విజయాల తమిళ తంబి ... భీంసింగ్
కొందరు నిర్మాతలకు కొన్ని భావానుబంధ విశ్వాసాలు వుంటాయి. ప్రముఖ తెలుగు చిత్రనిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్ కు తెలుగు అక్షరమాలలోని తొలి అక్షరాలు ‘అ/ఆ’ లతో మొదలయ్యే సినిమా పేర్లు పెట్టడంమీద ఆసక్తి మెండు. అన్నపూర్ణ, ఆరాధన, ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు, అదృష్టవంతులు సినిమాలు ఇలా వచ్చినవే. అలాగే కళాతపస్వి విశ్వనాథ్ కు ‘ఎస్’ అక్షరంతో మొదలయ్యే పేర్లతో సినిమాలు నిర్మించడం ఆనవాయితీ. సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి, శంకరా భరణం, సప్తపది, శ్రుతిలయలు, స్వాతికిరణం, స్వాతిముత్యం, స్వర్ణకమలం, శుభలేఖ, శుభోదయం, శుభ సంకల్పం, సిరివెన్నెల, సాగర సంగమం, స్వయంకృషి సినిమాలు ఆ కోవలోనివే. ఈ అలవాటు తమిళ, తెలుగు, హిందీ సినిమాలకు దర్శకత్వం వహించిన ఎ. భీంసింగ్ కు కూడా వుండడం, విచిత్రమేమీ కాదు. తమిళంలో ‘ప’ అక్షరంతో మొదలయ్యే పేర్లతో భీంసింగ్ శివాజీ గణేశన్ హీరోగా సినిమాలు నిర్మించారు. అవి అన్నీ బాక్సాఫీస్ హిట్లయ్యాయి. శివాజీ గణేశన్ నటించిన పావ మన్నిప్పు, పాలుమ్ పళముమ్, పాశమలర్, పడిత్తాల్ మత్తుమ్ పోదుమా, పళని, పార్తాళ్ పసి తీరుమ్ సినిమాలు వాటిలో కొన్ని కాగా, పావ మన్నిప్పు(1962) సినిమా దక్షిణాదిలో తొలి ఉత్తమ చిత్రంగా జాతీయ బహుమతి అందుకుంది. భీంసింగ్ సినిమాలలోకి రాకముందు ఒక తెలుగు పత్రికకు జర్నలిస్టుగా పనిచేయడం విశేషం. అత్యంత విజయవంతమైన దర్శకులలో ఎ. భీంసింగ్ ఒకరు. కన్నడ, మళయాళ చిత్రసీమలో కూడా ఒక వెలుగు వెలిగిన భీంసింగ్ జయంతి 15 అక్టోబర్. ఈ సందర్భంగా ఆ దర్శక నిర్మాతకు నివాళి సమర్పిస్తూ అందిస్తున్న విశేషాలు కొన్ని...


భీంసింగ్ తెలుగువాడే...
భీంసింగ్ పుట్టింది తెలుగు గడ్డ మీదే. అనంతపూరు జిల్లా రాయలచెరువు గ్రామంలో అక్టోబర్ 15, 1924 భీంసింగ్ పుట్టారు. పదహారేళ్లకే భీంసింగ్ కు సినిమాలమీద ఆసక్తి పెరిగి మద్రాసు చేరుకున్నారు. కృష్ణన్-పంజు దర్శక ద్వయం వద్ద సహాయ ఎడిటర్ గా పనికి కుదిరారు. వారితో మంచి స్నేహసంబంధాలను పెంచుకోవడంతో కృష్ణన్ తన సోదరి సోనా తో 1949లో భీంసింగ్ కు వివాహం జరిపించారు. భీంసింగ్ పెద్ద కుమారుడు నరేన్, పంజు కూతుర్ని పెళ్లాడాడు. భీంసింగ్ కొంతకాలం వివిధ తమిళ సినీ నిర్మాణ సంస్థలవద్ద సహాయ దర్శకునిగా పనిచేసి అనుభవం గడించారు. నాటి అద్భుత హాస్యనటుడు ఎన్.