డైలాగులు కావవి... తూటాలు!
ఒక్క డైలాగ్‌ సినిమాకి వెన్నెముకలా నిలిచే సందర్భాలు చాలా తక్కువ. సినిమా పేరు చెప్పగానే అందులోని డైలాగులు కంఠతాగా చెబుతారంటే అదంతా సంభాషణ రచయిత చాతుర్యమే!* ‘‘ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసుల్లో భావన్నై, హృదయాల జ్వాలనై.. నా జాతి జనులు పాడుకొనే సమర గీతాన్నై..’’ ఇలా చిరుగాలిలా మొదలై, తుపానులా మారి, సునామీలా విరుచుకుపడిపోయిన డైలాగ్‌ ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలోనిదని ప్రత్యేకంగా గుర్తుచేయవలసిన అవసరం లేదు. ఆ అక్షరాల్లో ఆయువై.. పదాల్లో ప్రాణమై నిలిచిన సంభాషణ చాతుర్యం రచయిత త్రిపురనేని మహారథిది. ఆ సినిమాలో అల్లూరి బాణం కన్నా.. ఈ మాటలే సూటిగా గుచ్చుకొన్నాయ్‌. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుల హృదయ స్పందనను అమాంతం పెంచేశాయ్‌. కృష్ణ అభినయం.. అల్లూరి పోరాటం.. తెలుగువీర లేవరా.. అంటూ భావోద్వేగంగా సాగిన శ్రీశ్రీ గీతం.. వీటికి మహారథి మాటలు తోడయ్యాయి. స్వచ్ఛమైన తెలుగు సంభాషణలు అందించిన త్రిపురనేని మహారథి డిసెంబర్‌ 23, 2011న తెలుగు సినీ జగత్తుని విడచి వెళ్లిపోయారు.


* త్రిపురనేని పూర్తిపేరు త్రిపురనేని బాలగంగాధరరావు. ఏప్రిల్‌ 20, 1930న కృష్ణా జిల్లా పసుమర్రులో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. బాల్యం నుంచీ అక్షరాలపై మమకారం పెంచుకొన్నారు. రామాయణ, మహాభారతాలను చిన్నప్పుడే చదివేశారు. బాధర్‌ అనేది ఆయన కలంపేరు. ఆపేరుతో పత్రికలకు పద్యాలు, గేయాలు పంపించేవారు. తండ్రి మరణంతో ఆయన చదువు ఎక్కువ కాలం సాగలేదు. ఆస్తులన్నీ హారతి కర్పూంలా కరిగిపోవడంతో కుటుంబ బాధ్యతను మోయాల్సివచ్చింది. యువకుడిగా ఉన్నప్పుడే ‘క్విట్‌ ఇండియా’ అంటూ బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా సమరనాదం వినిపించారు.
* ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో కొంతకాలం వ్యవసాయం చేశారు. హైదరాబాద్‌లో గుమస్తాగా పనిచేశారు. దక్కన్‌ రేడియోలో ఉద్యోగం వచ్చింది. అది కూడా ఎక్కువ కాలం నడవలేదు. ‘మీజాన్‌’ అనే పత్రికలో ఉప సంపాదకుడిగా కొన్నాళ్లు పనిచేశారు. తెలంగాణ భూపోరాటంలో చురుగ్గా పాల్గాన్నారు. ఈయన పేరు పోలీసు రికార్డులకు కూడా ఎక్కింది. ‘పాలేరు’ అనే సినిమాకి ప్రొడక్షన్‌ మేనేజరుగా పనిచేశారు. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.


* ఆ తరువాత ఆయన మనసు దర్శకత్వంపై మళ్లింది. దాంతో మద్రాసు రైలెక్కేశారు. ‘ఎమ్మేల్యే’ సినిమాకి కేబి తిలక్‌ దగ్గర సహాయకుడిగా చేశారు. కె.ఎస్‌.ప్రకాశరావు, వి.మధుసూదనరావుల సినిమాలకీ పనిచేశారు. మాటల రచయితగా ఆయన ప్రయాణం అనువాద చిత్రంతో మొదలైంది. ‘శివగంగ సీమై’ చిత్రాన్ని ‘యోధాను యోధులు’గా తెలుగులో అనువదించారు. దానికి మహారథి మాటలు రాశారు. ‘బందిపోటు’ తొలి తెలుగు చిత్రం. ‘సతీ అరుంధతి’, ‘కంచుకోట’, ‘పెత్తందారు’ ఇవన్నీ ఆయనకు రచయితగా తెలుగు చిత్రసీమలో స్థానాన్ని సుస్థిరం చేశాయి. దాదాపు 150 సినిమాలకు సంభాషణలు అందించారు.

*
ఎన్టీఆర్, కృష్ణలతో మహారథికి మంచి అనుబంధం ఉంది. మద్రాసులో అడుగుపెట్టేగానే తొలుత పరిచయమైంది ఎన్టీఆరే. ‘మనదేశం’ కోసం ఎన్టీఆర్‌ తొలిసారిగా కెమెరా ముందుకు వచ్చినప్పుడు సెట్లో ఎన్టీఆర్‌తో పాటు మహారథి కూడా ఉన్నారు. ఎన్టీఆర్‌ కలల ప్రాజెక్టుని.. కృష్ణ చేపట్టారు. అదే ‘అల్లూరి సీతారామరాజు’. ఈ చిత్రానికి మహారథి సంభాషణలు అందించారు. ఆ సినిమాతో మహారథికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ సినిమా కోసం ఆయన సంభాషణలన్నీ అడవిలోనే రాశారు. ‘‘తెల్లవారుజామున చలిలో వణికిపోతున్నా ఓ తపస్సులా భావించి.. సంభాషణలు రాశాను. అలా రాస్తున్నప్పుడు నన్ను నేను మరచిపోయాను. కానీ ప్రేక్షకులకు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాను..’’ అని చేప్పేవారు. ఆయనకు రయితగా చివరి చిత్రం ‘శాంతిసందేశం’. ఇందులో జీసస్‌ పాత్రను కృష్ణ పోషించారు.

*
నిర్మాతగా ‘రైతు భారతం’, ‘దేశమంటే మనుషులోయ్‌’, ‘మంచిని పెంచాలి’, ‘భోగిమంటలు’ సినిమాలు తీశారు. సాహిత్యంపై మమకారంతో చాలా పుస్తకాలు రాశారు. ఆ తరువాత రాజకీయాలపై ఆసక్తి చూపించారు. 1977లో బోధన్‌ నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2005లో ‘త్రిలింగ ప్రజా పార్టీ’ స్థాపించారు.

- రావి కొండలరావుCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.