జానపద బ్రహ్మ విఠలాచార్య
లైట్లారిన థియేటర్లలో హఠాత్తుగా తోక దెయ్యాలు ప్రత్యక్షమై వికటాట్టహాసం చేస్తుంటే... ఊడలమర్రి నుంచి లెక్కలేనన్ని అస్థిపంజరాలు వేలాడుతూ వికృతచేష్టలు చేస్తుంటే... నల్లని బురఖాలాంటి దుస్తులు ధరించి నుదురంతా వ్యాపించే కుంకుమ బొట్టుతో, ఓ చేతిలో మంత్రదండం, మరో చేతిలో నిమ్మకాయలతో చేతబడి చేసే మాహా మాంత్రికులు అతి భీకరంగా నవ్వుతుంటే... అంబరచుంబిత రాజా భవంతులు, రెక్కల గుర్రాలు, ఆకర్షనీయమైన వస్త్రాల్లో రాజకుమారులు, పాల వెన్నెల్లాంటి తెల్లని పల్చని దుస్తుల నుంచి పారదర్శకంగా పరువాలను నేత్రపర్వంగా ప్రదర్శించే అందాల రాకుమార్తెలు... ఇవన్నీ ఓ చిత్రంలో ఉంటే... కచ్చితంగా ఆ చిత్రం విఠలాచార్యదే.


కంప్యూటర్‌ మాయాజాలం, ఇంటర్నెట్‌ సౌకర్యం, గ్రాఫిక్‌ జిమిక్కులు లేని కాలంలోనే... మనకు తెలీని మరో ప్రపంచం లోకి తీసుకెళ్లి అవధుల్లేని ఆనందాన్ని అందించిన గొప్ప దర్శకుడు విఠలాచార్య. రోజువారి కష్టాలు, కన్నీళ్లు ఇట్టే మరిచిపోయి రెండున్నర గంటలపాటు తన గారడితో మనల్ని మంత్రముగ్దుల్ని చేసే దర్శకుడాయన. ఆయనకు నాయికానాయకులతో అస్సలు పని లేదు. ఎవరొచ్చినా... రాకున్నా షూటింగ్‌ ఆగనే ఆగదు. హఠాత్తుగా హీరోగారు రాకపోతే ఏం చెయ్యాలో తెలీక తలపట్టుకునే దర్శకుల మధ్య... ఆ రాని హీరోని ఏ ఎలుకనో, చిలుకను చేసి షూటింగ్‌ నడిపించేయగల గడసరి డైరెక్టర్‌ విఠలాచార్య. 28 జనవరిన జానపద బ్రహ్మగా గుర్తింపు పొందిన బి. విఠలాచార్య జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విఠలాచార్య గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ కోసం.

                                          

జనం మూడ్‌ తెలిసిన మూడో తరగతి మేధావి
విఠలాచార్య కర్ణాటకలోని ఉడిపిలో 1920 జనవరి 28న జన్మించారు. తల్లిదండ్రులకు ఈయన ఏడవ సంతానం. చిన్నతనం నుంచి నాటకాలంటే అమితమైన ఇష్టం. తండ్రి ప్రముఖ ఆయుర్వేదిక్‌ వైద్యుడు. ఉచితంగానే పేషెంట్లకు చికిత్స అందించేవారు. కేవలం మూడవ తరగతి వరకే చదువుకున్నారు విఠలాచార్య. తొమ్మిది సంవత్సరాలకే ఇంటిని విడిచిపెట్టారు. దాంతో, ఈయన ఎన్నో చిన్న చిన్న ఉద్యోగాలను చేశారు. అలా తన కజిన్‌ నుంచి ఓ ఉడుపి రెస్టారంట్‌ను కొనుగోలు చేశారు.

టూరింగ్‌ టాకీస్‌ నిర్వాహకుడిగా
స్నేహితులతో బ్రిటిష్‌ ప్రభుత్వానికి విరుద్ధంగా క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు పాలయ్యారు కూడా. జైలు నుంచి విడుదల అయిన తరువాత, తన హోటల్‌ వ్యాపారాన్ని తన తమ్ముడికి ఇచ్చేసారు విఠలాచార్య. కర్ణాటకలోని హస్సన్‌ జిల్లాలో స్నేహితుడు డి. శంకర్‌ సింగ్‌ తదితరులతో కలిసి ఒక టూరింగ్‌ సినిమాని స్థాపించారు. ఎగ్జిక్యూటివ్‌ పార్టనర్‌గా టూరింగ్‌ టాకీస్‌ని ప్రతి రోజు నడిపేవారు విఠలాచార్య. ఒక టూరింగ్‌ టాకీస్‌ను నాలుగు యూనిట్లుగా పెంచారు. వాటిలో ప్రదర్శింపబడే ప్రతీ సినిమాని చూసేవారు విఠలాచార్య. అలా ఫిల్మ్‌ మేకింగ్‌ టెక్నిక్స్‌ ఆచరణాత్మకంగా నేర్చుకున్నారు. 1944లో జయలక్ష్మి ఆచార్యని వివాహమాడారు విఠలాచార్య.

