మాధుర్యభరిత పాటల చే‘జిక్కి’...!
పాట....ఓ ఉత్సాహం...ఓ ఉల్లాసం. ఆనందపరవశం. ఒళ్ళంతా త్రిళ్లింత. నరాల్లో స్వరాల జాతర. గాన మహిమ ఎన్న తరమా? గాయనీగాయకులు గళం నుంచి సుతిమెత్తగా జాలువారే సుస్వరాల గంగాఝరి. ఆ అమృతాల నదిలో తలారా స్నానిస్తే... కొత్త లోకాల సరికొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. కాలంతో పాట తీరు తెన్నులు మారుతున్నా... ఇప్పటికీ వినోద పరిశ్రమలో పాటదే పై చేయి. పాటని చేజిక్కించుకుని... పాటే శ్వాసగా జీవితాన్ని పండించుకుని పల్లవించి పరవశించినవారెందరో ఉన్నారు. వారిలో అలనాటి గాయనీగాయకులు సినీ పాటకి ప్రాణం పోశారు. పట్టాభిషేకం చేసారు. అలనాటి మధురగీతాలు ఇప్పటి తరాన్నీ మైమరిపింప చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. రాత్రి వేళ...నిశబ్దాన్ని మీటుతూ గాలి అలల్లో తెలియాడి వచ్చే ఓ గీతం అమృత జలపాతం. ఆలాంటి పాటల్ని ఎన్నింటినో పాడి... తరతరాల తరగని గనిలా మనకు అందించిన ఎందరో గాయనీమణుల్లో జిక్కి కూడా ఒకరు. 1935 నవంబర్‌ 3న జన్మించిన ఈ మధుర గాయని జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా జిక్కికి సంబంధించిన కొన్ని విషయాలు మీకోసం.


పిల్లవలు గజపతి కృష్ణవేణి... జిక్కి అసలు పేరు ఇది. సినిమాల్లోకి వచ్చాక జిక్కీగా సుప్రసిద్ధురాలు. దాదాపు పదివేలకు పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం హిందీ తదితర భాషలలో పాటలు పాడారు. జిక్కి మాతృభాష తెలుగు అయినప్పటికీ తమిళ్‌ భాష బాగా మాట్లాడగలిగేవారు.

జీవన నేపథ్యం
జిక్కి చెన్నైలో 1935 నవంబర్‌ 3న జన్మించారు. తల్లిదండ్రులు గజపతి నాయుడు, రజకాంతమ్మ. జిక్కి కుటుంబం తిరుపతి దగ్గర ఉన్న చంద్రగిరి నుంచి చెన్నై నగరానికి వలస వెళ్లిపోయారు. జిక్కి అంకుల్‌ దేవరాజ్‌ నాయుడు సినిమా రంగంలో మ్యూజిక్‌ డైరెక్టరే కాదు... కన్నడ రంగస్థల దిగ్గజం, సినిమా మార్గదర్శకుడు అయిన గుబ్బి వీరన్నతో కలసి పని చేశారు. ఈ కారణంగా జిక్కి సంగీత, సినిమా ప్రపంచానికి పరిచయమయ్యారు.

కెరీర్‌
1943లో బాల నటిగా జిక్కి సినీ జీవితాన్ని ప్రారంభించారు. గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పంతులమ్మ’ అనే తెలుగు సినిమాలో ఒక చిన్న పాత్రను పోషించారు. 1946లో హాలీవుడ్‌ సినిమా ‘ఎక్స్‌క్యూజ్‌ మీ’కి రీమేక్‌ అయిన ‘మంగళసూత్రం’ సినిమాలో నటించారు. మరోపక్క మధురమైన గాత్రంతో పాటలు పాడి కూడా జిక్కి అందరి దృష్టిని ఆకర్షించేవారు. అప్పటికి, ఇంకా సంగీతపర శిక్షణ తీసుకోకపోయినప్పటికీ జిక్కి తన గాత్రంతో అందరినీ ఆకర్షించేవారు.


1948లో జిక్కీకి విజయవంతమైన తమిళ సినిమా ‘జ్ఞానసౌందరి’ సినిమాలో పాట పాడే అవకాశం వచ్చింది. ఈ సినిమాకు సంగీతం అందించింది ఎస్‌.వి.వెంకట్రామన్‌. ఈ సినిమాలో జిక్కి పాడిన ‘అరుళ్‌ తారం’ అనే పాట ఎంతో పెద్ద విజయవంతమైంది. జిక్కి కెరీర్‌లో ఈ పాట ఓ టర్నింగ్‌ పాయింట్‌ అని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి కృష్ణవేణి... జిక్కీగా మారిపోయారు. రెగ్యులర్‌ ప్లే బ్యాక్‌ సింగర్‌గా వరుస అవకాశాలు రాబట్టుకోగలిగారు. తమిళ, తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా కన్నడ, మలయాళ భాషలలో కూడా జిక్కికి వరుసపెట్టి అవకాశాలు వచ్చాయి.

