ఆమంచి... మా మంచి హాస్య నటుడు
ఆయనని తలచుకోగానే మనకు తెలీకుండా పెదాలపై చిరునవ్వులు చిందుతాయి. ఎన్ని బాధల్లో ఉన్నా చిటికలో మనసు ఉల్లాసభరితమవుతుంది. ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఆయన మంచి హాస్యానికి అసలు సిసలైన చిరునామా. అందుకే... అంటారు ప్రేక్షకులంతా ముక్తకంఠంతో ఆమంచి మా మంచి హాస్యనటుడని. పేరు... ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. బ్రహ్మానందంల్లాంటి నటుల సరసన సత్తా చాటుకున్న ప్రముఖ హాస్య నటుడు. అంతేనా? క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, నిర్మాతగా, దర్శకుడిగా చిత్రసీమలో తన ఉనికిని బలంగా నిరూపించుకున్నారు. పూర్వాశ్రమంలో ఆయన పాత్రికేయుడు కూడా. ఇంతకీ... ఆయన ఎవరో కాదు...ఏవీఎస్‌. ఏవీఎస్‌ అనే పొడి అక్షరాల్లోనే ఆయన సుప్రసిద్ధులు. ఏవీఎస్‌ 2013, నవంబర్‌ 8న మరణించారు. ఈరోజు ఆయన (జనవరి 2, 1957) జయంతి. ఈ సందర్భంగా ఏవీఎస్‌ గురించి కొన్ని విషయాలు. ‘సితార.నెట్‌’ పాఠకుల కోసం.


కుటుంబ నేపథ్యం, వృత్తి
1957 జనవరి 2న ఏవీఎస్‌ ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో జన్మించారు. రాఘవయ్య, శివ కామేశ్వరి ఈయన తల్లిదండ్రులు. ఏవీఎస్‌ డిగ్రీని వీఎస్‌ఆర్‌ కళాశాలలో పూర్తిచేశారు. కాలేజీలో చదువుతున్నప్పుడు రంగస్థల నాటకాలను వేసేవారు. రసమయి సంస్థని రూపొందించారు. మిమిక్రీ కళాకారుడిగా పేరు సంపాదించుకున్నారు. మంచి జర్నలిస్ట్‌గా పత్రికా రంగంలో పేరుసంపాదించుకొన్నారు. 

                                     

బాపు సినిమా ద్వారా సినీ ఎంట్రీ
1993లో విడుదలైన ‘మిస్టర్‌ పెళ్ళాం’ సినిమాతో ఏవీఎస్‌ సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు. ఈ చిత్రానికి బాపు దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో ఓ కామెడీ స్టార్‌గా మారిపోయారు. ఈ చిత్రంలోని పాత్రకి ఏవీఎస్‌కి నంది పురస్కారం లభించింది. ఈ సినిమాలో ఏవీఎస్‌ ‘నాకదో తుత్తి’ అని అంటూ ఉంటారు. ఈ డైలాగ్‌ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తే. అసలు ఈ సినిమాతో ఏవీఎస్‌ సినిమా కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎస్‌.వి.కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ‘శుభలగ్నం’ చిత్రంలో ‘గాలి కనుబడుతుందా?’ అంటూ అనేకానేక చొప్పదండి ప్రశ్నలు వేసి ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు. ‘ఘటోత్కచుడు’ సినిమాలో ‘రంగు పడుద్ది’ అని చెప్పి ప్రేక్షకుల మోములో నవ్వులు పూయించారు. కొన్ని సినిమాలలో ప్రతినాయక పాత్రలలో కూడా నటించి మెప్పించారు.
                                   

బహుముఖ ప్రజ్ఞ
ఎన్నో టీవీ షోస్‌లో కూడా ఏవీఎస్‌ పాల్గొన్నారు. సినిమాల్లోని పాత్రలతో పాటు వీటికి కూడా ఏవీఎస్‌కు ఎన్నో ప్రభుత్వ, ప్రయివేటు పురస్కారాలు లభించాయి. ‘అంకుల్‌’, ‘ఓరి నీ ప్రేమ బంగారం కాను’ సినిమాలను నిర్మించారు. ‘సూపర్‌ హీరోస్‌’, ‘ఓరి నీ ప్రేమ బంగారం కాను’, ‘రూమ్‌ మేట్స్‌’, ‘కోతిమూక’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కి జనరల్‌ సెక్రటరీగా కూడా వర్క్‌ చేశారు. 19 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో 500 చిత్రాల్లో నటించారు ఏవీఎస్‌. హాస్యనటుడిగా సుమారు 450 సినిమాలల్లో చేశారు. నారదుడిగా, శకునిగా పౌరాణిక సినిమాలలోనూ నటించారు.


రాజకీయాలంటే ఇష్టం
రాజకీయాలంటే ఏవీఎస్‌కు ఆసక్తి ఉండేది. అందుకే, చాలా కాలం తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించారు. టిడిపి తరుపున ఎన్నికల సమయంలో ఎంతో చురుగ్గా ప్రచార సభల్లో పాల్గొనేవారు.

వ్యక్తిగత జీవితం
ఏవీఎస్‌కు 1980లో వివాహమైంది. ఆశాకిరణ్మయిని ప్రేమ వివాహం చేసుకొన్నారు ఏవీఎస్‌. ఏవీఎస్‌కు ఆశాకిరణ్మయి స్టేజీ కార్యక్రమాలలో పరిచయం అయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఒక కుమార్తె, ఒక కుమారుడు. కుమారుడి పేరు ప్రదీప్‌. కుమార్తె పేరు శ్రీ ప్రశాంతి.

