తమిళుల ఆడపడుచు... తెలుగువారి కోడలు!

తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోయిన్‌గా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న దేవిక అసలుపేరు ప్రమీలాదేవి. ఆమె పుట్టింది 25 ఏప్రిల్‌ 1943న మద్రాసు నగరంలో. అన్నిటికన్నా విశేషమేవిటంటే, దేవిక తెలుగు చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు మనవరాలు. ఆమె మేనమామ ఆ రోజుల్లో మద్రాసు నగర మేయర్‌గా వుండేవారు. చిన్నతనంలో దేవికకు సంగీతం, డాన్సు నేర్పించి మంచి కళాకారిణిగా చూడాలని అమ్మమ్మ తాపత్రయం. కానీ చిన్న వయసు కావడంతో దేవికకు వాటి ప్రయోజనం తెలియదు. లంగా, గౌను వేసుకొని అమ్మమ్మ ఒడిలో నుంచి తప్పించుకుంటూ పరుగెత్తేది. అయినా దేవిక అమ్మమ్మ మాత్రం పట్టిన పట్టు వదిలేది కాదు. ఒకసారి వాళ్ల అమ్మమ్మ దేవికను దగ్గరి బంధువులపెళ్లికి తీసుకెళ్లింది. అక్కడ ఆమెకు ఒక జ్యోతిష్కుడు తారసపడ్డాడు. దేవికను అతనివద్దకు తీసుకెళ్లి ఆమె చేతిని జ్యోతిష్కుడి చేతిలో పెట్టింది. అతడు బాగా పరికించి చూసి ‘ఈ అమ్మాయికి సంగీతం, నృత్యం నేర్పించండి. బాగా రాణిస్తుంది’ అన్నాడు. దేవిక అమ్మమ్మ సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. అయితే దేవిక నాన్నకి ఈ సంగీతాలు, నాట్యాలు అంటే కిట్టేవి కాదు. బాగా చదివించాలని ఆయన కోరిక. దేవిక చిన్నతనంలో ఎవ్వరితోనూ కలివిడిగా వుండేది కాదు. స్కూలులో పిల్లలు ‘ఒంటిపిల్లి రాకాశి’ అంటూ గేలిచేసేవాళ్లు. అమ్మమ్మ పట్టువదలని విక్రమార్కుడిలా దేవికకు సంగీతం, నాట్యం నేర్పించింది. పనిలో పనిగా వయోలిన్‌ వాద్యం ఉపయోగించడం కూడా నేర్పించింది. దేవిక అమ్మమ్మకు దూరదృష్టి ఎక్కువ. ఆమె బాగా పాడేది. చాలా భాషల్లో ఆమెకు ప్రావీణ్యం వుండేది. దేవికకు యుక్తవయసు రాగానే వాళ్ల అమ్మమ్మ దేవికకు సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలెట్టింది. 1953లో డాక్టర్‌ గరికిపాటి రాజారావు నిర్మించిన ‘పుట్టిల్లు’ చిత్రంలో ఆమెకు చిన్న వేషం దొరికింది. పాత్ర చిన్నదే కావడంతో ఆమె పేరును క్రెడిట్స్‌లో వెయ్యలేదు. జమున కూడా ఈ చిత్రంతోనే తెలుగు చిత్రపరిశ్రమలో కాలుపెట్టింది. నిజానికి దేవిక టి.ఆర్‌.మహాలింగం తలపెట్టిన ఒక తమిళ చిత్రంలో మొదట నటించాల్సి వుండగా ఆమెచేత ఆయన ఒక్క డైలాగు కూడా చెప్పించలేకపోయారు. దాంతో తమిళ చిత్రపరిశ్రమకు దేవిక వెంటనే పరిచయం కాలేకపోయింది. ఈరోజు  దేవిక (మే 2, 2002) వర్థంతి. ఆమె గురించిన జ్ఞాపకాలు కొన్ని, సితార డిజిటల్‌ పాఠకుల కోసం...

* రేచుక్కతో తెలుగులో...

