కాసులు కురిపించిన కుక్కపిల్లలు!
కుక్క పిల్లల కథతో సినిమా...

అసలా ఆలోచనే విచిత్రం...

ఎవరైనా అయితే ‘నో’ అంటారు...

కానీ వాల్ట్‌డిస్నీ మాత్రం ‘ఎస్‌’ అన్నాడు!

నాలుగేళ్లు శ్రమపడ్డాడు...

వందలాది మంది చేత పని చేయించాడు...

3.6 మిలియన్‌ డాలరు ఖర్చుపెట్టాడు...

అతడి శ్రమ వృధా పోలేదు...

ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకుంది!

215.8 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది!!

అప్పుల్లో ఉన్న వాల్ట్‌డిస్నీ సంస్థను ఒడ్డున పడేసింది!!!


ఆ సినిమా ‘101 డాల్మేషియన్స్‌’. యానిమేషన్‌ విధానంతో తీసిన ఈ సినిమా 1961లో విడుదలైంది. డాల్మేషియన్‌ అనేది ఓ కుక్కల జాతి. ఇవి తెల్లని శరీరంపై నల్లని మచ్చలతో చాలా అందంగా ఉంటాయి. ఈ కుక్కపిల్లలతో ఓ చక్కని కథ అల్లి డోడీస్మిత్‌ అనే రచయిత్రి 1956లో పిల్లల కోసం ఓ నవల రాసింది. ఆ నవలను వాల్ట్‌డిస్నీ చదివి వెంటనే దాని హక్కులు కొన్నాడు, యానిమేషన్‌ సినిమా తీయాలని. కానీ అప్పటికి అతడి పరిస్థితి ఏంటో తెలుసా? అంతకు ముందు తీసిన ‘ద స్లీపింగ్‌ బ్యూటీ’ సినిమాకు నష్టాలు వచ్చాయి. యానిమేషన్‌ విభాగాన్ని అమ్మేయాలని కూడా అనుకున్నాడు. అయినా ఈ సినిమా తీయాలనుకున్నాడు. ఎందుకంటే కథ నచ్చి!

ఇంతకీ కథేంటి?
అనగనగా లండన్‌లో ఓ బ్రహ్మచారి. అతడికో డాల్మేషియన్‌ కుక్కపిల్ల. ఆ కుక్కపిల్లకి జీవితం బోర్‌ కొట్టింది. ఎలాగైనా తన యజమానికి ఓ అమ్మాయిని జత చేయాలనుకుంది. తానూ ఓ అందమైన ఆడకుక్కతో జంటగా మారాలనుకుంది. రోజూ కిటికీ లోంచి కుక్కల్ని షికారు తీసుకొచ్చే వారిని పరిశీలించింది. ఓ డాల్మేషియన్‌ కుక్కతో షికారుకొచ్చే అందమైన అమ్మాయిని చూసి, ఇంట్లోంచి పరుగెత్తి ఆ అమ్మాయి దగ్గర ఆగింది. బ్రహ్మచారి దాని వెంట పడ్డాడు. అబ్బాయి, అమ్మాయి మాట్లాడుకున్నారు. కుక్కలు రెండూ ముచ్చట్లాడాయి. ఇంకేముంది? వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇవి రెండూ జతగూడాయి. ఆపై అన్యోన్యంగా కాపురం చేసి 15 పిల్లల్ని కన్నాయి. అదే నగరంలో ఓ దుర్మార్గురాలైన ధనవంతురాలికి ఓ విచిత్రమైన కోరిక ఉంది. 101 డాల్మేషియన్‌ కుక్కపిల్లల చర్మంతో ఓ అందమైన బొచ్చుకోటు తయారు చేయించుకోవాలని. వేర్వేరు చోట్ల ఒకేరకమైన 84 కుక్కపిల్లల్ని కొంది. మరో 15 తక్కువయ్యాయి. కొత్తగా పెళ్లయిన బ్రహ్మచారి ఇంట్లో ఉన్న కుక్కపిల్లల్ని కొంటానంది. అతడు అమ్మనన్నాడు. దాంతో కోపం వచ్చి ఆమె తన మనుషుల చేత వాటిని కిడ్నాప్‌ చేయించి, తన పురాతన కోటలో దాచేసింది. ఆ కుక్కపిల్లలన్నీ కలిసి ఓ ప్లాన్‌ వేశాయి. లండన్‌లో ఉండే కుక్కలకు మాత్రమే అర్థమయ్యేలా ఓ కోడ్‌ భాషలో మొరిగాయి. దాంతో వందలాది కుక్కలు మరికొన్ని జంతువుల్ని కూడా తోడు తీసుకుని బయల్దేరాయి. చివరకి అన్నీ కలిసి సరిగ్గా ఆ దుర్మార్గురాలు కుక్కపిల్లల్ని చంపేసే వేళకి అన్నింటినీ రక్షించాయి. చివరకు పోలీసులు కూడా వచ్చి దుండగుల్ని అరెస్ట్‌ చేశారు. బాగుంది కదూ, కథ?

ఈ సినిమాను విడుదల చేసినప్పుడల్లా దేశదేశాల్లో పిల్లలు, పెద్దలు విరగబడి చూశారు. దీన్ని వీడియోగా విడుదల చేస్తే 11 కోట్ల కాపీలు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత డీవీడీలుగా, బ్లూరేలుగా కూడా విడుదల చేశారు.


ఈ సినిమాకు రీమేక్‌గా 1996లో లైవ్‌ యాక్షన్‌తో మరో సినిమాను విడుదల చేస్తే అది కూడా హిట్‌ అయింది.


* కొసమెరుపు: ఈ నవల రాసిన డోడీస్మిత్‌కి కూడా డాల్మేషియన్‌ కుక్కే ఉండేది. అది కూడా 15 పిల్లల్ని కంది. వాటిని చూసినప్పుడే ఆమెకీ ఈ కథ స్ఫురించింది!


* ఈ సినిమాలోని కుక్కపిల్లల ఒంటి మీద మచ్చల్ని లెక్కపెడితే అవి 6,469,952 అని తేలింది!


* ఈ యానిమేషన్‌ సినిమా కోసం బొమ్మలు వేయడానికి ఏకంగా 800 గ్యాలన్ల (5 టన్నులు) రంగులు వాడారు! దాదాపు 1000 రకాల షేడ్స్‌ ఉపయోగించారు!


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.