లగాన్‌ చిత్రం.. ఓ స్ఫూర్తి మంత్రం

వినోదం పంచే థియేటర్స్ ని వ్యక్తిత్వ పాఠశాలలుగా మార్చేసింది ఆ చిత్రం. చుట్టుముట్టే చీకట్లో కూచుని వేదన పడే కన్నా చిరు దీపం వెలిగించుకోమనే సందేశాన్ని అందించింది. ప్రతికూల దృష్టి తో అంది వచ్చే అవకాశాల్లో సమస్యల్ని చూడడం మానుకుని...సానుకూల దృక్పధంతో సమస్యల్లో సైతం అవకాశాల్ని వెతికి పట్టుకోవాలని ఉద్భోదించింది. అవాంతరాలు ఎదురైనా నేర్పుతో, ఓర్పుతో అధిగమించడమే జీవిత పాఠమని తేల్చి చెప్పింది. సినిమా అంటే కేవలం కాసులు కురిపించే వ్యాపార వేదిక కాదని, సినిమా అంటే ఆలోచనలు రేకెత్తించే సృజనాత్మకత అని చెప్తూ ... సమాజ హితం కోసం రూపొందిన చిత్రం అది. ఆ చిత్రం లగాన్. కాస్త వినోదం...మరికాస్త ప్రబోధం వెరసి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని విడుదలైన సంవత్సరంలో వసూళ్ల సునామి సృష్టించి అనేకానేక విజయాల సంచలనాలు నమోదు చేసింది లగాన్. ..వన్స్ అపాన్ ఏ టైం ఇన్ ఇండియా.

ఔను... ఒకనాటి చరిత్రకు అద్దం పట్టే పీరియాడికల్ మూవీ. బ్రిటిష్ దొరల ఏలుబడిలో ఉన్న 1893 కాలం ఈ చిత్రం కథావేదిక గుజరాత్ రాష్ట్రం లోని మారుమూల చిన్న గ్రామం చంపానేర్. క్రికెట్ క్రీడా నేపథ్యంతో పాటు గ్రామీణ నేపథ్యం కూడా ఈ చిత్రానికి ఆయువుపట్టు.

లగాన్...అంటే పన్ను. ఇసుమంతయినా కరుణ లేని బ్రిటిష్ దొరలు నడ్డి విరిచే పన్నులు విధిస్తుంటే ఆదుకునే ఆపన్నులు లేరా? అని యావత్ గ్రామం అల్లాడుతున్న వేళ... కధానాయకుడి ధైర్యం, చొరవతో ఆ సమస్యను అధిగమించిన ఇతివృత్తం ... 224 నిముషాల నిడివిగల ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠభరితం. ఈ చిత్రం జూన్‌ 15, 2019న  హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదలయింది.