                               

మహాత్మా పిక్చర్‌ బానర్‌ వ్యవస్థాపకుడిగా
శంకర్‌ సింగ్‌ తదితర స్నేహితులతో విఠలాచార్య మైసూర్‌ వెళ్లి అక్కడ మహాత్మా పిక్చర్‌ బ్యానర్‌ పై ఓ సినిమా నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ నిర్మాణ సంస్థ ద్వారా 1944 నుంచి 1953 వరకు 18 కన్నడ సినిమాలు నిర్మించారు. వాటిలో ‘నాగకన్య’, ‘జగన్‌ మోహిని’, ‘శ్రీనివాస కల్యాణ’ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలోనే, ఒక్కక్కరుగా ఆ సంస్థ నుంచి అందరూ వెళ్లిపోగా చివరకు శంకర్‌ సింగ్, విఠలాచార్యలు మాత్రమే మిగిలారు. ఈ సంస్థ ద్వారా నిర్మితమైన చిత్రాలలో కొన్నిటికి ఇతరులు దర్శకత్వం వహిస్తే.. కొన్నిటికి శంకర్‌ సింగ్‌ మరికొన్నింటికి విఠలాచార్య దర్శకత్వం వహించారు.


విఠల్‌ ప్రొడక్షన్స్‌ స్థాపకుడిగా
1953లో, శంకర్‌ సింగ్, విఠలాచార్య కూడా విడిపోయారు. అలా విడిపోయిన తరువాత విఠల్‌ ప్రొడక్షన్స్‌ అనే సొంత నిర్మాణ సంస్థని స్థాపించారు. అందులో విఠలాచార్య నిర్మించి, దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘రాజ్యలక్ష్మి’. 1954లో, విప్లవాత్మక చిత్రమైన ‘కన్యాదానం’ సినిమాని నిర్మించి, డైరెక్ట్‌ చేశారు విఠలాచార్య. ఈ సినిమాని తెలుగులో తెరకెక్కించాలన్న ఉద్దేశంతో మద్రాస్‌ చేరుకొన్న విఠలాచార్య తనువు చాలించే వరకు అక్కడే ఉన్నారు. రెండు కన్నడ సినిమాలు తెరకెక్కించిన తరువాత తెలుగు, తమిళ సినిమాలను రూపొందించాలన్న విషయంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు విఠలాచార్య. ఇతర నిర్మాతల సినిమాలకూ దర్శకత్వం వహించారు విఠలాచార్య. విఠలాచార్య తెలుగు సినిమాలు ‘వద్దంటే పెళి’్ల, ‘పెళ్లి మీద పెళ్లి’, ‘కనక దుర్గ పూజ మహిమ’, ‘వరలక్ష్మి వ్రతం’, ‘మదన కామ రాజు కథ’, ‘గురువును మించిన శిష్యుడు’, ‘నవగ్రహ పూజ మహిమ’, ‘అగ్గి పిడుగు’, ‘అగ్గి భారత’, ‘అగ్గి దొర’, ‘అగ్గి వీరుడు’, ‘బీదల పాట్లు’, ‘పల్లెటూరి చిన్నోడు’, ‘ఆడదాని అదృష్టం’, ‘కోటలో పాగ’, ‘జగన్‌ మోహిని’, ‘గాంధర్వ కన్య’ సినిమాలకు విఠలాచార్య డైరెక్ట్‌ చేసి, ప్రొడ్యూస్‌ చేశారు.
                                       

కేవలం దర్శకత్వం
‘అన్నాచెల్లెలు’, ‘జ్వాలా ద్వీప రహస్యం’, ‘మంగమ్మ శపథం’, ‘ఇద్దరు మొనగాళ్లు’, ‘చిక్కడు దొరకడు’, ‘పిడుగు రాముడు’, ‘భలే మొనగాడు’, ‘కదలడు వదలడు’, ‘గండి కోట రహస్యం’, ‘అలీబాబా 40 దొంగలు’, ‘లక్ష్మి కటాక్షం’, ‘రాజ కోట రహస్యం’, ‘శ్రీ దేవి కామాక్షి కటాక్షం’, ‘శ్రీశైల భ్రమరాంభిక కటాక్షం’, ‘కరుణించిన కనకదుర్గ’ చిత్రాలకు విఠలాచార్య కేవలం దర్శకత్వం మాత్రమే చేశారు. విఠలాచార్య గురించి విఠలాచార్య తన సినిమాలతో ఎన్టీఆర్, కాంతారావులకు మాస్‌ ఫాలోయింగ్‌ తెచ్చి పెట్టారు. విఠలాచార్య ఎక్కువగా ‘ట్రిక్‌ వర్క్‌’కి ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులతో టికెట్‌ కొనుకున్న ప్రేక్షకుడికి ఆహ్లాదం అందించాలన్నదే విఠలాచార్య ప్రముఖ లక్ష్యం.
ఖర్చు తక్కువుగా పెట్టి, లాభం ఎక్కువుగా పొందాలన్నది విఠలాచార్య నమ్మిన సూత్రం. ప్రేక్షకులు మాస్‌ సినిమాలే ఎక్కువగా చూస్తారని, అందుకే ఎక్కువగా వాటినే


