ప్రతిభకు గీటురాయి... సృజనకు సూదంటురాయి!
తెలుగు సినిమా పుట్టి 86 సంవత్సరాలయినా, అందరికీ ఈ నాటికీ ఏనాటికీ నచ్చే ఏకైక చిత్రం ‘మాయాబజార్‌’!
భారతదేశంలో సినిమా (మూకీ) పుట్టిన సంవత్సరం 1913. నూరేళ్ల తర్వాత 2103లో నూరు సంవత్సరాల్లో అన్ని భాషల్లోనూ వచ్చిన నూరు గొప్ప చిత్రాలేంటో చెప్పమంటూ ఐ.బి.ఎన్‌ - సి.ఎన్‌.ఎన్‌ టీవీ చానెల్స్‌ ఓటింగ్‌ పెడితే మన తెలుగు సినిమా ‘మాయాబజార్‌’ మొట్టమొదటి స్థానం పొందింది!
1957లో విడుదలై షష్టిపూర్తి జరుపుకున్న ఈ మహాచిత్రం ‘మాయాబజార్‌’ సృష్టికర్త కె.వి.రెడ్డి (కదిరి వెంకటరెడ్డి) తెలుగు సినిమా ఆలయానికి నిస్సందేహంగా ఒక ధ్వజస్తంభం!ఇవాళ కె.వి.రెడ్డి వర్థంతి. ఈ సందర్భంగా ఆ మహనీయుని గురించి స్మరించుకుందాం...


తాడిపత్రి సొంతవూరు. వాహిని సంస్థ ఆవిర్భావానికీ, వాహిని స్టూడియో వెలియడానికీ మూల పురుషుడైన మూలా నారాయణస్వామిదీ అదే ఊరు. కె.వి.కి సహధ్యాయి. కేవీకి బీఎస్సీ చదివిన తర్వత సినిమాల్లో ప్రవేశించాలనే ఆలోచన కలిగింది. నాటి నుంచే సినిమాకి సంబంధించిన ఆంగ్ల పుస్తకాలు అనేకం చదవడం ఆరంభించారు. రష్యన్‌ దర్శకులు, జపనీస్‌ నిర్మాతలూ తీసిన చిత్రాలు, రాసిన పుస్తకాలూ పరిశీలించారు. సినిమాకి స్క్రీన్‌ప్లే ప్రాణం అన్నది ఆనాడే తెలుసుకున్నారు. 1937లో రోహిణి పేరిట హెచ్‌.ఎమ్‌.రెడ్డి ‘గృహలక్ష్మి’ (1938) ఆరంభిస్తే ఆ బృందంలో కె.వి.ని కూడా ప్రవేశపెట్టారు నారాయణస్వామి. తన చేతిలో ఎప్పుడూ డబ్బు ఉండేది. అందరికి ఇచ్చేవారు - కానీ, తనకి జీతం లేదు. అక్కడ ఆయన ఉద్యోగం జీతం లేని క్యాషియర్‌. అయితే మాత్రం? ఆలోచనంతా సినిమా నిర్మాణం, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే రచన మీదనే. మద్రాసు నగరంలోని ముఖ్యమైన థియేటర్లలో మంచి ఆంగ్ల చిత్రాలు ప్రదర్శింపబడేవి. ‘గృహలక్ష్మి’ దర్శకత్వశాఖలో సహయ దర్శకుడైన కమలాకర కామేశ్వరరావు, కె.వి.రెడ్డి ఆంగ్ల చిత్రాలు చూసి, వాటి మీద విశ్లేషణలు, సమీక్షలూ చేసేవారు. ‘గృహలక్ష్మి’ తర్వాత వాహిని సంస్థ ఆరంభమైతే, రోహిణిలో ఉన్న బృందం బి.ఎన్‌.రెడ్డి, నాగిరెడ్డి, సముద్రాల, కె.వి.రెడ్డి, కె.కామేశ్వరరావు అందరూ వాహినికి వచ్చేశారు. బి.ఎన్‌.రెడ్డి దర్శకుడిగా వాహిని ‘వందేమాతరం’ (1939) నిర్మించింది. సినిమాటోగ్రఫీలో నిష్ణాతుడైన కె.రామనాథ్‌ వాహినిలో చేరి వందేమాతరానికి స్క్రీన్‌ప్లే రాశారు. రామ్‌నాథ్‌ స్క్రీన్‌ప్లే రాయడంలో ఉద్దండుడని, ఆయనే మాకు మార్గదర్శి అని బి.ఎన్‌., కె.