సినీ స్థితప్రజ్ఞుడు... విజయా నాగిరెడ్డి
సినిమా నిర్మాణం కూడా వ్యాపార పరిశ్రమే. పేరుతోపాటు పెన్నిధి సమకూర్చేదే సినీ వ్యాపారం అనే సూత్రాన్ని నమ్మి ఆచరించిన వ్యాపారదక్షుడు విజయా సంస్థ అధినేత బొమ్మిరెడ్డి నాగిరెడ్డి. యాభై సంవత్సరాలకు పైగా సినిమా అనే అద్భుత కళకి అంకితమైన స్థితప్రజ్ఞుడు నాగిరెడ్డి. సాక్షాత్తు తన అన్నగారైన బి.ఎన్‌.రెడ్డి (బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి) దిగ్దర్శకులుగా కీర్తిప్రతిష్టలు ఆర్జించినా ఆయన విజయా సంస్థ పతాకంపై ఒక్క సినిమాకు కూడా దర్శకత్వం వహించలేదు. అందుకు కారణం... అతి ఎక్కువ బడ్జెట్‌తో అతి తక్కువ మార్కెట్‌ వుండే ‘మల్లీశ్వరి’, ‘రాజమకుటం’ వంటి కళాఖండాల నిర్మాణానికి నాగిరెడ్డి వ్యాపారంలో చోటులేకుండడమే! తన సినిమా సూత్రాన్ని ‘పాతాళభైరవి’ చిత్రం ద్వారా ‘జనంకోరేది మనం తీయాలిగానీ మనం తీసేది జనం చూడడం కాదు’ అని చెప్పి మరీ సినిమాలు నిర్మించి సమాధానమిచ్చిన మేధావి నాగిరెడ్డి. ఆయన నిర్మించిన చిత్రాలు అధికంగా అంచనాలను మించి ఆర్జించినవే కావడం ఈ సూత్రాన్ని నమ్మి నిర్మించడం వలననే సాధ్యమైంది. ‘మాయాబజార్‌’ సినిమా కూడా కళాఖండమే... కానీ అది వ్యాపారాత్మక కళాఖండం! నాగిరెడ్డి కేవలం వాణిజ్యపరంగా మాత్రమే వ్యవహరించేవారు. కథ, కథనం, మాటలు-పాటలు, సంగీతం, దర్శకత్వం ఇత్యాది వ్యవహారాలన్నీ చక్రపాణికి దాఖలు పరచేవారు. అదే విజయా సంస్థ క్రమశిక్షణ. విజయ-వాహిని స్టూడియోలో నాగిరెడ్డి తోట పనులు పర్యవేక్షిస్తూ, తను కూడా స్వయంగా పనిచేస్తూ కనిపించిన సందర్భాలు కోకొల్లలు. సినిమా వాణిజ్యమే కాదు, విద్యా, వైద్య రంగాలకు కూడా నాగిరెడ్డి చేసిన సేవలు అద్వితీయం. అటువంటి నాగిరెడ్డి 107వ జయంతి డిసెంబర్‌ 2న జరుగుతున్న సందర్భంగా కొన్ని జ్ఞాపకాలు...
తొలిరోజులు...
