ఇదీ దివ్య భారతీయం

భారతీయుల్ని దివ్య భారతీయులుగా చేసిన మహత్తర సౌందర్యం ఆమె సొంతం. ఒంటిమీదకు వయసు వసంతాలు వచ్చి యవ్వన వైభవానికి ఆకుపచ్చని సంతకంలా జయ పతాక ఎగరేసినా...ముఖంలో ఇంకా పసితనం వీడని అమాయకత్వం కూడా ఆమె సొంతమే. చిక్కనైన వెన్నెల చిర్నవ్వులు...నీలాల కళ్ల నిండుగా కలర్‌ ఫుల్‌ కలలు...వెండితెర మహా సామ్రాజ్యాన్ని ఏలమంటూ కన్ను కొడుతున్న కెమెరాలు... తెరంగేట్రం చేసీ చేయగానే కొంగట్టుకు తిరిగే విజయాలు...ఇవీ దివ్య భారతి గుర్తుకు రాగానే ప్రేక్షకుల గొంతులో పొలమారించే మధుర జ్ఞాపకాలు. ముగ్ధ మనోహర సౌందర్యమంటే ఇప్పటికీ గుర్తుకువచ్చే పేరు తనదే.1990 దశకంలో హిందీ, తెలుగు సినిమాలను ఏలిన అందాల తారక దివ్యభారతి. ఎన్నో కమర్షియల్‌గా విజయవంతమైన సినిమాలలో నటించి ఎంతో మందిని ప్రేక్షకులను సంపాదించుకొన్నారు దివ్యభారతి. అందం, అభినయంతో ఎక్కువ పారితోషకం అందుకునే హీరోయిన్‌గా కూడా ఎదిగారు. రంగుల ప్రపంచంలో వినోదంతో పాటు విషాదానికి కూడా ఆమె జీవితం ప్రబల నిదర్శనం. అంతలా వినోద ప్రపంచాన్ని ప్రభావితం చేసిన దివ్య భారతి  (ఏప్రిల్‌ 5, 1993) వర్థంతి.  ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ కోసం.

తొలిదశ

దివ్యభారతి బొంబాయి (ఇప్పుడు ముంబై)లో ఇన్షురన్స్‌ ఆఫీసర్‌గా పనిచేసే ఓం ప్రకాష్‌ భారతీ, ఆయన భార్య మీతా భారతీకి 1974 ఫిబ్రవరి 25న జన్మించారు. కునాల్‌ అనే సోదరుడు ఉన్నారు దివ్యభారతికి. అలాగే పూనమ్‌ అనే హాఫ్‌ సిస్టర్‌ కూడా ఉన్నారు. నటి కైనాథ్‌ అరోరా దివ్యభారతికి రెండవ కజిన్‌ అవుతారు. దివ్యభారతి హిందీ, ఇంగ్లీష్, మరాఠీ భాషలను అనర్గళంగా మాట్లాడేవారు. తొలిదశలో, బబ్లీగా ఉండేవారు దివ్యభారతి. దివ్యభారతి విద్యాభాస్యం ముంబైలోనే జరిగింది. యావరేజ్‌ స్టూడెంట్‌గా ఉండే దివ్యభారతి తొమ్మిదవ స్టాండర్డ్‌ తరువాత నటనలో కెరీర్‌ని మొదలుపెట్టారు.


తొమ్మిదో తరగతినుంచే సినీ అవకాశం

1988లో నందు తోలని అనే ఫిల్మ్‌ మేకర్‌ దివ్యభారతిని చూశారు. చూసిన తరువాత, తాను చేస్తోన్న ఒక సినిమాకి సంతకం చేయమని దివ్యభారతిని అడిగారు. అప్పుడు దివ్యభారతి తొమ్మిదవ తరగతి చదువుతున్నారు. వాస్తవానికి, దివ్యభారతి ‘గుణాహో కా దేవతా’ ద్వారా తెరంగేట్రం చేయాల్సి ఉంది. కానీ, ఆమె పాత్రని క్యాన్సిల్‌ చేశారు. ఆ తరువాత కీర్తి కుమార్‌ ఓ వీడియో లైబ్రరీ ద్వారా దివ్యభారతిని చూసి ఆయన 1992నాటి ‘రాధా కా సంగం’ ప్రాజెక్టులో గోవిందాకు జోడీగా ఆమెను నటింపజేయాలని భావించారు. ఆ సినిమా కోసం దివ్యభారతి నాట్య, నటనలకు శిక్షణ పొందారు కూడా. అయితే, ఆ సినిమాలో ఆ తరువాత దివ్యభారతి చేయాల్సిన పాత్రలో జూహీ చావ్లా నటించింది. కారణాలు తెలియకపోయినా... దివ్యభారతి చిన్నపిల్లల స్వభావం వలన ఈ సినిమా నుంచి ఆమెను తొలిగించారని చాలా మంది భావించారు.