ఎస్. కృష్ణన్ సహాయ సహకారాలతో భీంసింగ్ తొలిసారి 1954 లో ‘అమ్మయ్యప్పన్’ అనే తమిళ సినిమాకు దర్శకత్వం వహించారు. నేషనల్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి నాటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిథి కథ, మాటలు, పాటలు సమకూర్చారు. ప్రేమబలం కథాంశం నేపథ్యంగా నిర్మించిన ఈ చిత్రంలో ఎస్.ఎస్. రాజేంద్రన్, శకుంతల హీరో హీరోయిన్లు గా నటించారు. సినిమా బాగా విజయవంతమవడంతో భీంసింగ్ దర్శకుడిగా వెనక్కు తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. అదే సంస్థ 1956 లో నిర్మించిన ‘రాజా రాణి’ చిత్రానికి కూడా భీమ్ సింగే దర్శకత్వం వహించారు. కరుణానిధి రచన చేసిన ఈ చిత్రంలో శివాజీ గణేశన్, పద్మిని, ఎస్. ఎస్. రాజేంద్రన్, రాజసులోచన, టి.ఎ. మధురం, కృష్ణన్ నటించారు. సినిమా సూపర్ హిట్ కావడంతో 1960లో ఇదే చిత్రాన్ని హిందీలో ‘ఆయీ ఫిర్ సే బహార్’ పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. న్యూటోన్ స్టూడియో అధిపతులైన దిన్షా టెహరాని, జితేన్ బెనర్జీ లు ఈ చిత్రానికి వరసగా శబ్ద, ఛాయాగ్రాహకులుగా పనిచేయడం విశేషం. 1960లో ఎ.వి.ఎం వారు భీంసింగ్ దర్శకత్వంలో ‘కళత్తూర్ కణ్ణమ్మ’ చిత్రాన్ని నిర్మించారు. అందులో జెమిని గణేశన్, సావిత్రి, టి.ఎస్. బాలయ్య, ఎస్.వి. సుబ్బయ్య, దేవిక, మనోరమ నటించగా, కమల్ హాసన్ బాలనటుడి పాత్ర పోషించారు. ఈ సినిమా సగానికి పైగా తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించారు. అయితే మెయ్యప్పన్ కు తాతినేని ప్రకాశరావు పధ్ధతి ఎందుకో నచ్చలేదు. కుమారుడు శరవణన్ కు చెప్పి అంతవరకూ షూట్ చేసిన ఫిలిం ను పక్కనపెట్టి భీంసింగ్ తో పూర్తి చిత్రాన్ని రీషూట్ చేయించారు. అలాగే బాలనటి డెయిసీ ఇరాని స్థానంలో కమల్ హాసన్ ను భీంసింగ్ తీసుకున్నారు. ఈ చిత్రం శతదినోత్సవం చేసుకోవడమే కాక, జాతీయ బహుమతిని కూడా గెలుచుకుంది. కమల్ హాసన్ కు ప్రెసిడెంట్ బంగారు పతకం లభించింది. ఈ సినిమాను ఎ.వి.ఎం వారే తెలుగులోకి ‘మావూరి అమ్మాయి’ పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. మరలా ఇదే సినిమాను ఎ.వి.ఎం వారే 1969లో ‘మూగనోము’ పేరుతో స్ట్రెయిట్ చిత్రంగా నిర్మించి విజయం సాధించారు. 1962లోనే ఎ.వి.ఎం వారు భీంసింగ్ దర్శకత్వంలో ‘కళత్తూర్ కణ్ణమ్మ’ చిత్రాన్ని హిందీలో ‘మై చుప్ రహూంగీ’ గా నిర్మించి బ్లాక్ బస్టర్ గా నిలిపారు. హిందీ వర్షన్ లో సునీల్ దత్, మీనాకుమారి, నానా ఫల్సికర్, హెలెన్, రాజ్ మెహ్రా నటించగా, కమల్ హాసన్ పాత్రను డెయిసీ ఇరాని పోషించింది.

తమిళ చిత్రాలు తెలుగులో పునర్నిర్మితమై...
