నప్పుడు వాటి రెక్కలు ఎలా కదులుతున్నాయో చూడాలనే కాంక్ష అతనిది. అది చూడాలంటే ప్రత్యేకమైన కెమేరా ఉండి తీరాలని మారీకి తెలుసు.

1878లో జేన్సన్ అనే మరో శాస్త్రజ్ఞుడు సూర్యుడి చుట్టూ తిరిగే శుక్రగ్రహం ఫొటోలు తీసేందుకు ‘ఫొటోరివాల్వర్’ పేరుతో ఒక కెమేరాను తయారుచేశాడు. ఇదో చిన్న తుపాకీలాంటిది. బారెల్లో లెన్సు ఉంటే ఇటు చివర వెట్ప్లేట్ ఉండేది. ప్లేట్ గుండ్రంగా తిరుగుతుంటే ఫొటోలు వరుసగా తీసుకొనే వీలుండేది. ఈ ఫొటో రివాల్వర్‌నే కొంచెం మెరుగుపరిచి మారీ రెండున్నర సెకెన్లకాలంలో 24 ఫొటోలు తీసుకోగలిగేలా తయారుచేశాడు. అయితే ఫొటోలన్నీ మరీ చిన్నవిగా రావటంతో మారీకి వాటిమీద ఆసక్తి తగ్గిపోయింది. అందుకే ఆయన 1888లో ‘క్రోనో ఫొటోగ్రాఫ్’ పేరుతో సెల్యులాయిడ్ ఫిల్మ్ ఉపయోగించే ఫిల్ము కెమేరా తయారుచేశాడు. దీన్నే తొలి ఫిల్మ్ కెమేరాగా చెప్పుకోవచ్చు. కానీ ఇది ఫిల్మును చింపేస్తున్న కారణంగా ఇది సరిగ్గా పనిచేయటం లేదని మారీ భ్రమించాడు.
సెల్యులాయిడ్ ఫిల్మును ఉపయోగించిన మరో శాస్త్రజ్ఞుడు ఫ్రియస్గ్రీన్. ‘మూవింగ్ ఫొటోగ్రఫీ’కి ఈయనే పితామహుడని పేటెంట్ హక్కులు పొందారు. మూవీ కెమేరా ఎలా పనిచేయాలో, ప్రొజెక్టర్ ఎలా పనిచేయాలో ఆయన ఆ పేటెంట్ హక్కులు పొందే పత్రంలో వివరంగా పేర్కొన్నాడు. సరిగ్గా తీయాల్సిన ఫొటో దగ్గరే ఫిల్ము ఎలా అగాలి అనేది ఈయనే తొలిసారి గుర్తించగలిగాడని అంటారు. ఈ పద్ధతిలో ప్రియస్గ్రీన్, హైడ్పార్క్లో ఒక ఆదివారం ఉదయపు సన్నివేశాన్ని తీసినట్లు చెప్తారు. కానీ ఈ ఫిల్ము ఆచూకీ దొరకలేదు.
వీరి తర్వాత రంగంలో దిగిన వ్యక్తి థామస్ అల్వా ఎడిసన్. ఆ బహుముఖ ప్రజ్ఞావంతుడి గురించి ఎంత చెప్పినా సరిపోదు. సినిమారంగంలో ఆయన సేవల్ని తరువాయి భాగంలో చెప్పుకుందాం..(ఇంకా ఉంది)