స్ఫూర్తిదాయకంగా ‘జయ’కేతనం!
రచయిత్రిగా, పాత్రికేయురాలిగా, పత్రికాధినేతగా, దర్శకురాలిగా ఆమె ప్రతిభావంతురాలు. ఎప్పటికప్పుడు తన సృజనని మెరుగుపరచుకుంటూ కొత్త లక్ష్యాలతో, సరికొత్త రంగాల్లోకి అడుగుపెట్టి విజయవంతమైన మహిళామణి. వేళ్ళపై లెక్కపెట్టగల మహిళాదర్శకుల్లో ప్రత్యేక శైలితో తనని తాను నిరూపించుకుని తెలుగు సినీ చరిత్రలో తనకో స్థానాన్ని సుస్థిరపరచుకున్న ఆమె...బి.జయ. తొలి చిత్రం ‘చంటిగాడు’ సినిమాతోనే ఇండస్ట్రీలో నిలవగల సత్తా ఉన్న దర్శకురాలు అన్న కీర్తి ప్రతిష్టలు సంపాదించుకొన్నారు బి.జయ. ‘సవాల్‌’ వంటి కథలను కూడా ‘లవ్లీ’గా తెరకెక్కించే ప్రతిభ ఉన్న ఈ దర్శకురాలి జయంతి జనవరి 11న. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ స్టార్‌ డైరెక్టర్‌ గురించి కొన్ని విశేషాలు మీ కోసం.

ఉన్నత విద్యావంతురాలు
1964 జనవరి 11న జన్మించిన బి.జయ ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ చేసారు. చెన్నై విశ్వవిద్యాలయంలో జర్నలిజంలో డిప్లొమా పొందారు. అన్నామలై విశ్వవిద్యాలయం నుంచి మనస్తత్వ శాస్త్రంలో ఎంఏ కూడా చేశారు. చదువు పూర్తైన తరువాత, ఒక ప్రముఖ తెలుగు పత్రికలో రచయిత్రిగా కెరీర్‌ని మొదలుపెట్టారు బి.జయ. అందులో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వార్తలు రాసే విభాగంలో పనిచేశారు. ఆ సమయంలో ఎంతోమంది సినీ ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేశారు. సినిమాని అధ్యయనం చేసేందుకు ఈ తొలి దశ ఆమెకి బాటగా, బాసటగా నిలిచింది.

ఫిల్మోగ్రఫీ
2003లో ‘చంటిగాడు’తో తెలుగు చిత్రపరిశ్రమలోకి దర్శకురాలిగా అడుగుపెట్టిన బి.జయ ఆ తరువాత 2005లో ‘ప్రేమికులు’, 2007లో ‘గుండమ్మ గారి మనవడు’, 2008లో ‘సవాల్‌’, 2012లో ‘లవీ’్ల, 2017లో ‘వైశాఖం’ సినిమాలను తెరకెక్కించారు. బాలాదిత్య, సుహాసిని హీరోహీరోయిన్లుగా నటించిన ‘చంటిగాడు’ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. స్టార్స్‌ లేని చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇటువంటి సినిమాలపై డబ్బు పెట్టడం అంటే వాస్తవానికి ఓ రిస్క్‌ అనే చెప్పాలి. అటువంటి సినిమాతోనూ, అందులోనూ మొదటి సినిమాతోనూ ఓ విజయాన్ని అందుకొన్నారు జయ.


‘లక్కీ ఫెలో’ తెరకెక్కించాలని
‘వైశాఖం’ సినిమా తరువాత ‘లక్కీ ఫెలో’ ప్రాజెక్టుని పట్టకెక్కించాలని భావించారు బి.జయ. ఈ సినిమాలోని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉండేటట్టు చేయాలని భావించారు. ‘వైశాఖం’ సినిమా సమయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో భాగంగా ఈ సినిమా విశేషాలను చెప్పుకొచ్చారు బి.జయ. అనుకోకుండా వచ్చే అవకాశాన్ని హీరో ఎలా వాడుతాడన్న విభిన్న కాన్సెప్ట్‌ ‘లక్కీ ఫెలో’ది అని అప్పుడు చెప్పుకొచ్చారు బి.జయ. కథానాయికకు కూడా ప్రాధాన్యం ఉన్న సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలన్న ఆలోచనలో ఉన్నట్టు అప్పుడు తెలిపారు. ఈ చిత్రంలో ఇప్పటి వరకు ప్రేక్షకులు చూడని దేశాన్ని చూపించాలనుకుంటున్నట్టు కూడా తెలిపారు. కానీ.. ఈ సినిమాని తెరకెక్కించకుండానే బి.జయ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

