సాహస నాయకి జయలలిత
ఆమె తమిళ ప్రజలకు అమ్మ, శత్రువుల పాలిట విప్లవ నాయకి. ఆమెను పెణ్ణిస్‌ పెరుమైగా ఎం.జి. రామచంద్రన్‌ ప్రజలకు పరిచయచం చేసేవారు. అలా మహిళలకే గర్వకారణమైన ‘పురచ్చి తలైవి’ జయలలిత ఒక పడిలేచిన కడలి తరంగం. తమిళనాట అగ్రనాయికగా వెలుగొందుతున్న జయలలితను ఎమ్జీఆర్‌ రాజకీయాలలోకి తీసుకొస్తే, అతని ఆదర్శాలను అనుసరిస్తూ ఒక ముఖ్యమంత్రిగా అద్భుత ఆదరణను, కీర్తిని సముపార్జించిన జయలలిత అనారోగ్యంతో, మృత్యువుతో 74రోజులు పోరాడి, కోట్లాది మంది గుండెల్లో బాధను నింపుతూ డిసెంబరు 5, 2016న అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. గురువును మించిన శిష్యురాలుగా భాసిల్లుతూ తమిళనాడు రాష్ట్రానికి ఆరుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన జయలలిత గొప్ప సినిమా నాయిక. ఆ సాహస నాయకి వర్థంతి ఈరోజు. ఆమె ప్రస్థానాన్ని ఒకసారి స్మరించుకుంటే....

బాల లలిత
అరవై ఏళ్ళ క్రితం జయలలిత (24-2-1948) పుట్టింది. నాటి మైసూర్‌ రాష్ట్రంలోని మాండ్య జిల్లా, పాండవవుర తాలూకా మెల్కోటేలోని సంప్రదాయ తమిళ అయ్యంగార్‌ కుటుంబంలో, తల్లి వేదవల్లి తండ్రి జయరాం. జయరాం లాయరు వృత్తిలో ఉండేవారు. నాయనమ్మ లేదా తాతమ్మ పేరుతో బాటు వ్యావహారిక నామధేయాన్ని కూడా కలుపుకొని రెండు పేర్లు పెట్టడం అయ్యంగార్ల సంప్రదాయం. తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన రెండు పేర్లు కోమలవల్లి, జయలలిత. ఆమె తాత నరసింహన్‌ రంగాచార్యులు మైసూర్‌ మహారాజా వారి సంస్థానంలో ఆస్థాన వైద్యునిగా వుండేవారు. దురదృష్టవశాత్తు జయలలిత పుట్టిన రెండేళ్లకే తండ్రి చనిపోవడంతో ఆమె కుటుంబం బెంగుళూరులోని మాతామహుల ఇంటికి చేరింది. ఉదరపోషణ నిమిత్తం తల్లి వేదవల్లి బెంగుళూరులో చిన్న ఉద్యోగంలో చేరింది. ఆ తరువాత వేదవల్లి మద్రాసు వెళ్లి రంగస్థలి నటిగా స్థిరపడిన సోదరి అంబుజవల్లి వద్ద ఉంటూ సినిమా నటిగా ప్రయత్నాలు సాగించింది. సంధ్య అనే పేరుతో తన ప్రస్థానాన్ని తొలుత నాటకాలతో ప్రారంభించి, డబ్బింగ్‌ కళాకారిణిగా రాణిస్తూ, క్రమంగా సనీ నటి స్థాయికి ఎదిగింది. అలా జయలలిత బాల్యం మద్రాసుతో ముడివడింది. ప్రాధమిక విద్యను బెంగుళూరు బిషప్‌ కాటల్‌ బాలికల పాఠశాలలోను, హైస్కూల్‌ చదువు మద్రాసు చర్చ్‌ పార్క్‌ కాన్వెంట్‌లోను కొనసాగించిన జయలలిత మెట్రిక్యులేషన్‌ పరీక్షలో రాష్ట్రం మొత్తం మీద ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణురాలై మంచి తెలివిగల విద్యార్థినిగా నిలిచింది. స్టెల్లా మేరిస్‌ కళాశాలలో చేరినా ఆమె చదువు కొనసాగలేదు. అలా న్యాయశాస్త్రం చదవాలనే అభిలాషకు అడ్డుకట్ట పడింది. చదువుకుంటూనే జయలలిత సంప్రదాయ భరతనాట్యంతోబాటు మోహినీయాట్టం, మణిపురి, కథక్‌ వంటి నృత్యరీతులు నేర్చుకుంది. సంప్రదాయ కర్నాటక సంగీతం కూడా అభ్యసించడంతో జయలలితకు బాలనటిగా సినిమా అవకాశాలు రాసాగాయి. తొలిసారి ఆమె 1961లో ‘శ్రీశైలం మాహాత్మే’ అనే కన్నడ సినిమాలో బాలనటిగా, మన్‌మౌజీ అనే హిందీ సినిమాలో కుమారి నాజ్‌తో చిన్నారి కృష్ణుడుగా నటించారు. అంతేకాదు ఎపిస్టిల్‌ అనే ఇంగ్లీషు చిత్రంలో కూడా నటించడం జరిగింది. ఆ తరువాత జయలలిత నటించిన పూర్తిస్థాయి చిత్రం బి.ఆర్‌.పంతులు నిర్మించిన కర్ణన్‌. ఇదే సినిమాను తెలుగులో కర్ణగా డబ్‌ చేశారు. ఆ చిత్ర విజయం చదువుకు స్వస్తి చెప్పే పరిస్థితులను కల్పించింది. 1964లో తన పదహారవ ఏటనే చిన్నద గొంబే అనే కన్నడ చిత్రంలో జయలలిత తొలిసారి కథానాయకిగా నటించింది. ఆ సినిమాలో నటనకు జయలలితకు ముట్టిన పారితోషికం మూడు వేలు. బి.ఆర్‌.పంతులు నిర్మించిన ఈ సినిమాలో ఎం.వి.రాజమ్మ, సంధ్య, కల్పన, కల్యాణ్‌ కుమార్‌ నటించారు. చిన్నద గొబేను తమిళంలో మురదన్‌ ముత్తు అనే పేరుతో పునర్మించగా అందులో జయలలిత పాత్రను దేవిక పోషించింది.