1958 లో భీంసింగ్ దర్శకత్వం వహించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. అవి ‘పతిభక్తి’, ‘తిరుమానం’. పతిభక్తి చిత్రంలో శివాజీ గణేశన్, జెమిని గణేశన్, సావిత్రి, ఎం.ఎన్. రాజం ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని బుద్ధ పిక్చర్స్ పతాకం మీద భీంసింగ్ నిర్మాతగా వ్యవహరిస్తూ దర్శకత్వ, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. దుర్గా ఫిలిమ్స్ నిర్మాత కె.వి. చౌదరి తమిళ మాతృకను ‘పతిభక్తి’ పేరుతోనే తెలుగులోకి అదే సంవత్సరం డబ్ చేసి విడుదలచేశారు. తెలుగులో కూడా ఈ చిత్రం విజయవంతమైంది. వాలంపూరి సోమనాథన్ కథ, మాటలు సమకూర్చి నిర్మించిన చిత్రం ‘తిరుమానం’. ఇందులో జెమిని గణేశన్, సావిత్రి, నాగయ్య, ఎస్.వి. రంగారావు ముఖ్య తారాగణం. గోపికృష్ణ, కమలాలక్ష్మణ్, బి. సరోజాదేవిల మీద కొన్ని నృత్య గీతాలను గేవాకలర్ లో చిత్రీకరించి విడుదల చేశారు. సినిమా గొప్పగా ఆడలేదు. 1959లో పి.కె. సత్యపాల్ ఓరియంటల్ మూవీస్ బ్యానర్ మీద ‘పొన్ను విలయుమ్ భూమి’ అనే చిత్రాన్ని భీంసింగ్ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ బాధ్యతలు భీంసింగ్ నిర్వహించారు. అదే సంవత్సరం కాస్ట్యూమ్ మేకర్ గా ఉంటూ శరవణ ఫిలిమ్స్ అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించిన జి.ఎన్. వేలుమణి భీంసింగ్ దర్శకత్వంలో ‘భాగ పిరివినై’ అనే పెద్ద సూపెర్ హిట్ చిత్రాన్ని నిర్మించారు. శివాజీ గణేశన్, బి. సరోజాదేవి, ఎం.ఆర్. రాధా, నంబియార్, టి.ఎస్. బాలయ్య, ఎం.వి. రాజమ్మ ముఖ్య తారాగణంగా నటించిన ఈ చిత్రం అనేక కేంద్రాల్లో రజతోత్సవం చేసుకుంది. ఇదే సినిమాను 1960 లో శ్రీసారథి స్టూడియో వారు తాపీ చాణక్య దర్శకత్వంలో ‘కలసివుంటే కలదుసుఖం’ పేరుతో పునర్నిర్మించారు.అలాగే హిందీలో ‘ఖాందాన్’ (1965) గా, కన్నడంలో ‘మురియాద మానె’ (1964) గా రీమేక్ చేశారు. అన్నిభాషల్లో కూడా ఈ సినిమా విజయవంతమైంది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘భాగ పిరివినై’ చిత్రం ప్రెసిడెంట్ రజత పతకాన్ని అందుకుంది. తరవాత ఆశాపూర్ణాదేవి నవల ఆధారంగా బెంగాలీలో నిర్మించిన ‘జోగ్ బిజోగ్’ అనే సినిమా ఆధారంగా తమిళంలో భీంసింగ్ దర్శకత్వంలో ఎన్. కృష్ణస్వామి ‘పడిక్కాద మేధై’ పేరుతో నిర్మించారు. శివాజీ గణేశన్, జానకి, ఎస్.వి. రంగారావు, కన్నాంబ, ముత్తురామన్, ఇ.వి. సరోజ ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ సినిమా సూపర్ హిట్టయింది. శ్రీసారథి స్టూడియోస్ వారే ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఆత్మబంధువు’ (1962) పేరుతో రీమేక్ చేశారు. భరణీ రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఇదే సినిమాను ఎ.వి.