‘విజయా’ల చక్కన్న ... చక్రపాణి

చక్రపాణిగా పేరొందిన విజయా సంస్థ రథసారథి అసలుపేరు ఆలూరి వెంకట సుబ్బారావు. బాలల పత్రిక ‘చందమామ’ వ్యవస్థాపకుడు. చక్రపాణి బహు భాషాకోవిదుడు. మంచి అభిరుచిగల రచయిత. ప్రఖ్యాత బెంగాలి రచయిత శరత్ చంద్ర చటర్జీ సాహిత్యాన్ని తెలుగులోకి అనువాదం చేసి బెంగాలి సంస్కృతిని తెలుగువారికి దగ్గర చేర్చిన సాహితీ పిపాసి. బడి చదువులు లేకపోయినా తమిళ, సంస్కృత, ఆంగ్లేయ భాషలను ఆపోసన పట్టిన విద్యాధికుడు. ప్రేక్షకుల నాడిని ఖచ్చితంగా అంచానా వేయగల సినీవైద్యుడు. ఆంధ్రజ్యోతి, కినిమా, చందమామ, యువ, విహారి వంటి పత్రికలను విజయవంతంగా నడిపిన సాహితీ కృషీవలుడు. మితభాషిగా, విజయా చక్కన్నగా పేరుతెచ్చుకున్న చక్రపాణిది ముక్కుసూటి మనస్తత్వం. చక్రపాణికి బెంగాలి కథలను ఎన్నుకోవడం ఇష్టం. ఎవరైనా అడిగితే ‘కథలకు భాషేంటి. ఏ భాషలో రాస్తే అవి ఆ భాష కథలౌతాయి’ అంటూ నర్మగర్భంగా చెప్పిన ఈ మేధావి చక్రపాణి జయంతి నేడు. ఈ సందర్భంగా కొన్ని విశేషాలు....

తొలిరోజుల్లో...

చక్రపాణి పుట్టింది ఆగస్టు 5, 1908న తెనాలి పట్టణంలో. తండ్రి గురవయ్య, తల్లి వెంకమ్మ. వారిది వ్యవసాయ కుటుంబం. ప్రాధమిక విద్యాభ్యాసం అనంతరం చక్రపాణి జాతీయోద్యమ ప్రభావానికి లోని హైస్కూలు విద్యకు స్వస్తి చెప్పి, యలమంచిలి వెంకటప్పయ్య పంతులు వద్ద హిందీ నేర్చుకున్నారు. హిందీ భాషా వ్యాపతికి నడుం కట్టిన వ్రజ నందన వర్మ వద్ద శిష్యరికం చేసి హిందీ భాషలో పట్టువిడుపులు నేర్చుకొని పాండిత్యాన్ని గడించారు. హిందీ ప్రచార సమితి ద్వారా భాషాభివృద్ధికి తోడ్పాటు ఇచ్చారు. ఆలూరి వెంకట సుబ్బారావు పేరును ‘చక్రపాణి’ గా మార్చింది వ్రజ నందన వర్మే. తరవాత ఇంగ్లీష్, సంస్కృత భాషల్ని స్వయంకృషితో నేర్చుకున్నారు. 1934 లో ‘యువ’ పత్రికను ప్రారంభించి మద్రాసు నుంచి వేలువరించేవారు. మద్రాసుకు వచ్చి వెళుతుండడంతో తమిళ భాష మీద పట్టు సాధించారు. ఈ పత్రికలో తెనాలికే చెందిన సాహితీవేత్త కొడవటిగంటి కుటుంబరావు చక్రపాణికి భాగస్వామిగా, చేదోడు వాదోడుగా వుండేవారు. ఈ పత్రికను చక్రపాణి 28 సంవత్సరాలు నడపగా కుటుంబరావు దానికి సంపాదకుడుగా వ్యవహరించారు. ఈ పత్రిక ప్రారంభానికి ముందు చక్రపాణికి 1932 లో క్షయవ్యాధి సోకింది. ఆధునిక వైద్య సదుపాయాలు లేని ఆ రోజుల్లో చక్రపాణి మదనపల్లి శానటోరియం లో చేరి చికిత్స పొందారు. అక్కడ వున్న కాలంలో చక్రపాణికి ఒక బెంగాలి బాబు పరిచయమయ్యాడు. అతనితో సాంగత్యం నెరపి బెంగాలి భాషను రాయడం, చదవడం నేర్చుకున్నారు. అదే శానటోరియంలో వాహినీ సంస్థ మూలస్తంభం ‘రాయలసీమ బిర్లా’ గా పేరొందిన మూలా నారాయణస్వామి కూడా చికిత్స పొందారు. అప్పుడే నారాయణ స్వామిని చూసేందుకు వచ్చిన కె.వి. రెడ్డి తో కూడా చక్రపాణికి పరిచయభాగ్యం కలిగింది. బెంగాలి నవలా రచయిత శరత్ చంద్ర చటర్జీ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించి పుస్తకాలుగా ప్రచురించారు. ఆ అనువాద నవలలలోని పాత్రలు తెలుగు వారి పాత్రలేనా అనేలా భ్రమింపజేసేవి. ఆ నవలల మాతృకలు బెంగాలీ అంటే నమ్మ శక్యం అయ్యేవి కాదు. ఇవి కాకుండా కొన్ని కథానికలు, నవలలు చక్రపాణి కలం నుండి జాలువారాయి.


