ఎన్టీఆర్‌ పేరు పెట్టారు!

తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతంగా కొనసాగుతున్న అగ్ర నిర్మాతల్లో ఒకరు సి.అశ్వనీదత్‌. వైజయంతీ మూవీస్‌ అధినేత అయిన ఆయన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి, కృష్ణంరాజు వంటి అగ్ర కథానాయకులతో పాటు, మహేష్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ వంటి యువ కథానాయకులతోనూ సినిమాలు తీస్తూ విజయాల్ని సొంతం చేసుకొంటున్నారు. వైజయంతీ మూవీస్‌ని ఓ బ్రాండ్‌గా తీర్చిదిద్దిన ఘనత అశ్వనీదత్‌ది. ఎన్టీఆర్‌ స్వయంగా ఈ సంస్థకి పేరు పెట్టారు. అందుకే లోగోలో కూడా కృష్ణుడిగా శంఖం ఊదుతూ కనిపించే ఎన్టీఆర్‌ చిత్రం కనిపిస్తుంది. ‘ఓ సీత కథ’తో ప్రయాణం మొదలుపెట్టిన సి.అశ్వనీదత్‌ అగ్నిపోరాటం, జగదేగవీరుడు అతిలోక సుందరి, ఇంద్ర వంటి ఘన విజయాలతో సత్తా చాటారు. హిందీ, తమిళ భాషల్లోనూ పలు చిత్రాలు నిర్మించారు. ఇటీవలే ఆయన సంస్థ నుంచి వచ్చిన ‘మహానటి’ సంచలన విజయాన్ని సొంతం చేసుకొంది. ప్రస్తుతం మహేష్‌బాబు కథానాయకుడిగా దిల్‌రాజుతో కలిసి ‘మహర్షి’ నిర్మించారు. నాగార్జున, నాని కథానాయకులుగా ‘దేవదాస్‌’ నిర్మించారు. అశ్వనీదత్‌ కూతుళ్లయిన స్వప్నదత్, ప్రియాంకదత్‌ సంస్థ బాధ్యతల్ని భుజాన వేసుకొని తండ్రికి విజయాల్ని చేకూరుస్తున్నారు. వైజయంతీ మూవీస్‌పై ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. తిరుగులేని నిర్మాతగా కొనసాగుతున్న అశ్వనీదత్‌ పుట్టినరోజు ఈ రోజు. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.