కడప జిల్లా పొట్టిపాడు గ్రామంలో 1912 డిసెంబర్‌ 2న నాగిరెడ్డి జన్మించారు. బొమ్మిరెడ్డి ఎరుకలమ్మ, నరసింహారెడ్డిలు నాగిరెడ్డి తల్లిదండ్రులు. ప్రముఖ దర్శకనిర్మాత, వాహినీ సంస్థ అధిపతి బి.ఎన్‌.రెడ్డి (బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి) నాగిరెడ్డికి అన్న. కొండారెడ్డి, రామలింగారెడ్డి అనే ఇద్దరు తమ్ముళ్ళు. కొండారెడ్డి మంచి సినిమాటోగ్రాఫర్‌. రామలింగారెడ్డి వ్యాపారవేత్త. నాగిరెడ్డి పూర్వీకులది కర్నూలు జిల్లా బొమ్మిరెడ్డిపల్లి. కొన్నాళ్ళకు వారి కుటుంబాలు పొట్టిపాడు గ్రామానికి వచ్చి స్థిరపడ్డాయి. నాగిరెడ్డి తండ్రి నరసింహారెడ్డి ఆ రోజుల్లోనే మద్రాసు నగరంలో కమీషన్‌ వ్యాపారం చేస్తుండేవారు. దాంతో నాగిరెడ్డి మాత్రం వారి తాత అయిన హనుమన్న, అమ్మమ్మల దగ్గరే పెరిగారు. రామరాజు అనే ఉపాధ్యాయుని శిష్యరికంలో రామాయణం, మహాభారతం, భాగవతం వంటి పురాణాలు చదవడం నాగిరెడ్డికి అలవాటుగా మారింది. జీవిత పునాదులు గురువు రామరాజు చలువతోనే గట్టిపడ్డాయి. నాగిరెడ్డి తన పద్నాల్గవ ఏట మద్రాసు చేరుకున్నారు. గోవిందప్ప నాయకన్‌ వీధిలోని పాఠశాలలో అన్న బి.ఎన్‌.రెడ్డితో కలిసి నాగిరెడ్డి చదువు కొనసాగింది. ముత్యాలపేట హైస్కూలులో ఎనిమిదవ తరగతి పూర్తిచేశారు. స్వాతంత్రోద్యమం బాగా ఊపందుకుంటున్న రోజుల్లో గాంధీజీ పిలుపుతో స్కూలు విద్యార్థిగా వుంటూనే ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణోద్యమాలలో నాగిరెడ్డి ఉత్సాహంగా పాల్గొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు నాగిరెడ్డిని దుర్గాబాయి దేశముఖ్‌ దళంలో చేర్పించారు. బి.ఎన్‌.రెడ్డితో కలిసి గ్రామాలకెళ్లి ఖద్దరు ప్రచారం చేశారు. దాంతో రకరకాల వ్యక్తుల్ని కలవడం, వారితో స్వాతంత్య్ర భావాలు పంచుకోవడం అలవడింది. తను కూడా ఖద్దరు పైజమా, ఖద్దరు జుబ్బా, తలమీద ఖద్దరు టోపీ ధరించి చెప్పులు లేకుండా గ్రామాలు తిరగడంతో నాగిరెడ్డిని తమాషాగా ‘చిన్న గాంధీ’ అని పిలిచేవారు. బి.ఎన్‌.రెడ్డి మాత్రం చదువు కొనసాగించగా, తండ్రి ఆజ్ఞ మేరకు పద్దెనిమిదేళ్ల వయసులో నాగిరెడ్డి ఉల్లిపాయల వ్యాపారం నిమిత్తం ఓడలో రంగూన్‌ (బర్మా దేశం) వెళ్ళారు. అక్కడ తమ కుటుంబ స్నేహితుడు ఇస్మాయిల్‌ మహమ్మద్‌ బోడి ఇంటిలో ఉంటూ వ్యాపారం వృద్ధిచేశారు. తీరిక సమయాల్లో వారి దగ్గర ఉర్దూ భాష నేర్చుకునేవారు. రెండవ ప్రపంచ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న సమయంలో మద్రాసు తిరిగివచ్చారు. తన ఇరవై ఒకటవ సంవత్సరంలో నెల్లూరు బంధువర్గానికి చెందిన శేషమ్మతో నాగిరెడ్డికి వివాహం జరిగింది.
సినిమా వ్యాపారంలోకి...