సినిమా రంగంలోకి అడుగిడి...
1965లో ప్రసాద్‌ ఆర్ట్‌ పిక్చర్స్‌ నిర్మాత ఎ.వి.సుబ్బారావు నిర్మించిన ‘మనుషులు మమతలు’ చిత్రంలో జయలలిత తొలిసారి నటించింది. అది కూడా అక్కినేని నాగేశ్వరరావుకు జంటగా. స్విమ్మింగ్‌ పూల్‌ దుస్తుల్లో ముద్దు ముద్దు తెలుగు మాట్లాడుతూ ప్రేక్షక హృదయాలను ఆకట్టుకుంది. చిత్రాలయ అధిపతి, దర్శకుడు శ్రీధర్‌ నిర్మించిన ‘వెన్నీరాడై’ ఆమెకు హీరోయిన్‌గా తొలి తమిళ చిత్రం. అదే సంవత్సరం శాండో చిన్నప్ప దేవర్‌ నిర్మించిన కణ్ణిత్తాయ్‌లో ఎం.జి.రామచంద్రన్‌ సరసన, కన్నడ సినిమా ‘నాన్‌ కర్తవ్య’లో కల్యాణ్‌ కుమార్‌ సరసన, తమిళ చిత్రం ‘గౌరి కల్యాణం’లో జయశంకర్‌ సరసన జయలలిత నటించింది. 1966లో జగపతి సంస్థ నిర్మిత వి.బి.రాజేంద్రప్రసాద్‌ నిర్మించిన ‘ఆస్తిపరులు’ తెలుగులో ఆమెకు రెండవ చిత్రం. ఇందులోనూ ఆమె అక్కినేనికి జంటగా నటించడం విశేషం. అదే సంవత్సరం ‘ఇట్‌ హ్యపెండ్‌ వన్‌ నైట్‌’ అనే ఆమెరికన్‌ సినిమా ఆధారంగా తమిళంలో నిర్మించిన ‘చంద్రోదయం’ చిత్రంలో ఎమ్జీఆర్‌ సరసన నటించిన జయలలితకు ఫిలింఫేర్‌ బహుమతి లభించింది. తరువాత బాలచందర్‌ దర్శకత్వంలో ‘మేజర్‌ చంద్రకాంత్‌’ సినిమాలో ముత్తురామన్‌ సరసన నటించింది. తమిళ సినిమా ‘యార్‌ నీ సస్పెన్స్‌’ చిత్రంలో తొలిసారి ద్విపాత్రాభినయం చేసింది. అ అందులో నటనకు మద్రాస్‌ ఫిలిం ఫ్యాన్స్‌ వారి ఉత్తమ నటి బహుమతి గెలుచుకుంది. అదే సినిమాను తెలుగులో ‘ఆమె ఎవరు’గా నిర్మించగా అందులో నటించిన జయలలితకు అది మూడవ చిత్రంగా రికార్డయింది. ప్రసాద్‌ ఆర్ట్స్‌ వారి ‘నవరాత్రి’ సినిమాలో మానసిక రోగి పాత్రలో అతిథి పాత్ర పోషించిన జయలలిత సుందర్లాల్‌ నహతా, డూండీ నిర్మించిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘గూఢచారి 116’లో కృష్ణ సరసన హీరోయిన్‌గా నటించింది. తమిళంలో ‘మోటార్‌ సుందరం’, ‘నాన్‌; మాడి వీట్టు మాప్పిళె’్లౖ, ‘కావల్‌ కారన్‌; రాజా వీట్టు పిళ్లై’, ‘పనక్కార పిళ్లై’, ‘ఎంగవూర్‌ రాజా’, ‘పుదియ భూమి’, ‘ముత్తుచ్చిప్పి’, ‘గలాటా కల్యాణం’, ‘ఒలివిళక్కు’ వరుసగా వచ్చిన తొలితరం సినిమాలు. ఈ సినిమాలన్నీ విజయవంతం కావటం జయలలిత అదృష్టం కూడా.


