తెలుగు తెరకు కన్నడ కస్తూరి
చెంపకు చారడేసి కళ్ళు...ఆ కళ్ళ చుట్టూ హద్దులు గీస్తూ సన్నని కాటుక రేఖలు...తుమ్మెద రెక్కల్లాంటి కనురెప్పల్ని టప టపలాడిస్తే...ఆ కళ్ళలో వ్యక్తమయ్యే భావాలు కోకొల్లలు. సంతోష సంబరాలు, త్రుళ్ళింతల కేరింతలు, సరదాల ,మౌన సంభాషణలు...ఇలా శతకోటి భావాల్ని ఆ రెండు కళ్ళతోనే అలవోకగా పలికించగల అందాల అభినేత్రి తను. ఎర్రెర్రని పెదాల్ని అలా..అలా నెమ్మదిగా సాగదీస్తే...థియేటర్లో ఉన్న ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందే. లేడిపిల్లలా గెంతులు వేస్తూ నేపథ్యంలో వినిపిస్తున్న ఓ మాధురీభరిత గీతానికి నృత్యాభినయనం చేస్తే... వీక్షకుల గుండె జారీ గల్లంతవడం ఖాయం. వెండితెరపై వినోదం పండించడంలోనూ, విషాదాన్ని అభినయించడంలోనూ ఆమెకంటూ ఓ ప్రత్యేక శైలి. వాడుక మరిచిదవేలా? వేడుక చూసేదవేలా? అంటూ నాయకుడు సైకిల్ పై అనుసరిస్తూ పాటెత్తుకుంటే నిను చూడని క్షణం నాకొక యుగం నీకు తెలుసును నిజమూ...అంటూ చిరునవ్వులతో బదులు చెప్పే ఆ నాయికని అప్పటి ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుని ఆరాధించారు. వివిధ భాషల్లో నటించినా...తెలుగు తెరపై పదికాలాలు గుభాలించే పరిమళాలద్దిన కన్నడ కస్తూరి తాను. వచ్చి రాని తెలుగులో ఆమె పలికే సంభాషణలు ఎంతో ముద్దుగా అభిమానుల్ని ఎంతగానో అలరించాయి. ఆమె కన్నడ పెయింకిలి.. .అభినయ సరస్వతి. అభినయ కాంచనమాల...సల్లభా సుందరి...అభినయ భారతి...చతుర భాషా తార బి. సరోజాదేవి.


రమణీయ, కమనీయ నటవైభవం
సినీ వినీలాకాశంలో తారలెన్నో తళుక్కుమన్నా... కొన్ని తారలే వీక్షకుల మనో విహాయసంపై కాంతిదారులు కురిపిస్తాయి. వత్సరాలు గడిచినా వన్నె తగ్గని నటవైదుష్యంతో గుండె భరిణలో ఎన్నటికీ మరిచి పోలేని జ్ఞాపకాల పరిమళాలద్దుతాయి. అప్పటి మైసూర్ పరిధిలో...ఇప్పటి కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఉద్యానవన నగరి బెంగళూర్ లో 1938 జనవరి 7న జన్మించారు. తండ్రి బైయిరప్ప. తల్లి రుద్రమ్మ. చిన్నతనం నుంచే ఆటపాటలతో పాటు సాంస్కృత కళా రంగాల పట్ల కూడా ఆసక్తి, అనురక్తి ఉన్న సరోజా దేవి నృత్యంలో శిక్షణ పొందింది. అంతే కాదు...తండ్రి బైయిరప్ప ప్రోత్సాహంతో నటనపట్ల కూడా అభిరుచి పెంచుకుంది. తర్వాత్తరవాత... తండ్రి కూడా రాగ ...తెరపై వెలగాలన్న మక్కువ ఎక్కువ కాగా...స్టూడియోలకి వెళ్లి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.