చిత్ర విశేషాలు
అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రానికి దర్శకుడు అశుతోష్ గోవారికర్ అన్నీ తానై వ్యవహరించి విజయాన్ని చేకూర్చిపెట్టారు. చిత్రకథ సమకూర్చడమే కాకుండా సంజయ్ డైమా తో కలసి చిత్రానువాదంలో పాలు పంచుకున్న అశుతోష్ గోవారికర్ ఆంగ్ల సంభాషణలను రాసిపెట్టారు. హిందీ డైలాగులు కె. పి . సక్సేనా రాసారు. మొదట ఈ చిత్ర కథానాయకుడు భువన పాత్రకి గాను దర్శకుడు అశుతోష్ గోవారికర్ షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, బాబే డియోల్, అభిషేక్ బచ్చన్...ఇలా అగ్ర నటులందర్నీ ఊహించుకున్నారు. చివరికి అమీర్ ఖాన్ చేతిలో ఈ చిత్రం రూపు దిద్దుకుంది. కధానాయిక పాత్ర విషయంలోనూ ఇదే తీరు కొనసాగింది. సోనాలి బింద్రే, నందిత దాస్, అమీషా పటేల్ లాటి తారలని ముందు ఊహించుకున్నా...రాణి ముఖర్జీని చిత్ర యూనిట్ సంప్రదించింది. అయితే, ఆ సమయంలో ఆమె డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఈ చిత్ర నాయికగా గ్రేసీ సింగ్ ఖరారు అయింది. పాత్ర ఔచిత్యం, తీరు తెన్నులు గమనించిన దర్శకుడు అశుతోష్ గోవారికర్ అలనాటి మేటి నటి వైజయంతి మాల లాంటి నాయిక ఉండాలని ఆశించారు. ఆ ఆశ గ్రేసీ సింగ్ రూపంలో నెరవేరినట్లయింది. గ్రేసీ సింగ్ మంచి నర్తకి. కొత్తగా అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉంది. ఆపై, శ్రద్ధాసక్తులతో పాత్రలో పరకాయ ప్రవేశం చేసే అంకితభావాన్ని కూడా దర్శకుడు అశుతోష్ గోవారికర్ గుర్తించారు. కీలకమైన పాత్రల్లో ఎలిజబెత్ రస్సెల్ గా రాచెల్ షెల్లీ, కెప్టెన్ ఆండ్రు రస్సెల్ గా పౌల్ బ్లాక్ త్రోన్, నాయకుడు భువన్ తల్లి పాత్రలో సుహాసిని ములే, రాజా పురాన్ సింగ్ పాత్రలో ఖుల్ భూషణ్ కలబంద, ముఖ్యాజీ పాత్రలో రాజేంద్ర గుప్తా, ఫౌల్ ట్రీ ఫార్మర్, ఫీల్డర్ భూర గా రఘుబీర్ యాదవ్...ఇలా ముఖ్య భూమికలు పోషించారు. ఇంకా రాజేష్ వివేక్, రాజ్ జుట్సీ, ప్రదీప్ రావత్, ముఖేష్ రిషి, అఖిలేంద్ర మిశ్రా ఇలా చాలామంది కళాకారులు ఈ చిత్రంలో తమ ప్రతిభ చూపారు.


జావేద్ అక్తర్ గీతాలు...రెహ్మాన్ సంగీతం
లగాన్ చిత్రంలో పాటలన్ని తీయ తేనియ ఊటలు. గీత కర్త జావేద్ అక్తర్ సన్నివేశానికి తగ్గట్లుగా పాటల్ని సమకూర్చారు. సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహ్మాన్ మాధురీభరితమైన బాణీల్ని ఒద్దికఆ పొదిగారు. చిత్రంలో ఆరు పాటలున్నాయి. కేవలం వాద్య సంగీతం కూడా రెండు చోట్ల చెవుల్లో అమృతం పోస్తుంది. ఈ చిత్రానికి గాను రెహ్మాన్ వైవిధ్యమైన సంగీత బాణీలు సమకూర్చడంలో సఫలీకృతులయ్యారు. ఆరు పాటలూ జనరంజకంగా మారి ఇప్పటికీ జనం నాలుకలపై నర్తిస్తున్నాయి. ఘనన్ ఘనన్ ఘిర్ ఘిర్ రాయే బాదరా...అనే పల్లవితో సాగిన పాటను ఉదిత్ నారాయణ్, అల్కా యాగ్నిక్ సుమధురంగా ఆలపించారు. మిత్వా, రాధా కైసే న జలే, ఓరీ చోరీ, ఓ పాలన్ హరే. పాటలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అమీర్ ఖాన్, గ్రేసీ సింగ్ ఈ చిత్రంలో ముచ్చటైన జంటగా ప్రేక్షకుల ప్రశంసలను పొందారు.

