బహుముఖ ప్రజ్ఞాశాలి బాలు మహేంద్ర
స్క్రీన్‌ రైటర్, సినిమా ఎడిటర్, సినిమాటోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్‌...ఇలా సినిమాకి సంబంధించిన సకల కళల్లోనూ అభిరుచి ఉన్న సృజనశీలుడు. తన సినిమాల్లో భావోద్వేగాలను తెరకెక్కించడంలోనూ, వీక్షక హృదయాలను ఒడిసిపట్టడం లోనూ నేర్పు ఉన్న ప్రజ్ఞాధురీణుడు. సినిమాకి సరికొత్త వ్యాకరణం అందించిన మహనీయుడు. ఆయనే బాలు మహేంద్ర. ఎక్కడో శ్రీలంకలో పుట్టి...భారతీయ వినోదపరిశ్రమలో కాలిడి...జీవితాన్ని కళాత్మకంగా మలచుకున్న మాననీయుడు. సినిమా చరిత్రలో తనకంటూ ఓ పేజీని కేటాయించుకున్న ఈ కళాకారుడి జయంతి మే 19. ఈ సందర్భంగా బాలు మహేంద్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ కోసం.తమిళ్‌ ఇండస్ట్రీకి వన్నె తెచ్చిన కళాకారుడు
బాలు మహేంద్ర ప్రధానంగా తమిళ సినిమా పరిశ్రమకు పని చేశారు. అడపాదడపా తెలుగు చిత్రాలకూ పని చేశారు. చిన్నవయసులోనే ఫోటోగ్రఫీ, సాహిత్యంపై ఆసక్తి పెంచుకొన్నారు. శ్రీలంకలో స్కూల్‌ ట్రిప్‌లో ఉన్నప్పుడు డేవిడ్‌ లీన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది బ్రిడ్జ్‌ ఆన్‌ ది రివర్‌ క్వాయ్‌’ సినిమా షూటింగ్‌ చూసే అవకాశం లభించింది బాలు మహేంద్రకి. ఆ తరువాత ఫిల్మ్‌ మేకింగ్‌ పట్ల ఈయనకు ఆసక్తి పెరిగింది. ఈయన లండన్‌ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యారు.డేవిడ్‌ లీన్‌ స్పూర్తి
బాలుమహేంద్ర అసలు పేరు బాలనాథన్‌ బెంజమిన్‌ మహేంద్ర. శ్రీలంకలోని బట్టికలోవా అనే గ్రామంలో ఓ తమిళ కుటుంబంలో జన్మించారు. తండ్రి ప్రొఫెసర్‌గా వర్క్‌ చేసేవారు. బట్టికలోవాలోనే ఈయన విద్యాభ్యాసం జరిగింది. అక్కడే మెథాడిస్ట్‌ సెంట్రల్‌ కాలేజ్, సెయింట్‌ మైఖేల్స్‌ కాలేజ్‌లో ఈయన చదివారు. యుక్తవయసులో ఉన్నప్పుడు తరగతి ఉపాధ్యాయుడి కారణంగా సినిమాలపై ఆసక్తి పెంచుకొన్నారు. అదే సమయంలో ‘బైసైకిల్‌ తీవ్స్‌’ తదితర సినిమాలు చూసే అవకాశం బాలు మహేంద్రకు వచ్చింది. సిక్స్త్‌ గ్రేడ్‌లో ఉన్నప్పుడు ‘ది బ్రిడ్జ్‌ ఆన్‌ ది రివర్‌ క్వాయ్‌’ సినిమా షూటింగ్‌ చూసారు. డేవిడ్‌ లీన్‌ పర్సనాలిటీతో స్ఫూర్తి పొందిన బాలు మహేంద్ర తాను కూడా ఫిల్మ్‌ మేకర్‌ కావాలని నిశ్చయించుకొన్నారు.