1955లో ఘంటసాల బలరామయ్య కుమారుడు కృష్ణమూర్తి పి.పుల్లయ్య దర్శకత్వంలో ప్రతిభా బ్యానర్‌ మీద ‘రేచుక్క’ చిత్రాన్ని నిర్మించారు. అదే దేవికకు తొలి చిత్రానుభవం. అందులో లలితాదేవి పాత్రను దేవిక పోషించింది. సినిమా క్రెడిట్స్‌లో దేవిక పేరును ‘ప్రమీల’గా వేశారు. ఈ సినిమాలో మంత్రి కుమార్తె లలితాదేవిగా నటించిన దేవిక మీద ‘ఎక్కడిదీ అందం ఎవ్వరిదీ ఆనందం... వెలిగే అందం చెలరేగే ఆనందం’ అనే పాటను చిత్రంలో తొలిపాటగా చిత్రీకరించారు. చివర్లో వచ్చే ‘సొగసేమో మనసేమో గారామో అది మారామో ఆ తీరే వేరేమో’ అనే మరోపాటను కూడా దేవిక మీదే చిత్రీకరించారు. తరువాత దేవిక నటించిన రెండవచిత్రం 1957లో భరణీ వారు రామకృష్ణ దర్శకత్వంలో నిర్మించిన ‘వరుడు కావాలి’ ద్విభాషా చిత్రం. ఇందులో కూడా ఆమె పేరు ప్రమీలగానే ప్రచారంలోకి వచ్చింది. తెలుగు వర్షన్‌లో దేవిక అమరనాథ్‌కు జంటగా నటించింది. తమిళ వర్షన్‌ ‘మనమగన్‌ తేవై’లో కూడా దేవిక చంద్రమతి పాత్రను పోషించింది.

* ప్రమీలాదేవి దేవికగా మారి...