చలనచిత్ర రంగంలో తొలి అడుగులు...

1940లో బొంబాయికి చెందిన ఫేమస్ ఫిలిమ్స్ వారు తెలుగులో ‘ధర్మపత్ని’ అనే సినిమా నిర్మాణం చేపట్టారు. ప్రముఖ మరాఠీ రచయిత విష్ణు సుఖరాం ఖండేర్కర్ రాసిన కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి పి. పుల్లయ్య దర్శకుడు. ముందు చిత్ర సంభాషణలు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ చేత రాయించారు. కానీ అవి పూర్తిగా గ్రాంధిక భాషలో వుండటం చేత దర్శకుడు పుల్లయ్యకు తృప్తినివ్వలేదు. ఆ చిత్ర నిర్మాణ వ్యవహారాలు చూస్తున్న బి.ఎస్. రామారావు తెనాలి వెళ్లి చక్రపాణి ని సంప్రదించి వాటిని పూర్తిగా మార్చి వ్యవహార శైలిలో తిరగరాయించారు. సినిమారంగంతో చక్రపాణికి అదే తొలి అనుభవం. కొల్హాపూర్ శాలిని స్టూడియోలో నిర్మితమైన ఈ చిత్రంలో శాంతకుమారి హీరోయిన్ కాగా ఉప్పులూరి హనుమంతరావు హీరో. అక్కినేని నాగేశ్వరరావు బాలనటుడుగా ఈ చిత్రం ద్వారానే వెండితెరకు పరిచయమైనారు. నిర్మాత బి. నాగిరెడ్డి మద్రాసులో తమ తండ్రిగారి హయాంలో ప్రారంభించిన బి.ఎన్.కె ప్రెస్ ను నిర్వహిస్తూ వుండేవారు. చక్రపాణి యువ పబ్లిషర్స్ పేరిట శరత్ నవలలు అనువదించి ప్రింటింగ్ కోసం బి.ఎన్.కె ప్రెస్ కు రావడం అక్కడ నాగిరెడ్డితో స్నేహం కలవడం, జీవితాంతం ఆ స్నేహం అనురాగ బంధంగా బలపడటం చక్రపాణి జీవితంలో చెప్పుకోతగిన సంఘటన. 1945లో బి.ఎన్. రెడ్డి, మూలా నారాయణస్వామి కలిసి వాహినీ సంస్థ బ్యానర్ మీద ‘స్వర్గసీమ’ నిర్మిస్తూ కథ, సంభాషణల రచన కోసం చక్రపాణిని పిలిపించారు. చిత్తూరు నాగయ్య హీరోగా, జయమ్మ నాగయ్య భార్యగా, భానుమతి సుజాతాదేవిగా నటించగా ఘంటసాల గాయకుడుగా వెండితెరకు పరిచయమైన చిత్రం స్వర్గసీమ. ఈ సినిమా బహుళ జనాదరణ పొందింది.


విజయా ప్రొడక్షన్స్ ఆవిర్భావం...