అన్న బి.ఎన్‌.రెడ్డి కళల మీద, సినిమా నిర్మాణం మీద ఆసక్తి చూపడంతో వారి తండ్రి వ్యాపార పాలనా పనులను నాగిరెడ్డికి అప్పజెప్పారు. ఆ సమయంలోనే బి.ఎన్‌.రెడ్డి హెచ్‌.ఎం.రెడ్డితో కలిసి రోహిణీ సంస్థను నెలకొల్పటం జరిగింది. ఆ సంస్థలో బి.ఎన్‌.రెడ్డి పాతికవేలు పెట్టుబడి పెట్టారు. ఆ సంస్థ బ్యానర్‌ మీద హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వంలో ‘గృహలక్ష్మి’ (1938) సినిమా నిర్మించారు. అందులో నాగయ్య, కన్నాంబ, కాంచనమాల, రామానుజాచారి మొదలగు వారు నటించారు. సినిమా విజయవంతమైంది. తరువాత హెచ్‌.ఎం.రెడ్డితో బి.ఎన్‌.రెడ్డికి అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయారు. అప్పుడు నాగిరెడ్డి, బి.ఎన్‌.రెడ్డి మిత్రులు బ్రిజ్‌ మోహన్‌ దాస్, మూలా నారాయణస్వామి కలిసి బి.ఎన్‌.రెడ్డిని చిత్ర నిర్మాణంలోనే కొనసాగేలా ఒప్పించారు. దాంతో రోహిణి నుంచి ‘వాహిని’ సంస్థ అవతరించింది. ఈ సంస్థకు రచయిత సముద్రాల రాఘవాచార్య, సినిమాటోగ్రాఫర్‌ రామనాథ్, ఆర్ట్‌ డైరెక్టర్‌ శేఖర్, కె.వి.రెడ్డి మూల స్తంభాలుగా వుండేవారు. ఆ సంస్థ బ్యానర్‌ మీద బి.ఎన్‌.రెడ్డి దర్శకత్వంలో ‘వందేమాతరం’ (1938) నిర్మించారు. నాగయ్య, కాంచనమాల, దొరస్వామి, శేషుమాంబ నటించిన ఈ చిత్రం విజయవంతమైంది. తరువాత బి.ఎన్‌.రెడ్డి ‘సుమంగళి’ (1940) చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి నాగిరెడ్డి అటు వ్యాపారం చూసుకుంటూనే వినూత్న రీతిలో పబ్లిసిటీ సమకూర్చారు. హోటళ్ల ముందు, బస్‌ స్టాపులు, ట్రామ్‌ బండ్ల కూడళ్ళ వద్ద మనుషులను నిలబెట్టి కరపత్రాలు పంచే ఏర్పాటు చేసి ప్రచారం ముమ్మరం చేయించారు. తరువాత 1941లో వాహినీ సంస్థ ‘దేవత’ చిత్రాన్ని నిర్మించి విజయం సాధించారు. నాగయ్య. కుమారి, టంగుటూరి సూర్యకుమారి, లింగమూర్తి ఈ చిత్రంలో తారాగణం. తరువాత నిర్మించిన ‘భక్త పోతన’ (1942) చిత్రానికి కె.వి.రెడ్డి దర్శకుడు. నాగయ్య, గౌరీనాథశాస్త్రి, లింగమూర్తి, మాలతి, హేమలత నటించిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచి వాహినీ సంస్థకు కాసులు రాల్చింది. నాగిరెడ్డి ఈ చిత్రానికి పబ్లిసిటీ కోసం ముప్పై అడుగుల ఆంజనేయస్వామి కటవుట్‌ తయారు చేయించి నాలుగు దారుల కూడలిలో పెట్టించి ప్రేక్షకులను ఆకర్షింపజేశారు. తరువాత నాగిరెడ్డి మద్రాసులో బి.ఎన్‌.కె ప్రెస్‌ ప్రారంభించి రామకృష్ణ మిషన్‌ వంటి ధార్మిక సంస్థల పుస్తకాలను అచ్చువేయించే పని చేబట్టారు. వాహినీ సంస్థకు ఆర్ధిక చేయూతనిస్తూ ప్రోత్సహించిన మూలా నారాయణస్వామి సహకారంతో వాహిని స్టూడియో రూపుదిద్దుకుంది. సమాంతరంగా ‘విజయా ప్రొడక్షన్స్‌’ సంస్థ కూడా ఆవిర్భవించింది. యువ పబ్లికేషన్స్, శరత్‌ అనువాద నవలలు బి.ఎన్‌.కె ప్రెస్‌లో ముద్రింపజేసుకుంటున్న ఆలూరు వెంకట సుబ్బారావు అనే చక్రపాణి విజయా సంస్థలో భాగస్వామిగా చేరారు. వీరు వాహిని స్టూడియోని విజయా ప్రొడక్షన్స్‌ పేరుతో లీజుకు తీసుకున్నారు. వాహిని వారి ‘స్వర్గసీమ’ (1943)కు మాటలు సమకూర్చింది చక్రపాణే. 1947లో ‘చందమామ’ పత్రికను ప్రారంభించారు. దానికి చక్రపాణి సంపాదకత్వం వహిస్తే, నాగిరెడ్డి ‘ఆంధ్రజ్యోతి’ (1945) మాసపత్రికకు సంపాదకత్వం స్వీకరించారు.