ఎం వారు భీంసింగ్ దర్శకత్వంలో ‘మెహర్బాన్’ పేరుతో హిందీలో పునర్నిర్మించారు. ఇందులో సునీల్ దత్, అశోక్ కుమార్, నూతన్, జయంతి, శశికళ, మెహమూద్ నటించగా విన్సెంట్ చాయాగ్రహణం నిర్వహించారు. విజయవంతమైన ఈ సినిమాకు రవి సంగీత దర్శకుడు. 1961లో రాజమణి పిక్చర్స్ అధిపతి ఎం.ఆర్. సంతానం భీంసింగ్ దర్శకత్వంలో ‘పాశమలర్’ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో శివాజీ గణేశన్, జెమిని గణేశన్, సావిత్రి, తంగవేలు, ఎం.ఎన్. రాజం, నంబియార్ నటించారు. ఈ చిత్రం 26 వారాలు ఆడి సిల్వర్ జూబిలీ చేసుకుంది. 9 వ జాతీయ బహుమతుల ఉత్సవంలో ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఈ సినిమా హక్కులు కొని సుందర్లాల్ నహతా, డూండీ రాజలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తెలుగులో ‘రక్తసంబంధం’ పేరుతో పునర్నిర్మించారు. ఎన్.టి. రామారావు, కాంతారావు, సావిత్రి, దేవిక నటించిన ఈ సూపర్ హిట్ తెలుగు త్రానికి వి. మధుసూదనరావు దర్శకత్వం వహించారు. ముళ్ళపూడి వెంకటరమణ మాటలు సమకూర్చారు. తెలుగులో 11 కేంద్రాల్లో ఈ చిత్రం సిల్వర్ జుబిలీలు చేసుకుంది. ‘పాశమలర్’ చిత్రాన్ని నటుడు శివాజీ గణేశన్ హిందీలో ‘రాఖి’ పేరుతో భీంసింగ్ దర్శకత్వంలో సొంతంగా నిర్మించారు. ఇందులో అశోక్ కుమార్, ప్రదీప్ కుమార్, మెహమూద్, వహీదా రెహమాన్ నటించగా, అశోక్ కుమార్ కు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ బహుమతి లభించింది. తరవాత శరవణ ఫిలిమ్స్ వారి ‘పాళుమ్ పళముమ్’, సొంత సంస్థ బుద్ధ పిక్చర్స్ వారి ‘పావ మన్నిప్పు’ సినిమాలకు భీంసింగ్ దర్శకత్వం వహించారు. ‘పాళుమ్ పళముమ్’ చిత్రంలో శివాజీ గణేశన్, బి. సరోజాదేవి, జానకి, నాగయ్య, ప్రేమ నజీర్. ఎం. ఆర్. రాధా, టి.ఎస్. బాలయ్య, మనోరమ నటించగా ఈ చిత్రం కూడా సూపర్ హిట్టయింది. ఈ చిత్రాన్ని హిందీలో వీనస్ పిక్చర్స్ నిర్మాత ఎస్. కృష్ణమూర్తి ‘సాథి’ (1968) పేరుతో పునర్నిర్మించారు. రాజేంద్రకుమార్, సిమి, డేవిడ్, పహరి సన్యాల్ ముఖ్య తారాగణం. ఈ చిత్రం ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డులకెక్కింది. సిమి కి ఫిలింఫేర్ బహుమతి లభించింది. భీంసింగ్ ఎ.వి.ఎం వారి సహకారంతో సొంతంగా నిర్మించిన భారీ బడ్జట్ సినిమా ‘పావ మన్నిప్పు’ లో శివాజీ గణేశన్, దేవిక, జెమిని గణేశన్, సావిత్రి, ఎం.ఆర్. రాధా ప్రధాన తారాగణం. ఈ చిత్రం సిల్వర్ జూబిలీ చేసుకోవడమే కాకుండా, జాతీయ బహుమతి కూడా అందుకుంది. తెలుగులో ఈ సినిమాను ‘పాపపరిహారం’ పేరుతో డబ్ చేశారు. శివాజీ గణేశన్ సొంత సినిమా థియేటర్ ‘శాంతి’ లో ప్రదర్శనకు నోచుకున్న తొలి చిత్రంగా ‘పావ మన్నిప్పు’ రికార్డు అందుకుంది. అక్కడ ఈ సినిమా 175రోజులు ఆడి రికార్డు సృష్టించింది. ఇతర కేంద్రాల్లో సిల్వర్ జూబిలీ చేసుకుంది. ద్వితీయ ఉత్తమ చిత్రంగా జాతీయ బహుమతి కూడా అందుకుంది.

అన్నీ విజయవంతమైన సినిమాలే...
