ఆయన ఒక్కో సినిమా ఒక్కో రత్నం!
మె... తెలుగు సినిమాని శాసించిన అభినేత్రి. అతడు... ఆమె మేకప్‌ మాన్‌. ఆ సాదాసీదా మేకప్‌ మానే తర్వాతర్వాత పెద్ద నిర్మాతగా మారి ఎంతో మంది ఆర్టిస్ట్‌ల జాతకాలు తిరగ రాసిన చరిత్ర ఏదయినా ఉందంటే... అది ఎ.ఎం. రత్నం కధే. కృషి, పట్టుదల ఉంటే నిర్దేశించుకున్న లక్ష్యాల్ని ముద్దాడడం సులువేనని ఆయన జీవితం చెపుతోంది. విషయానికి వస్తే... చుట్టూ సినిమా వాతావరణం. సూపర్‌ హీరోయిన్‌ దగ్గర మేకప్‌ మాన్‌గా ఉద్యోగం. అంతటితో ఆయన సరిపెట్టుకుంటే తెలుగులో కొన్ని మంచి సినిమాలు నిర్మాణం కాకుండా మరుగున పడిపోయి ఉండేవి. కొంతమంది సృజనశీలురకు అవకాశాలు అంది వచ్చేవి కావు. కానీ, సినిమా కళ పట్ల ఆసక్తి, అనురక్తితో కన్రెప్పల్లో ఎన్నో కలలు దాచుకుని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఎ.ఎం.రత్నం, ఇన్నాళ్లూ తాను మేకప్‌ చేసిన హీరోయిన్‌తోనే సూపర్‌ డూపర్‌ హిట్‌ మూవీ తీసి ఆమెకి జాతీయస్థాయిలో ఉత్తమ నటి అవార్డు రావడానికి కారకుడయ్యాడు. ఆ హీరోయిన్‌ సినీ వైభవ కాంతి విజయశాంతి కాగా... ఆ మేకప్‌ ఆర్టిస్ట్‌ ఎ.ఎం.రత్నం. రత్నంలాంటి సినిమాలు ఎన్నిటినో నిర్మించి తన పేరుకు సార్ధకత తెచ్చుకున్న అభిరుచిగల నిర్మాత. ఇటు తెలుగు, అటు తమిళ్‌ భాషల్లో ఆయన తీసిన సినిమాలు సంచలనాలు సృష్టించాయి. నిర్మాతగా ఆయనకు కాసుల వర్షం కురిపిస్తే... ఆయా చిత్రాల్లో పనిచేసిన కళాకారుల ప్రతిభకు పట్టాభిషేకం దక్కింది.


విజయాల మైలురాళ్లు
1990 నుంచి ఎ.ఎం.రత్నం పేరు మారుమోగింది. మంచి చిత్రాల నిర్మాతగా ప్రఖ్యాతిని గడించారు. అదే సమయంలో సామాజిక స్పృహతో కూడిన సినిమాలు నిర్మించారు. 1990లో విజయశాంతి హీరోయిన్‌గా ఆయన నిర్మించిన ‘కర్తవ్యం’ సాధించిన విజయం స్ఫూర్తి తరువాత ఆయన్ని మరింత ముందుకు నడిపించింది. రాజకీయ నేపథ్యంతో కూడిన కథలో నాయిక ఐపీఎస్‌ అధికారిణి. ఈ పాత్రలో విజయశాంతి ప్రదర్శించిన నటనకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి పురస్కారం లభించింది. అంతకు ముందు ఆమె కొన్ని సినిమాలకు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించారు. ఆ తరువాత ప్రత్యక్షంగా నిర్మాతగా రత్నం అనేక సినిమాలు తీశారు. వాటికి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఎ.ఎం.రత్నం స్థాపించిన శ్రీ సూర్య మూవీస్‌ ఎంటరటైన్‌మెంట్‌ పతాకానికి అభిమానులయ్యారు. ఎ.ఎం.రత్నం పేరు చెప్పగానే... ‘కర్తవ్యం’తో పాటు అనేక బ్లాక్‌ బస్టర్‌ మూవీస్‌ గుర్తొస్తాయి. వాటిలో కమలహాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వం వహించిన ‘భారతీయుడు’ ఎప్పటికీ చెప్పుకోదగ్గ గొప్ప సినిమా. ఈ చిత్రంలో కమల హాసన్‌ రెండు పాత్రల్లో తండ్రి, కొడుకుగా కనిపిస్తారు. సమాజంలో పేరుకుపోయిన అవినీతి మురికిని పారద్రోలేందుకు దర్శకుడు శంకర్‌ సంధించిన సృజనాత్మక అస్త్రం ‘భారతీయడు’. తమిళ్‌లో ‘ఇండియన్‌’గా నిర్మితమైన ఈ సినిమాకి ఎ.ఎం.రత్నం తొలుత ఫైనాన్స్‌ చేశారు. ఆ సినిమా ఉత్తమ సినిమాగా ఫిలిం ఫేర్‌ అవార్డు గెలుచుకుంది. ఈ సినిమాతోనే ఎ.ఎం.రత్నం పేరు కూడా సుపరిచితమైనది. ఆ తరువాత ఆయన తీసిన అనేకానేక చిత్రాలు థియేటర్స్‌లో హల్చల్‌ చేసాయి. వాటిలో... ‘పెద్దరికం’, ‘స్నేహం కోసం’, ‘ఖుషి’, ‘రన్‌’, ‘బాయ్స్‌’, ‘నాగ’, ‘7/జి బృందావన్‌ కాలనీ’, ‘ఆరంభం’, ‘బంగారం’, ‘ఆక్సీజû’Â...ఇలా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల మనోయవనికలపై రీళ్లు రీళ్లుగా కదలాడుతాయి. ఎక్కువగా తెలుగు, తమిళ్‌ సినిమాలు తీసినా అడపాదడపా హిందీలో కూడా సినిమాల్ని ఎ.ఎం.రత్నం నిర్మించారు.


