నాటక సాహిత్య కృషీవలుడు... గిరీష్ కర్నాడ్
నాటక సాహిత్యానికి వన్నెలద్దిన ఒక సుగంధపుష్పం నేల రాలింది. కన్నడ సాహిత్యానికి వన్నెలద్దిన ఆ ప్రసిద్ధ నాటక సాహితీవేత్త గిరీష్ రఘునాథ కర్నాడ్. నాటక సాహిత్యంలో విశిష్ట రచనలు చేసినందుకు జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న తొలి నాటక సాహితీవేత్త గిరీష్ కర్నాడ్. జ్ఞానపీఠ బహుమతి కర్నాడ్ కు ప్రకటించినప్పుడు “మరాఠీ నాటక సాహిత్యంలో నాకన్నా ముందు విశేష కృషి సల్పిన టెండూల్కర్ గారికి మొదట ఈ పురస్కారం అందించి వుంటే సంతోషించే వాడిని” అంటూ వినయపూర్వకంగా చెప్పడం సమకాలీన సాహితీవేత్తలమీద అతనికి వున్న గౌరవాన్ని, అభిమానాన్ని తెలియజేస్తుంది. కర్నాడ్ కేవలం నాటక సాహిత్య వేత్త మాత్రమే కాదు, అతడు ఒక మంచి నటుడు, దర్శకుడు కూడా. కర్నాడ్ రాసిన తుగ్లక్, యయాతి, అంజుమల్లిగే, నాగమండల, తలెదండ, అగ్ని మత్తుమళే వంటి నాటకాలెన్నో ఇంగ్లీష్, హిందీ, పంజాబీ, మరాఠీవంటి ఇతరజాతీయ భాషల్లోకి అనువదించ బడ్డాయి. డాII తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి నిర్మించిన ‘సంస్కార’ అనే కన్నడ చిత్రంలో కర్నాడ్ తొలిసారి నటించి ప్రధాన భూమిక పోషించారు. కన్నడ భాషలో వచ్చిన చిత్రాల్లో తొలి స్వర్ణకమలం బహుమతి పొందిన సినిమా ‘సంస్కార’. జంధ్యాల దర్శకత్వంలో నిర్మించిన ‘ఆనంద భైరవి ‘ (1984) చిత్రంలో కర్నాడ్ ది ప్రధాన భూమిక. ఆ చిత్రం జాతీయ పురస్కారంతోబాటు నంది బహుమతి కూడా గెలుచుకుంది. గిరీష్ ఉత్తమ నటుడి బహుమతి గెలుచుకున్నారు. ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’, ‘ప్రేమికుడు’, ‘ధర్మచక్రం’, ‘రక్షకుడు’. ‘కొమరం పులి’ వంటి తెలుగు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన గిరేష్ కర్నాడ్ జూన్ 10, 2019 న అనారోగ్యంతో బాధపడుతూ బెంగుళూరు లావేల్లె రోడ్ లోని స్వగృహంలో మరణించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని అంజలి ఘటిస్తూ సమర్పిస్తున్న జీవిత విశేషాలివి...


తొలిరోజులు...
