ఆమె ఓ నిండు గోదారి
ప్రముఖుల జంతులను, వర్ధంతులను జరుపుకొంటూ వారిని స్మరించుకోవడటం కదు. అయితే ఈ కార్యక్రమాలు ఎక్కువగా రాజకీయ రంగానికే పరిమితం అవుతూ ఉంటాయి. అనునిత్యం ఎన్నో ఒత్తిడులకు గురయ్యే సామాన్యుడికి ‘‘రిలీఫ్‌’’ ఇచ్చే కళారంగంలో ఆ కళామతల్లి ముద్దుబిడ్డలెందరో తమతమ ప్రజ్ఞాపాటవాలతో జనవాహిని మురిపించారు. మైమరపించారు. అటువంటి కళాకారులను మరింత ‘‘ఘనంగా’’ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది.


డిసెంబర్‌ నెలలోనే జయంతిని (ఆరోతేదీ), వర్ధంతిని (ఇరవై ఆరోతేదీ) కూడా జరుపుకుంటున్న మహానటి, పద్మశ్రీ, పద్మవిభూషణ సావిత్రిని మర్చిపోలేం. క్షమించాలి. ఆమెకి ‘‘పద్మ’’ బిరుదులు వచ్చినట్లు లేదు. ఆ నటి శిరోమణికి ‘‘పద్మ’’ బిరుదులు రాకుండా ఉంటాయా అనుకొని బిరుదులను తగిలించడం జరిగింది. క్షంతవ్యున్ని. ఆమెకు ‘‘పద్మ’’ బిరుదులు ఇవ్వనందుకు ఆడిపోసుకోకుండా బహుశా ఆమె నట కౌశల్యాన్ని ‘‘పద్మ’’ బిరుదులు కొలవలేవేమోనని ప్రకటించి ఉండకపోవచ్చని అనుకొని తృప్తిపడదాం.

తమిళులు కూడా సమానంగా ఆదరించి ఆరాధించిన సావిత్రి సుదీర్ఘకాలం కోమాలో ఉండి 1981లో కన్నుమూసారు. అప్పటికి ఆమె వయస్సు నలభై అయిదేళ్ళు మాత్రమే అంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. అప్పటికి పదేళ్ళకు ముందుగానే ఆమె చిత్రాలు తగ్గిపోయాయి. మరి ఆమెకి అంతపేరు ఎలా వచ్చింది? పదమూడు, పద్నాలుగు ఏళ్ల వయసులోనే సినిమా రంగంలో ప్రవేశించింది. 1950లో సంసారం చిత్రంలో కథానాయకగా ముందు తీసుకొన్న తరువాత ఆమెను తొలగించి చిన్న వేషం ఇచ్చారు. పాతళభైరవిలో కేవలం ఓ నాట్యగత్తే. 1953లో వచ్చిన దేవదాసు ఆమె ‘ఉనికిని’ చాటిచెప్పింది. 1955లో ‘‘అర్ధాంగి’’ ‘‘మిస్సమ్మ’’ ‘‘దొంగరాముడు’’ ఆమెకు ‘‘స్టార్‌డమ్‌’’నిచ్చాయి. 1957లో ‘‘మాయాబజార్‌’’తో ఆమె పతాకస్థాయికి చేరుకుంది. ఆ తరువాత మరో పదేళ్ళు మాత్రమే ఆమె గుర్తింపు కలిగిన పాత్రలలో నటించింది. వ్యక్తిగత జీవితం, వ్యసనాలు, కారణాలు ఏమైనా ఆమె సినీ రంగంలో ప్రముఖంగా కనిపించింది. ఓ పది పదిహేనేళ్ళే మాత్రమే. అయితేనేం మరెవరికి రాని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొంది. అతి చిన్న వయసులోనే ఎంతో అనుభవం గల వారు మాత్రమే వేయగలిగిన పాత్రలను అతి సమర్ధవంతంగా పోషించటం ఆమెకే చెల్లింది.