బొబ్బిలి రాణి

తెలుగు సినిమా నిర్మాత డి.రామానాయుడు ‘బొబ్బిలి రాజా’ సినిమాలో అవకాశం ఇచ్చే వరకు దివ్యభారతి కెరీర్‌ నిలిచిపోయిందనే చెప్పాలి. వెంకటేష్, దివ్యభారతి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 1990 విడుదలై, విజయం అందుకొంది. ఇప్పటికీ ‘బొబ్బిలి రాజా’ సినిమా ఓ పాపులర్‌ తెలుగు సినిమాగా నిలిచింది. అదే సంవత్సరం దివ్యభారతి ఓ తమిళ సినిమాలో హీరో ఆనంద్‌కు జోడీగా నటించారు. అయితే, ఈ సినిమా విమర్శనాత్మకంగా, కమర్షియల్‌గా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు.

టాలీవుడ్‌లో వరుస విజయాలు

తెలుగు పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన సినిమాలు ఉన్నాయి దివ్యభారతికి. దాంతో, తెలుగు పరిశ్రమలో ఎంతో పాపులర్‌ నటిగా గుర్తింపు పొందారు. బాక్సాఫీసు రేటింగ్స్‌ పరంగా విజయశాంతి తరువాత దివ్యభారతికే ఎక్కువ రేటింగ్స్‌ వచ్చాయి. 1991లో ‘రౌడీ అల్లుడు’, ‘అసెంబ్లీ రౌడీ’ సినిమాలతో వరుస విజయాలను అందుకొన్నారు దివ్యభారతి. ఆ సంవత్సరంలోనే ఎ.కోదండరామి రెడ్డి యాక్షన్‌ సినిమా ‘ధర్మ క్షేత్రం’ సినిమా షూటింగ్‌లో పాల్గొనడం మొదలు పెట్టారు దివ్యభారతి. ఆ సినిమా ద్వారా తెలుగు నటుడు నందమూరి బాలకృష్ణ సరసన నటించే అవకాశం సొంతం చేసుకోగలిగారు దివ్యభారతి.

‘విశ్వాత్మ’తో బాలీవుడ్‌ ఎంట్రీ

తెలుగు సినిమాలతో వరుసగా అవకాశాలను అందుకుంటూ వస్తోన్న సమయంలో బాలీవుడ్‌లో నటించే అవకాశం వచ్చింది దివ్యభారతికి. బాలీవుడ్‌ దర్శకులు తెలుగులో స్టార్‌ స్టేటస్‌తో ఓ వెలుగు వెలుగుతోన్న దివ్యభారతితో ఓ సినిమా తీయాలని భావించారు. దివ్యభారతి మొదటి హిందీ సినిమా ‘విశ్వాత్మ’. ఇందులో సన్నీ డియోల్‌తో కలిసి నటించారు దివ్యభారతి. రాజీవ్‌ రాయ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1992 జనవరి 2న విడుదల అయింది. సూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ద్వారా దివ్యభారతికి విమర్శకుల నుంచి అలాగే ప్రేక్షకుల నుంచి ఎంతో గుర్తింపు లభించింది. ఈ సినిమా సంగీతపరంగా కూడా ఎంతో విజయవంతమైంది. ఆ విధంగా దివ్యభారతి బాలీవుడ్‌లో బాగా గుర్తింపు పొందారు.


వెనువెంటనే దివ్యభారతి నటించిన ‘దిల్‌ కా క్యా కసూర్‌’ అనే మరో సినిమా విడుదల అయింది. బాక్సాఫీసు వద్ద అనుకున్నంత స్థాయిలో విజయవంతం కానప్పటికీ సంగీత పరంగా ఈ సినిమా ఎంతో గుర్తింపు సంపాదించుకొంది.


1992 మార్చిలో, డేవిడ్‌ ధావన్‌ దర్శకత్వం వహించిన ‘షోలా ఔర్‌ షబ్నమ్‌’ సినిమా విడుదల అయింది. విమర్శకులు కూడా ఈ సినిమాని ప్రశంసించారు. అలాగే ఇది బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకొంది. ఈ సినిమాతో బాలీవుడ్‌లో తొలి పెద్ద హిట్టుని అందుకొన్నారు దివ్యభారతి. నటుడు గోవిందా కెరీర్‌కు కూడా ఈ సినిమా ఎంతో పెద్ద ఊపు ఇచ్చిందని చెప్పవచ్చు. అలాగే డేవిడ్‌ ధావన్‌ కూడా ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్‌గా స్థిరపడ్డారు.