1950లో భవిష్యత్తులో కాబోయే భర్త అయ్యే ఎ.ఎం.రాజాను మొదటిసారి కలిశారు జిక్కి. ఎస్‌.ఎస్‌.వాసన్‌ ద్వారా నేపథ్యగాయకుడిగా ‘సంసారం’ అనే తమిళ చిత్రంతో పరిచయం అయ్యారు ఎ.ఎం.రాజా. ఆ తరువాత ఎస్‌.ఎస్‌.వాసన్‌ జిక్కీని హిందీ పరిశ్రమకు ‘మిస్టర్‌ సంపత్‌’ అనే సినిమాతో పరిచయం చేశారు. ఈ సినిమాలో పి.బి.శ్రీనివాస్‌ కూడా తన మొదటిపాటని కోరస్‌లో పాడారు. అప్పట్లో సింహళీ సినిమాలు మద్రాసులో నిర్మాణం అయ్యేవి. దాంతో, జిక్కి సింహళ పాటలను కూడా పాడారు.


పి.లీలతో పాటు దక్షిణ భారత సినిమా ప్రపంచాన్ని జిక్కి ఏలారు. బాగా పోటీ ఉన్నప్పటికీ, లీల, జిక్కి అక్కాచెలెళ్లుగా మెలిగేవారు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం ఉండేది. కలిసి కూడా ఎన్నో పాటలను పాడారు. సినిమా పాటలతో పాటు జిక్కి ఎన్నో క్రిస్టియన్‌ పాటలు కూడా పాడేవారు.పలువురు సంగీత దర్శకులతో జిక్కి పనిచేశారు జి.రామనాథన్, సి.ఆర్‌.సుబ్బురామన్, ఎస్‌.ఎం.సుబ్బయ్య నాయుడు, ఎస్‌.హనుమంతరావు, ఎస్‌.రాజేశ్వరరావు, జి.గోవిందరాజులు నాయుడు, ఆర్‌.సుధర్సనమ్, ఆర్‌.గోవర్ధనం, ఎస్‌.దక్షిణామూర్తి, సి.ఎన్‌.పాండురంగన్, అడెపల్లి రామారావు, ఎమాని శంకరశాస్త్రి, మాస్టర్‌ వేణు, కె.వరప్రసాదరావు, టి.ఎ.కళ్యాణం, ఎం.ఎస్‌.జ్ఞానమణి, కె.వి.మహాదేవన్, పెండ్యాల నాగేశ్వరరావు, జి.అశ్వథామ, వి.దక్షిణామూర్తి, టి.జి.లింగప్ప, పి.ఆదినారాయణరావు, పి.ఎస్‌.దివాకర్, టి.ఆర్‌.పప్పా, ఎ.ఎం.రాజా, టి.వి.రాజు, సి.ఎస్‌.జయరామన్, ఘంటసాల, వేద, ఎం.ఎస్‌.విశ్వనాథన్, టి.కె.రామమూర్తి, రాజన్‌-నాగేంద్ర, జి.దేవరాజన్, ఎం.రంగారావు, విజయభాస్కర్, ఎం.ఎస్‌.బాబురాజ్, కె.రాఘవన్, ఎల్‌.పి.ఆర్‌.వర్మ, కె.జి.మూర్తి, టి.చలపతిరావు, ఆర్‌.కె.శేఖర్, జీవన్, ఇళయరాజా, శంకర్‌-గణేష్, దేవ, శంకర్‌-జైకిషన్, సి.రామ్‌చంద్ర, మణిశర్మ... వీరి సంగీత దర్శకత్వంలో జిక్కి అనేక పాటలు పాడారు. ‘అనార్కలి’ చిత్రంలో జిక్కి పాడిన ‘‘రాజశేఖరా...నీపై మోజు తీరలేదురా!..’’ పాట దగ్గర నుంచి సుదీర్ఘ ప్రస్థానంలో ‘ఆదిత్య 369’ చిత్రంలో ‘‘జాణవులే...నెరజాణవులే... ’’, ‘మురారి చిత్రం’లో ‘‘అలనాటి రామచంద్రుడికన్నింటా సాటి’’ దాకా ఎన్నో మాధుర్యభరిత గీతాలు ఆలపించారు. ఆమె పేరు చెప్పగానే ఆణిముత్యాల్లాంటి పాటలు శ్రోతల మదిలో మెదిలి కచేరి చేస్తాయి. కవ్విస్తాయి. అలరిస్తాయి.

                                 

వ్యక్తిగత జీవితం
నేపథ్య గాయకుడిగా, సంగీత దర్శకుడిగా విజయవంతమైన ఎ.ఎం.రాజాని వివాహమాడారు జిక్కి. వీళ్లద్దరూ కలిసి పాడిన యుగళ గీతాలు విజయవంతమయ్యాయి. భర్త దర్శకత్వంలో జిక్కి ఎన్నో పాటలు పాడారు. ఆ పాటలు ఇప్పటికీ ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ప్రసారమవుతూనే ఉన్నాయి. ఎ.ఎం.రాజా, జిక్కి యూఎస్‌ఏ, మలేషియా, సింగపూర్‌ వంటి దేశాలలో ఎన్నో లైవ్‌ ప్రోగ్రామ్స్‌ ఇచ్చారు.