గిరీష్ రఘునాథ్ కర్నాడ్ మహారాష్ట్ర లోని రాయగడ్ జిల్లాలోని మథేరా అనే ఒక హిల్ స్టేషన్ లో మే నెల 19, 1938 న జన్మించారు. తండ్రి రఘునాథ్ గిరీష్ ప్రగతిశీల, అభ్యుదయ భావాలుగలవ్యక్తి కావడంతో బాల్య వితంతువైన కృష్ణాబాయిని సమాజాన్ని యెదిరించి సహధర్మచారిణిగా స్వీకరించారు. తన తండ్రి వ్యక్తిత్వం గిరీష్ కర్నాడ్ కు వారసత్వంగా లభించి. ప్రగతిశీల భావాలు పుణికి పుచ్చుకున్న వారసుడుగా ఎదగడానికి సహకరించింది. ఉత్తర కర్ణాటకలో మరాఠీ మాధ్యమంలో ప్రాధమిక విద్యాభ్యాసం ముగించుకున్న గిరీష్, దార్వాడా లోని మిషన్ స్కూలులో హైస్కూలు విద్యనూ పూర్తిచేసి, 1958లో కర్ణాటక కళాశాల ద్వారా లెక్ఖలు ప్రధాన అంశంగా డిగ్రీ పుచ్చుకున్నారు. లండన్ నగరంలోని ఆక్స్ ఫర్డు విశ్వవిద్యాలయంలోని మాగ్డేలిన్ కళాశాలలో ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ ప్రధాన అంశాలుగా మాస్టర్స్ డిగ్రీ పుచ్చుకున్నారు. అక్కడ డిబేట్ క్లబ్బుకు, ఆక్స్ ఫర్డు యూనియన్ కు 1963లో అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆ క్లబ్బుకు ఎంపికైన తొలి ఆసియా పౌరుడు ఇతడే. షికాగో విశ్వవిద్యాలయంలో సందర్శనాచార్యుడు గా చాలాకాలం పనిచేసి అక్కడి విద్వాంసులు, కళాకారుల మెప్పు పొందారు. అక్కడి గ్రంధాలయాలలో లభ్యమైన యెన్నో గ్రంధాలను క్షుణ్ణంగా పరిశీలించి నాటక సాహిత్యం మీద మక్కువ పెంచుకున్నారు. తన నాటక సాహిత్య రచనకు బీజం పడింది అక్కడే. ఆక్స్ ఫర్డు నుంచి భారతదేశం వచ్చాక మద్రాసు నగరంలో ఆక్స్ ఫర్డు యూనివర్సిటీ ప్రెస్ లో 1963 నుంచి 1970 వరకు ఏడేళ్ళపాటు ఉద్యోగం చేసిన గిరీష్, నాటక సాహిత్య రచనకు పూర్తి కాలాన్ని కేటాయించాలనే ఉద్దేశ్యంతో రాజీనామా చేశారు. మద్రాసులో వున్న కాలంలో స్థానిక ఔత్సాహిక నాటక బృందంలో చేరి కొన్ని నాటక ప్రదర్శనల్లో పాల్గొన్నారు. తరవాత దార్వాడా కు వెళ్లి నాటక రంగానికి అంకితమై నాటక సాహిత్య రంగంలో విశేష కృషి సలిపారు. బాల్యంలో ‘యక్షగానం’ నాటకాలను చూసి గిరీష్ బాగా ప్రభావితుడయ్యారు. ఊరూరా తిరిగి ప్రదర్శించే నాటకాల బృందాలను, నాటక మండళ్లను కలిసి ఎన్నో తెలియని విషయాలను అధ్యయనం చేశారు.


నాటక సాహిత్య రచన...
ఉన్నత చదువులకు లండన్ వెళ్ళకముందే గిరీష్ కర్నాడ్ ‘యయాతి’ అనే నాటక రచనకు పూనుకున్నారు. ఆ నాటకం దార్వాడా నుండి వెలువడే మనోహర గ్రంధమాలే అనే పత్రికలో ప్రచురితమైంది. లండన్ లో ఉన్నతవిద్య ముగించుకొని వచ్చిన తరవాత ‘తుగ్లక్’, ‘హయవాదన’ అనే నాటక సాహిత్య రచనకు ఉపక్రమించారు. కొంతకాలం పూణేలోని ఫిలిం ఇనిస్టిట్యూట్ లో అధ్యాపకుడుగా, నిర్దేశకుడిగా వ్యవహరించి నాటక, సినీ నటనలో మెళకువలు విద్యార్థులకు నేర్పారు. తరవాత బొంబాయి వెళ్లి కొన్ని చలనచిత్రాల్లో నటించారు. ఆ తరవాత కొంతకాలానికి బెంగుళూరు వచ్చి స్థిరపడి నాటక సాహిత్యరచనా కౌశలానికి మెరుగులు పెట్టారు. బెంగుళూరు వచ్చాక రాసిన నాటకాల్లో ‘అంజుమల్లిగె’, ‘నాగమండల’, తలెదండ’, ‘అగ్ని మత్తుమళే’ ముఖ్యమైనవి. బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ అభ్యర్ధన మేరకు ‘టిప్పువిన కనసుగళు’ అనే నాటకాన్నిరాసిచ్చారు. కర్నాడ్ నాటక సాహిత్యంలో పాశ్చాత్య సాహిత్య ప్రభావం ఎక్కువగా కనపడుతుంది. అయితే చక్రవర్తుల రాజగోపాలాచారి ఇంగ్లీష్ లో రచించిన ‘మహాభారతం’ నవలలోని పాత్రల ప్రభావం కర్నాడ్ మీద అధికంగా పనిచేసింది. ముఖ్యంగా ‘యయాతి’ నాటక రచనకు ఈ గ్రంధమే స్పూర్తి. ఈ నాటకం అత్యధిక ప్రేక్షకులను రంజింపజేసింది. పౌరాణిక, చారిత్రాత్మిక అంశాలలోని సూక్ష్మ అనుభూతులను తన నాటకాలకు కథా వస్తువులుగా మలుచుకునేవారు. కర్నాడ్ రచించిన ‘తుగ్లక్’ నాటకం అలాంటిదే. 14 వ శతాబ్దానికి చెందిన ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ జీవిత కథాంశంలోని ముఖ్య ఘట్టాలతో చేసిన వ్యంగ్య సాహిత్యాన్ని కర్నాడ్ ఇందులో జొప్పించారు. ఈ నాటక రచానా కాలంలో అతని వయసు 26 ఏళ్ళు మాత్రమే. భారతీయ నాటక పితామహుడుగా పరిగణించే ఇబ్రహీమ్ ఆల్కజి దర్శకత్వంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆద్వర్యంలో ‘తుగ్లక్’ నాటకాన్ని ప్రసిద్ధ ఎర్రకోట వద్ద ప్రదర్శనకు ఉంచితే ఆ నాటకం ఎందఱో పండితుల అభిమానాన్ని చూరగొంది. అదే నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా బృందం ‘తుగ్లక్’ నాటకాన్ని భారతీయ ఫెస్టివల్ సందర్భంగా 1982లో లండన్ నగరంలో ప్రదర్శించి మన్ననలు పొందింది. 11 వ శతాబ్దానికి చెందిన ‘కథా సరిత్సాగారం’ నేపథ్యంలో గిరీష్ కర్నాడ్ రచించిన ‘హయవదన’ (1971) ఒక యక్షగాన నాటకం రూపంలో రూపుదిద్దుకుంది. వీమర్ లోని డచ్ నేషనల్ థియేటర్ వారు విజయ మెహతా దర్శకత్వంలో ఈ నాటకాన్ని జర్మనీలో ప్రదర్శించారు. ఒక జానపద కథను స్పూర్తిగా తీసుకొని రచించిన ‘నాగ మండల’ (1988) అనే నాటక సాహిత్యం గిరీష్ కర్నాడ్ కు కర్ణాటక రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతిని గెలిచి పెట్టింది. మినియాపోలిస్ లో వారి దేశపు 30 వ నాటక సప్తాహం సందర్భంగా ’నాగ మండల’ నాటకాన్ని జె. గార్లేండ్ రైట్ దర్శకత్వంలో ప్రదర్శించారు. తరవాత అక్కడే కర్నాడ్ రచించిన మరో రెండు నాటకాలు ‘అగ్ని మత్తు మాలె’ (నిప్పు నీరు), ‘తాలేదండ’ ప్రదర్శించారు.
 
                                          

సినిమా రంగంలో కర్నాడ్...
గిరీష్ కర్నాడ్ 1970 లో తొలిసారి వెండితెర ప్రవేశం చేశారు. బెంగుళూరు విశ్వవిద్యాలయ ఆచార్యులు తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ‘సంస్కార’ అనే కన్నడ చిత్రంలో ప్రాణేశాచార్య అనే ప్రధాన పాత్రను కర్నాడ్ పోషించారు. అందులో పట్టాభి భార్య స్నేహలతారెడ్డి చంద్రి పాత్రను పోషించింది. ఈ చిత్ర కథ యు.ఆర్. అనంత మూర్తి తను బర్మింగ్ హ్యామ్ లో పి.హెచ్.డి చేస్తున్నప్పుడు (1965) రాసుకున్నది. ఆ కథను అనంత మూర్తి గిరీష్ కర్నాడ్ కు పంపగా దానిని కర్నాడ్ పట్టాభికి అందజేశారు. ఈ చిత్రానికి పట్టాభితోబాటు వాసుదేవ్ కళాదర్శకత్వం, టామ్ కోవన్ ఫోటోగ్రఫీ, స్టీవెన్ కార్టా ఎడిటింగ్ అందించారు. ఈ చిత్రానికి ప్రముఖ తెలుగు దర్శకులు సింగీతం శ్రీనివాసరావు సహకార దర్శకునిగా పనిచేశారు. ఈ చిత్రానికి మద్రాస్ సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ నిరాకరించింది. దాంతో పట్టాభి భారత సమాచార ప్రసార శాఖ ను సంప్రదించి సర్టిఫికేటు సంపాదించారు. ‘సంస్కార’ చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమచిత్ర స్వర్ణకమల బహుమతి లభించింది. కర్ణాటక ప్రభుత్వం ఉత్తమ చిత్రం, ఉత్తమ కథ, ఉత్తమ ఛాయాగ్రహణం, ఉత్తమ సహాయనటన విభాగాల్లో బహుమతులు పంచింది. 