అనితర సాధ్యుడు... అట్లూరి
1946 జనవరి...

దక్షిణ భారత హిందీ ప్రచార సభ...

రజతోత్సవం...

మద్రాసులో మహాత్ముని విడిది...

ఆ రోజు 21 సంవత్సరాల ఓ యువకుడికి చాలా ఆనందంగా ఉంది. జాతిపిత బాపూజీ దర్శనానికి వచ్చే సందర్శకులను లోపలికి పంపే మహదవకాశం ఆ రోజు అతనికి లభించింది మరి. ఆ యువకుడి చేతిలో ఓ కాగితం... దాని మీద ఆ రోజు బాపూజీ కార్యక్రమ వివరాలు... సందర్శకుల జాబితా... గంటలు, నిమిషాలతో స్పష్టంగా రాసి ఉన్నాయి. అవన్నీ ముందు రోజే నిర్ణీతమయ్యాయి. ఆ వివరాల ప్రకారమే సందర్శకులు వచ్చి వెళ్లాలి. ఆ రోజు సమయపాలన చూసే బాధ్యత ఆ యువకుడికి ఆశ్రమ నిర్వాహకులు అప్పగించారు. పట్టికను తు.చ తప్పకుండా పాటిస్తున్నాడా యువకుడు. ఆ సమయంలో ఓ మహానుభావుడు బాపూజీ విడిదికి వచ్చి లోపలికి వెళ్లబోయాడు. ‘క్షమించండి..’ అని కైలాసగిరి సింహాద్వారం వద్ద శివుణ్ణి అడ్డగించిన బాలగణపతిలా ఆ యువకుడు అభ్యంతరం చెప్పాడు. నిజం చెప్పాలంటే వచ్చినవాడు శివుడని బాలగణపతికి తెలియదు. కానీ, ఇక్కడ వచ్చిన మహానేత ఎవరో ఈ దళపతికి తెలుసు. అయితే చేతిలో ఉన్న కాగితంలో సదరు నేత పేరు లేనందువల్ల లోపలికి పంపించాలని ఉన్నా తనకి ఇచ్చిన బాధ్యత గుర్తొచ్చి వినయ విధేయతలతో అభ్యంతరం తెలిపి లోపలికి కబురంపాడు. ఒక్క నిమిషం ఇక్కడ ఆగి ఓ విషయాన్ని ఆలోచించండి. అదే సంఘటన ఈ రోజుల్లో జరిగితే... నేటి దళపతులు అంత నిబద్ధతతో వ్యవహరిస్తారా? నేటి నేతలు ఆగ్రహించకుండా ఉండేవారా? ఆనాడు జరిగిందేమిటో తెలుసా? ఆ దళపతి అభ్యంతరానికి ఆ మహానుభావుడు అగ్రహించలేదు, సరికదా... ఆ యువకుడిలోని సమయపాలనా స్ఫూర్తిని, అంకిత భావంతో కూడిన కర్తవ్య దీక్షను చిరునవ్వుతోనే అభినందించాడు. ఆ యువకుడిని ఆశీర్వదించాడు. ఆ తరువాత కొంతమంది ఆ నేతే... చక్రవర్తుల రాజగోపాలచారి. బాపూజీతో వియ్యమందిన రాజాజీ. ఆ నాటి గణపతే... అట్లూరి రామారావు. చేసేపనిలో రాజీపడని ఆయన నైజానికి అద్దం పట్టే ఓ ఉందంతం ఇది. నిబద్ధతకు నిలువెత్తు రూపంలాంటి అట్లూరి రామారావు జాతీయ భాషకీ, సినీ రంగానికీ విశిష్టమైన సేవలు అందించారు. తెలుగు సినీ ప్రముఖుల్లో ఒకరిగా ప్రత్యేకమైన గుర్తింపు పొందారు.