ప్రతిష్టాత్మకమైన సవాల్
కరువుతో అల్లాడుతున్న పల్లెలో రాజా పురాణ సింగ్ పన్నుల భారం మోపడంతో కట్టలేని దీన, హీన స్థితిలో ఉన్న గ్రామీణుల పక్షాన నిలిచి పోరాడి గెలిచిన కధానాయకుడి కధ ఇది. పన్నుల భారం ఉండకూదంటే క్రికెట్ క్రీడలో గెలవాలనే షరతును హీరో అంగీకరిస్తాడు. క్రీడలో గెలిస్తే...రాబోయే మూడేళ్ళలో అసలు పన్నులే ఉండవని, ఒకవేళ ఓడితే మూడింతల పన్నుల భారం ఉంటుందనేది పెను సవాల్. గ్రామస్తులంతా ఈ సవాల్ ని వ్యతిరేకిస్తారు. కారణం...ఒకవేళ ఆటలో ఓడితే రాబోయే పన్నుల భారం తలచుకుని భయాందోళనలకు గురవుతారు. అయితే, కధానాయకుడు ఆటలో ఎలా గెలిచాడు? పన్నుల భారం నుంచి గామస్తులను ఎలా తప్పించాడు? అనేదే అసలు కధ.

వ్యక్తిత్వ పాఠాలు
లగాన్ చిత్ర కధలో మేనేజ్మెంట్ స్కిల్స్ అంతర్లీనంగా ఉన్నాయి. బృంద స్ఫూర్తి ఎలా ఉండాలో? చక్కగా తేల్చి చెప్తుంది ఈ చిత్రం. నాయకుడు అనేవాడు తన వెంట నడిచే అనుచరగణానికి దిశానిర్దేశం ఎలా చేయాలో...వారిని విజయపధంలో ఎలా తీసుకెళ్ళాలో తేటతెల్లంగా తెలియపరుస్తుంది. టీమ్ లో ఉన్న ప్రతిఒక్కరికీ ఏదో నైపుణ్యం ఉంటుంది. ఆ నైపుణ్యాన్ని నాయకుడి గుర్తించి మెరుగు పరిచి ముందుకు సాగేలా వ్యూహాలు విరచించాలి. ఈ చిత్రంలో కదనాయకుడు భువన్ టీమ్ మానేజ్మెంట్ చేసిన విధానం స్ఫూర్తిదాయకం.


వైఫల్యాల్ని అధిగమించే విధానం
పొరపాటున టీమ్ సరయిన పర్ఫార్మెన్స్ చూపకపోవడంతో ఎదురయ్యే వైఫల్యాన్ని కూడా సంయమనంతో వ్యవహరించి పరిస్థితి ని అదుపులోకి తెచ్చుకోవడం కూడా నాయకుడికి తప్పనిసరిగా ఉండవలసిన లక్షణం. ఈ సినిమాలో ఇదీ ప్రముఖంగా కనిపిస్తుంది. గ్రామస్థులు లఖా పై ఆగ్రహం వ్యక్తం చేయడం...తీవ్రస్థాయిలో నిందించడాన్ని గమనించిన కదా నాయకుడు ఇబ్బందికర పరిస్థుల నుంచి లఖా ని రక్షించడంతోపాటు సున్నితంగా విషయాన్ని వివరించడం కూడా సక్సెస్ మంత్ర. ఈ చిత్రం ద్వారా ఇదీ ప్రేక్షకులకు అర్ధమయ్యేలా సన్నివేశాన్ని రూపొందించారు. తద్వారా టీమ్ సభ్యుల్లో ఉన్న నైరాశ్యాన్ని పారద్రోలి నవ్యోత్సాహాన్ని కధానాయకుడు నింపాడు.