బాల్యం నుంచే కళలపట్ల ఆసక్తి
చిన్నతనం నుంచి, బాలు మహేంద్రకు లలిత కళలు, సాహిత్యం అంటే ఆసక్తి ఎక్కువ ఉండేది. పాఠశాల విద్యాభ్యాసం పూర్తయిన తరువాత, లండన్‌ విశ్వవిద్యాలయంలో విజ్ఞాన శాస్త్రంలో బాచిలర్స్‌ డిగ్రీ (హానర్స్‌) పట్టా పుచ్చుకున్నారు. గ్రాడ్యుయేషన్‌ తరువాత, శ్రీలంకకు తిరిగి వచ్చి కొలంబోలో సర్వే విభాగంలో డ్రాఫ్ట్స్‌మన్‌గా కొంతకాలం పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఓ తమిళ సాహిత్య పత్రికకు సంబంధించిన ఎడిటింగ్‌ పనులు చూసుకొన్నారు. కొలంబోలో, రేడియో సిలోన్‌తో ఔత్సాహిక నాటక కళాకారుడిగా పనిచేశారు. అలాగే, ఒక నాటక బృందంతో పరిచయం పెంచుకున్నారు.

1966లో ఇండియాకి సినిమాల్లో పనిచేయాలన్న ఆకాంక్షతో 1966లో భారతదేశానికి వచ్చి పుణెలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్స్టిట్యూట్‌లో చేరారు. ఇతర విభాగాలలో ప్రవేశం పొందలేకపోవడంతో సినిమాటోగ్రఫీని చేపట్టాల్సి వచ్చింది. ఇన్స్టిట్యూట్‌లో ఫ్రెంచ్‌ సినిమా దర్శకుడు ఫ్రాంకోయిస్‌ ట్రూఫాట్, ఫ్రెంచ్‌-స్విస్‌ సినిమా దర్శకుడు జీన్‌-లూక్‌ గొడార్డ్‌ సినిమాలను ఎక్కువగా చూసారు. అలా ప్రపంచ స్థాయి సినిమాలను చూసారు బాలు మహేంద్ర. 1969లో, ఈ ఇన్స్టిట్యూట్‌ నుంచి గోల్డ్‌ మెడల్‌ తో గ్రాడ్యుయేట్‌ అయ్యారు.


మలయాళంలోనూ ప్రతిభ
ఫిల్మ్‌ ఇన్స్టిట్యూట్‌ నుంచి గ్రాడ్యుయేట్‌ అయిన తరువాత, శ్రీలంకకు చెందిన తమిళ సినిమాల పరిశ్రమకు ఎంట్రీ ఇవ్వాలని బాలు మహేంద్ర ప్రయత్నించారు. అయితే, అవి విజయవంతం కాలేదు. 1971లో ‘నీల్లు’ అనే మలయాళం సినిమాతో సినిమాటోగ్రాఫర్‌గా మొదటి బ్రేక్‌ వచ్చింది బాలుమహేంద్రకి. ఆ చిత్ర దర్శకుడు రాము, ఫిల్మ్‌ ఇన్స్టిట్యూట్‌లో బాలుమహేంద్ర తెరకెక్కించిన ‘ఫోర్టెస్ర్‌’ అనే డిప్లొమా ఫిల్మ్‌ని చూసి ఇంప్రెస్‌ అయ్యి బాలు మహేంద్రకు అవకాశం ఇచ్చారు. ‘నీల్లు’ చిత్రం షూటింగ్‌ 1971లో మొదలైనప్పటికీ... నిర్మాణ సంబంధిత కారణాల వల్ల మూడు సంవత్సరాల పాటు చిత్ర విడుదల ఆలస్యం అయింది. ఇదిలా ఉంటె ఆ చిత్ర దర్శకుడు రాము... బాలు మహేంద్రతో ‘మాయ’ అనే మరొక సినిమాకు వర్క్‌ చేయించుకోవడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ ‘మాయ’ సినిమా 1972లో విడుదల అయింది. ఆ తరువాత... ‘కలియుగం’, ‘చట్టకారి’ తదితర మలయాళ సినిమాలకు వర్క్‌ చేస్తూ బిజీగా ఉండేవారు బాలుమహేంద్ర.