చక్రపాణితో స్నేహబంధం...
దర్శకుడు పి.పుల్లయ్య ‘ధర్మపత్ని’ సినిమా నిర్మిస్తున్న రోజులవి. ఆ చిత్రానికి మాటలు రాయడానికి ఒకరిని ఎన్నుకుంటే ఆయన రాసిన సంభాషణలు పుల్లయ్యకు నచ్చలేదు. అప్పుడు పుల్లయ్య వద్ద ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న బి.ఎస్‌. రామారావు తెనాలి వెళ్లి చక్రపాణిని వెంటబెట్టుకొని వచ్చారు. ఆయనచేత ‘ధర్మపత్ని’ చిత్రానికి మాటలు రాయించారు. అవి నచ్చడంతో వాహిని వారు నిర్మించిన ‘స్వర్గసీమ’ (1943) చిత్రానికి చక్రపాణి చేత మాటలు రాయించారు. అలా ఆలూరు వెంకట సుబ్బారావు అనే చక్రపాణి విజయా సంస్థకు పరిచయమై నాగిరెడ్డికి దగ్గరైనారు. నాగిరెడ్డి ప్రెస్‌లో ‘ఆంధ్రజ్యోతి’ (1945) అనే రాజకీయ సామాజిక పత్రిక ఆరంభించారు. దానికి చక్రపాణి సంపాదకుడు కాగా, బి.ఎన్‌.గుప్తా ప్రకాశకులుగా వ్యవహరించేవారు. తరువాత 1947లో ‘చందమామ’ అభ్యుదయ మాసపత్రిక చక్రపాణి సంపాదకత్వంలోనే ప్రారంభమైంది. అతి త్వరలో ఆ మాసపత్రిక పన్నెండు భాషల్లో వెలుగొందింది. అప్పట్లో టి.నగర్‌లోని రామస్వామి వీధిలో బి.ఎన్‌.ప్రెస్‌ వుండగా, ఆ ఇంటి మేడమీద గదిలో చక్రపాణి వుండేవారు. భార్యా వియోగంతో చక్రపాణి తన ఇద్దరు కుమారులు తిరుపతిరావు, సుధాకర్‌లను కూడా మద్రాస్‌ తీసుకొనివచ్చి నాగిరెడ్డి భార్య సంరక్షణలో వారి పిల్లలతోపాటు పెంచారు.


‘షావుకారు’తో మొదలెట్టి ...
విజయా ప్రొడక్షన్స్‌ సంస్థ ప్రారంభించి నాగిరెడ్డి-చక్రపాణి తొలి ప్రయత్నంగా ‘షావుకారు’ చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమాకి కథ, మాటలు సమకూర్చడమే కాకుండా నిర్మాణ బాధ్యతలను మోసింది చక్రపాణి. ఎల్‌.వి.ప్రసాద్‌ సారధ్యంలో నిర్మించిన ఈ చిత్రం 7, ఏప్రిల్‌ 1950న ఆంధ్రదేశమంతటా విడుదలైంది. ఆరోజుల్లోనే ఈ సినిమాకి ‘ఇరుగు పొరుగుల కథ’ అనే ట్యాగ్‌ లైను తగిలించారు. నాగిరెడ్డి, చక్రపాణి నిర్మాతలుగా వ్యవహరించగా గోవిందరాజుల సుబ్బారావు, ఎన్‌.టి.రామారావు, ఎస్‌.వి.రంగారావు, రేలంగి, జానకి, శాంతకుమారి ముఖ్యపాత్రలు పోషించారు. సముద్రాల పాటలు, ఘంటసాల సంగీతం కూర్చారు. సినిమా యావరేజిగా ఆడింది. ఈ చిత్రం ద్వారా పరిచయమైన జానకి ‘షావుకారు జానకి’గా గుర్తింపు పొందింది. 1951లో కె.వి.రెడ్డి దర్శకత్వంలో ‘పాతాళభైరవి’ సినిమా నిర్మించారు. కథ, మాటలు, పాటలు పింగళి నాగేంద్రరావు రాయగా ఘంటసాల సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో ఎన్‌.టి. రామారావు, ఎస్‌.వి.రంగారావు, సి.ఎస్‌.ఆర్, రేలంగి, మాలతి, హేమలత, సురభి కమలాబాయి నటించారు. ఈ జానపద చిత్రం సర్వజనుల్నీ విశేషంగా ఆకర్షించింది. సినిమా సూపర్‌ హిట్టై 185 రోజులు ఆడి కనకవర్షం కురిపించింది. దాంతో వాహిని స్టూడియోలో మరొక ఫ్లోర్‌ నిర్మించి దానికి ‘పాతాళభైరవి’ అని పేరుపెట్టారు. తమిళంలో కూడా ఈ చిత్రాన్ని నిర్మించారు. 1952లో చక్రపాణి స్క్రిప్టు, పింగళి పాటలతో ఎల్‌.