చక్రపాణి నవలలు, ఆంధ్రజ్యోతి పత్రికలు బి.ఎన్.కె ప్రెస్ లో అచ్చొత్తిస్తున్న సందర్భంగా నాగిరెడ్డికి చక్రపాణి సహచర్యం లభించింది. ఇద్దరూ కలిసి చిన్నపిల్లలకోసం ప్రత్యేకంగా ఒక పత్రిక తీసుకురావాలని నిర్ణయించి చందమామ పత్రికను నెలకొల్పారు. అదే ఊపులో 1949లో విజయా ప్రొడక్షన్స్ ను స్థాపించారు. భారత ఇతిహాసంలో అర్జునుడికి విజయుడు అనే పేరుంది. గెలుపును సూచించే ఆ పేరునే తమ సంస్థకు ఎన్నుకున్నారు. విజయా ప్రొడక్షన్స్ ఆఫీసు వాహినీ స్టూడియోలోనే వుండేది. వారికి రెండు యూనిట్లు ఉండేవి. ఒకటి చక్రపాణి ఆధ్వర్యంలోను, రెండవది కె.వి. రెడ్డి ఆధ్వర్యంలోను నడిచేవి. చక్రపాణి ఆధ్వర్యంలోని యూనిట్ తొలి ప్రయత్నంగా ‘షావుకారు’ (1950) చిత్రాన్ని ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించింది. ఈ సినిమాకి కథ, సంభాషణలు చక్రపాణి సమకూర్చారు. ఆరోజుల్లోనే ఈ సినిమా టైటిల్ కు ‘ఇరుగుపొరుగుల కథ’ అనే ట్యాగ్ లైన్ అమర్చారు. ఈ చిత్రంలో షావుకారు (గోవిందరాజుల సుబ్బారావు) పాత్ర ఒకరకంగా హీరో మరోరకంగా విలన్ పాత్రలాంటిది. పెద్దకుటుంబాలలో వ్యక్తులకు వుండే సహజసిద్ధమైన భావోద్వేగాలు ఇందులో కనిపిస్తాయి. వాస్తవికతకు ప్రధమ తాంబూలం ఇస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సరికొత్త భావాలను ప్రేక్షకులు ఆదరించలేకపోవడంతో సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. అప్పుడే పూర్తి చేసుకుంటున్న వాహినీ స్టూడియోలో ఈ సినిమా నిర్మాణం జరిగింది. ఈ స్టూడియోలో రూపుదిద్దుకున్న తొలిచిత్రం కూడా ఇదే కావడం విశేషం. కె.వి. రెడ్డి గారికి సంబంధించిన రెండవ యూనిట్ 1951 లో ‘పాతాళ భైరవి’ చిత్రాన్ని నిర్మించింది. కె.వి. రెడ్డి, పింగళి నాగేంద్రరావు కలిసి చేసిన ఈ చిత్రంలో చక్రపాణి-నాగిరెడ్డి ల ప్రమేయం తక్కువేనని చెప్పాలి. అయితే పాతాళభైరవి చిత్రంలో షావుకారు చిత్ర పరాజయానికి కారణమైన ప్రేక్షకుల ప్రవృత్తిని దృష్టిలో పెట్టుకొని నేపాళ మాంత్రికుని చేత “జనం కోరేది మనం శాయడమా, మనం చేసేది జనం చూడడమా” అనే డైలాగును చక్రపాణి చెప్పించారు. ఈ సినిమాను జనం విరగబడి చూశారు. చక్రపాణికి అప్పుడే అర్ధమైంది...ప్రేక్షకులు కోరుకునే వినోదం ఎలావుండాలో అనే విషయం. ఒక్క విజయవాడ దుర్గా కళామందిర్ లోనే ఈ చిత్రం 33 వారాలు హౌస్ ఫుల్ తో నడిచింది. ఈ అఖండ విజయంతో పాతాళభైరవి చిత్రాన్ని తమిళ, హిందీ భాషల్లో కూడా పునర్నిర్మించారు.


విభేదాలు...