1971 నుంచి 1976 మధ్యలో, మలయాళం సినిమాలకు ఎక్కువగా వర్క్‌ చేశారు బాలు మహేంద్ర. ఆ తరువాతి సంవత్సరంలో ‘కోకిల’ చిత్రం ద్వారా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. కన్నడ భాషలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీ. ఉత్తమ రచన విభాగంతో పాటు, కర్ణాటక ప్రభుత్వం నుంచి ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో కూడా ఆ సినిమాకు జాతీయ పురస్కారాలను అందుకొన్నారు ఈ సినిమాటోగ్రాఫర్‌. విమర్శనాత్మకమైన విజయంతో పాటు కమర్షియల్‌గా కూడా విజయవంతమైంది ఈ సినిమా. అలాగే తమిళనాడు రాష్ట్రంలో కూడా ఈ సినిమా సక్సెస్‌ అయింది. చెన్నైలో 150 రోజులు ఆడిన ఏకైక కన్నడ సినిమాగా ‘కోకిల’ గుర్తింపు పొందడం విశేషం.

తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ
1978లోనే తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు బాలు మహేంద్ర. దర్శకుడిగా జె.మహేంద్రన్‌ మొదటి సినిమా ‘ముల్లుం మలరుమ్’కు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్‌ చేశారు. ఆ తమిళ చిత్రానికి సినిమాటోగ్రఫీగా బాధ్యతలు వహిస్తూనే ఆ చిత్రానికి సంబంధించిన రచన, తారాగణ ఎంపిక, ఎడిటింగ్, దర్శకత్వం వంటి అంశాలలో కూడా పాల్గొన్నారు బాలుమహేంద్ర. ఆ తమిళ చిత్రం తరువాత తమిళ్‌లో ఓ చిత్రానికి దర్శకత్వం వహించాలని భావించారు బాలు మహేంద్ర. అలా ‘అళియాద కోలంగళ’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రంతోనూ విజయం సాధించారు బాలు మహేంద్ర. ఆ సమయంలోనే తెలుగులో కె.విశ్వనాధ్‌ దర్శకత్వం వహించిన ‘శంకరాభరణం’ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్‌ చేశారు. ఇది కమర్షియల్‌గా, విమర్శనాత్మకంగా పెద్ద విజయం సాధించింది.

ఇళయరాజాతో అనుబంధం
ఆంగ్ల సినిమా దర్శకుడు, నిర్మాత ఆల్ఫెడ్ర్‌ హైచ్కాక్‌ ‘సైకో’ ఆధారంగా బాలు మహేంద్ర మూడవ సినిమా ‘మూడు పాని’ తెరకెక్కిందని సినిమా విశ్లేషకులు అంటారు. ఈ సినిమాకు మొదటిసారి సంగీత దర్శకుడు ఇళయరాజాతో కలిసి వర్క్‌ చేశారు బాలుమహేంద్ర. ఆ తరువాత నుంచి బాలు మహేంద్ర సినిమాలకు రెగ్యులర్‌ కంపోజర్‌ అయిపోయారు ఇళయరాజా. 1982లో, ‘మూంద్రన్‌ పిరాయి’ సినిమాని తెరకెక్కించారు. ఇది తెలుగులో ‘వసంత కోకిల’ పేరుతో రిలీజ్‌ అయింది. ఆమ్నీసియాతో బాధపడుతోన్న ఒక అమ్మాయిని సంరక్షించే ఒక పాఠశాల ఉపాధ్యాయుడు చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కింది ఈ సినిమా. మూడు వందల రోజుల పాటు ఆడి బ్లాక్‌ బస్టర్‌గా పేరుగాంచింది ఈ సినిమా. ఈ సినిమా రెండు జాతీయ సినిమా పురస్కారాలను కూడా బాలు మహేంద్రకి తెచ్చిపెట్టింది. అదే సంవత్సరం ‘ఓలంగల్‌’ చిత్రంతో మలయాళంలోనూ దర్శకుడిగా అడుగుపెట్టారు బాలు మహేంద్ర. ఎరిచ్‌ సెగల్‌ నవల ‘మ్యాన్, ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌’ నుంచి ప్రేరణ పొందిన ఈ చిత్రం విమర్శనాత్మక విజయాన్ని సాధించింది. ఆ సంవత్సరం చివరిలో ‘ఓలంగల్‌’, ‘మూంద్రన్‌ పిరాయి’ సినిమాలకు రెండు ఫిలింఫేర్‌ ట్రోఫీలు సంపాదించుకోగలిగారు బాలు మహేంద్ర.


