శంకరాభరణం శంకరశాస్త్రి

శంకరాభరణం శంకరశాస్త్రిగా తెలుగు ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేసిన నటుడు జె.వి.సోమయాజులు. రంగస్థలంతో ప్రయాణం మొదలుపెట్టిన ఆయన వెండితెరపైనా, బుల్లితెరపైనా మెరిసి ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. శ్రీకాకుళం జిల్లా లుకలాంలో 1928 జూన్‌ 30న శారదాంబ, వెంకటశివరావు దంపతులకి జన్మించిన సోమయాజులు పూర్తిపేరు జొన్నలగడ్డ వెంకట సుబ్రహ్మణ్య సోమయాజులు. చదువుకొనే వయసులోనే నాటకాలపై ఆసక్తి పెంచుకొన్న ఆయన తన సోదరుడు, ప్రముఖ నటుడు రమణమూర్తితో కలిసి కన్యాశుల్కంతో పాటు నాటక ప్రదర్శనలిచ్చేవారు. కన్యాశుల్కంలో రామప్ప పంతులు పాత్ర వేస్తూ ప్రసిద్ధి చెందారు. 45 ఏళ్లలో 500 ప్రదర్శనలు ఇచ్చారు. విలేజ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఆయన అంచలంచెలుగా ఎదిగారు. మహబూబ్‌నగర్‌ డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోనే ‘శంకరాభరణం’లో నటించే అవకాశం వచ్చింది. అంతకుముందే ‘రాధాకృష్ణయ్య’ చిత్రంలో కీలక పాత్రని పోషించారు. అయితే ఆ చిత్రం పరాజయాన్ని చవిచూడటంతో పేరు రాలేదు. ‘జ్యోతి’లోనూ ఓ పాత్రని పోషించారు. కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శంకరాభరణం’తో సోమయాజులు పేరు మార్మోగిపోయింది. ఆ తరువాత తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించి విశేషమైన పేరు సంపాదించారు. ‘సప్తపది’, ‘త్యాగయ్య’, ‘వంశ వృక్షం’, ‘సితార’, ‘తాండ్ర పాపారాయుడు’, ‘మగధీరుడు’, ‘మజ్ను’ ఇలా అన్ని భాషల్లో కలిపి 150కిగాపై చిత్రాలు చేశారు సోమయాజులు. ఏప్రిల్‌ 27, 2004లో హైదరాబాద్‌లో గుండెపోటుతో మరణించారు. ఈ రోజు సోమయాజులు జయంతి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.