‘దీవానా’తో సూపర్‌ హిట్‌ స్టార్డమ్‌

రాజ్‌ కాన్వార్‌ దర్శకత్వం వహించిన ‘దీవానా’ సినిమాతో మరో విజయం తన ఖాతాలో వేసుకొన్నారు దివ్యభారతి. ‘దీవానా’లో పెర్ఫార్మన్స్‌ పరంగా దివ్యభారతికి ఎన్నో ప్రశంసలు దక్కాయి. 1992 జులై నాటికల్లా ‘దీవానా’ సినిమాలోని నటన పరంగా ఎంతో గుర్తింపును సంపాదించుకొన్నారు దివ్యభారతి. ఆ సంవత్సరం దివ్యభారతి నటించిన ఎన్నో హిందీ సినిమాలు విడుదల అయ్యాయి. వాటిలో ‘జాన్‌ సే ప్యారా’ సినిమా కూడా ఉంది. ఈ చిత్రంలో మళ్ళీ గోవిందా సరసన నటించారు దివ్యభారతి. అలాగే ‘గీత్‌’లో అవినాష్, ‘దుష్మన్‌ జమానా’లో అర్మాన్‌ కోహ్లీ, ‘బల్వాన్‌’లో సునీల్‌ శెట్టికి జోడీగా నటించారు దివ్యభారతి. ఆ తరువాత హేమా మాలిని దర్శకత్వం వహించి, నిర్మించిన ‘దిల్‌ ఆష్నా హై’ సినిమాలో మరొకసారి షారుఖ్‌ ఖాన్‌ సరసన నటించారు దివ్యభారతి. అయితే, ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పెద్దగా విజయం సాధించలేదు. అయితే, తన కన్నతల్లిని కనుక్కోవాలని తాపత్రయపడే ఓ బార్‌ డాన్సర్‌ పాత్రలో దివ్యభారతి నటన బాగుందంటూ ప్రశంసలు మాత్రం వచ్చాయి. తెలుగు ప్రేక్షకులని నిరుత్సాహపరచకూడదన్న ఉద్దేశంతో తెలుగులోనూ ఏడాదికి ఒక్క సినిమా చేయాలని నిర్ణయించుకొన్నారు దివ్యభారతి. అలా ‘చిట్టమ్మ మొగుడు’ సినిమాలో నటించారు. ఇది 1992 చివరి నాటికీ రిలీజ్‌ అయింది. ఇందులో మరొకసారి మోహన్‌ బాబు సరసన నటించారు దివ్యభారతి. ‘క్షత్రియ’ సినిమాలో సన్నీ డియోల్, సంజయ్‌ దత్, రవీనా టాండన్‌లతో కలిసి స్కీన్ర్‌ షేర్‌ చేసుకొన్నారు దివ్యభారతి.

అకాల మరణం - సినిమాలపై ప్రభావం

దివ్యభారతి 1993 ఏప్రిల్‌ 5న చనిపోయారు. ఆమె అకస్మిక మరణం కారణంగా ఎన్నో సినిమాలు పూర్తి కాకుండా మధ్యలోనే ఆగిపోయాయి. చనిపోయేటప్పుడు ‘లాడ్లా’ సినిమా ఎక్కువ భాగం షూటింగ్‌ దివ్యభారతితోనే జరిగింది. కానీ హఠాత్తుగా దివ్యభారతి మరణించడంతో శ్రీదేవితో సినిమాని మళ్లీ తెరకెక్కించారు. అలాగే దివ్యభారతి పూర్తి చేయాల్సిన ‘మొహ్రా’, ‘కర్తవ్య’, ‘విజయ్‌ పథ్‌’, ‘దిల్వాలే’, ‘ఆందోళన్‌’ సినిమాలను కూడా వేరే హీరోయిన్లతో పూర్తి చేశారు చిత్ర సభ్యులు. దివ్యభారతి షూటింగ్‌ మొదలుపెట్టనటువంటి అక్షయ్‌ కుమార్‌ ‘పరిణామ్‌’, సల్మాన్‌ ఖాన్‌ ‘దో కదం’, రిషి కపూర్‌ ‘కన్యాదాన్‌’, సన్నీ డియోల్‌ ‘బజ్రంగ్‌’ తదితర సినిమాలు తరువాత రద్దయ్యాయి. చనిపోయేముందు, ‘రంగ్‌’, ‘షత్రంజ్‌’ సినిమాలను పూర్తి చేశారు. ఈ సినిమాలు ఆమె చనిపోయిన తరువాత విడుదల అయ్యాయి. ఇవి మోస్తరు విజయాన్ని అందుకున్నాయి.