1983లో బాలీవుడ్‌కి
1983లో, ‘సద్మా’ సినిమాతో హిందీ పరిశ్రమకు అడుగుపెట్టారు బాలు మహేంద్ర. ఇది ‘మూంద్రన్‌ పిరాయి’కి రీమేక్‌. ఈ హిందీ చిత్రంలో కూడా కమల్‌ హాసన్, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ద్వారా ఉత్తమ కథ విభాగంలో ఫిలింఫేర్‌ పురస్కారానికి నామినేట్‌ అవడంతో పాటు హిందీ ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యారు బాలుమహేంద్ర. అదే సంవత్సరం, మణిరత్నం మొదటి సినిమా అయిన కన్నడ చిత్రం ‘పల్లవి అను పల్లవి’ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్‌ చేశారు. ఆ సమయంలోనే, మలయాళంలో మరో సినిమాని బాలు మహేంద్ర తెరకెక్కించగా... అది ప్రేక్షకులకు దగ్గరవడంతో విఫలమయింది.

కమర్షియల్సి సినిమాల్లోనూ
1984లో వచ్చిన ‘నీంగల్‌ కేట్టవై’ కమర్షియల్‌ పిక్చర్‌గా తెరకెక్కింది. తరువాత, బాలు మహేంద్ర తాను కమర్షియల్‌ సినిమాలు చేయగలనని విమర్శకులను నిరూపించాలనే ఏకైక ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని రూపొందించానని పేర్కొన్నారు. ఆ తరువాతి సంవత్సరం, రజినీకాంత్‌తో ‘ఉన్‌ కన్నిల్‌ నీర్‌ వలిందల్‌’ అనే సినిమాను తెరకెక్కించగా... అది ఆశించినంత స్థాయిలో విజయవంతం కాకపోవడం ఆయన అభిమానుల్ని నిరాశపరిచే విషయమే. ఆ తరువాత మలయాళంలో మమ్ముట్టి ఫారెస్ట్‌ ఆఫీసర్‌గా ప్రధాన పాత్రలో ‘యాత్ర’ అనే సినిమాని తెరకెక్కించారు బాలుమహేంద్ర. కళాత్మక విలువలుతో తెరకెక్కిన ఆ సినిమా బాగా వసూళ్లు రాబట్టిందని విశ్లేషకులు అంటారు. ఇలా తనదైన శైలిలో సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నసమయంలోనే తమిళ్లో ‘రెట్టై వాల్‌ కురువి’ అనే ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ చిత్రాన్ని తెరకెక్కించి అందరినీ ఆశ్చర్యపరిచారు బాలు మహేంద్ర. ఆ దశాబ్దంలోనే బాలుమహేంద్ర తెరకెక్కించిన ఆ కామెడీ తమిళ్‌ చిత్రం వన్‌ అఫ్‌ ది బెస్ట్‌ కామెడిస్‌గా నిలబడింది.