వి. ప్రసాద్‌ దర్శకత్వంలో మరొక సాంఘిక చిత్రం ‘పెళ్ళిచేసి చూడు’, తమిళంలో ‘కల్యాణం వణ్ణిపార్‌’ చిత్రాలను సమాంతరంగా నిర్మించారు. అప్పటికే విజయా సంస్థలో కాంట్రాక్టు మీద వున్న రామారావు హీరోగా నటించగా జి.వరలక్ష్మి హీరోయిన్‌గా నటించింది. ఘంటసాల అద్భుత సంగీతం సమకూర్చిన ఈ చిత్రం కూడా విజయ దుందుభి మోగిస్తూ 182 రోజులు ఆడింది. అయితే ఎల్‌.వి.ప్రసాద్‌ పర్యవేక్షణలో కమలాకర కామేశ్వరరావు తొలిసారి దర్శకత్వం వహించగా తెలుగు, తమిళంలో ఒకేసారి నిర్మించిన ‘చంద్రహారం’ (1954) సినిమా పరాజయం పొందింది. తరువాత 1955లో నాగిరెడ్డి-చక్రపాణి ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వంలో ‘మిస్సమ్మ’ చిత్రాన్ని రెండు భాషలలోను నిర్మించారు. రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, రంగారావు, రేలంగి, జమున, ఋష్యేంద్రమణి నటించిన ఈ సినిమాకు సాలూరు రాజేశ్వరరావు సంగీతం అందించారు. పింగళి పాటలు అద్భుతంగా అమరి సూపర్‌ హిట్టయ్యాయి. ఈ సినిమాను సమాంతరంగా తమిళంలో కూడా తీశారు. అది కూడా శతదినోత్సవం చేసుకుంది. ఇక 1957లో కె.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘మాయాబజార్‌’ ద్విభాషాచిత్రం 175 రోజులకుపైగా ఆడి చరిత్ర సృష్టించింది. తెలుగు చలచిత్ర పరిశ్రమలో వున్న హేమాహేమీలందరూ ఈ చిత్రంలో నటించడం విశేషం. ఇక వరుసగా ‘అప్పుచేసి పప్పుకూడు’ (ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకుడు) చిత్రం శతదినోత్సం చేసుకోగా, కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన ‘జగదేకవీరుని కథ’ కూడా 175 రోజులు ఆడింది. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ‘గుండమ్మ కథ’ సూపర్‌ హిట్‌గా నిలిచి 175 రోజులకు పైగా ఆడింది. తరువాత వచ్చిన ‘సత్యహరిశ్చంద్ర’ (1965) గొప్పగా ఆడకపోయినా, తాపీ చాణక్య దర్శకత్వం వహించిన ‘సి.ఐ.డి’ చిత్రం 106 రోజులు ఆడి శతదినోత్సవం చేసుకుంది. సురేష్‌ రామానాయుడు నిర్మించిన ‘రాముడు-భీముడు’ చిత్రాన్ని హిందీలో నాగిరెడ్డి-చక్రపాణి ‘రామ్‌ అవుర్‌ శ్యామ్’ పేరుతో పునర్నిర్మించగా చిత్రం బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. అయితే 1968లో విజయావారు నిర్మించిన ‘ఉమా చండి గౌరీ శంకరుల కథ’ బాగా ఆడలేదు. విజయా సంస్థ ఇరవై తొమ్మిది చిత్రాలు నిర్మించింది. అవి వేళ్ళమీద లెక్కించ తగినవే అయినా అవి వేటికవే మాస్టర్‌ పీసులే. వాహినీ స్టూడియోని తీసుకొని విజయా-వాహినీ స్టూడియోగా అధునాతన పరికరాలతో అభివృద్ధి చేశారు. ఆసియా ఖండంలోని అతిపెద్ద స్టూడియోగా ఇది పేరు గడించింది. విజయా గార్దన్స్‌లో అవుట్‌ డోర్‌ షూటింగులు జరిగేవి. అలాగే రికార్డింగ్‌ సదుపాయాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మొత్తం పన్నెండు ఫ్లోర్లు, రెండు రికార్డింగ్‌ థియేటర్లు, లేబరేటరీ, ప్రొజెక్షన్‌ థియేటర్లతో ఆ స్టూడియో అలరారింది.