పాతాళభైరవి సినిమా పదవ వారం నడుస్తుండగా నాగిరెడ్డి-చక్రపాణి కె.వి. రెడ్డి తో తరవాతి సినిమా ప్లాన్ చెయ్యమని బ్లాంక్ చెక్ చేతిలో పెట్టారు. అప్పుడు వాహినీ బ్యానర్ మీద బి.ఎన్. రెడ్డి ‘మల్లీశ్వరి’ చిత్రం నిర్మిస్తున్నారు. ఒడంబడిక ప్రకారం మల్లీశ్వరి చిత్రం తరవాత వాహినీ వారికి కె.వి..రెడ్డి సినిమా తీయాలి. అయితే వాహినీకి కూడా నాగిరెడ్డి మేనేజింగ్ డైరెక్టరు. “అదికూడా నా కంపెనీయే కదా” అనే నాగిరెడ్డి అంటే, కె.వి.రెడ్డి “వాహినీ నా మాతృ సంస్థ. ఆ బ్యానర్ మీదే పిక్చర్ తీస్తాను” అన్నారు. దాంతో నాగిరెడ్డి-చక్రపాణి కి మనస్తాపం కలిగింది. పదిరోజులు పోయాక కె.వి. రెడ్డి నాగిరెడ్డి-చక్రపాణి ల వద్దకు వచ్చి పింగళి నాగేంద్రరావు ను ఇస్తే వాహినీ కి కథ తయారు చేసుకుంటానని అడిగారు. అంతకు ముందు 1949లో పింగళి వాహినీ వారి ‘గుణసుందరి’ చిత్రానికి పనిచేసి వున్నారు. అహం దెబ్బతినివున్న నాగిరెడ్డి “ఎందుకులే బ్రదర్ వాహినీ, విజయా వేరువేరుగానే వుండనియ్” అన్నారు. అలా మనస్పర్ధలు పెరిగాయి. దీని ప్రభావం ‘పెద్దమనుషులు’ చిత్రం మీద పడింది. దాంతో పెద్దమనుషులు చిత్రాన్ని వాహిని ప్రక్కనే వున్న రేవతి స్టూడియోలో నిర్మించారు. ఈ చిత్రం తరవాత కె.వి. రెడ్డి అన్నపూర్ణా సంస్థ తొలిచిత్రం ‘దొంగరాముడు’ కు పనిచేశారు. ఈలోగా విజయా సంస్థ ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో ‘పెళ్ళిచేసి చూడు’(1952) చిత్రాన్ని నిర్మించింది.

మాయాబజార్... పారా హుషార్...

గతంలో మాయాబజార్ అనేక భాషల్లో సినిమాలుగా వచ్చింది. వీధినాటకాలు, బుర్రకథలు, జానపద గాధలను ఆధారం చేసుకుంటూ కె.వి. రెడ్డి, పింగళి లు కథను అల్లడం ప్రారంభించారు. పాండవులు లేకుండా అభిమన్యుడి వివాహం జరిపించేలా స్క్రిప్టు తయారయింది. ఆర్టు డైరెక్టర్లు కష్టపడి రామారావుకి కృష్ణుడు గెటప్ రూపొందించారు. అన్ని ఏర్పాట్లు పూర్తై షూటింగుకు షెడ్యూలు తయారు చేసుకుంటుండగా ఒకరోజు ప్రొద్దునే మేనేజర్ వచ్చి నిర్మాణపనులు ఆపమని నాగిరెడ్డి-చక్రపాణి చెప్పినట్లు కె.వి. రెడ్డి కి విన్నవించాడు. కారణం చెప్పకుండా సినిమా నిర్మాణం ఆపడం కె.వి.రెడ్డి ని బాధించింది. విషయం తెలిసిన ఎ.వి.యం నిర్మాత మెయ్యప్ప చెట్టియార్ విజయావాళ్ళు తీయకపోతే కె.వి. రెడ్డి దర్శకత్వంలో తమ సంస్థ ద్వారా నిర్మించడానికి ముందుకొచ్చారు. ఎంత ఖర్చైనా సిద్ధమని ప్రకటించారు. అలాగే సుందర్ లాల్ నహతా తోబాటు మరో ఇద్దరు తమిళ నిర్మాతలు కూడా సిద్ధమయ్యారు. కానీ కె.వి. రెడ్డి మాత్రం “కోట్లు ఇచ్చినా సరే ఇంకెవరికీ తీయను. తీయడమంటూ జరిగితే విజయా వారికే తీస్తాను” అని సమాధానం ఇచ్చారు. అక్కినేని వచ్చి చక్రపాణితో ఎవరో తమిళ నిర్మాతలు కె.వి.రెడ్డి తీయబోయే మాయాబజార్ లో తనని అభిమన్యుడుగా నటించమని అడుగుతున్నారని, అసలేం జరిగిందని వాకబు చేయడంతో నాగిరెడ్డి-చక్రపాణిలు పునరాలోచనలో పడ్డారు. కె.వి. రెడ్డి వద్దకు విజయా డిస్ట్రిబ్యూటర్ పూర్ణచంద్రరావు ను పంపి సినిమా ఎంతవుతుందో బడ్జెట్ వేసి ఇమ్మని కబురంపారు. కె.వి. రెడ్డి బడ్జెట్ తయారుచేసి పంపారు. మాయాబజార్ నిర్మాణం జరగడం, ఆ సినిమా ఊహకందని రీతిగా సూపర్ హిట్ కావడం తెలిసిందే. చక్రపాణి షూటింగ్ కొచ్చి కూర్చొని సలహాలు ఇవ్వడం కె.వి. రెడ్డి కి సుతారామూ ఇష్టం లేదు. అందుకే చక్రపాణితో ఎడమొహం పెడమొహంగా వుండేవారు. ‘జగదేక వీరుని కథ’ సినిమా నిర్మాణానికి ముందు కె.వి. రెడ్డి చిత్ర నిర్మాణంలోని యేశాఖలోనూ, యే విధంగానూ చక్రపాణి జోక్యం కలిగించుకోకూడదు అనే షరతు విధించారు. పైగా టైటిల్స్ లో నిర్మాత-దర్శకుడుగా తనపేరు వుండాలి అనేది మరొక షరతు. అందుకు నాగిరెడ్డి-చక్రపాణి లు ఒప్పుకున్నారు. విజయా వారు నిర్మించిన చిత్రాలన్నిటికీ నిర్మాతలు నాగిరెడ్డి-చక్రపాణి పేర్లు వుంటాయి. జగదేకవీరుడు చిత్రానికిమాత్రం క.వి. రెడ్డి పేరు వుంటుంది. అయితే ‘సత్యహరిశ్చంద్ర’, ‘ఉమా చండి గౌరీశంకరుల కథ’చిత్రాలు ఫెయిలై నష్టాలు రావడంతో చక్రపాణి విజయా ప్రొడక్షన్ సిబ్బంది మొత్తాని తొలగించారు. అలా తొలగించినవారిలో పింగళి, గోఖలే, కళాధర్ కూడా వుండడం వింతే. అది కె.వి. రెడ్డి ని అవమానించినట్లయింది. తరవాత ఎన్టీఆర్ కె.వి. రెడ్డి ని దర్శకునిగా పెట్టి ‘శ్రీకృష్ణ సత్య’ చిత్రాన్ని నిర్మించి విజయవంతం చేయించారు. ఆ తరవాత తన అన్న బి.ఎన్.రెడ్డి గారితో వాహినీ బ్యానర్ మీద ఒక సినిమా నిర్మించేందుకు నాగిరెడ్డి సిద్ధపడితే చక్రపాణి అడ్డుకున్నారు. “ఇద్దరూ అన్నదమ్ములేగా. మీరిద్దరూ కలిసి సొంతంగా తీయొచ్చుగా. కంపెనీ తరఫున తీయడమెందుకు” అంటూ నిష్టూరంగా మాట్లాడడంతో నాగిరెడ్డి మిన్నకుండిపోయారు.