సామాజిక సమస్యలపై చిత్రాలు
ఆ దశాబ్దపు చివరిలో ‘వీడు’, ‘సంధ్యారాగం’ రెండు చిన్న బడ్జెట్‌ సినిమాలు తెరకెక్కించారు. ‘వీడు’ దిగువ మధ్యతరగతి పట్టణ మహిళ జీవితం గురించి, ఇల్లు కట్టడానికి ఆమె చేసిన పోరాటంపై దృష్టి సారించగా, ‘సంధ్యారాగం’లో వృద్ధాప్యం గురించి ప్రస్తావించారు. ఈ రెండు చిత్రాలు తన తల్లిదండ్రులకు నివాళిగా ఇచ్చారు బాలుమహేంద్ర. 1992లో, ఎస్‌.ధను నిర్మించిన ‘వన్న వన్న పూక్కల్‌’ చిత్రానికి బాలుమహేంద్ర దర్శకత్వం వహించారు. వంద రోజుల పాటు ఈ చిత్రం ఆడింది. ఈ సమయంలోనే అప్పటి న్యూ కమర్‌ ఎం.నైట్‌ శ్యామలన్‌... బాలుమహేంద్రని సంప్రదించి తాను మొదటిసారిగా దర్శకత్వం వహిస్తోన్న ‘ప్రేయింగ్‌ విత్‌ ఎంగర్‌’ అనే అమెరికన్‌ డ్రామా చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్‌ చేయమని అడిగారు. అయితే, బాలు మహేంద్ర అందుకు ఒప్పుకోలేదు.ఆ తరువాతి సంవత్సరం, మహేష్‌ భట్‌ సినిమా ‘అర్త్‌’ చిత్రాన్ని తమిళ్లో ‘మరుబడియుమ్’ పేరుతో తెరకెక్కించారు. తన వ్యక్తిగత జీవితానికి చాలా దగ్గరగా ఉందని భావించి బాలుమహేంద్ర ఆ చిత్రాన్ని రూపొందించారు. ఆ తరువాత 1995లో ‘సతీ లీలావతి’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమాని హీరో కమల్‌ హాసన్‌ నిర్మించారు. ఆ తరువాతి ఏడాది బాలీవుడ్‌లో ‘ఔర్‌ ఏ ప్రేమ్‌ కహాని’ చిత్రాన్ని తెరకెక్కించారు. కన్నడంలో ఆయన రూపొందించిన ‘కోకిల’ చిత్రానికి రీమేక్‌ ఇది. 1997లో ‘రమణ్‌ అబ్దుల్లా’ సినిమాని తెరకెక్కించారు. వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు స్నేహితుల మధ్య స్నేహం అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా మాత్రం అంతగా పాజిటివ్‌ రివ్యూస్‌ సంపాదించుకోలేకపోయింది. ‘రమణ్‌ అబ్దుల్లా’ తరువాత సినిమాల నుంచి విరామం తీసుకుని బాలు మహేంద్ర టెలివిజన్‌ సిరీస్‌పై దృష్టి పెట్టారు.

                                 

అయిదేళ్ల విరామం తర్వాత రీ ఎంట్రీ
ఐదు సంవత్సరాల విరామం తరువాత, 2003లో ‘జూలీ గణపతి’తో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు బాలు మహేంద్ర. స్టీఫెన్‌ కింగ్‌ రాసిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ నవల ‘మిజెరీ’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని సినిమా విమర్శకులు అంటారు. అయితే, బాలు మహేంద్ర మాత్రం తన మునుపటి సినిమాలు ‘మూంద్రన్‌ పిరాయి’, ‘మూడు పాని’ సినిమాల తరహాలోనే ‘జూలీ గణపతి’ సినిమాని తెరకెక్కించినట్లు చెప్పారు. సినిమా రివ్యూల నుంచి ఈ చిత్రానికి ఒక ఉత్తమ థ్రిల్లర్‌గా గుర్తింపు లభించింది. విమర్శ నాత్మకమైన ప్రశంసలు లభించినప్పటికీ ఈ సినిమా కమర్షియల్‌గా మాత్రం విఫలమయింది. 2005నాటి ‘అదు ఒరు కనా కాలమ్‌’ సినిమాలో ధనుష్‌ని ప్రధాన పాత్రలో ఎంపిక చేసుకొన్నారు బాలు మహేంద్ర. మొదట, తన 1979 ‘అళియాద కోలంగళ్’ సినిమాకి కొనసాగింపుగా ప్రకటించారు. అయితే, చివరికి వేరొక కథగా ఆ సినిమా రూపుదిద్దుకొంది. అయితే, 1985నాటి మలయాళ సినిమా ‘యాత్ర’తో ఈ సినిమాకు కొన్ని పోలికలు ఉన్నాయన్న వార్తలు ఉన్నాయి.


చెన్నయ్‌ లో సినిమా పాఠశాల
2007లో, చెన్నైలో ఒక సినిమా పాఠశాలని ప్రారంభించారు. ఈ ఇన్స్టిట్యూట్‌ లో సినిమాటోగ్రఫీ, దర్శకత్వం, నటన మీద శిక్షణ ఇస్తారు. సినిమాల నుంచి చిన్న విరామం తరువాత ‘తలైమురైగళ్‌’ చిత్రంతో మళ్ళీ తెరపైకి వచ్చారు. ఇందులో ఆయన నటించారు కూడా. నటనతో పాటు, ఆ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు, దర్శకత్వ పనులు, ఎడిటింగ్‌ పనులు చూసుకుంటూనే సినిమాటోగ్రాఫర్‌గా కూడా వర్క్‌ చేశారు బాలు మహేంద్ర.