అలాగే తెలుగులో ‘గూఢాచారి 116’ తరవాత వచ్చిన ‘చిక్కడు దొరకడు’, ‘గోపాలుడు భూపాలుడు’, ‘నిలువుదోపిడి’, ‘బాగ్దాద్‌ గజదొంగ’, ‘తిక్కశంకరయ్య’, ‘కథానాయకుడు’, ‘గండికోట రహస్యం’, ‘ఆలీబాబా నలభైదొంగలు’, ‘శ్రీకృష్ణ సత్య’, ‘దేవుడు చేసిన మనుషులు’ వంటి సినిమాలలో ఎన్‌.టి.రామారావు సరసన; ‘బహ్మచారి’, ‘ఆదర్శకుటుంబం’, ‘అక్కచెల్లెళ్ళు’, ‘భార్యాబిడ్డలు’, ‘ప్రేమలు- పెళ్ళిళ్ళు’, ‘నాయకుడు- వినాయకుడు’ వంటి సినిమాలలో అక్కినేని సరసన; ‘డాక్టరు బాబు’ సినిమాలో శోభన్‌బాబు సరసన జయలలిత నటించింది. ముత్తురామన్‌తో నటించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘తిరుమంగళం’ జయలలితకు నూరవ చిత్రం. ఈ సినిమాలో నటించినందుకు జయలలిత ‘నడిపుప్క ఇలక్కియుం వహుత్తువర్‌’ బిరుదును స్వీకరించింది. హిందీలో తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించిన ‘ఇజ్జత్‌’ సినిమాలో ధర్మేంద్రకు జంటగా జయలలిత నటించడం విశేషం. 1969లో వచ్చిన ఎమ్జీఆర్‌ సొంత సినిమా ‘అడిమైపెణ్‌’్ణలో జయలలిత నాలుగవసారి ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాలో నటనకు ఆమెకు ఫిలింఫేర్‌ ప్రత్యేక బహుమతి లభించింది. అలాగే శివాజీ గణేశన్‌ సరసన నటించిన ‘ఎంగిరిందో వందాళ్‌’ సినిమాకు కూడా జయలలితకు ఫిలింఫేర్‌ ప్రత్యేక బహుమతి లభించింది. 1971లో ‘తంగ గోపురం’ సినిమాలో ఆమె ఐదవసారి ద్విపాత్రాభినయం చేసింది. 1973లో ‘వందళే ముగరాసి (కె.ఎస్‌.గోపాలకృష్ణన్‌)లో ఏడవసారి, గంగాగౌరి (బి.ఆర్‌.పంతులు)లో ఎనిమిదవసారి ద్విపాత్రాభినయం చేయడం జయలలితకే సాధ్యమైంది. ఒక గాయనిగా కూడా జయలలిత రాణించిన సందర్భాలున్నాయి. ‘అడిమైపెణ్ణ్‌’లో ‘అమ్మ ఎందాల్‌ అన్బు’, సూర్యకాంతిలో ‘ఓ మేరి దిల్‌ రుబా’, అన్బైతేడిలో ‘చిత్తిర మండపతిల్‌’, తిరుమాంగల్యంలో ‘తిరుమాంగల్యం కొల్లుం మురై’, ఉణ్ణె సుత్రుం ఉళగంలో ‘మద్రాస్‌ మెయిల్‌’ పాటలు కొన్ని మచ్చుకు మాత్రమే. తెలుగులో ‘ఆలీబాబా నలభై దొంగలు’ సినిమాలో ‘చల్లచల్లని వెన్నెలాయో... మల్లెపూల పానుపాయే’ అనే పాటను ఘంటసాల దర్శకత్వంలో జయలలిత పాడటం కూడా ఒక విశేషమే! జయలలిత 140 సినిమాలలో నటించారు. సినిమాలలో అత్యధిక పారితోషికం పుచ్చుకున్న నటి కూడా జయలలితే! ఆమె నటించిన ఆఖరి చిత్రం ‘నీంగా నల్లా ఇరుక్కుం’ అనే తమిళ సినిమా (1992).