గాంధీజీ పిలుపు మేరకు హిందీ అధ్యయనానికి శ్రీకారం చుట్టిన ఆయన దక్షిణాదిన హిందీ ప్రచారం కోసం విశేషంగా కృషి చేశారు. అదొక పవిత్రమైన హిందీ ప్రచారం కోసం విశేషంగా కృషి చేశారు. అదొక పవిత్రమైన ఉద్యమంగా భావించి పలు సాహిత్య గోష్టుల్లో పాల్గొన్నారు. అనంతరం ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు పిలుపు మేరకు ఆయనతో కలిసి నడిచారు. అన్నదాత, సితార, చతుర, విపుల పత్రికల నిర్వాహణ పనుల్ని సమర్థవంతంగా పర్యవేక్షించి, జనరల్‌ మేనేజర్‌ హోదాలో బాధ్యతల్ని నిర్వర్తించారు. ఉషాకిరణ్‌ మూవీస్‌లో తెరకెక్కిన పలు చిత్రాలకి నిర్మాణ నిర్వాహకుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. తొమ్మిదేళ్ల వ్యవధిలో 39 తెలుగు చిత్రాలకి, 2 హిందీ చిత్రాలకి, కొన్ని అనువాద చిత్రాలకి నిర్మాణ బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించిన ఘనత రామారావు సొంతం. రామోజీరావుకీ, చిత్రబృందానికి మధ్య వారధిగా నిలుస్తూ ‘ప్రతిఘటన’, ‘మౌనపోరాటం’, ‘మయూరి’, ‘అశ్విని’ వంటి మేలిమి చిత్రాల రూపకల్పనలో ముఖ్యభూమిక పోషించారు.


జాతిపితతో సన్నిహితంగా...
కృష్ణాజిల్లా, గుడివాడ తాలూకా, పెదపారుపూడి గ్రామంలో 1925 జూన్‌ 26న అట్లూరి గోపాలకృష్ణయ్య, సౌభాగ్యమ్మ దంపతులకు జన్మించారు అట్లూరి రామరావు. చిన్నప్పట్నుంచే చదువుపై మక్కువ పెంచుకొన్న ఆయన పెదపారుపూడిలో 5వ తరగతి వరకు చదివారు. వేరే ఊళ్లకు వెళ్లి పైచŸదువులు చదివేందుకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఉన్న ఊళ్లోనే ఆంధ్రనామ సంగ్రహం, అమరం వంటి శతక సాహిత్యాలను అధ్యయనం చేశారు. 1940లో గాంధీజీ ఉద్బోధనలకు ప్రభావితమైన అట్లూరి రామారావు ఉద్యమం దిశగా అడుగులేశారు. అందులో భాగంగా హిందీ అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. మూడేళ్ల వ్యవధిలో దక్షిణ భారత హిందీ ప్రచార సభ, మద్రాసు వారి ‘రాష్ట్ర భాషా ప్రవీణ’ హిందీ ప్రచారక్‌ డిప్లొమో పూర్తి చేశారు. 1944లో ప్రవేటుగా హిందీ టీచర్‌గా పనిచేస్తూ 1947లో ఆంధ్ర రాష్ట్ర హిందీ ప్రచార సభలో చేరిన హిందీ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్, పరీక్షా విభాగం మేనేజర్‌లాంటి బాధ్యతయుతమైన పదవుల్ని నిర్వర్తించారు. 27 ఏళ్ల పాటు జాతీయ భాషతో ప్రత్యక్ష అనుబంధాన్ని కొనసాగించారు. దక్షిణాదిలో హిందీ భాషని ప్రచారం చేయడాన్ని ఓ పవిత్ర ఉద్యమంగా భావించి కృషి చేశారు. 1946లో మదరాసులో జరిగిన దక్షిణ భారత హిందీ ప్రచార సభ రజతోత్సవాల్లో పాల్గొని మహాత్మా గాంధీతో అత్యంత సన్నిహితంగా గడిపారు.