అదే సంవత్సరం ఎం.ఎ.వి పిక్చర్స్‌ నిర్మాత వేణు నిర్మించిన ‘ముదలాళి’ చిత్రంలో దేవిక తొలిసారి కథానాయికగా నటించింది. ముక్తా శ్రీనివాసన్‌కు ఇదే దర్శకునిగా తొలి చిత్రం. దేవికకు జంటగా ఎస్‌.ఎస్‌.రాజేంద్రన్‌ నటించగా, ఎం.ఎన్‌.రాజం, టి.కె.రామచంద్రన్, లక్ష్మీరాజ్యం, పక్కీర్‌ సామి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఇక్కడ మరో విషయాన్ని గుర్తు చేయాలి. నిర్మాత వేణు ‘సంపూర్ణ రామాయణం’ సినిమా నిర్మిస్తున్న రోజుల్లో సమాంతరంగా నిర్మించబడిన సినిమా ‘ముదలాళి’. అప్పట్లో ‘సంపూర్ణ రామాయణం’ షూటింగు అనివార్య కారణాల వలన నెలలో పదిరోజులు మాత్రమే జరిగేది. తరువాత ఆచిత్ర నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది. మిగిలిన ఆ 20 రోజులు ఖాళీగా వుండడం ఇష్టంలేని నిర్మాత వేణు లఘు బడ్జట్‌తో ‘ముదలాళి’ సినిమా కోసం ఆ సమయాన్ని కేటాయించారు. అలా ఈ తమిళ సినిమా కేవలం నాలుగు నెలల్లోనే తయారై విడుదలకు నోచుకుంది. తమిళులకు ప్రమీల పేరును ఉచ్చరించడం కాస్త ఇబ్బంది కావడంతో తన పేరును ఈ చిత్రంలోనే ‘దేవిక’గా మార్చుకుంది. హీరోయిన్‌గా నటించినందుకు దేవిక అందుకున్న పారితోషికం ఐదు వేలు. విజయవంతంగా ఆడి శతదినోత్సవం చేసుకున్న ఈ చిత్రం దేవిక, రాజేంద్రన్, దర్శకుడు శ్రీనివాసన్‌లకు బంగారు భవిష్యత్తు ప్రసాదించేందుకు ప్రధమ సోపానమై నిలిచింది. దేవిక హీరోయిన్‌గా నటించిన ఈ తొలి సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ బహుమతి అందుకోవడం గమనార్హం. ఈ సినిమా నిర్మించే రోజుల్లో దేవిక తమిళ నాటకాల్లో పాత్రలు పోషించడంతో ఆమెకు భాషోచ్చారణ మీద మంచి పట్టు లభించింది. తను అభ్యసించిన నాట్యం కూడా ఉపయోగపడింది. ఈ చిత్రవిజయం దేవికకు తెలుగులో కూడా మంచి అవకాశాలు వచ్చేందుకు సహకరించింది. 1958లో అనుపమ చిత్రాల దర్శక నిర్మాత కె.బి.తిలక్‌ ‘అత్తా ఒకింటి కోడలే’ చిత్రాన్ని నిర్మించారు. అందులో దేవిక ‘ప్రమీల’ పేరుతోనే నటించింది. ఆ చిత్రం విజయాన్ని సాధించింది. వెంటనే తెలుగులో సుందర్‌ లాల్‌ నహతా హిందీలో విజయవంతమైన ‘బడా భాయి’ (1957) చిత్రాన్ని రాజశ్రీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ మీద ‘శభాష్‌ రాముడు’ (1959) పేరుతో పునర్నిర్మింమిచారు. అందులో అజిత్‌ పాత్రను ఎన్టీఆర్, కామిని కౌశల్‌ పోషించిన లక్ష్మి పాత్రను దేవిక పోషించారు. ఎన్‌.టి.రామారావు సరసన దేవిక తొలిసారి హీరోయిన్‌గా నటించింది ఈ చిత్రంలోనే. తెలుగులో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని తమిళంలోకి డబ్‌ చేసి విడుదల చేస్తే అక్కడ కూడా విజవంతమైంది. మరుసటి సంవత్సరమే సుందర్‌ లాల్‌ నహతా శ్రీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ మీద టి. అశ్వథనారాయణతో కలిసి ‘శాంతి నివాసం’ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కాంతారావు భార్యగా, అక్కినేనికి వదినగా దేవిక నటించింది. ఈ చిత్రం అనేక కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. ఈ రెండు సినిమాలు దేవికను ఒక మంచి నటనాపటిమగల సంసారపక్ష హీరోయిన్‌గా తీర్చిదిద్దాయి. ఇదే సినిమాను తరవాత జెమిని వాసన్‌ హిందీలో ‘ఘరానా’ (1961)గా రీమేక్‌ చేశారు. ఈ హిందీ వర్షన్‌లో కూడా దేవిక రాజకుమార్‌కు జంటగా ‘సీత’ పాత్రను పోషించింది. తరువాత రోజుల్లో ఈ ‘ఘరానా’ చిత్రాన్ని ‘ఘర్‌ ఘర్‌ కి కహాని’ (1988) పేరుతో రీమేక్‌ చేశారు.

* తమిళ, తెలుగు సినిమాల్లో సమాంతరంగా...