1962లో భీంసింగ్ దర్శకత్వం వహించిన సినిమాలు బాగా విజయవంతమయ్యాయి. వాటిలో శాంతి ఫిలిమ్స్ వారు నిర్మించగా శివాజీ గణేశన్, జెమిని గణేశన్, దేవిక, సావిత్రి, ఎస్. వి. రంగారావు నటించిన ‘బంధ పాశం’ కూడా ఒకటి. ఈ చిత్రాన్ని ‘ఆదర్శ సహోదరులు’ పేరుతో తెలుగులోకి అనువదించారు. ఆ సంవత్సరం భీంసింగ్ ఏకంగా ఏడు సినిమాలకు దర్శకత్వం వహించారు. వాటిలో ‘సెంతమరై’ (మద్రాస్ పిక్చర్స్), ‘పార్తాల్ పసి తీరుమ్’ (ఎ.వి.ఎం ప్రొడక్షన్స్), ‘పదిత్తాల్ మట్టుమ్ పోదుమా’ (రంగనాథ పిక్చర్స్) చిత్రాలున్నాయి. ’పార్తాల్ పసి తీరుమ్’ చిత్రంలో శివాజీ గణేశన్, జెమిని గణేశన్, సావిత్రి, జానకి, బి. సరోజాదేవి నటించారు. ఈ చిత్రాన్ని ఎ.వి. ఎం వారే ‘పవిత్రప్రేమ’ పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. 1963లో ‘పార్ మగళే పార్’ అనే సినిమాను కస్తూరి ఫిలిమ్స్ సంస్థ నిర్మించగా భీంసింగ్ దర్శకత్వం వహించారు. శివాజీ గణేశన్, జానకి, ముత్తురామన్, విజయకుమారి ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. తరవాత వేల్ పిక్చర్స్ వారి ‘పచ్చాయ్ విళక్కు’, ఎ.ఎల్.ఎస్ ప్రొడక్షన్స్ వారి ‘శాంతి’, సన్ బీమ్ ప్రొడక్షన్స్ (భీంసింగ్ సొంత సంస్థ)వారి ‘సాదు మిరండల్’, ‘ఆలయం’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు భీంసింగ్ దర్శకత్వం వహించారు. తను దర్శకత్వం వహించిన సినిమాలకు ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహించడం భీంసింగ్ కు అలవాటు.హిందీ, తెలుగు చిత్రాల దర్శకుడిగా...
1986లో భీంసింగ్ దర్శకత్వం వహించిన ‘రాజా-రాణి’ చిత్రాన్ని హిందీలో ‘ఆయే ఫిర్ సే బహార్’ పేరిట సినిమాగా రీమేక్ చేశారు. భీంసింగ్ దర్శకత్వం వహించిన తొలి హిందీ సినిమా కూడా ఇదే. ఇందులో శివాజీ గణేశన్, పద్మిని, రాగిణి, రాజసులోచన ముఖ్య తారాగణం. ‘మై చుప్ రహూంగీ’, ’రాఖీ’, ‘పూజా కే ఫూల్’ (తమిళ కుముదమ్ సినిమా), ’ఖాందాన్’ (తమిళ భాగ పిరివినై సినిమా), ‘సాధు అవుర్ సైతాన్’ (తమిళ సాధు మిరండాల్ సినిమా), ‘గౌరి’ (తమిళ శాంతి సినిమా), ‘ఆద్మీ’ (తమిళ ఆలయమణి చిత్రం), ‘గోపి’ (కన్నడ చిన్నద గొంబె సినిమా), ‘సబ్ కా సాథీ’, ‘మాలిక్’ (తమిళ తునైవన్ సినిమా), ‘జోరూ కా గులామ్’ (కన్నడ అనుకూలక్కొబ్బ గండ సినిమా), ‘లోఫర్’, ‘నయా దిన్ నయీ రాత్’, ‘అమానత్’ హిందీ సినిమాలు భీంసింగ్ దర్శకత్వం వహించినవే. వీటిలో సింహభాగం సినిమాలు శతదినోత్సవం చేసుకున్నవి కావడం విశేషం. ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే భీంసింగ్ తెలుగులో దర్శకత్వం వహించిన మొదటి స్ట్రెయిట్ చిత్రం ‘మనసిచ్చిన మగువ’. తరవాత నటుడు నాగభూషణం రవి ఆర్ట్ థియేటర్స్ బ్యానర్ మీద నిర్మించిన ‘ఒకే కుటుంబం’ (1970) చిత్రానికి భీంసింగ్ దర్శకత్వం వహించారు. ఇందులో ఎన్.