వినూత్న ప్రచార సారథి...
1942లో జెమినీ వారి ‘బాలనాగమ్మ’, వాహిని వారి ‘భక్తపోతన’ చిత్రాలు కేవలం ఇరవై రోజుల వ్యవధిలో విడుదలయ్యాయి. ‘బాలనాగమ్మ’ చిత్రం విడుదలకు ముందు బెంగుళూరులో జెమిని వారు బ్రహ్మాండమైన పబ్లిసిటీ ఇచ్చారు. ఎక్కడ చూసినా ఆ సినిమా పోస్టర్లే దర్శన మిచ్చాయి. నాగిరెడ్డి ఊరంతా తిరిగి చూశారు. జెమినీకి పోటీగా వాల్‌ పోస్టర్లతో పబ్లిసిటీ రాదనీ గ్రహించారు. వెంటనే విజయవాడ నుంచి, మద్రాసు నుంచి నిపుణులైన కార్పెంటర్లను, పెయింటర్లను బెంగుళూరు పిలిపించి ముప్పై అడుగుల హనుమంతుడి కటవుట్‌ తయారు చేయించి దానిని పది అడుగుల పీఠం మీద నిలబెట్టించి, దానిమీద ‘భక్తపోతన’ ప్రకటన రాయించి మల్లేశ్వరం కూడలిలో పెట్టించారు ఇక ఆ సర్కిల్‌ నిండా జనం తిరునాళ్ళకు వచ్చినట్లు వచ్చి ఆ భారీ ఆంజనేయుని కటవుట్‌ని చూస్తూ ప్రదక్షిణలు చేశారు. ‘భక్త పోతన’ సినిమా మూవీల్యాండ్‌ థియేటర్‌లో విడుదలైంది. జనాన్ని కంట్రోల్‌ చెయ్యలేకపోయారు. బ్యారికేడ్లు విరిచేసి ప్రేక్షకులు టికెట్ల కోసం ఎగబడ్డారు. అలా ‘భక్తపోతన’ చిత్ర విజయానికి నాగిరెడ్డి చేసిన తెలివైన కృషి అద్వితీయం.


* బి.ఎన్‌.రెడ్డి నిర్మించిన ‘సుమంగళి’ సినిమా నిర్మాణం పూర్తి కావస్తుండగా పంపిణీ హక్కుల కోసం ఒక వ్యక్తి బి.ఎన్‌ వద్దకు వచ్చాడు. ఆయన చెప్పిన రేటుకి బి.ఎన్‌ హక్కులు ఇవ్వనన్నారు. ఆరోజుల్లో వాల్‌ పోస్టర్లు తగిలించాలంటే కార్పొరేషన్‌ వారికి పన్ను చెల్లించి ముద్ర వేయించుకోవాలి. ఆ వ్యక్తి మద్రాసు నగరంలోని లైటు స్తంభాలకు వెదురు దట్టీలు కట్టి వాల్‌ పోస్టర్లు అంటించి ప్రచారం చేసుకునే హక్కులు మద్రాసు కార్పొరేషన్‌ వారి నుంచి పొంది వున్నాడు. దాంతో ‘సుమంగళి’ సినిమా ప్రచారానికి అతడు అడ్డు తగిలాడు. నాగిరెడ్డి పూనుకొని వెదురు దట్టీల కొలతకి 500 ఫ్రేములు తయారు చేయించి, వాటికి గొనె సంచుల గుడ్డలు వేసి కుట్టించి వాటి మీద మద్రాసు కార్పొరేషన్‌ వారు ముద్రవేసిన పోస్టర్లను అతికించి, ఆ పోస్టర్లను మద్రాసు నగర్‌ రోడ్లకు ఇరువైపులా వున్న చెట్లకు అటూ ఇటూ కట్టి వేలాడదీయించారు. దాంతో సినిమాకు అఖండమైన పబ్లిసిటీ లభించి సినిమా విజయానికి సహకరించింది.