గుండమ్మ కథ కమామీషూ...

నాగిరెడ్డి సినిమాల విషయంలో చక్రపాణి ఆమోదం లేకుండా యేపనీ చేసేవారు కాదు. గుండమ్మ కథ స్క్రిప్టు చక్రపాణికి నచ్చలేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ అలాంటి వేషం వేయడం చక్రపాణికి సుతరామూ ఇష్టంలేదు. ఇదే విషయాన్ని గురించి మాట్లాడుతూ “ఎవడు చూస్తాడు ఈ పిచ్చివాడి సినిమాలు” అంటే నాగిరెడ్డికి కోపం వచ్చింది. “నువ్వు తియ్యవు. ఒకళ్ళు తీస్తుంటే వంక పెడతావు” అంటూ కోప్పడ్డారు. రోషమొచ్చిన చక్రపాణి కమలాకర కామేశ్వరరావు ను పిలిపించి నరసరాజుతో కూర్చొని సినిమాకు ట్రీట్మెంట్ రాయించారు. సినిమా మొదలుపెట్టారు. కానీ... ఆర్టిస్టులనుంచి కాల్షీట్లు తీసుకోలేదు. వారిలో ఎవరు ఖాళీగా వుంటే వారోతో ఆయా సీన్లు షూట్ చేయించే వారు. స్టూడియో మొదటి ఫ్లోర్ లో గుండమ్మ ఇల్లు, హాలు, హాలులో మెట్లు, మెట్లపైన మొదటి అంతస్తుకు పోయే వరండా సెట్ వేశారు. షూటింగ్ “కోలుకోలోయన్న కోలో” పాటతో షూటింగ్ ప్రారంభమైంది. పొద్దుటే చక్రపాణి ఆఫీసుకు రావడం...టెలిఫోన్ ఆపరేటర్ని సావిత్రి ఉందేమో కనుక్కోమనడం... ఖాళీగావుంటే ఆమెను పిలిపించి షూటింగ్ చెయ్యడం. అలాగే సూర్యకాంతం, రామణారెడ్డి... ఇలా.. అలా 1961 జూన్ లో మొదలెట్టిన సినిమా 1962 జూన్ 7 వ తేదీ దాకా విడుదలవలేదు. అవుట్ డోర్ కి వెళ్ళకుండా అంతా విజయా గార్డెన్ లోనే షూట్ చేశారు. ఒకరకంగా చక్రపాణి ది డిక్టేటర్ షిప్. పిక్చర్ ఎప్పుడు రిలీజ్ చేద్దామని డిస్ట్రిబ్యూటర్ అడిగితే ‘ఎప్పుడు పూర్తయితే అప్పుడు’ అని సమాధానమివ్వడం చక్రపాణి నైజం. సినిమాలో నీతి ఏముంది అని అడిగితే... “ఏంటి నీతులు చెప్పేది? మనకే నీతి లేదు. ఇంకా వాళ్ళకేం చెబుతాం. అయినా టికెట్ కొని సినిమాకు వచ్చేది నీతులు చెప్పించుకోవదానికా” అంతూ బూతులు లంకించుకునేవారు చక్రపాణి.

