చిత్రకళకు వన్నెతెచ్చిన ఈశ్వర్‌
నడిరోడ్డు మీద జన వాహనాలని హటాత్తుగా ఆపించి, తలెత్తించి పోస్టర్లకేసి చూస్తూ నిలబెట్టించి, ఆ జనవాహినిని సినిమాహాలు క్యూలో నిలబడేలాచేసి, వేలాది సినిమాలను వంద రోజులదాకా నడిపించి, కళని పోస్టర్‌ పోట్రెయిట్‌ స్థాయికి పెంచి చూపిన ‘కళా మాంత్రికుడు’... ప్రకటనా చిత్రకళలో గురుస్థానాధిష్టుడు అని బాపు, రమణల ప్రశంసలు అందుకున్న ఈశ్వర్‌ అనబడే కొసనా ఈశ్వరరావు. వివిధ భాషల సినిమాలకు పబ్లిసిటీ డిజైన్లు రూపొందించిన అపర ‘రాజా రవివర్మ’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలకు ప్రచార డిజైన్లు రూపొందించిన ఈశ్వర్‌ ఓ మంచి రచయిత కూడా. 2011లో ఉత్తమ సినిమా గ్రంధ రచనకు ఈశ్వర్‌ రచించిన ‘సినిమా పోస్టర్‌’కు నంది బహుమతి లభించింది. పోస్టర్‌ ఆర్ట్‌ రంగంలోను, పబ్లిసిటీ ప్రక్రియలోను సాంకేతికతను అందిపుచ్చుకొని కళావిశ్వరూపాన్ని ఆవిష్కరించిన దక్షుడు ఈశ్వర్‌. క్రమశిక్షణతో కూడిన జీవితం, కఠోర పరిశ్రమతో యాభై సంవత్సరాలుగా పైగా రెండు వేల పైచిలుకు సినిమాలకు కళాఖండాలను సమకూర్చి పబ్లిసిటీ రంగంలో వేలెత్తి చూపని వ్యక్తిగా వ్యక్తిత్వాన్ని నిలుపుకున్న ఈశ్వర్‌ తెలుగు సినిమాకు చేస్తున్న సేవలను గుర్తిస్తూ ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం 2015 సంవత్సరానికి జీవిత సాఫల్య పురస్కారంగా ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డును ప్రకటించింది. ఈశ్వర్‌ (ఫిబ్రవరి 1న ) పుట్టినరోజు సందర్భంగా ఆ ప్రతిభావంతుని కళా ప్రస్థానం గురించి కొన్ని విశేషాలు సితార.నెట్‌ పాఠకుల కోసం...


రఘుపతి వెంకయ్య పురస్కారం
జాతీయ స్థాయిలో సినిమా రంగానికి సంబంధించిన అత్యుత్తమ అవార్డుగా దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం గుర్తింపు పొందినట్లే, తెలుగు సినిమా రంగానికి అత్యుత్తమ సేవలు అందించిన వారికి అందించే ప్రతిష్టాత్మక జీవిత సాఫల్య పురస్కారం రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు. తెలుగు సినిమా పితామహుడుగా రఘుపతి వెంకయ్య నాయుడుని గౌరవిస్తున్నాం. బొమ్మలు గీస్తూ, శిల్పాలు చెక్కుతూ జీవనం సాగించిన వెంకయ్య క్రమంగా ఫొటోగ్రఫీ వైపు మళ్లి, 1909 లోనే క్రోనో మెగా ఫోను సాయంతో పన్నెండు లఘు చిత్రాలు నిర్మించి శ్రీలంక, రంగూన్‌ వంటి దేశాల్లో ప్రదర్శించి సినీ పరిశ్రమ స్థాపనకు కృషి చేశారు. మద్రాసులో గెయిటీ టాకీస్, క్రౌన్‌ థియేటర్, గ్లోబ్‌ థియేటర్లను నిర్మించి అనేక అమెరికన్, బ్రిటిష్‌ మూకీ చిత్రాలను ప్రదర్శించి సినిమా వ్యాసంగాన్ని ప్రజలకు రుచి చూపించారు. గ్లాస్‌ స్టూడియో నిర్మించి, 1919 లోనే స్టార్‌ ఆఫ్‌ ఈస్ట్‌ ఫిలిమ్స్‌ అనే కంపెనీ స్థాపించి ‘మీనాక్షి కల్యాణం’, ‘గజేంద్ర మోక్షం’, ‘మత్స్యావతారం’, ‘నందనార్‌’, ‘భీష్మ ప్రతిజ్ఞ’ వంటి మూకీ సినిమాలు నిర్మించి ప్రదర్శించారు. వెంకయ్య సేవలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుర్తిస్తూ 1981లో ‘రఘుపతి వెంకయ్య అవార్డ్‌’ను ప్రవేశపెట్టింది. ఈ బహుమతి క్రింద యాభై వేల నగదు, స్వర్ణ నంది ప్రతిమ, బంగారు పతకంతో బాటు ప్రశంసా పత్రం అందజేస్తారు. సినిమా నిర్మాతలు, దర్శకులు, నటీనటులు ఎక్కువగా ఈ పురస్కారాలు అందుకున్నారు. కానీ, సాంకేతిక నిపుణులలో ఇంతవరకు ఛాయాగ్రాహకుడు యం.ఎ.రహమాన్‌ (1983) మాత్రమే ఈ పురస్కారాన్ని అందుకున్నారు. పబ్లిసిటీ డిజైనర్‌ ఈశ్వర్‌ ఈ సత్కారాన్ని అందుకున్న రెండవ సాంకేతిక నిపుణుడు కావడం విశేషం.


చెన్నపట్నం చేరాలని....

ఈశ్వర్‌ పుట్టింది (ఫిబ్రవరి 1) పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో. వారి పూర్వీకులు దేవాలయ వాహనాలు, ఉత్సవ విగ్రహాలు చేసేవారు. వంశ పారంపర్యంగా ఎవరూ నేర్పకుండానే ఈశ్వర్‌కు బొమ్మలు గీయడం అలవడింది. స్వాతంత్య్ర వేడుకల్లో గాంధీజీ బొమ్మను వేసి అందరి మన్నన పొందారు. స్కూలు వార్షికోత్సవాల్లో నాటకాలు వేశారు. ఆ ఊళ్లో వున్న సినిమా హాలు ముందు తగిలించిన పెద్దపెద్ద వాల్‌ పోస్టర్లను తదేకంగా గమనించేవారు. పత్రికల్లో వచ్చే సినిమా ప్రచార చిత్రాలను ముందుపెట్టుకుని అలాగే బొమ్మలు గీసి షో కార్డులను తయారు చేసేవారు. వాటిని సినిమా హాలు వద్ద ప్రదర్శనకు ఉంచితే అందరూ మెచ్చుకునేవారు. సొంతంగా నాటకాలు రాసి ఆడేవారు. వారి కుటుంబం ఆర్ధికంగా వెనకపడడంతో, కలంకారి పెయింటింగ్‌లు వేసి వచ్చిన డబ్బుతో స్కూలు ఫైనల్‌ చదువు పూర్తిచేశారు. కాకినాడ పాలిటెక్నిక్‌ కళాశాలలో చేరి అనివార్య కారణాల వలన చదువును మధ్యలోనే ఆపేశారు. ‘చెడి చెన్నపట్నం చేరుకో’ అన్న సామెతను గుర్తుచేసుకుంటూ ఒక స్నేహితుని సాయంతో మద్రాసు చేరుకున్నారు. పబ్లిసిటీ ఆర్టిస్టుగా స్థిరపడాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజుల్లో టీవీయస్‌ శర్మ, కాకుమాను నాగేశ్వరరావు ఇద్దరూ అటు కళాదర్శకత్వ శాఖను, ఇటు పబ్లిసిటీని కూడా నిర్వహిస్తూ వుండేవారు. వారివద్ద