జిక్కి, రాజా దంపతులకు ఆరుగురు సంతానం ఉన్నారు. రైలు ఎక్కేటప్పుడు ట్రాక్స్‌ మధ్య జారిపడిపోయి ప్రాణాలను కోల్పోయారు రాజా. భర్త పోయిన తరువాత జిక్కి కొంతకాలం పాటు పాటలు పాడలేదు. ఆ విరామం నుంచి బయటకొచ్చి ఇళయరాజా సంగీతంలో ఓ పాటను పాడారు. తన ఇద్దరి కొడుకులతో ఓ మ్యూజిక్‌ ట్రూప్‌ని మొదలుపెట్టారు జిక్కి. దాని ద్వారా యునైటెడ్‌ స్టేట్స్, మలేషియా, సింగపూర్‌ దేశాలలో పెర్ఫార్మ్‌ చేశారు.

వ్యక్తిత్వం
ఇతర గాయకులలాగా డబ్బు విషయంలో కఠినంగా వ్యవహరించేవారు కాదు జిక్కి. ఒకసారి ఒక తమిళ సినిమాలో ఐదు పాటలు పాడారు జిక్కి. ఆ చిత్ర నిర్మాత సోమనాథన్‌ దగ్గరకు వెళ్లి ఒకే సినిమాలో ఐదు పాటలు పాడే అవకాశం తనకు ఇచ్చినందుకు తన రెమ్యూనరేషన్‌ని తగ్గించమని అడిగారట జిక్కి. వృత్తిపై అంత అంకితభావంతో ఉండేవారు జిక్కి. 98 తెలుగు సినిమాలలో, 71 తమిళ సినిమాలలో జిక్కి పాటలు పాడారు.

మరణం
జిక్కికి బ్రెస్ట్‌ కాన్సర్‌ వచ్చింది. అది ఆమె కిడ్నీలకు, లివర్‌కు వ్యాప్తి చెందింది. జిక్కి ప్రాణ స్నేహితురాలు, గాయని జమునా రాణి జిక్కీని బతికించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లక్ష రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2 లక్షల రూపాయలు జిక్కి వైద్య ఖర్చులకు కోసం ఇచ్చారు. చెన్నైలోని 2004 ఆగస్టు 16న జిక్కి మరణించారు.

పురస్కారాలు, గౌరవాలు
జిక్కి గాన ప్రతిభను గుర్తించి మద్రాస్‌ తెలుగు అకాడమీ ‘ఉగాది పురస్కారం’తో సత్కరించింది. తమిళనాడు ప్రభుత్వం ఆమెకు ‘కలై మా మణి’ పురస్కారాన్ని అందించింది.

జిక్కి గాత్రధారణ చేసిన కొన్ని తెలుగు సినిమాలు ఇవి.
‘మనదేశం’, ‘పల్లెటూరిపిల్ల’, ‘షావుకారు’, ‘సంసారం’, ‘పాతాళ భైరవి’, ‘నవ్వితే నవరత్నాలు’, ‘ధర్మదేవత’, ‘పల్లెటూరు’, ‘బ్రతుకు తెరువు’, ‘దేవదాసు’, ‘పరదేశి’, ‘ప్రతిజ్ఞ’, ‘రేచుక్కా’, ‘తోడుదొంగలు’, ‘దొంగరాముడు’, ‘రోజులు మరాయి’, ‘అనార్కలి’, ‘అర్ధాంగి’, ‘చిరంజీవులు’, ‘భలే రాముడు’, ‘ఏది నిజం’, ‘జయం మనదే’, ‘పెంకి పెళ్ళాం’, ‘సువర్ణ సుందరి’, ‘మాయాబజార్‌’, ‘భలే బావ’, ‘పాండురంగ మహత్యం’, ‘తోడి కోడళ్ళు’, ‘చెంచులక్ష్మి’, ‘మాంగళ్య బలం’, ‘కృష్ణ లీలలు’, ‘పెళ్లి కానుక’, ‘కృష్ణ ప్రేమ’, ‘శాంతినివాసం’, ‘శ్రీ వెంకటేశ్వర మహత్యం’, ‘శ్రీ సీతారామ కళ్యాణం’, ‘బాటసారి’, ‘శబాష్‌ రాజా’, ‘భీష్మ’, ‘గులేబకావలి కథ’, ‘సిరి సంపదలు’, ‘తిరుపతమ్మ కథ’, ‘లవకుశ’, ‘సంపూర్ణ రామాయణం’, ‘శ్రీమంతుడు’, ‘ఆదిత్య 369’, ‘సీతారామయ్య గారి మనవరాలు’, ‘నిన్నేపెళ్లాడతా’, ‘మురారి’ తదితర సినిమాలలో పాటలకు జిక్కి తన గాత్రాన్ని అందించారు.

- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌  


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.