కార్యదక్షతకు మారుపేరు...
ప్రొడక్షన్‌ పనుల్లో చక్రపాణి చెయ్యిపెడితే నాగిరెడ్డి పెట్టుబడి వ్యవహారాలకే పరిమితమయ్యేవారు. చక్రపాణి తీసుకునే నిర్ణయాలకు ఆయన బద్ధుడై మెలిగేవారు. ’మిస్సమ్మ’ చిత్రానికి మొదట్లో భానుమతిని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. నాలుగు రీళ్ల సినిమా తీశాక భానుమతి ఒకరోజు షూటింగుకు ఆలస్యంగా హాజరైంది. చక్రపాణికి సంజాయిషీ ఇస్తూ ముందురోజే కాగితం రాసి ప్రొడక్షన్‌ సిబ్బందికి అందజేశానని, వరలక్ష్మి వ్రతం కారణంగా ఆలస్యమవుతుందని అందులో పేర్కొన్నానని భానుమతి చెప్పిన దానికి చక్రపాణి ఒప్పుకోలేదు. నిజానికి ఇద్దరూ రచయితలే. ‘ధర్మపత్ని’ సినిమా నుంచి ఇద్దరూ మంచి సాహితీ మిత్రులు. అయినా చక్రపాణి ఉపేక్షించలేదు. భానుమతిని తొలగించి, సావిత్రిని ‘మిస్సమ్మ’ పాత్రలో పెట్టి సినిమా పూర్తిచేయించారు. నాగిరెడ్డి అందుకు చక్రపాణికి పూర్తి మద్దతు ప్రకటించారు. సమయపాలనకు, క్రమశిణకు వీరిద్దరూ మారుపేర్లే. ఇద్దరూ కృష్ణార్జునులు లాగా వ్యవహరిస్తూ విజయా సంస్థను ముందుకు నడిపారు.


* జెమిని అధిపతి ఎస్‌.ఎస్‌.వాసన్‌ వద్దకు నాగిరెడ్డి అప్పుడప్పుడు సలహాల కోసం వెళ్ళేవారు. ఇద్దరూ మంచి మిత్రులుగా మెలిగారు. వాసన్‌ మొదట ‘ఆనంద వికటన్‌’ అనే పత్రిక నడిపేవారు. మెల్లగా జెమిని సంస్థను స్థాపించి స్టూడియో అధిపతిగా ఎదిగారు. నాగిరెడ్డికి వాసన్‌ స్పూర్తి. వాసన్‌ని ఆదర్శంగా తీసుకొని నాగిరెడ్డి విజయా సంస్థను నెలకొల్పారు. ఎన్‌.టి.రామారావుకి విజయా మాతృసంస్థ. నాగిరెడ్డిని రామారావు ‘నాన్నగారూ’ అని ‘ఫాదర్‌’ అని పిలిచేవారు. విడుదలైన అన్ని కేంద్రాలలో శతదినోత్సవం చేసుకున్న ‘పాతాళభైరవి’ చిత్రానికి పనిచేసిన ముఖ్యకళాకారులందరికీ నాగిరెడ్డి ‘బ్యూక్‌’ కంపెనీ కార్లను బహుమతిగా అందజేశారు. రామారావు ఆ కారును ‘ఫాదరిచ్చిన కారు’ అని గొప్పగా చెప్పుకునేవారు. రామారావు విజయా సంస్థలో 20 చిత్రాలకు పైగా నటించారు.