1972లో లొకార్నో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లోను, 1992 లో భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలోను ఈ సినిమా ప్రదర్శనకు నోచుకుంది. 1971 లో గిరీష్ కర్నాడ్ ‘వంశవృక్ష’ అనే చిత్రానికి బి.వి. కారంత్ తో కలిసి దర్శకత్వం వహించారు. కర్నాడ్ నటించిన ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకుని బహుమతి లభించింది. ఫిలింఫేర్ బహుమతి కూడా ఈ చిత్రం గెలుచుకుంది. కన్నడ నటుడు విష్ణువర్దన్ ఈ చిత్రంతోనే వెండితెర ప్రవేశం చేశారు. ఇదే చిత్రాన్ని బాపు ‘వంశవృక్షం’ (1980) పేరుతో అనిల్ కపూర్, సోమయాజులు, కాంతారావు, జ్యోతి ముఖ్య తారాగణంగా తెలుగులో నిర్మించారు. తరవాత కర్నాడ్ ‘గోధూళి’, ‘ఉత్సవ్’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇవి కాక డాక్టర్ బింద్రే, కనకదాసు, పురంధర దాసు లమీద డాక్యుమెంటరీలు నిర్మించారు. కర్నాడ్ నిర్మించిన అనేక డాక్యుమెంటరీలు జాతీయ పురస్కారాలకు నోచుకున్నాయి. 1977లో ‘తబ్బలియు నీనాడే మగనే’ (హిందీలో గోధూళి చిత్రం), 1978లో ‘ఒందనొందు కలదళ్లి’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘ఒందనొందు కలదళ్లి’ సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ బహుమతి అందుకుంది. గిరీష్ దర్శకత్వం వహించిన మరో కన్నడ చిత్రం ‘కాడు’ (అడవి) కి జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్ర బహుమతి లభించింది. గిరీష్ నిర్మించిన ‘కానూరు హేగ్గడితి’ 1999 లో విడుదలైంది.


పరభాషా చిత్రాల్లో...
గిరీష్ కర్నాడ్ హిందీలో అనేక చిత్రాల్లో నటించారు. వాటిలో ‘నిశాంత్’ (1975), ‘మంథన్’ (1976), ‘స్వామి’ (1977), ‘పుకార్’ (2000) చిత్రాలను ముఖ్యంగా చెప్పుకోవాలి. 2012 లో వచ్చిన ‘ఎక్ థా టైగర్’ దాని తరవాత వచ్చిన పొడిగింపు చిత్రం ‘టైగర్ జిందా హై’ (2007) లో గిరీష్ కర్నాడ్ మంచి పాత్రలు పోషించారు. జంధ్యాల దర్శకత్వంలో నిర్మించిన ‘ఆనంద భైరవి’ తెలుగు సినిమాలో గిరీష్ కర్నాడ్ ది ప్రధాన పాత్రం. ఈ పాత్రకోసం ఆయన కూచిపూడి నాట్యాన్ని అభ్యసించడం జరిగింది. చిరంజీవి హీరోగా నటించిన ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ చిత్రంలో చిరంజీవి తండ్రి పాత్రలో ఒదిగిపొయారు. అక్కినేని నాగార్జున ద్విభాషా చిత్రం ‘రక్షకుడు’ లో విలన్ పాత్రను పోషించారు. ప్రభుదేవా చిత్రం ‘ప్రేమికుడు’ లో గిరీష్ కర్నాడ్ ది ఒక ప్రధాన పాత్ర. ‘ధర్మచక్రం’ సినిమాలో హీరో వెంకటేశ్ కు గిరీష్ కర్నాడ్ తండ్రిగా నటించారు. గిరీష్ కర్నాడ్ నాటక, సినీ రంగాలకు చేసిన సేవలకు గుర్తింపుగా భారతప్రభుత్వం ‘జ్ఞానపీఠ అవార్డు’, ‘పద్మభూషణ్’ పురస్కారం అందించింది.

ఆచారం షణ్ముఖాచారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.