కుటుంబకథాచిత్రాల్లో సంసారపక్షంగా వుండే సాత్విక పాత్రలు పోషిస్తూ విభిన్న తరహా హీరోయిన్‌గా దేవిక తెలుగులో మంచిపేరు తెచ్చుకొని తమిళ చిత్రాల్లో కూడా సమాంతరంగా వెలుగుతూ వచ్చింది. ‘ముదలాళి’ చిత్ర విజయంతో నిర్మాత గోవిందరాజన్, యోగానంద్‌ దర్శకత్వంలో నిర్మించిన ‘అన్బు-ఎంగే’ (1958) అనే చిత్రంలో ఎస్‌.ఎస్‌.రాజేంద్రన్‌కు జంటగా దేవిక నటించింది. సినిమా హిట్టయింది. తరువాతి సంవత్సరంలో దేవిక నాలుగు తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. వాటిలో నటుడు ఎస్‌.వి.సహస్రనామం నిర్మించిన ‘నాలు వేళినిలం’ అంతగా ఆడలేదు. కన్నడ నిర్మాత గుబ్బి వీరన్న, భీంసింగ్‌ దర్శకత్వంలో కన్నడ, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించిన ‘సహోదరి’ చిత్రంలో దేవిక మళయాళ నటుడు ప్రేమ నజీర్‌ సరసన నటించింది. ఈ చిత్రానికి ఎ.వి.యం నిర్మాత మెయ్యప్పన్‌ ఆర్ధిక సహకారాన్ని అందించారు. ఎం.ఎ.త్యాగరాజన్‌ సినిమా ‘పాంచాలి’లో దేవిక మనోహర్‌ సరసన నటించింది. 1960లో ఆమె తెలుగులో ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’, ‘అన్నా చెల్లెలు’, ‘మాంగల్యం’ చిత్రాల్లో నటించగా పి.శ్రీధర్‌ దర్శకత్వం వహించిన ‘ఇవన్‌ అవనేతన్‌’, ఎ.వి.యం వారు నిర్మించిన ‘కళత్తూర్‌ కణ్ణమ్మ’ అనే రెండు తమిళ సినిమాల్లో నటించింది. ‘ఇవన్‌ అవనేతన్‌’ సినిమా బాక్సాఫీస్‌ హిట్టయింది. కమలహాసన్‌ బాల నటుడుగా తెరంగేట్రం చేసిన ‘కళత్తూర్‌ కణ్ణమ్మ’లో దేవిక, సావిత్రి సరిసమాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని తొలుత దర్శకుడు తాతినేని ప్రకాశరావు సగం వరకు చిత్రీకరించినా, అభిప్రాయ భేదాలతో మెయ్యప్పన్‌ దర్శకుణ్ణి మార్చి, ప్రకాశరావు షూట్‌ చేసిన రీళ్లను తొలగించి, భీంసింగ్‌ చేత దర్శకత్వం చేయించడం ఇక్కడ గమనార్హం. ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయచిత్ర బహుమతి దక్కగా, సినిమా ఆడిన ప్రతిచోటా శత దినోత్సవం చేసుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘మావూరి అమ్మాయి’గా డబ్‌ చేశారు. ఇదే కథాంశంతో తరువాత 1969లో ఎ.వి.యం వారే ‘మూగనోము’ పేరుతో పునర్నిర్మించి విజయాన్ని అందుకున్నారు. తెలుగులో వచ్చిన ‘అన్నా చెల్లెలు’ చిత్రానికి విఠలాచార్య దర్శకత్వం వహించగా దేవికతోబాటు రమణమూర్తి, రాజనాల నటించారు. ‘మాంగల్యం’ చిత్రం ఎ.వి.యం వారు నిర్మించినదే. అందులో కాంతారావు సరసన దేవిక నటించింది. 1961-62 మధ్యకాలంలో దేవిక తమిళంలో ‘నాగనందిని’, ‘కానల్‌ నీర్‌’, ‘మల్లియం మంగళం’, ‘పంగాలిగళ్’, ‘ఆది పెరుక్కు’, ‘బలే పాండియ’, ‘సుమైతాంగి’, ‘బంధపాశం’ వంటి అనేక చిత్రాల్లో నటించింది. అందులో ‘కానల్‌ నీర్‌’ సినిమా తెలుగులో భానుమతి నిర్మించిన ‘బాటసారి’కి రీమేక్‌. దేవిక అదే పాత్రను రెండు సినిమాల్లోనూ పోషించడం విశేషం. అప్పుడే తెలుగులో ‘కన్నకొడుకు’ చిత్రంలో జగ్గయ్యతో నటించింది. సంగీత దర్శకుడు ఎస్‌.పి.కోదండపాణికి ఇదే తొలిచిత్రం కావడం విశేషం. డి.బి.నారాయణ నిర్మించిన ‘పెండ్లిపిలుపు’ చిత్రంలో ఎన్‌.టి.రామారావుకు హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం మే 5, 1961న విడుదల కాగా ఎన్టీఆర్‌ నటించిన మరోచిత్రం ‘సతీ సులోచన (ఇంద్రజిత్‌)’ కూడా అదేరోజు విడుదల కావడం తెలుగు సినీ చరిత్రలో మొదటిసారి జరిగింది. అలాగే వి.మధుసూదనరావు దర్శకత్వం వహించిన ‘టాక్సీరాముడు’ లో రామారావు సరసన, తరువాత బి.ఆర్‌.పంతులు తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి నిర్మించిన ‘గాలిమేడలు/గాలి గోపుర’ చిత్రంలో మరలా ఎన్టీఆర్‌ సరసన దేవిక నటించింది. ఈ రెండు సినిమాలు బాగా ఆడాయి.