పనిచేసిన కేతా, రామదాసు బయటకు వచ్చి సొంతంగా పోస్టర్ల తయారీ మొదలెట్టారు. కేతా వద్ద సత్యనారాయణ, రామారావు, గంగాధరం అనే ముగ్గురు అసిస్టెంటులు వుండేవారు. వాళ్లు కూడా బయటకు వచ్చి తమ మొదటి అక్షరాల సమాగమంతో ‘స్టూడియో సరాగం’ అనే సంస్థను తెరిచి పబ్లిసిటీ రంగంలో ఒక విప్లవం సృష్టించారు. ఈశ్వర్‌ వారి వద్దకు వెళితే పని దొరికింది. కానీ, సంపాదన లేదు. తరువాత సోము అనే మరో ఆర్టిస్టు వద్ద చేరి డిటెక్టివ్‌ నవలలకు ముఖ చిత్రాలు వెయ్యడం ప్రారంభించారు. ఆర్టిస్ట్‌ కేతా వద్ద చేరి పోస్టరు డిజైనింగ్‌లో మెళకువలు నేర్చుకున్నారు ఈశ్వర్‌.


సొంతంగా... శ్రీకారం
విభేదాలతో సరాగం నుంచి బయటకొచ్చిన గంగాధరం కేతా వద్దకు వెళ్లి ఈశ్వర్‌ను తనతో పంపితే సొంతంగా పబ్లిసిటీ డిజైన్లు చేసుకుంటానని అర్ధించారు. కానీ కేతా మాత్రం ఈశ్వర్‌ను ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. దాంతో కేతా తనమీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయరాదని భావించి ఎంతో కష్టపడి కొత్తదనం కోసం పుస్తకాలు, హిందీ పోస్టర్లూ పరిశీలిస్తూ తన విద్యకు మెరుగు దిద్దుకోవడం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో పోస్టర్ల కోసం ఆఫ్‌సెట్‌ ముద్రణ అమలులోకి రాలేదు. ఫిలిం ఇండియా మ్యాగజైన్‌లో మోహన్, ఫెయిజ్‌లు వేసే లైన్‌ డ్రాయింగ్‌ పద్ధతిని అనుసరిస్తూ పోస్టర్లకి వినూత్న సోయగం తీసుకురావడంతో కేతా ఎంతో ఆనందించేవారు. ‘మహామంత్రి తిమ్మరుసు’, ‘అమరశిల్పి జక్కన్న’, ‘పాండవ వనవాసము’, ‘వసంత సేన’ వంటి సినిమాలకు ఈశ్వర్‌ ఈ నూతన టెక్నిక్‌ వాడి పోస్లర్లకు కొత్తరూపు ఇవ్వడంతో స్టూడియో కేతా అంటే మంచి డిమాండు పెరిగింది. ఈశ్వర్‌ బాగా ఇష్టపడే దివాకర్‌ శైలిని అనుకరిస్తూ హిందీ హీరో రాజ్‌కుమార్‌ సినిమాకు కొత్త తరహా పెయింట్‌ చేసిన ఈశ్వర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. తరువాత అక్షరశిల్పిగా పేరుగాంచిన ఈశ్వర్‌ తమ్ముడు బ్రహ్మం కూడా కేతా వద్ద చేరాడు. నటుడు పెరుమాళ్లు చొరవతో వరలక్ష్మితో ఈశ్వర్‌కు వివాహం జరిగింది. తరువాత తమ్ముడుతో కలిసి కెమెరామన్‌ జానకీరాం సాయంతో జయ యాడ్స్‌ పేరుతో కొన్ని కన్నడ సినిమాలకు సొంతంగా పబ్లిసిటీ డిజైన్లు రూపొందించడం మొదలెట్టారు. ఆ తరువాత శ్రీనివాసరెడ్డి వీధిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని, ‘ఈశ్వర్‌’ పేరుతో సొంత పబ్లిసిటీ కంపెనీకి శ్రీకారం చుట్టారు.