వ్యక్తిగత జీవితం
బాలుమహేంద్ర మొదటి భార్య పేరు అఖిలేశ్వరి. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. నటి శోభతో ఈయన సంబంధం ఉన్నట్లు ఒకప్పుడు వార్తలు వచ్చాయి. 1998లో మౌనిక అనే మరో నటిని వివాహం చేసుకున్నారు. 2004లో బహిరంగంగా వాళ్ళ వివాహం గురించి ప్రకటించారు బాలు మహేంద్ర.  2014 ఫిబ్రవరి 13న, విజయా హాస్పిటల్‌లో గుండెపోటు కారణంగా బాలు మహేంద్ర ఆసుపత్రిలో చేరారు. ఆ ఆసుపత్రిలో చేరిన ఆరు గంటల తరువాత గుండెపోటుతో ఆయన చనిపోయినట్టు ప్రకటించారు. ఆయన మరణవార్త బయటకు వచ్చిన కొంత సమయంలోనే భారత చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సామజిక మాధ్యమాల ద్వారా వారివారి సంతాపాన్ని తెలియజేశారు. మరణించేటప్పుడు ఆయన వయసు 74 సంవత్సరాలు.


పురస్కారాలు
ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో ‘నెల్లు’, ‘ప్రయాణం’, ‘చువన్న సంధ్యకల్‌’ సినిమాలకు కేరళ రాష్ట్ర సినిమా పురస్కారాలు అందుకొన్నారు. ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలోనే ‘కోకిల’ చిత్రానికి ఓ జాతీయ పురస్కారాన్ని అందుకొన్నారు. 1978నాటి ‘మనవూరి పాండవులు’ చిత్రానికి బెస్ట్‌ సినిమాటోగ్రాఫర్‌గా ఓ నంది పురస్కారాన్ని సంపాదించుకొన్నారు. తమిళ సినిమా ‘మూంద్రన్‌ పిరాయి’ చిత్రానికి బెస్ట్‌ సినిమాటోగ్రఫీ విభాగంలో ఓ జాతీయ పురస్కారం, ఉత్తమ దర్శకుడిగా సౌత్‌ ఫిలింఫేర్‌ పురస్కారం అందుకొన్నారు. మలయాళ చిత్రం ‘ఒలంగల్‌’ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్‌ పురస్కారం సంపాదించుకొన్నారు. ‘నిరీక్షణ’ సినిమాకు ఉత్తమ సినిమాటోగ్రఫీగా నంది పురస్కారం అందుకొన్న ఆయన ‘పల్లవి అను పల్లవి’ చిత్రానికి బెస్ట్‌ సినిమాటోగ్రఫీ విభాగంలోనే కర్ణాటక రాష్ట్ర సినిమా పురస్కారాన్ని రాబట్టుకోగలిగారు. ‘యాత్ర’ సినిమాకు ఉత్తమ దర్శకుడి విభాగంలో ఓ ఫిలింఫేర్‌ పురస్కారం ఆయన ఇంటికి నడిచొచ్చింది. అదే చిత్రానికి బెస్ట్‌ ఫిల్మ్‌ కేటగిరీలో కేరళా రాష్ట్ర సినిమా పురస్కారం కూడా ఆయన్ను వరించింది. ‘వీడు’ చిత్రానికి ఉత్తమ తమిళ చిత్రంగా ఓ జాతీయ సినిమా పురస్కారం రాగా అదే చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్‌ పురస్కారం కూడా బాలుమహేంద్రకు రావడం విశేషం. ‘సంధ్యారాగం’ సినిమాకు బెస్ట్‌ ఫిల్మ్‌ ఆన్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ విభాగంలో ఓ జాతీయ పురస్కారం వరించింది. ‘వన్న వన్న పూక్కల్‌’ సినిమాకు కూడా తమిళ ఉత్తమ చిత్రంగా జాతీయ సినిమా పురస్కారం లభించింది. ‘తలైమురైగళ్‌’ సినిమాకు బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ ఆన్‌ నేషనల్‌ ఇంటెగ్రేషన్‌ విభాగంలో ఓ అవార్డు లభించింది. అలాగే అదే చిత్రానికి ఉత్తమ కథా రచయితగా తమిళనాడు రాష్ట్ర పురస్కారం బాలు మహేంద్రను వరించింది.


- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌   


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.