* దేవికకు బ్రేక్‌ ఇచ్చిన శ్రీధర్‌ సినిమా..

ప్రముఖ దర్శక నిర్మాత, రచయిత సి.వి.శ్రీధర్‌ 1962లో ‘నెంజిల్‌ ఒర్‌ ఆలయం’ చిత్రాన్ని నిర్మించారు. కల్యాణ్‌ కుమార్, ముత్తురామన్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో దేవిక హీరోయిన్‌. తమిళంలో వచ్చిన ఒక గొప్ప ముక్కోణపు ప్రేమకథగా ఈ చిత్రానికి మంచి పేరొచ్చింది. ఇదే చిత్రాన్ని హిందీలో ‘దిల్‌ ఏక్‌ మందిర్‌’గా తెలుగులో ‘మనసే మందిరం’గా శ్రీధరే పునర్నిర్మించారు. హిందీలో దేవిక పాత్రను మీనాకుమారి పోషించగా, తెలుగులో సావిత్రి పోషించింది. హేమాహేమీలుగా పేరున్న ఈ నటీమణులందరిలోకి శ్రీధర్‌కు నచ్చిన తార దేవిక కావడం గమనార్హం. ఆమె ఇందులో అద్భుత నటన ప్రదర్శించింది. ‘నెంజిల్‌ ఒర్‌ ఆలయం’లో ‘సొన్నట్టు నీదానా’ (తెలుగులో ‘అన్నది నీవేనా’) అనే పాటలో నటన దేవికకు చాలామంచి పేరు తెచ్చిపెట్టింది. తరువాత ఇదే సినిమాను కన్నడ, మళయాళ భాషల్లో కూడా రీమేక్‌ చేశారు. ‘నెంజిల్‌ ఒర్‌ ఆలయం’లో అసలు సావిత్రే నటించాల్సింది. డేట్లు సర్దుబాటు కాకపోవడంతో ఆ పాత్ర దేవికను వరించింది. అదే దేవిక పాలిత అదృష్టంగా మారి ఆమెకు తమిళంలో మంచి పేరు సంపాదించి పెట్టింది. విశ్వనాథన్‌-రామమూర్తి అందించిన సంగీతం ఈ చిత్రానికి పెద్ద అసెట్‌. ఈ సినిమా 175 రోజులు ఏకబిగిని ఆడి శ్రీధర్‌కు మంచిపేరు తెచ్చిపెట్టింది. 58వ జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ చిత్రం ప్రశంసా పత్రాన్ని గెలుచుకోవడమే కాకుండా పారిస్‌లో జరిగిన కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శనకు నోచుకుంది.

* కేరళలోని కోవెళం బీచ్‌లో...
పి.ఎస్‌.వీరప్పన్‌ 1964లో కె.శంకర్‌ దర్శకత్వంలో ‘ఆండవన్‌ కట్టలై’ అనే చిత్రాన్ని నిర్మించారు. అందులో దేవిక శివాజీ గణేశన్‌కు జంటగా నటించింది (ఈ చిత్రాన్ని తరువాత ‘ప్రేమించి పెళ్ళిచేసుకో’ పేరుతో తెలుగులోకి డబ్‌ చేశారు). ఈ చిత్ర షూటింగ్‌ కోసం కేరళలోని కోవెళంకు చిత్ర బృందం వెళ్ళింది. అక్కడ బీచ్‌లో చిత్రీకరణ జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఆరోజు అమావాస్య కావడంతో సముద్రం అల్లకల్లోలంగా వుంది. అలలు నురగలు కక్కుతూ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అక్కడ వున్న కొండలను తాకుతున్న కెరటాల మధ్య దేవిక నటించాలి. ఆ కొండ బాగా ఎత్తులో వుంటుంది. అంతపైకి అలలు వచ్చి తాకుతాయని దర్శకుడు ఊహించలేదు. అంతలోనే తాటిచెట్టంత అల ఒకటి దేవిక నిలుచున్న కొండను తాకి ఆమెను సముద్రంలోకి ఈడ్చుకొనిపోయింది. అక్కడ సుడిగుండాలున్నాయి. గజ ఈతగాళ్లు దేవికను అనుసరించారు. కానీ ఇంతలోనే మరొక అల ఆమెను మళ్లీ కొండమీదికి నెట్టివేసింది. దాంతో ఆమె ఒంటినిండా సూదుల్లాంటి రాళ్ళు గుచ్చుకున్నాయి. మళ్లీ పెద్ద అలవచ్చి సముద్రంలోకి దేవికను లాక్కుపోతుండగా గజఈతగాళ్లు ఒడిసి పట్టుకొని ఆమెను రక్షించారు. తరువాత ఏమి జరిగిందో దేవికకు తెలియదు. అదృశ్యశక్తి ఏదో తనని కాపాడిందని దేవిక నమ్మేది. ఆ విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా ఆమె చాలా కలవరపడేది.