1955లో... తన 17వ ఏట అద్భుతమైన సినిమా ఆమెకు అంది వచ్చింది. కన్నడ మూవీ మహాకవి కాళిదాసు చిత్రంలో ఆమె నటించే అవకాశం ఆమెకు దక్కింది. మొదటి సినిమాలోనే కళాకారిణిగా తన బలాన్ని నిరూపించుకోవడంతో వరుస సినిమా అవకాశాలు ఆమె ఇంటిముందు క్యూ కట్టాయి. నాలుగేళ్ల తర్వాత ఆమె తెలుగులో మొట్టమొదటి సినిమా చేసింది. 1959లో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగులోగిళ్ళలో సరోజా దేవి సందడి మొదలయింది. 1955 నుంచి 1984 వరకూ వివిధ భాషల్లో 161 సినిమాలు చకచకా చేసిన ఘనతః ఆమె ఖాతాలో పడింది. కెరీర్ మొత్తంలో సరోజాదేవి సుమారు 200 పైగా చిత్రాలు చేసినా... మొదటి 161 సినిమాల జోరు మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. అప్పట్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా సరోజాదేవి హవా అంతా ఇంతా కాదు. కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ...ఇలా అనేక భాషా చిత్రాలతో ఆమె డైరీ నిండిపోయింది. కాల్ షీట్ల కోసం నిర్మాతలు...దర్శకులు తరచూ ఆమెని సంప్రదిస్తూ ఉండేవారు. ఆమె నటించిన మొదటి కన్నడ సినిమా మహాకవి కాళిదాస్ జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం గా అవార్డు అందుకోవడం విశేషం. 1957లో బి. ఆర్. పంతులు దర్శకత్వంలో మరో కన్నడ సినిమా తంగమాలై రగస్యం లో సరోజాదేవి చేసిన నృత్యాభినయనం వీక్షకులను ఎంతగానో ఆకట్టలుకుంది. 1958లో తమిళ హీరో ఎంజి రామచంద్రానికి జోడిగా నాదోడి మన్నన్ సినిమాతో తమిళ ప్రేక్షకుల మనసులని చూరగొంది. 1959లో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. అలనాటి మేటి కధానాయకుడైన దిలీప్ కుమార్ సరసన పైగామ్ సినిమా చేసింది. ఆ తర్వాత్తర్వాత...హిందీ సినీ సీమలో తనదయిన ముద్ర వేసింది. అప్పటి కథానాయకులు రాజేంద్ర కుమార్తో ససురల్ (1961), సునీల్ దత్ తో భేటీ భేటీ (1964), షమ్మీ కపూర్ తో ప్రీత్ న జానే రీతూ (1966) తదితర సినిమాల్లో నటించింది. రాజకపూర్ తో నజరానా (1961) సినిమా కోసం కొన్ని సన్నివేశాల్లో నటించినా...ఆ చిత్రం డైరెక్టర్ శ్రీధర్తో వచ్చిన అభిప్రాయభేదాల కారణంగా సరోజాదేవి తప్పుకోవాల్సి వచ్చింది. సరోజాదేవి నటించాల్సిన ఆ పాత్రని వైజయంతి మాల పోషించారు. ఎం జీ ఆర్ తో నటించిన నాదోడి మన్నన్ సినిమా తర్వాత ...తమిళంలో అప్పటి అగ్ర హీరోలతో కలసి తెరపై ఆడింది. పాడింది. అభినయాన్ని ప్రదర్శించింది. జెమిని గణేశంతో కల్యాణ పరిసు (1959), శివాజీ గణేశంతో భాగ్య ప్రివినియ్ (1959), ఎం జీ ఆర్ తో తిరుద్దతీ (1961) చిత్రాల్లో బి. సరోజాదేవి నటించింది. అలా తమిళంలో ఆమె విజయ పరంపర మూడు చిత్రాలు...ఆరు షూటింగులతో బిజీ బిజీగా సాగింది. తమిళంలో సరోజాదేవి చిత్రాలనగానే... పాలం పజహమము (1961), ఆది పేరుక్కు (1962), ఆలయమని (1962), పెరియ ఇదత్తు పెన్ (1963), పుతియా పరవై (1964), ఎంగ వీటు పిళ్లై (1965), అంబే వా (1966) ఇలా అనేకానేక సినిమాలు గుర్తొస్తాయి. ప్రత్యేకించి ...ఎమ్ జీ ఆర్ తో సరోజా దేవి జోడి సూపర్ హిట్ జోడి గా అక్కడి ప్రేక్షకులు ఆమోద ముద్ర వేశారు. కన్నడ చిత్రాల్లో కూడా సరోజాదేవి ముద్ర అంతా ఇంతా కాదు. చింతామణి(1957), స్కూల్ మాస్టర్ (1958) చిత్రాలు ఘానా విజయాన్ని చవిచూశాయి. కిట్టూరు రాణి చెన్నమ్మ (1961) చిత్రంలో సరోజాదేవి దేశ భక్తురాలిగా ప్రదర్శించిన అభినయం ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది.


సరోజాదేవి మొదటి కలర్ సినిమా..
సరోజాదేవి, కధానాయకుడు కళ్యాణ్ కుమార్తో కలసి నటించిన మొదటి కలర్ సినిమా అమరశిల్పి జక్కన్న. ఈ సినిమా కన్నడంలో కనీవినీ ఎరుగని విజయాన్ని చవిచూసింది. తెలుగులోనూ అగ్రతారగా తనకంటూ ప్రత్యేకత నిరూపించుకుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ చిత్రాల్లో సందడి చేసారు. ఎన్టీఆర్ తో సీతా రామకల్యాణం (1961), జగదేక వీరుని కదా (1961), దాగుడు మూతలు (1964) చిత్రాల్లో సరోజాదేవి నటన అనుపమానం. కన్నడంలో విజయం సాధించిన అమరశిల్పి జక్కన్న చిత్రాన్ని అక్కినేనితో కలసి సరోజాదేవి అదే పేరుతో పునర్నిర్మించిన చిత్రంలో నటించింది. 1964లో విడుదలయిన ఈ సినిమాలో పాటలు ఇప్పటి శ్రోతల్ని సైతం ఆకట్టుకుంటున్నాయి. పెళ్లి కానుక, రహస్యం...తదితర చిత్రాల్లో కూడా అక్కినేనితో కలసి సరోజాదేవి నటించింది.