రాజకీయ రంగంలో రాణిస్తూ...
జయలలిత జీవితమంతా ఆటుపోట్లమయమే. ఆమె ఎదుర్కొన్న కష్టాలు, వివాదాలు, కేసులు మరే ఇతర రాజకీయ నేతలు ఎదుర్కొనలేదు. ఆమె సమస్యలతో సహవాసం చేసింది. సాహసమే ఊపిరిగా పోరాడింది. ఆ పోరాడే గుణమే ఆమెను విప్లవ నాయకిగా మార్చివేసింది. 1982లో జయలలిత రాజకీయరంగ ప్రవేశం చేశారు. 1984లో రాజ్యసభకు ఎన్నికైనారు. ఆమెకు ఎమ్జీఆర్‌ రాజకీయ గురువు. ఒకానొక సందర్భంలో ఎమ్జీఆర్‌నే ఎదిరించి బహిష్కరణకు కూడా గురైన సందర్భం లేకపోలేదు. ఎమ్జీఆర్‌ అనారోగ్యం బారినపడినప్పుడు ఆమె రాజీవ్‌గాంధీకి చేరువై తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రయత్నించారనే అపప్రధ ఆమె మీదర ఉన్న మాట వాస్తవం. అది పసిగట్టిగా ఎమ్జీఆర్‌ ఆమె ప్రాధాన్యం తగ్గించారని కూడా చెప్పుకుంటారు. ఎమ్జీఆర్‌ మరణానంతరం అన్నా డి.ఎం.కె. రెండుగా చీలిపోవడంతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని జయలలిత 1991లో తొలిసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అలకరించారు. రాజకీయాలలో ఆమెకు కరుణానిధి బద్ధ శత్రువు. ఆమె ముఖ్యమంత్రిగా ఉండగా కరుణానిధి ఒక్కసారి కూడా శాసనసభలో అడుగుప్టెలేదు. అలాగే కరుణానిధి అధికారంలో వున్నప్పుడు జయలలిత కూడా అంతే! 2014లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె జైలుకెళ్లారు కూడా. అభిమానులకు అమ్మగా కీర్తినందుకొని తమిళ రాజ్యాన్ని పాలించిన మహాసామ్రాజ్ఞి జయలలిత.