తెరకెక్కించానని ఓ సందర్భంలో విఠలాచార్య అన్నారు. సినిమా అంటే బోలెడు డబ్బు ఖర్చు పెట్టి తీయాలి, తీరా అంత ఖర్చుతో తీసినా ఆ సినిమా పోతే ఆ డబ్బులు పోయినట్టే అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. అయితే వారందరూ ఒక్కసారి విఠలాచార్య పనితీరు గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే, చిత్ర నిర్మాణంలోనూ పొదుపుని పాటించిన వ్యక్తి ఆయన. ఒక్క దేవాలయం సెట్టునే వివిధ రకాల సెట్లుగా మార్చి ప్రేక్షకులను మైమరిపింపజేసిన వ్యక్తి విఠలాచార్య. ఈయన సినిమాలలో ప్రతినాయకుడి గృహం, రాజు రహస్య మందిరము, వేరొక రాజుగారి గృహం... ఇలా పలురకాలుగా కేవలం ఒక్క సెట్‌నే వాడుకునేవారు విఠలాచార్య. ఇక్కడే ఈయన గొప్పదనం అర్ధమవుతుంది.

ప్రధాన తారాగణానికి మాత్రమే రకరకాల దుస్తులు మార్చుకునే అవకాశం ఇచ్చేవారు విఠలాచార్య. ఇతర పాత్రధారులకు అంతగా అవసరం ఉండదనే వారు. ఇంకా, నటీనటులు అందుబాటులో లేని సందర్భాలలో వారి పాత్రలను చిలుకలుగానో, కోతులగానో మార్చేసేవారు విఠలాచార్య. విఠలాచార్య సినిమాలకు పనిచేయడమంటే టెక్నిషియన్లకు, నటీనటులకు పండుగ వంటిదే. ఎందుకంటే, ఒకటో తేదీ వచ్చిందంటే సాంకేతిక సిబ్బందికి, నటీనటులకు చెక్‌ వెళ్లిపోవాల్సిందే. ఇది నిజంగా అరుదనే చెప్పాలి. విఠలాచార్య గురించి చెప్పుకోవాల్సిన మరొక విషయమేమిటంటే... సినిమాల్లో నటించాలన్న ఉద్దేశంతో ఆఫీసులకు ఎవరైనా వెళితే... వేషాల కోసం వచ్చిన ప్రతీ ఒక్కరితో మాట్లాడేవారు విఠలాచార్య. సాధారణంగా... వేషాల కోసం వచ్చిన వారి అడ్రస్‌ తీసుకొని వారిని పంపించేస్తూ ఉంటారు మేనేజర్లు.


విఠలాచార్య ఎంతో ప్రణాళికాబద్ధంగా సినిమాలు తీస్తూ ఉంటారు. చిత్రీకరణ ప్రారంభించకముందే విడుదల తేదీ కూడా ప్రకటించేసేవారు. సినిమా స్క్రిప్ట్‌ని ముందే రాయించుకునేవారు. షెడ్యూల్స్‌ ప్రకారం షూటింగ్‌ ముగించి అనుకున్న తేదీకి చిత్రాన్ని విడుదల చేసేవారు విఠలాచార్య.

జానపద సినిమాలకు ఆదరణ తగ్గుతుందని ఒకసారి విఠలాచార్య భావించారు. దాంతో, తన శైలిని పక్కన పెట్టి అక్కినేని నాగేశ్వరరావుతో ‘బీదల పాట్లు’ అనే సినిమాని తెరకెక్కించారు. మంచి నాణ్యతతో సినిమాని తెరకెక్కించాలని ఎంతో కృషి చేశారు విఠలాచార్య. ఈ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించకపోగా విఠలాచార్య ఇలాంటి సినిమా తెరకెక్కించారేమిటి అన్న విమర్శలు కూడా వచ్చాయి. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ ‘నా పేరుకు బదులు వేరొకరి పేరుని స్క్రీన్‌పై వేసి ఉంటే సినిమా ఆడేదేమో’ అన్నారు విఠలాచార్య.

తన సినిమాలతో ప్రేక్షకులను ఎంతో అలరించిన విఠలాచార్య 1999 మే 28న మరణించారు. ఆయన చనిపోయి ఇరవై సంవత్సరాలు అయినా ఆయన తెరకెక్కించిన సినిమాలు మాత్రం ప్రేక్షకుల మనస్సులో ఎప్పటికీ నిలిచిపోయే ఉంటాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.