* ‘మాయాబజార్‌’ చిత్రం విడుదలైనప్పుడు ఎన్టీఆర్‌ కృష్ణుడి వేషాన్ని నలభై వేల కలర్‌ క్యాలండర్లుగా ముద్రించి అమ్మారు. జనం ఆంధ్రరాష్ట్రమంతటా వాటిని ఫ్రేములు కట్టించుకొని ఇళ్ళలో, షాపుల్లో పెట్టుకున్నారు. కొందరైతే పూజామందిరాల్లో కూడా పెట్టుకొని పూజలు నిర్వహించారు. ఈ ఐడియా నాగిరెడ్డిదే! ఎం.జి.రామచంద్రన్‌తో నాగిరెడ్డి అనుబంధం గొప్పది. ఒకసారి నాగిరెడ్డికి జబ్బుచేసి ఆసుపత్రిలో వుంటే ఎమ్జీఆర్‌ (అప్పుడు ముఖ్యమంత్రిగా వున్నారు) స్వయంగా వచ్చి పరామర్శించడమే కాకుండా ఫారిన్‌ నుండి మందులు తెప్పిస్తానని చెప్పారు. ఎమ్జీఆర్‌ సూచనమేరకే నాగిరెడ్డి విజయా ఆసుపత్రి నిర్మించి దాని పరిపాలనా బాధ్యతల కోసం ఒక ట్రస్టు స్థాపించి దానికి అప్పగించారు.


* 1966లో నాగిరెడ్డి ‘విజయచిత్ర’ అనే సినిమా మాసపత్రికను ప్రారంభించారు. రావి కొండలరావు పత్రికా సారధ్య బాధ్యతలను సహాయ సంపాదకుడిగా ఇరవై ఆరు సంవత్సరాల పాటు మోశారు. ఈ పత్రిక నలభై సంవత్సరాలకు పైగా నడిచింది. ప్రలోభాలకు లొంగని నైజం, నిబద్ధతత, అంకితభావంతో ఈ పత్రిక నడిచింది. ఆహ్లాదంతోపాటు విజ్ఞానం అందజేసే ధ్యేయంతో ఈ విజయచిత్ర తన ఉనికిని చాటుకుంది. తొలి సంచికలోనే ‘విజయచిత్ర’ ‘ఉన్న మంచినే చెబుతుంది, ఉన్నా చెడు చెప్పదు’ అనే సూత్రానికి కట్టుబడి పనిచేసింది. పక్షపాతానికి, మొహమాటానికి, అసభ్యరచనలకి, అవాచ్యమైన రాతలకి ఈ పత్రికలో చోటులేదు. ఇదంతా నాగిరెడ్డి అంకితభావమే!

* నాగిరెడ్డి ఫిలిం ఫెడరేషన్‌ అధ్యక్షునిగా నాలుగుసార్లు దక్షతతో కూడిన బాధ్యతలను నిర్వహించారు. ఇందిరా గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి, మొరార్జీ దేశాయి, రాజాజీ, కామరాజనాడార్, నీలం సంజీవరెడ్డి మొదలైన ప్రజానాయకులతో సన్నిహిత సంబంధాలను నెరిపారు. తిరుమల-తిరుపతి దేవస్థానం పాలకమండలి అధ్యక్షునిగా నాగిరెడ్డి వ్యవహరించారు. మెడికల్‌/ఎడ్యుకేషన్‌ ట్రస్టును స్థాపించి సేవలందించారు. చలనచిత్ర రంగానికి ఎనలేని కృషి చేసినందుకు భారత ప్రభుత్వం 1987లో నాగిరెడ్డిని ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ అవార్డుతో సత్కరించింది. తమిళనాడు ప్రభుత్వం ‘కలైమామణి’ బిరుదు ప్రదానం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘రఘుపతి వెంకయ్య’ పురస్కారాన్ని అందజేసింది. తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నాగిరెడ్డికి గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. నాగిరెడ్డి ముగ్గురు కొడుకుల్లో వెంకటరామరెడ్డి, విశ్వనాథరెడ్డి సినిమా నిర్మాణంలో వున్నారు. నాగిరెడ్డి అనారోగ్యంతో తన 92వ ఏట 21 ఫిబ్రవరి 2004న మద్రాసులో మరణించారు.

- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.