దొరబాబు లాంటి దేవదాసుతో పంతంపడి ఓ ముసలి జమిందారును పెళ్ళి చేసుకొని ‘‘నిన్ను లేవదీసుకు పోగలనా పారూ’’ అని సతాయించే తాగుబోతు ప్రేమికుడిని సముదాయించలేక నలిగిపోయే ‘‘పార్వతి’’ పాత్రను పోషించడానికి ఎంత అనుభవముండాలి? కాని అదే ఆమెకి మొదటి ప్రధానపాత్ర. జీవితాన్ని, మగవాళ్ళ మనస్తత్వాలని కాచి వడబోసిన కన్యాశుల్కంలోని ‘‘మధురవాణి’’ పాత్ర పోషించడానికి ఎంత వయసుండాలి? ఆ సినిమాలో ఓ సన్నివేశంలో సియస్సార్‌కు వచ్చిన లేఖలో లొట్టిపిట్టలనే ప్రస్తావన వచ్చినపుడు ఆమె పడిపడీ ఎంతో సహజంగా, అందంగా నవ్విన నవ్వు అనితరసాధ్యం. భానుమతి వంటి సీనియర్‌ నటి వేయాల్సిన మిస్సమ్మ పాత్ర పోషించాల్సి వచ్చినప్పటికి ఆమె వయస్సు సుమారుగా రెండు మూడు పదులు మాత్రమే. అదే వయసులో ఆమె చేసిన దొంగరాముడు సినిమాలో ‘‘రారోయ్‌ మా ఇంటికి’’ పాటలో ఆమె హావభావాలకు, మాయాబజార్‌లో ‘‘అహనా పెళ్లియంట..’’ అంటూ చెలికత్తె భుజాలు నొక్కి కళ్ళెగరేసే గడుసుదనానికి, పాచికల మాంత్రికుడు శకుని పాచికలను తారుమారు చేసి గడ్డం దువ్వుకొనేలా చేసి వెంటనే చూపే అమాయకత్వానికి, మూగమనసులులో ‘‘ముద్ధబంతి పువ్వులో.. మూగకళ్ళ ఊసులో’’ అనగానే బరువుగా వాల్చిన కన్నులకు, డాక్టర్‌ చక్రవర్తిలో నాగేశ్వరావుని అపార్థం చేసుకొని ‘‘తోడొకరుండిన అదే భాగ్యమూ’’ అంటూ అతను తన గోడుని వెళ్ళబోసుకోంటున్నా కాస్త ముక్తసరిగా, కాస్త ఎగతాళిగా చూసే చూపులకు ‘‘ఆస్కార్‌’’లు లేవు. యశస్వీ రంగరావుతో ఢీకొట్టే పాత్రలో (మంచి మనసులు) రెండు జడలు వేసుకొని ‘ఏమండోయ్‌ శ్రీవారూ.. ఒక చిన్న మాట..’ అంటూ మేడమెట్లు దిగుతూ ఆమె వేసిన స్టెప్స్‌ నేటి ‘‘జీరో’’ సైజ్‌ భామలు వెయ్యగలరా?


సావిత్రి వెన్నెల మాయని అనుభవించని మిస్సమ్మ, అవమాన భారాన్ని దిగమింగుతూ ప్రతీకార జ్వాలతో రగిలిపోయే ద్రౌపది, మతిలేని పతిని దారిలో పెట్టే ‘‘అర్ధాంగి’’, ఎంతటి త్యాగానికైనా ఒడికట్టే తోడికోడలు, ఓ మూగప్రేమికుడికి అమ్మాయిగోరు, రక్తసంబంధానికి తపించే చెల్లెలు, దేవత, మాతృదేవత, ప్రేమంటే సిగపూవులా వాడిపోయేది కాదని చెప్పే సుమంగళి, విచిత్ర కుటుంబంలో అమాయక వదిన ఇలా ఎన్నో ఎన్నెన్నో పాత్రలు అన్నీ దాదాపుగా మూడుపదుల వయసు రాకుండానే.

అగ్రశ్రేణి కథానాయకులతో సమానంగా సంపాదించింది. కానీ, ఆమె చేతికి ఎముక లేదు. కెరీర్, శరీర ఆకృతి, సంపాదన వంటి విషయంలో నేటి తారలు చూపించే తెలివితేటలు ఆమెకి లేవు. ఉండి ఉంటే మనకి మరి కొన్ని మంచి సినిమాలు చెయ్యడం మాట అటుంచండి. కనీసం ఆమె చరమాంకం అంత ఇబ్బందికరం కాకుండా ఉండేది.

నిజాని ఆమె శరీర ఆకృతికి నేడు కథానాయిక వేషాలు దొరకడం కష్టం. వదినానో, తల్లిగానో మిగిలిపోవాల్సి ఉండేది. కానీ ఆనాటి నిర్మాతలు, దర్శకులు అమాయకులు. మంచివాళ్ళు వాళ్ళ దృష్టిలో సినిమా అంటే నటన మాత్రమే. వాళ్ళు నటనని మాత్రమే చూసారు. ఆదరించారు. తారలు కూడా నటనని ‘‘మాత్రమే’’ చూపించారు.

ఆ నిండు గోదారికి సరితూగే వాళ్ళెవరు?- పొన్నాడ సత్యప్రకాశరావు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.