మరిన్ని విశేషాలు...
* జయలలిత, శోభన్‌బాబు మధ్య గాఢమైన స్నేహబంధం ఉండేది. తల్లి మరణంతో దిగాలుగా ఉంటున్న జయలలితను ఛలోక్తులతో నవ్విస్తూ శోభన్‌ ఆమెకు దగ్గరయ్యారు. బ్రతుకు చాలించాలనే విషాదంలో ఉన్న జయలలిత శోభన్‌బాబు స్నేహంలో ఆత్మీయతను చూడగలిగింది.

* జయలలిత, ఎమ్జీఆర్‌ను తిరుగులేని జోడిగా తమిళ ప్రేక్షకులు ఆదరించారు. వారిద్దరూ కలిసి ఏకంగా 28 సినిమాలలో నటించి రికార్డు సృష్టించారు.

* జయలలిత తనను తమిళ మహిళగా పేర్కొనేవారు. కన్నడ యువతిని కాదని అన్నందుకు ఆమెను కన్నడ అభిమానులు బహిష్కరించారు. మైసూర్‌ ప్రిమియర్‌ స్టూడియోలో ఒకసారి ‘గంగా గౌరీ’ సినిమా షూటింగు జరుగుతుండగా కొంతమంది స్టూడియోలోకి ప్రవేశించి ఆమెను కన్నడ దేశానికి చెందిన దాన్ని బహిరంగంగా ఒప్పుకోమని గొడవచేశారు. ఆ వాతావరణాన్ని గమనించిన జెమిని గణేశన్, అశోకన్‌ ‘వాళ్ళు చెప్పినట్లు అంటే గొడవ చెయ్యకుండా వెళ్లిపోతార’ని సర్దిచెప్పినా జయలలిత ససేమిరా అంది. అంతేకాదు ‘ఏం చేస్తారో చూస్తాను’ అంటూ వారి ముందుకెళ్లి నిల్చుంది. అంతటి వీర నారి జయలలిత.

* ఒకసారి ఆమె తన ఆరాధ్య ప్రేమికుడు నవాబ్‌ ఆఫ్‌ వటౌడీ అని చెప్పినందుకు కొన్ని పత్రికలు జయలలిత పటౌడీని పెళ్లాడబోతోంది అని రాశారు. ఆ విషయాన్ని జయలలిత తేలిగ్గా తీసుకున్నారు.


* జయలలిత సినిమా షూటింగ్‌ గ్యాప్‌లో ఇంగ్లిష్‌ నవలల్ని చదువుతూ కాలం గడిపేవారు. ఆమెది ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడే తత్త్వం కాదు. ఒక సీనియర్‌ నటి తాను షూటింగ్‌లోకి వచ్చినప్పుడు జయలలిత లేచి ఆమెను గౌరవించలేదని గారాలు పోయింది. సినిమానైనా వదులుకుంటాను గానీ, వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టలేను అంటూ నిర్మాతతో తెగేసి చెప్పిన ధీర వనిత జయలలిత.

* తెలుగులో జయలలిత ముఫ్పైకిపైగా సినిమాలలో నటించారు. తల్లి మరణంతో ఆమె మూడేళ్లు సినిమాలకు దూరమయ్యారు. అభిమానులు మాత్రం ఆమెనే హీరోయిన్‌గా ఆరాధించడంతో ‘నదియ తేడివంద కడత్తిల్‌’ సినిమాతో రెండవ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు.


* అద్వితీయ మైత్రికి జయలలిత- శశికళ ప్రత్యక్ష ఉదాహరణ. వారి స్నేహానికి నీరుపోసిన వ్యక్తి నాటి కడలూర్‌ కలెక్టర్‌ చంద్రలేఖ. శశికళ అన్న కుమారుడు సుధాకరన్‌ను దత్తత తీసుకొని స్నేహానికి నిర్వచనం తెలియజేసిన స్నేహశీలి జయలలిత.


- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.