‘తొలి ముదు’్దలో కొన్ని సన్నివేశాల్లో రంభ

తెలుగులో దివ్యభారతి చనిపోయే ముందు చేస్తోన్న సినిమా పేరు ‘తొలి ముద్దు’. దివ్యభారతి మరణానంతరం ఆమెను పోలిన నటి రంభతో ఈ సినిమాని పూర్తిచేశారు. అలా ఈ సినిమా 1993 అక్టోబర్‌లో విడుదల అయింది. ‘అల్లరి ప్రేమికుడు’ సినిమాలోనూ భవాని పాత్రలో దివ్యభారతి నటించాల్సి ఉంది. అయితే, ఆమె హఠాత్తు మరణంతో ఆ పాత్రలో మళ్ళీ రంభనే నటించారు. బాలీవుడ్‌ లెజెండ్‌ దేవ్‌ ఆనంద్‌ ‘ఛార్జ్‌ షీట్‌’ పేరుతో ఓ సినిమాని తెరకెక్కించారు. దివ్యభారతి మరణం, ఆమె మరణం చుట్టూ ఉన్న మిస్టరీపై తెరకెక్కిందట. ఇది 2011 సెప్టెంబర్‌ 30న రిలీజ్‌ అయింది.

వ్యక్తిగత జీవితం

‘షోలా ఔర్‌ షబ్నమ్‌’ సినిమాకు వర్క్‌ చేస్తున్న సమయంలో దర్శకుడు - నిర్మాత సాజిద్‌ నడియాద్వాలను కలిశారు దివ్యభారతి. వీరి వివాహం 1992 మే 10న జరిగింది. దివ్య, సాజీద్‌ ఒక ప్రైవేటు వేడుకలో వివాహం చేసుకొన్నారు. దివ్యభారతి హెయిర్‌ డ్రెస్సేర్‌ అలాగే స్నేహితురాలు సంధ్య, ఆమె భర్త సమక్షంలో వివాహం అయింది. ముంబైలో ఉన్న సాజిద్‌ నడియాద్వాలాకు చెందిన తులసి బిల్డింగ్స్‌ సమీక్షంలో ఈ వివాహం జరిగింది. వివాహం అనంతరం, ఇస్లాం మతంలోకి మారిపోయారు దివ్యభారతి. సనా నడియాద్వాలాగ తన పేరు మార్చుకొన్నారు.


మృత్యువు ఎలా సంభవించింది?

1993 ఏప్రిల్‌ 5న సాయంత్రపు సమయంలో, దివ్యభారతి తాను నివాసముంటున్న ముంబైలోని తులసి బిల్డింగ్స్‌ ఐదవ అంతస్తు బాల్కనీ కిటికీ నుంచి కింద పడిపోయారు. అతిథులు నీతా లుల్లా, ఆమె భర్త శ్యామ్, దివ్యభారతి ఇంటి పనిమనిషి అమృత, అలాగే పక్కవాళ్ళు ఏమి జరిగిందో తెలుసుకున్నప్పుడు, ఆమెను అంబులెన్స్‌లో కూపర్‌ హాస్పిటల్‌లోని అత్యవసర విభాగానికి తరలించారు, అప్పటికే ఆమె నుంచి విపరీతమైన రక్తపు వచ్చింది. తలకు తీవ్రమైన గాయాలు, అంతర్గత రక్తస్రావం ఆమె మరణానికి ఇమ్మీడియేట్‌ కాజ్‌ అని పేర్కొన్నారు. దివ్యభారతి మృతిపై ఇన్వెస్టిగేషన్‌ 1998లో ముంబై పోలీసులు క్లోజ్‌ చేశారు. ప్రమాదవశాత్తు మరణంగా దివ్యభారతి మరణం గురించి తేల్చారు. దివ్యభారతి లేకపోవడం నిజంగా బాలీవుడ్‌కు పెద్ద లోటనే చెప్పవచ్చు. ఆమెతో పనిచేసిన దర్శక, నిర్మాతలు, ‘దివ్యభారతి బ్రతికుంటే శ్రీదేవి, మాధురి దీక్షిత్‌ల తరువాత విజయవంతమైన హీరోయిన్ల జాబితాలో ఆమె ఖచ్చితంగా ఉండేది’ అని చెప్పారు.

పురస్కారాలు

‘దీవానా’ సినిమాకు ఫిలింఫేర్‌ అవార్డ్‌ ఫర్‌ లక్స్‌ న్యూ ఫేస్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారం అందుకొన్నారు దివ్యభారతి.

- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌ Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.