బాపు సాక్షితో తె(వె)లుగులోకి

స్టిల్‌ ఫోటోగ్రాఫర్‌ భూషణ్, ఈశ్వర్‌కు మంచి స్నేహితుడు. అప్పుడే బాపు - రమణలు ప్రయోగాత్మకంగా ‘సాక్షి’ సినిమాను పూర్తి అవుట్‌ డోర్‌లో నిర్మిస్తున్నారు. ఆ సినిమాకు భూషణ్‌ స్టిల్‌ ఫోటోగ్రాఫరే కాకుండా అందులో ఒక ముఖ్యపాత్రను కూడా పోషించాడు. భూషణ్‌ ఈశ్వర్‌ను బాపుకు పరిచయం చేశాడు. బాపు తనపై ఉంచిన నమ్మకాన్ని ఈశ్వర్‌ వమ్ము చెయ్యలేదు. సాక్షి కలర్‌ పోస్టర్లు, లోగో అద్భుతంగా అమరాయి. అవి చూసిన విజయా విశ్వనాథ రెడ్డి హిందీలో నిర్మిస్తున్న ‘రామ్‌ అవుర్‌ శ్యామ్‌’ చిత్రానికి పబ్లిసిటీ పనులు ఈశ్వర్‌కు అప్పగించారు. వాటర్‌ కలర్స్‌లో రూపొందించిన పోస్టర్లు ఆయిల్‌ పెయింట్‌ పోస్టర్లకన్నా బాగున్నాయని నాగిరెడ్డి ప్రశంసించారు. వాటిని చూసిన రామానాయుడు ‘పాప కోసం’ సినిమాలో ఈశ్వర్‌కు అవకాశం ఇస్తే, బ్రష్‌ వాడకుండా నైఫ్‌ వర్క్‌ చేసి వాల్‌ పోస్టర్లు రూపొందించారు. హిందీ, తమిళ వర్షన్లకు కూడా అదే రకం పోస్టర్లు రూపొందించడంతో ఈశ్వర్‌ పనితనానికి మంచి ప్రాచుర్యం లభించింది. అంతే కాదు ఆ సినిమాకన్నా పోస్టర్లకే ఎక్కువ క్రెడిట్‌ వచ్చింది. అప్పటి నుంచి ప్రతి పేపర్‌ డిజైన్‌లో ఒక లైన్‌ డ్రాయింగ్‌ ఉండేలా పోస్టర్లకు కొత్తదనం తీసుకొచ్చారు. తెలుగు, తమిళ హిందీ ‘ప్రేమనగర్‌’ సినిమా పోస్టర్లు ఈశ్వర్‌ వినూత్న సృష్టికి నిదర్శనం అని చెప్పడంలో సందేహం లేదు. ‘మనుషులు మారాలి’, ‘సమాజ్‌ కో బదల్‌ డా’లో సినిమా పోస్టర్లు వేటికవే వినూత్నం. అణ్ణాదురై తైలవర్ణ చిత్రం తయారు చేయ్యమని నాటి ముఖ్యమంత్రి కరుణానిధి ఈశ్వర్‌ ఇంటికి రావడం కన్నా విశేషం ఏం కావాలి? 1970 దీపావళి పండుగకు ఆరు తమిళ సినిమాలు విడుదలయ్యాయి. ఆ సినిమాలు అన్నిటికీ పబ్లిసిటీ డిజైన్లు రుపొందించింది ఈశ్వరే. ఆ రోజుల్లో యమ్జీఆర్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, జయశంకర్, రవిచంద్రన్, శివకుమార్‌ వంటి అగ్రశ్రేణి హీరోల సినిమాలకు పబ్లిసిటీ డిజైన్లు రూపొందించే అవకాశం దక్కింది కూడా ఒక్క ఈశ్వర్‌కే. సౌత్‌ ఇండియన్‌ పబ్లిసిటీ డిజైనర్స్‌ సంఘానికి ఈశ్వర్‌ పదేళ్లు అధ్యక్షులుగా ఉన్నారు. స్వల్ప వ్యవధిలో అధిక సంఖ్యలో చిత్రాలకు