వినోదంలో కొత్త ఒరవడి

వినోదంలో ఓ ఠీవి జంధ్యాల తర్వాత ఆ స్థాయి హాస్యంతో ఇంటిల్లిపాదినీ మెప్పించేలా చిత్రాలు తీసిన దర్శకుడు ఈదర వీర వెంకట సత్యనారాయణ. ఈవీవీగా పేరుగాంచిన ఈయన తెలుగు చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు. జంధ్యాల శిష్యుడైన ఈవీవీ ‘చెవిలోపువ్వు’తో దర్శకుడిగా మారారు. ఆ సినిమా విజయవంతం కాలేదు. కానీ ఆయన ప్రతిభని గుర్తించిన నిర్మాత డి.రామానాయుడు తన సంస్థలో ‘ప్రేమఖైదీ’ తీసే అవకాశాన్నిచ్చారు. ఆ చిత్రం విజయవంతం కావడంతో ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు ఈవీవీ. ‘అప్పుల అప్పారావు’, ‘సీతారత్నంగారి అబ్బాయి’, ‘420’, ‘జంబలకిడిపంబ’, ‘ఏవండీ ఆవిడ వచ్చింది’, ‘వారసుడు’, ‘ఆ ఒక్కటీ అడక్కు’, ‘అబ్బాయిగారు’, ‘అలీబాబా అరడజను దొంగలు’, ‘హలో బ్రదర్‌’, ‘మగరాయుడు’, ‘ఆమె’, ‘అల్లుడా మజాకా’ ఇలా వరుసగా విజయాలే. 20 యేళ్ల వ్యవధిలో 51 చిత్రాలు తీశారు. అగ్ర కథానాయకులతో పాటు.. యువతరంతోనూ సినిమాలు తీస్తూ ఇంటిల్లిపాదినీ థియేటర్‌కి రప్పించిన ఘనత ఆయనది. పశ్చిమ గోదావరి జిల్లా దొమ్మేరులో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన (జూన్‌ 10, 1956) ఆయన చిన్నప్పుడే సినిమాలపై మక్కువ పెంచుకొన్నారు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో మద్రాసు వెళ్లి ‘ఓ ఇంటి భాగోతం’ చిత్రానికి సహాయ దర్శకుడిగా సినీ జీవితాన్ని ఆరంభించారు. ఈవీవీకి ఇద్దరు తనయులు. ఒకరు ఆర్యన్‌ రాజేష్, మరొకరు అల్లరి నరేష్‌. ఇద్దరూ కథానాయకులే. అయితే ఆర్యన్‌ రాజేష్‌ కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటుండగా, అల్లరి నరేష్‌ మాత్రం తన జోరును ప్రదర్శిస్తున్నార
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.