అగ్ర నటులందరితో...సినిమాలు
శ్రీ సూర్య మూవీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకం కింద ఆయన తమిళ్, తెలుగులో అగ్ర నటులందరితో సినిమాలు తీశారు. చిరంజీవి, విజయకుమార్‌తో ‘స్నేహం కోసం’, పవన్‌ కళ్యాణ్‌తో ‘ఖుషి’, ‘బంగారం’, కమల హాసన్‌తో ‘నాయక్‌’, మాధవన్, మీరా జాస్మిన్‌తో ‘రన్‌’, తరుణ్, త్రిషతో తమిళంలో ‘ఇనక్కు 20..ఉనక్కు 18’, తెలుగులో ‘నీ మనసు నాకు తెలుసు’, జూనియర్‌ ఎన్టీఆర్, సదాతో ‘నాగ’, సిద్దార్ధ్, జెనీలియా, భరత్‌తో శంకర్‌ దర్శకత్వంలో ‘బాయ్స్‌’, విజయ్, త్రిష కాంబినేషన్లో తమిళ్‌లో ‘గిల్లీ’, కొత్తగా గోపీచంద్, రాశిఖన్నాతో కలసి ‘ఆక్సిజన్‌’..ఇలా ప్రఖ్యాతిగాంచిన నటీనటులందరితో సినిమాలు నిర్మించారు. అజిత్‌ హీరోగా ‘ఆరంభం’, ‘ఎన్నాయ్‌ అరందాల్‌’, ‘వేదాళం’ చిత్రాలు ఎ.ఎం.రత్నం ఖ్యాతిని పెంచాయి.


కుమారులిద్దరూ సినీ వారసులే!
ఎ.ఎం.రత్నం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జన్మించారు. సినిమా మీద ప్రేమతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ స్థానాన్ని సముపార్జించుకున్నారు. ఆయనకి ఇద్దరు కుమారులు. వారిద్దరూ కూడా సినిమాల్లోనే రాణించారు. పెద్ద కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకుడిగా రాణిస్తే... రెండో కుమారుడు రవికృష్ణ నటుడిగా రాణించారు. జ్యోతి కృష్ణ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఇనక్కు 20.. ఉనక్కు 18’ తమిళభాషలో తీసిన ఈ చిత్రాన్ని తరువాత తెలుగులో ‘నీ మనసు నాకు తెలుసు’గా అనువదించారు. ఈ సినిమాలో తరుణ్, త్రిష నటించారు. జ్యోతి కృష్ణ తన సోదరుడు రవికృష్ణ హీరోగా తమిళంలో ‘7/జి రైన్‌ బో కాలనీ’, తెలుగులో ‘7/జె బృందావన్‌ కాలనీ’గా తీసిన సినిమాలు ఎ.ఎం.రత్నం నిర్మాణ సంస్థకు ఎక్కడలేని పేరుని తెచ్చాయి. ఈ సినిమా యువతను ఎంతగానో ఆకట్టుకుంది. యువన్‌ శంకరరాజా సంగీతంలో ఈ చిత్రంలోని పాటలు జనాదరణ పొందాయి. మరీ ప్రత్యేకించి...తలచి తలచి చూస్తీ...పాట గుండెల్ని పిండేస్తుంది. అంత ఆర్దత్ర, అంత విషాదం ఆ పాటలో ఉంది.


అవార్డులు-పురస్కారాలు
ఎ.ఎం.రత్నం అభిరుచికి ప్రేక్షకుల నుంచే కాకుండా, ఎన్నో సాంస్కృతిక సంస్థల నుంచి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవార్డులు, పురస్కారాలు లభించాయి. 1990లో ‘కర్తవ్యం’ తొలి సినిమాకే ఉత్తమ చిత్రంగా ఫిలిం ఫేర్‌ అవార్డు అందుకున్నారు. 1996లో తమిళంలో నిర్మించిన ‘ఇండియన్‌’ సినిమాకి సైతం ఉత్తమ చిత్రంగా ఫిలిం ఫేర్‌ అవార్డు లభించింది. 1998లో తమిళంలో ‘నాట్‌ ఫుక్కా’గా సినిమాకి కూడా ఫిలిం ఫేర్‌ అవార్డు లభించింది. శ్రీ సూర్య మూవీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ పేరును శ్రీ సాయిరాం క్రియేషన్స్‌గా మార్చి వరుసగా తీసిన కొన్ని సినిమాలు బ్లాక్‌ బస్టర్లుగా సంచలన విజయాల్ని నమోదు చేశాయి. కేవలం నిర్మాతగానే కాకుండా స్కీన్ర్‌ ప్లే రైటర్‌గా కూడా సినిమాలకు పనిచేశారు. అందులో జూనియర్‌ ఎన్టీఆర్, సదా నటించిన నాగ సినిమాకి స్కీన్ర్‌ ప్లే అందించారు.

సాయి భక్తుడు
ఎ.ఎం.రత్నం షిర్డీ సాయి భక్తుడు. ఆయన సేవలో తరించాలని తపనపడుతున్న వ్యక్తి. అందుకే...ఆయన వలసరవక్కం ప్రాంతంలోని తన కార్యాలయ ప్రాంగణంలో షిర్డీ సాయి ఆలయాన్ని 2012లో నిర్మించి పూజాదికాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు.

- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.