                                         
                                   

సరోజాదేవికి కృష్ణకుమారి డబ్బింగ్
ఓ నాయికకు మరో నాయిక డబ్బింగ్ చెప్పడం అప్పట్లో విశేషమే. 1957లో సరోజాదేవి నటించిన తొలి తెలుగు చిత్రం పాండురంగ మహత్యంలో సరోజాదేవికి నటి కృష్ణకుమారి డబ్బింగ్ చెప్పారు. తర్వాత్తర్వాత సరోజాదేవి తెలుగు నేర్చుకుని తనపాత్రలకు తానే డబ్బింగ్ చెప్పడం అలవాటు చేసుకుంది. సరోజాదేవి ముద్దు ముద్దు మాటలు వినసొంపుగా ఉన్నాయంటూ...ఆమె డబ్బింగ్ కి అభిమానులైనవాళ్లు అప్పట్లో ఎంతో మంది ఉన్నారు.


భర్త మరణం తర్వాత జోరు తగ్గించిన సరోజాదేవి
1967లో శ్రీ హర్షతో సరోజాదేవి వివాహం జరిగింది. అన్యోన్యమయిన దాంపత్యం వారిద్దరిది. భారత్ ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీర్ గా పనిచేసే శ్రీ హర్ష తో పెద్దలు కుదిర్చిన వివాహం సరోజాదేవిది. సరోజాదేవికి నటనపట్ల ఉన్న ఆసక్తి గమనించిన శ్రీ హర్ష ఆమెకి ఏనాడు అభ్యంతరం చెప్పలేదు. వివాహం తర్వాత కూడా చాలా సినిమాల్లో చురుగ్గా పాత్రలు వేస్తూ నట ప్రస్థానంలో ముందుకు సాగింది. 1985లో లేడీస్ హాస్టల్ చేస్తున్న సమయంలో భర్త శ్రీ హర్ష అనారోగ్యం పాలయ్యారు. దాంతో...కాస్త విరామం ప్రకటించిన సరోజాదేవి...ఆయన ఆలన, పాలనా దగ్గరుండి చూసుకునేది. 1986లో శ్రీ హర్ష మరణించారు. అయితే అప్పటికే అంగీకరించిన 8 చిత్రాలు పూర్తి చేసిన సరోజాదేవి...ఆపై నటించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు.


అవార్డులు...పురస్కారాలు
సరోజాదేవి నటనకు గాను ఎన్నో అవార్డులు, పురస్కారాలు దక్కాయి. జాతీయ, రాష్ట్ర, కళా సంస్కృత సంస్థల పురస్కారాలు లెక్కకు మిక్కిలిగా ఆమె ఖాతాలోకి వచ్చి చేరాయి. 2008లో 60వ స్వాతంత్ర సంబరాల నేపథ్యంలో సరోజాదేవిని జాతీయ స్థాయిలో భారత ప్రభుత్వం జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది. 1993లో పద్మ భూషణ్, 1969లో పద్మశ్రీ పురస్కారాలు ఆమెకి లభించాయి. తమిళనాడు ప్రభుత్వం 2010లో జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది. కర్ణాటక ప్రభుత్వం డాక్టర్ రాజ్ కుమార్ జాతీయ పురస్కారాన్ని అందించింది. 2009లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందించి రెండోసారి గౌరవించింది. అంతకు ముందు 2001లో కూడా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్నిఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించింది. 1993లో తమిళనాడు ప్రభుత్వం ఎంజీఆర్ అవార్డుతో గౌరవించింది. 1989లో కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ అవార్డుతో సత్కరించింది. 1980లో కర్ణాటక ప్రభుత్వం అభినయ కాంచనమాల అవార్డుతో సత్కరించింది. 1969లో తమిళనాడు ప్రభుత్వం కులవిళక్కు సినిమాలో నటనకు గాను ఉత్తమ నటి అవార్డుతో సత్కరించింది. 1965లో కర్ణాటక ప్రభుత్వం అభినయ సరస్వతి అవార్డుతో గౌరవించింది. ఇంకా అనేక సాంసృతిక సంస్థలు ఎన్నో అవార్డులతో సరోజాదేవి నటనకు అభిమాన నీరాజనాలు పట్టారు. అభినాయంపై అంతులేని అభిమానం, వృత్తిపట్ల గౌరవం, పాత్రల్లో పరకాయ ప్రవేశం పట్ల అంకిత భావం, క్రమశిక్షణ...ఇవే సరోజాదేవి నట జీవితానికి వన్నె తెచ్చిన లక్షణాలు. ప్రస్తుత తరానికి వ్యక్తిత్వ పాఠాలు.                                   
                                   
    - పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌                                                                                              


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.