సామాజిక సేవాభిలాష
జయ మార్క్‌ సినిమాని రూపొందించాలన్న తన ఉద్దేశాన్ని తెలిపారు బి.జయ. సినిమాల నుంచి రిటైర్‌ అయిన తరువాత జనంలోకి వెళ్లి జనాలకి ఉపయోగపడే పనిని చేయాలన్న తన మనసులోని మాటని మీడియా ముందు ఓ సందర్భంలో చెప్పారు జయ. అయితే, రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని అన్నారు. తాను బాగా హ్యాండిల్‌ చేసే జనంతో మమేకం అయ్యే ఓ సామాజిక సేవని ఎంచుకున్నట్టు కూడా తెలిపారు. ఆ పనిపైన వర్క్‌ అవుట్‌ చేసి ఆచరణలో పెట్టాలి అని అభిమానులతో ముచ్చటించారు.

ఈజీఎస్‌ విజిటింగ్‌ ప్రొఫెసర్‌
ఈనాడు జర్నలిజం స్కూల్‌కు విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా వెళ్లేవారు బి.జయ. కేవలం జయనే స్ఫూర్తిగా తీసుకొని చాలా మంది అమ్మాయిలు వచ్చేవారట. ఈ విషయం రామోజీ రావు స్వయంగా జయతో చెప్పారట. ఓ ప్రముఖ పత్రికలో పని చేస్తున్నప్పుడు ఆ ఆఫీస్‌లో ఏకైక మహిళా ఉద్యోగిగా ఉండేవారు జయ.

సినిమాలపైనే ఆసక్తి
తనకు కేవలం సినిమాలపైనే ఆసక్తి ఉన్నట్టు చెప్పారు బి.జయ. వెబ్‌ సిరీస్‌లోకి అడుగుపెట్టే ఆలోచన తనకు లేదని అన్నారు. సినిమా ద్వారా వచ్చే ఫోకస్‌ వెబ్‌ సిరీస్‌ ద్వారా రాదని అభిప్రాయపడ్డారు. వచ్చినా అది ఎంతోకాలం ఉండదని అన్నారు. ఇప్పటికీ ‘చంటిగాడు’ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉంటారని సినిమాకున్న పవర్‌ అదని అన్నారు.


‘సూపర్‌ హిట్‌’ ఫిల్మ్‌ మ్యాగజిన్‌
రచయిత్రి అయిన జయ తన భర్త బి.ఎ.రాజుతో కలిసి ‘సూపర్‌ హిట్‌’ ఫిల్మ్‌ మ్యాగజిన్‌ని స్థాపించారు. ఒక దర్శకురాలిగా జయ... సుహాసిని, శాన్వి శ్రీవాస్తవ తదితర అనేక నూతన నటీనటుల్ని పరిశ్రమకు పరిచయం చేశారు. బాలనటుడిగా ప్రసిద్ధి చెందిన బాలాదిత్య కూడా ‘చంటిగాడు’ సినిమాతోనే ప్రధాన పాత్రధారుడిగా పరిశ్రమకు పరిచయమయ్యారు.

మరణం
తెలుగు సినిమా పరిశ్రమలో మహిళా దర్శకురాలిగా తన సత్తా చాటుకుంటున్న సమయంలో జయ గుండె పోటుతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి ప్రేక్షకులకు తీవ్ర బాధని మిగిల్చారు. ఆగస్టు 30, 2018న జయ కన్నుమూశారు. చనిపోయేటప్పుడు ఆమె వయసు 54 సంవత్సరాలు.


ఆమె మరణవార్త విన్న తరువాత సినిమా ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి చెందారు. సామాజిక మాధ్యమాల ద్వారా కూడా అనేకమంది సినిమా ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు.

- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.