మరణం
కాలేయ వ్యాధితో ఏవీఎస్‌ మృతి చెందారు. మణికొండలో తన కుమారుడు ప్రదీప్‌ ఇంట్లో ఏవీఎస్‌ కన్నుమూశారు. 2013, నవంబర్‌ 8న అభిమానులను శోక సముద్రంలోకి నెట్టి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు ఏవీఎస్‌.
                                                          
పురస్కారాలు
2011లో ‘కోతిమూక’ సినిమాలో ఉత్తమ క్యారెక్టర్‌ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకొన్నారు. 2000వ సంవత్సరంలో ‘అంకుల్‌’ సినిమాకు నంది స్పెషల్‌ జ్యూరీ పురస్కారాన్ని తీసుకున్నారు. 1994లో ‘శుభ లగ్నం’ సినిమాలో ఉత్తమ మేల్‌ కమెడియన్‌గా నంది పురస్కారాన్ని అందుకొన్నారు.

వ్యక్తిత్వం
ఏవీఎస్‌ ప్రతీ వేదికమీదా తనతో చిన్నప్పుడు కలిసి చదువుకొన్న మిత్రులను, గురువులను, నటనను నేర్పించిన మార్గదర్శకులు స్మరించుకునేవారు. తెనాలికి తనతో పాటు సినిమా కళాకారులను తీసుకొచ్చి తెనాలి ప్రాధాన్యం తెలిసేవిధంగా వాళ్లను గౌరవించేవారు. కళల రాజధానిగా తెనాలికి గుర్తింపు తేవాలని ఏవీఎస్‌ ఎంతో తపనపడ్డారు. అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ కేవలం నగరాలకు మాత్రమే పరిమితమయ్యేవి. కానీ, ఆ వేడుకలను తెనాలిలో వైభవంగా జరిపించాలని ఏవీఎస్‌ ఎంతో కృషి చేశారు. ఆ కృషి మరవలేనిది. మిమిక్రీ కళాకారునిగా, నటుడిగా ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన ఏవీఎస్‌ ఎంతోమంది కళాకారులను ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఆసుపత్రులు, విద్యా సంస్థలతో కలిసి ఉచితంగా మెగా వైద్య శిబిరాలు నిర్వహించేవారు. అలా వేలాది మందికి ఉచితంగా వైద్య సేవలు అందేలా చూసేవారు ఏవీఎస్‌.                                                                                   
                                     

ఏవీఎస్‌ సినిమాలు
ఏవీఎస్‌ అన్న పేరు చెప్పగానే ఎన్నో సినిమాలలో ఏవీఎస్‌ పోషించిన ఎన్నో పాత్రలు ఇట్టే కళ్ల ముందు కదలాడతాయి. ‘మిస్టర్‌ పెళ్ళాం’లో గోపాల్‌గా, ‘మాయలోడు’లో సూపర్‌ మార్కెట్‌ యజమానిగా... చెప్పుకుంటూ పోతే ఏవీఎస్‌ నటించిన పాత్రలు ఎంతో ప్రేక్షకాదరణ పొందాయి. ఏవీఎస్‌ నటించిన చిత్రాలలో ‘లక్కీ ఛాన్స్‌’, ‘యమలీల’, ‘బంగారు కుటుంబం’, ‘అల్లరి ప్రేమికుడు’, ‘ఆమె’, ‘సూపర్‌ పోలీస్‌’, ‘పుణ్యభూమి నా దేశం’, ‘రిక్షావోడు’, ‘ఘటోత్కచుడు’, ‘అల్లుడా మజాకా’, ‘సిసింద్రీ’, ‘వజ్రం’, ‘శుభమస్తు’, ‘రాంబంటు’, ‘అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి’, ‘ధర్మ చక్రం’, ‘రాముడొచ్చాడు’, ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’, ‘వినోదం’, ‘వీడెవడండీ బాబు’, ‘పెళ్లి సందడి’, ‘చిలకొట్టుడు’, ‘చిన్నబ్బాయి’, ‘అన్నమయ్య’, ‘మావిడాకులు’, ‘ఆవిడా మా ఆవిడే’, ‘పరదేశి’, ‘శుభాకాంక్షలు’, ‘సమరసింహా రెడ్డి’, ‘యమజాతకుడు’, ‘రాజా’, ‘శ్రీ రాములయ్య’, ‘రావోయి చందమామ’, ‘పెళ్లి సంబంధం’, ‘కంటే కూతుర్నే కనాలి’, ‘కలిసుందాం రా’, ‘యువరాజు’, ‘చిత్రం’, ‘జయం మనదేరా’, ‘దేవుళ్ళు’, ‘అధిపతి’, ‘ఆకాశ వీధిలో’, ‘సుబ్బు’, ‘ఇంద్ర’, ‘గంగోత్రి’, ‘శివమణి’, ‘దొంగ దొంగది’, ‘వెంకీ’, ‘సంక్రాంతి’, ‘రాధా గోపాలం’ వంటి ఎన్నో సినిమాలున్నాయి. 2014లో వచ్చిన ‘శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి చరిత్ర’ ఏవీఎస్‌ చివరి సినిమా. ఆయన మనమధ్య లేకున్నా ...ఆయన నటించిన పలు చిత్రాలు జ్ఞాపకాలై ప్రేక్షకులను వెన్నాడుతూనే ఉంటాయి. నవ్విస్తూనే ఉంటాయి.

- పి.వి.డి.ఎస్‌. ప్రకాష్


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.