వైవిధ్యంతో విజయం
విజయసాధనలో వైవిద్యం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందనే పాఠాన్ని ఈ చిత్రం తెర ముందుకు తీసుకొచ్చింది. కులాలు, మతాలూ, ప్రాంతాలు, భాష, వయస్సు...ఇలా అనేకానేక సమీకరణాలతో వైవిధ్యభరితమైన మంచి టీమ్ ని రూపొందించుకోవచ్చని ఈ చిత్రం సూటిగా చెప్తుంది. ఈ తరహా టీమ్ లో అనేకానేకమంది ఆలోచనలు ముందుకు నడిపిస్తాయని తేల్చి చెపుతుంది. గ్రామస్థులను పన్నుల భారం నుంచి తప్పించడానికి తన ముందున్న ఒకే ఒక పరిస్కారం క్రికెట్ క్రీడ. ఆ క్రీడలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాల్సిందే. పొరపాటున ఓడితే గ్రామస్తులంతా మూకుమ్మడిగా చెల్లించుకోవాల్సి భారీ మూల్యం భరించరానిది. అనివార్యంగా ఈ బాధ్యత స్వీకరించిన కధానాయకుడి మీద పడిన ఒత్తిడి అంతా ఇంతా కాదు. క్రికెట్ క్రీడ బృంద విజయానికి సూచిక. అందరూ సమష్టి గా ఆడితేనే గెలుపు తలుపు తీస్తుంది. అందువల్ల...తన టీమ్ ఎలా ఉండాలో...? వారిలో ఏయే లక్షణాలు ఉండాలో? ముందుగానే ఆలోచించిన కథానాయకుడు ఆచి తూచి అడుగులు వేసాడు. చివరాఖరికి మంచి టీమ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇలాంటి వైవిధ్యమే సమకాలీన ప్రపంచంలో విజయాన్ని సాధిస్తుంది. అది...ఓ దేశాన్ని, రాష్ట్రాన్ని ఏలే మంత్రి వర్గమైనా... ఎమ్మెన్సీ లో పనిచేసే సాఫ్ట్ వెర్ ఇంజినీర్లయినా...టీం లీడర్ కి కావాల్సిన ముఖ్య లక్షణాన్ని ఈ చిత్రం చాటి చెప్పింది.


సమభావం అత్యవసరం
టీమ్ లీడర్ అన్నవాడు నిస్పక్షపాతంగా వ్యవహరించాలి. ఓ ఒక్క సభ్యుడి వైపు మొగ్గకుండా అందర్నీ సమదృష్టితో, సమ భావంతో చూడాలి. ఈ చిత్రం లో కూడా కధానాయకుడు టీమ్ సభ్యులందరి పట్ల ఒకే వైఖరి అవలంబించి మంచి ఫలితాలు రాబట్టుకున్నాడు. ఈ ఒక్కరికీ మద్దతు ఇవ్వకుండా... ఓ అభ్యర్థి గత రికార్డులను పరిగణనలోనికి తీసుకుని అప్పటికప్పుడు ఓ నిర్ణయానికి రాకుండా...వర్తమానంలో పనికి ఆ సభ్యుడు పనికివస్తాడో, రాడో అనే అంచనాతోనే టీమ్ లీడర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అదే విషయాన్ని ఈ చిత్రం చెప్పింది.

లక్ష్యాన్నే గురి చూడాలి
లక్ష్యాన్ని మాత్రమే గురి చూడాలని... పక్క చూపులు చూస్తే విజయం అందనంత దూరం వెళ్ళిపోతుందని ఈ చిత్రకధ చెప్తుంది. ఒకానొక దశలో టీమ్ సభ్యులు మరో మార్గం వైపు దృష్టి సారించబోగా...చక్కని మోటివేషన్ తో వారినందరినీ దారిలోకి తెచ్చుకోవడం చిత్రంలో కనిపిస్తుంది. టీమ్ లీడర్ అన్నవాడు ఈ విషయంలో జాగ్రత్త గా ఉండాలని చిత్రం హెచ్చరిస్తుంది. అవాంతరాలు ఎదురైనా అధిగమించడం, అనూహ్యంగా వ్యవస్థలో తలెత్తిన లోపాలను సవరించడం, టీమ్ సభ్యులు ఈ చిన్న విజయాన్ని నమోదు చేసినా అభినందించడం, ప్రోత్సహించడం, క్లిష్ట సమయాల్లో తెలివైన నిర్ణయాలు తీసుకోవడం, సదా ఆశావహ దృక్పధంలో ఉండడం... ఓడిపోతామేమోననే నిరాశ కలిగించే మాటలు చెప్పకపోవడం, ఎవరి భుజానో తుపాకీ పెట్టి ప్రత్యర్థులపై పోరు సలపకుండా...ఎప్పుడూ తాను ముందుండి తనవారిని నడిపించగల సత్తా ఉండడం...ఇవీ టీమ్ లీడర్ లక్షణాలని ఈ చిత్రం వినోదాన్ని మేళవించి మరీ చెప్పింది.