టి. రామారావు, లక్ష్మి, రాజశ్రీ, కాంతారావు, నాగభూషణం, నాగయ్య, రావి కొండలరావు తదితరులు నటించగా భీంసింగ్ స్క్రీన్ ప్లే కూడా సమకూర్చారు. పాలగుమ్మి పద్మరాజు మాటలు రాయగా, కోదండపాణి సంగీతం సమకూర్చారు. ‘మంచిని మరచీ వంచన నేర్చీ నరుడే ఈనాడూ, వానరుడైనాడూ’; ‘అందరికీ ఒక్కడే దేవుడూ... కొందరికి రహీమూ కొందరికి రాముడూ, ఏపేరున పిలిచినా దేవుడొక్కడే’ అనే దాశరథి పాటలు బాగా హిట్టయ్యాయి. సినిమా బాగా ఆడింది. అలాగే ‘చిరంజీవి’, ‘బంగారు మనిషి’, ‘ఎవరు దేవుడు’ చిత్రాలకు కూడా భీంసింగ్ దర్శకత్వం వహించారు. నటుడు విజయచందర్ నటించి నిర్మించిన అద్భుత బైబిల్ నేపథ్య సినిమా ‘కరుణామయుడు’ చిత్రానికి భీంసింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి అంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది బహుమతి ప్రదానం చేసింది. ఈ చిత్రాన్ని హిందీ, కన్నడంలో ‘దయాసాగర్’ గా, తమిళంలో ‘కరుణామూర్తి’ గా, ఇంగ్లీషు లో ‘ఓషన్ ఆఫ్ మెర్సీ’ గా డబ్ చేసి విడుదలచేస్తే సినిమా బాగా ఆడింది.


మరిన్ని విశేషాలు...
శివాజీ గణేశన్ హీరోగా భీంసింగ్ అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించారు. భీంసింగ్ దర్శకత్వంలో వచ్చిన పావ మన్నిప్పు, పాలుమ్ పళముమ్, పాశమలర్, పడిత్తాల్ మట్టుమ్ పోదుమా, పళని, పార్తాళ్ పసి తీరుమ్ వంటి సినిమా లన్నీ ‘ప’ అనే తమిళ అక్షరంతో మొదలయ్యేవే కావడం ఒక విశేషం. దక్షిణ భారతదేశంలో ఒక తమిళ చిత్రానికి మొదటి జాతీయ బహుమతి తెచ్చిపెట్టిన ఘనత భీంసింగ్ దే (పావ మన్నిప్పు). భీంసింగ్ దర్శకత్వం వహించిన అధిక శాతం సినిమాలకు విశ్వనాథన్-రామమూర్తి ద్వయం సంగీత దర్శకత్వం వహించడం కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి. హిందీ చిత్రం ‘మెహర్బాన్’ లో దర్శకత్వ ప్రతిభకు ఉత్తమ దర్శకుని బహుమతి భీంసింగ్ కు కొద్దిలో తప్పిపోయింది. భీంసింగ్ దర్శకత్వం వహించిన ఐదు తమిళ చిత్రాలు జాతీయ బహుమతులు పొందడం ఒక రికార్డు. కృష్ణన్-పంజు దర్శక ద్వయంలోని కృష్ణన్ చెల్లెలు సోనా ను భీంసింగ్ వివాహం చేసుకున్నారు. అలాగే భీంసింగ్ పెద్దకుమారుడు లెనిన్, పంజు కుమార్తెను వివాహ చేసుకున్నాడు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి కరుణానిథి భీంసింగ్ దర్శకత్వం వహించిన తొలి రెండు సినిమాలకు సంభాషణలు సమకూర్చడం ఒక విశేషం. హిందీలో భీంసింగ్ దర్శకత్వం వహించిన ఎక్కువ సినిమాలలో సునీల్ దత్ హీరో కాగా, క్యారక్టర్ పాత్రలను అశోక్ కుమార్ పోషించారు. తెలుగులో ‘నవరాత్రి’ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పోషించిన తొమ్మిది వైవిధ్య పాత్రలను ‘నయా దిన్ నయీ రాత్’ చిత్రంలో సంజీవ్ కుమార్ పోషించిన విషయం తెలిసిందే. ఆ చిత్రానికి దర్శకుడు భీంసింగ్! బుద్ధ పిక్చర్స్, సన్ బీమ్ చిత్రనిర్మాణ సంస్థలు భీంసింగ్ సొంత సంస్థలు. భీంసింగ్ జనవరి 16, 1978 న కాలంచేశారు.

ఆచారం షణ్ముఖాచారి


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.