రంగస్థలంపై...
ప్రజానాట్యమండలి, ఆ సంస్థ కళారూపాలు రామారావుపై విశేషంగా ప్రభావాన్ని చూపాయి. వ్యక్తిగతంగా గాంధీజీని మార్గదర్శిగా గౌరవిస్తూనే మరోవైపు రాజకీయంగా కమ్యూనిజం వైవు ఆకర్షితులయ్యారు. హిందీ భాష ప్రచారంలో భాగంగా హిందీ నాటకాల్లో స్త్రీ పాత్రధారిగా నటించిన అనుభవంతో విజయవాడలో కోడూరు అచ్చయ్య దర్శకత్వం వహించిన ‘మాభూమి’ నాటికలో పెరుమాళ్లులాంటి నటుడితో కలిసి రామారావు నటించారు. అచ్చయ్య నాటకబృందంలోని వి.మధుసూదనరావు, టి.చలపతిరావు, చదలవాడ కుటుంబరావు, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, తాతినేని ప్రకాశరావు వంటి సినీ దిగ్గజాలు రామారావు సహవాసులే. ‘దాసి పన్నా’, ‘షాజహాన్‌’, ‘మేవాడ్‌ పతన్‌’, ‘పూజరిణి’, ‘ఏసుక్రీస్తు’, ‘ఆజ్‌’..తదితరల నాటలకాల్లో అట్లూరి రామారావు పోషించిన స్త్రీ పాత్రలు అప్పట్లో విశేషంగా అలరించాయి. విఖ్యాత నటుడు స్థానం నరసింహారావు ‘నా చీరకట్టు ఆయనకు, ఆయన అందం నాకు ఉంటే ఈ రాష్ట్రాన్నే పాలించేవాళ్లం’ అని రామరావు అందాన్నీ, ఆయన నటనాకౌశలాన్నీ కీర్తించేవారు. ‘‘దక్షిణ భారతదేశంలో హిందీ నాటక ప్రదర్శన ద్వారా హిందీ ప్రచారోద్యమానికి తోడ్పడినందుకు అభినందనలు’’ అంటూ గాంధీజీ స్వయంగా రాసిన ప్రశంసాపత్రాన్ని, ఆయన్నుంచి పండిత శాలువానీ స్వీకరించారు అట్లూరి రామారావు.


వెండితెరపైనా..
చేపట్టిన కార్యాన్ని విజయతీరాలకు చేర్చే కృషి, పట్టుదల అట్లూరి రామరావు సొంతం. ‘మయూరి’ చిత్ర నిర్మాణంలో ఆయన కృషిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రామోజీరావు అందించిన న్యూస్‌ పేపర్‌ కటింగ్‌ని ఆధారం చేసుకొని దానికి కథాపరమైన కల్పనని తయారు చేయించడం మొదలుకొని, కథకు అవసరమైన లోకేషన్లనీ, నటీనటులను కూడగట్టడం వరకు రామారావు అవిశ్రాంతంగా పనిచేశారు. నాటకాల్లో నటించిన అనుభవంతో వెండితెరపైనా నటుడిగా తనదైన ముద్రవేశారు. ‘ప్రతిఘటన’లో గాంధేయవాదిగా, ‘మౌనపోరాటం’లో కథానాయకుడి తండ్రిగా వేసిన పాత్రలు నటుడిగా ఆయనకెంతో పేరు తెచ్చిపెట్టాయి. ‘కలిసి ఉంటే కలదు సుఖం’, ‘జల్సారాయుడు’, ‘సేతుబంధం’, ‘సదా మీ సేవలో’ తదితర చిత్రాల్లో నటనతోనూ ఆయనకి మంచి పేరొచ్చింది.
తెలుగుదనం ఉట్టిపడేలా వస్త్రధారణ... చెరగని చిరునవ్వు... ఆత్మీయతతో కూడిన చూపులతో అందరినీ ఆప్యాయంగా పలకరించే అట్లూరి రామారావు.. హైదరాబాద్..
పంజాగుట్ట, హిందీనగర్‌లో 6/02/2015న తుదిశ్వాస విడిచారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.