పబ్లిసిటీ చేసినందుకు లక్ష్మి ఫిలిమ్స్‌ వారు విజయవాడలో అక్కినేని నాగేశ్వరరావు సమక్షంలో ఈశ్వర్‌ను సత్కరించారు. నమ్మినవాళ్ళు తన ఆస్తుల్ని తాకట్టు పెట్టించి ఇబ్బంది పెట్టినా వారిని దయాగుణంతో క్షమించి వదలిన ఉత్తమ వ్యక్తిత్వం ఈశ్వర్‌ది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈశ్వర్‌ చేత బాలాజీ నేత్రదర్శనం, అర్చనానంతర దర్శనం, పూలంగి సేవాదర్శనం చిత్రాలను వేయించి వాటిని క్యాలండర్లుగా ప్రచురించారు. అందుకోసం ఈశ్వర్‌ ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల దాకా స్వామివారి గర్భగుడికి ఎదురుగా కూర్చుని స్కెచ్‌లు గీశారు. అంతటి అదృష్టం ఎవరికి వస్తుంది? అంతేకాదు 2600 సినిమాలకు పబ్లిసిటీ డిజైన్లు అందించారంటే ఈశ్వర ప్రతిభ వర్ణించతరమా!


మనసులో మాట
1967లో బాపు - రమణల ‘సాక్షి’ సినిమాతో ప్రారంభమైన ఈశ్వర్‌ సినీ ప్రస్థానం 2000లో విడుదలైన ‘దేవుళ్లు’ సినిమాతో ముగింపు పలికిందని చెప్పవచ్చు. 2600 సినిమాలకు పబ్లిసిటీ ఆర్టిస్టుగా ఈశ్వర్‌ డిజైన్లు రూపొందిండం ఒక ప్రపంచ రికార్డు. సరైన పబ్లిసిటీ లేక కొన్ని మంచి సినిమాలు దెబ్బతిన్న సంఘటనలున్నాయని, ఆకర్షణీయమైన పబ్లిసిటీతో యావరేజిగా వున్న మరికొన్ని సినిమాలు విజయం సాధించిన సంఘటనలు కూడా లేకపోలేదని ఈశ్వర్‌ చెబుతుంటారు. సినిమాకి పబ్లిసిటీ ప్రాణం. కళకు జీవం తప్ప భాషతో పనిలేదు అనే సిద్ధాంతాన్ని నమ్ముతారు ఈశ్వర్‌. సినీ పరిశ్రమ దూరం చేయకున్నా, అరవైయేళ్ల కళాప్రస్థానం విజయవంతంగా పూర్తి చేశాక కావాలనే ఈశ్వర్‌ పబ్లిసిటీ రంగానికి దూరంగా వున్నారు. డిజిటల్‌ కంప్యూటర్‌ టెక్నాలజీ ఒక ఉప్పెనలా సినీ రంగాన్ని ఆక్రమించాక తనది మరలా విద్యార్థిÄ దశను అందుకుంటుందని భావించడం కూడా అందుకు కారణం కావచ్చు. తనకు లభించిన రఘుపతి వెంకయ్య పురస్కారంతో ఇన్నాళ్లుగా ఎన్నడూ గుర్తింపు పొందని పబ్లిసిటీ డిజైనింగ్‌ కళకు, పబ్లిసిటీ రంగానికి గుర్తింపు, గౌరవం సమకూరినట్లయిందని ఈశ్వర్‌ అభిప్రాయపడ్డారు. యువ కళాకారులు పబ్లిసిటీ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించాలని అభిలషించారు.
- ఆచారం  


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.