ఇతరత్రా...

ఒకసారి బి.ఎ. సుబ్బారావు చక్రపాణి దగ్గరకు వచ్చి ‘భీష్మ’ చిత్రం తీస్తునానని, అందులో భీష్ముడుగా ఎన్టీఆర్ నటిస్తున్నాడని, ముసలి వేషం వేసి టెస్ట్ తీశామని, అసలు మీరు గుర్తు పట్టలేరని చక్రపాణితో చెప్పారు. ‘గుర్తు పట్టలేనప్పుడు ఎన్టీఆర్ ఎందుకు? నువ్వే వెయ్యొచ్చుగా!” అంటూ వ్యాఖ్యానిస్తే విస్తుబోవడం బి.ఎ. సుబ్బారావు దయింది. చక్రపాణి సన్నగా పొడుగ్గా వుండేవారు. ఒంటిమీద కండ వుండేది కాదు. ఎస్.వి. రంగారావు ఆయనకీ ‘కటవుట్’ అని పేరుపెట్టారు. సూర్యకాంతాన్ని పెట్టినతరవాత ఆవిడ గయ్యాళి అని చెప్పడానికి సీన్లు వేస్ట్ అనేవారు చక్రపాణి. గుండమ్మ కథలో విజయలక్ష్మి డ్యాన్స్ ఎందుకు పెట్టినట్లు అని పూర్ణచంద్రరావు చక్రపాణిని అడిగారు. “చూడ్డానికి” అన్నది చక్రపాణి సమాధానం. శ్రీరాజేశ్వరి విలాస్ కాఫ్గీ క్లబ్ చిత్రానికి కథ చక్రపాణి రాశారు. ఆ సినిమా విడుదల కాకుండానే సెప్టెంబరు 24, 1975 న చక్రపాణి కన్నుమూశారు. చక్రపాణి కి ఆ సినిమాను అంకితమిస్తూ సంచాలకుడు చక్రపాణి, సహకారం బాపు అని టైటిల్స్ లో క్రెడిట్స్ వేశారు. ఒకసారి మేనేజర్ ‘మన పిక్చర్ కి రెండుచోట్ల ‘హోల్డ్ ఓవర్’ వచ్చేసింది. అయినా ఇంకోవారం ఆడిస్తున్నాం’ అన్నాడు. “ఎందుకలా? పాసిపోయిన శవాన్ని గుమ్మంలో పెట్టుకొని కూర్చున్నట్టు. అక్కడ తీసేసి ఇంకో ఊళ్ళో వేస్తే ఇంతకన్నా ఎక్కువ వస్తుందిగా’ అన్నారు చక్రపాణి. చిత్రం ఏదైనా చక్రపాణి లేబొరేటరీకి వెళ్లి కాపీలు చెక్ చేసేవారు. ఆపరేటర్ ని పిలిచి ‘ఆఖరి రీలు వెయ్’ అనేవారట. ఆయన అనుకున్నట్లు కథ ముగిస్తే సరే. లేకుంటే మిగతా అన్ని రీళ్ళు చూసేవారు. ఇలా చెప్పుకుంటూ పొతే చక్రపాణి గురించిన గమ్మత్తులు, జోకులు గంపెడన్ని.

- ఆచారం షణ్ముఖాచారిCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.