 


* మరిన్ని విశేషాలు...

తమిళంలో ‘ఆనంద జోతి’ వంటి చిత్రంలో ఎం.జి.రామచంద్రన్‌తో, ‘కర్ణన్‌’, ‘కులమగల్‌ రాధై’, ‘బలే పాండియ’, అన్బు కరంగళ్’, ‘ఆన్నై ఇల్లం’, ‘పావ మణిప్పు’, ‘నీలవాణమ్’ వంటి చిత్రాల్లో శివాజి గణేశన్‌తో, ‘సుమైతాంగి’ వంటి సినిమాలో జెమిని గణేశన్‌తో, అలనాటి ఇతర హీరోలతో తమిళంలో నటించి దేవిక మంచిపేరు తెచ్చుకుంది. శివాజీ గణేశన్‌తో ఆమె నటించిన చివరి సినిమా కణ్ణన్‌ నిర్మించిన ‘సత్యం’ (1976). ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ‘మహామంత్రి తుమ్మరుసు’లో అన్నపూర్ణాదేవిగా, బోళ్ల సుబ్బారావు నిర్మించిన ‘దేశద్రోహులు’, జెమినీ వారు నిర్మించిన ‘ఆడబ్రతుకు’, ఎ.కె.వేలన్‌ నిర్మించిన ‘మంగళసూత్రం’, మిద్దె జగన్నాథరావు నిర్మించిన ‘నిండుమనసులు’, యు.విశ్వేశ్వరరావు నిర్మించిన ‘కంచుకోట’, ’నిలువుదోపిడి’, చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వం వహించిన ‘భామావిజయం’, పుండరీకాక్షయ్య నిర్మించిన ‘శ్రీకృష్ణావతారం’, డి.వి.ఎస్‌.రాజు నిర్మించిన ‘రాజకోట రహస్యం’ ఎన్‌.ఎ.టి వారు నిర్మించిన ‘శ్రీకృష్ణ సత్య’ వంటి చిత్రాల్లో ఎన్‌.టి. రామారావుకు దేవిక జంటగా నటించింది. రామారావు-దేవికను మంచి హిట్‌ పెయిర్‌ అనేవారు. అందుకు కారణం వారిద్దరూ నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్‌ హిట్లు కావడమే. అక్కినేని నాగేశ్వరరావుతో మాత్రం దేవిక హీరోయిన్‌గా నటించలేదు. వదినగా మాత్రమే నటించింది. మలయాళంలో ఐదు చిత్రాల్లోనూ, హిందీలో నాలుగు చిత్రాల్లోనూ దేవిక నటించింది. మొత్తం మీద ఆమె 150 చిత్రాలకు పైగానే నటించింది. చారిత్రాత్మక చిత్రాలకు, పౌరాణిక చిత్రాలకు దేవిక సరైన నటి అని తమిళ నిర్మాతలు నమ్ముతారు. దేవదాస్‌ అనే వ్యక్తిని దేవిక 1972లో వివాహమాడింది. అనివార్య కారణాలతో 1990లో అతనితో విడాకులు పుచ్చుకుంది. ఆమెకు ‘కనక’ అనే కూతురు వుంది. ఆమె కూడా సినిమాలలో నటిస్తోంది. ‘కరగట్టక్కరన్‌’ సినిమాతో కనక తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. దేవిక చెన్నైలో 2 మే 2002న మరణించింది.

- ఆచారం షణ్ముఖాచారిCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.