లగాన్ కి స్ఫూర్తి నయాదౌర్
లగాన్ కి స్ఫూర్తి దిలీప్ కుమార్ నటించిన నయాదౌర్ సినిమా. ఈ సినిమా 1957లో విడుదలైనది. అప్పట్లో దిలీప్ కుమార్ కి ఎనలేని పేర ప్రఖ్యాతులు తీసుకొచ్చింది. ఇప్పుడూ లగాన్ ద్వారా అమీర్ ఖాన్ అంతర్జాతీయ ఖ్యాతి కేతనాన్ని అందుకున్నారు. దర్శకుడు ఈ చిత్రకథను రూపొందించి ఒక్కడే తీయలేక అమీర్ ఖాన్ ని సంప్రదించడంతో అమీర్ ఈ ప్రాజెక్టు లో ఆర్ధిక భాగస్వామి గా మారారు. తన సొంత పతాకంపై తానే నిర్మాతగా వ్యవహరించి చిత్రం ద్వారా కీర్తి ప్రతిష్టలు అందుకున్నారు. ఆర్ధిక లాభాలను కూడా స్వీకరించారు. 2001లో విడుదలైన ఈ సినిమా ఆ సంవత్సరం విడుదలైన అన్ని చిత్రాల్లోనూ అత్యధిక వసూళ్లు సాధించిన మూడో సినిమాగా సంచలనం నమోదు చేసింది. ఆ సంవత్సరం కభీ ఖుషీ కభీ గేమ్, గదర్ ఏక్ ప్రేమ్ కధ చిత్రాల తర్వాత ఘనవిజయం చవి చూసిన చిత్రం లగాన్.

అంతర్జాతీయ ఖ్యాతి
లగాన్ చిత్రం అంతర్జాతీయ ఖ్యాతిని సముపార్జించింది. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులు గెలుచుకుంది. అలాగే, దేశంలో కూడా అనేకానేక అవార్డులు, పురస్కారాలు అందుకుంది. 2002 ఫిబ్రవరి 12న అత్యంత ప్రతిష్టాత్మకమైన అకాడమీ అవార్డు కోసం నామినేట్ అయిన మూడో విదేశీ భాష చిత్రంగా లగాన్ చరిత్ర సృష్టించింది. అంతకు ముందు 1957లో మదర్ ఇండియా, 1988లో సలామ్ బొంబాయి చిత్రాలు ఇదే కోవలో నామినేట్ అయ్యాయి. హీరో అమీర్ ఖాన్, దర్శకుడు అశుతోష్ గోవారికర్ అకాడమీ అవార్డ్స్ కి ఎంట్రీ ఇచ్చిన తమ చిత్రం ప్రచారం నిమిత్తం లాస్ ఏంజిల్స్ కి వెళ్లారు. ఇండియా లో బ్రిటిష్ పాలకులు మంచీ మానవత్వం అస్సలు లేకుండా ప్రజలను నన ఇబ్బందులు పెట్టి రాక్షసానందాన్ని పొందిన వైనాన్ని లగాన్ చెప్పింది. అయినా.. అంతర్జాతీయంగా ఈ చిత్రానికి లభించిన ఖ్యాతి అపురూపం...అనిర్వచనీయం. ఈ నేపథ్యంలో బీబీసీ లగాన్ సినిమా గురించి విశ్లేషిస్తూ...యూఎస్ లో భారతీయ సినిమాలపై మంచి నమ్మకం ఏర్పడనుంది వ్యాఖ్యానించడం గమనార్హం. లగాన్ సినిమా భారతీయ సినిమాలకు గొప్ప స్ఫూర్తి కలిగిస్తుందని కూడా పేర్కొంది. సన్ డాన్స్ ఫిలిం ఫెస్టివల్, కైరో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో లగాన్ చిత్రం ప్రదర్శనకు నోచుకుంది.

-పి.వి.డి.ఎస్. ప్రకాష్


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.