వి. ఎప్పుడూ చెప్పేవారు. ‘వందేమాతరం’ విజయ సాధనతో వాహిని, ‘సుమంగళి’ (1940), ‘దేవత’ (1941) చిత్రాలు నిర్మించింది. తర్వాత చిత్రాన్ని కె.వి. డైరక్టు చేస్తాడని, మూలా నారాయణస్వామి ప్రకటించారు. నారాయణస్వామికి కె.వి.మీద ఎనలేని విశ్వాసం. ‘‘క్యాషియర్‌ ఉద్యోగంలో ఉన్నవాడు సినిమా ఎలా డైరక్టు చేస్తాడు?’’ అని అందరూ విమర్శించారు. ‘‘కె.వి. దర్శకత్వంలో సినిమా విజయం సాధిస్తే అది వాహినిదే. అది పరాజయం పొందితే, ఆ నష్టం నేను భరిస్తాను’’ అని మూలా నారాయణస్వామి, కె.వి.ని బలపరిచారు. కె.వి. ఎప్పట్నించో ‘పోతన’ కథ తియ్యాలని ఆలోచన. దాని గురించి ఆలోచిస్తూనే వస్తున్నారు. రామ్‌నాథ్‌కి తన ఆలోచన వివరించి, స్క్రీన్‌ప్లే రాయించారు. ఆయనే ఛాయాగ్రహకుడిగా, ‘భక్తపోతన’ (1943) కె.వి. డైరక్టు చేస్తే ప్రేక్షక మేఘాలచేత, కనక వర్షం కురిపించింది. ఒక్క తెలుగు ప్రాంతంలోనే కాకుండా, కర్ణాటక, కేరళ, తమిళ రాష్ట్రాల్లో కూడా ‘పోతన’కి సంబరాలు జరిగాయి. సినిమా అంతా భక్తిరసం. ‘పోతన’ పాత్రకి, నాగయ్య అనుకూలం కాదని చాలామంది భావిస్తే, ‘ఎందుకు కాడో నేను నిరూపిస్తాను’ అని, కె.వి. నాగయ్యచేత ఆ పాత్ర ధరింపజేసి, అత్యద్భుతంగా నటింపజేశారు. ఒక గొప్ప దర్శకుడు, గొప్ప నటుడూ తోడైనారు. సినిమా అంతా కె.వి. తానే చేసినా, బి.ఎన్‌.రెడ్డి చిత్రనిర్మాణ పర్యవేక్షకుడిగా తన పేరు వేసుకొనేందుకు ఎవరూ అభ్యంతర పెట్టలేదు!


కె.వి.రెడ్డి దర్శకుడైనా, దర్శకత్వ వ్యవహారాలు మాత్రమే చూస్తూ కూచోరు. నిర్మాణం కూడా చూసుకునేవారు. ‘భక్తపోతన’ హిట్‌ కావడంతో, వాహినికి ఒక సినిమా, బి.ఎన్‌. ఒక సినిమా కె.వి. చేసేలాగా ఒప్పందం కుదర్చుకున్నారు. 1946లో బి.ఎన్‌.రెడ్డి ‘స్వర్గసీమ’ తీశారు. యుద్ధం రోజులు, ఉన్నవాళ్లు ఉంటూ వెళ్లిన వాళ్లు వెళ్తూ ఉండంతో సినిమా పరిశ్రమ అస్తవ్యస్తమైంది, వాహిని సంస్థ వెంటనే చిత్రం తియ్యలేకపోయింది. ఆలోగా నాగయ్య తానుగా ‘త్యాగయ్య’ ఆరంభించి, తానే దర్శకత్వం వహించి, 1946లో విడుదల చేస్తే అదే అఖండ విజయం సాధించింది. కె.వి.రెడ్డి నాగయ్యకి సరిపోయే మరో పాత్రని తీసుకుని ‘యోగివేమన’ (1947) నిర్మించారు. తాను దర్శకుడైనా, కూడా, ‘స్వర్గసీమ’కి నిర్మాణశాఖలో పనిచేశారు కె.వి. ‘యోగివేమన’ వేదాంతపరమైన సినిమా కావడంతో, ప్రజ అర్థం చేసుకోలేదు. సినిమాకి కాసులు రాలకపోయినా, కానుకలు వర్షించాయి. ప్రపంచం మీద అన్ని భాషల చిత్రాల్లోనూ ఉన్న క్లాసిక్స్‌లో ‘యోగివేమన’ కూడా జమ చెయ్యబడింది. కె.వి మేధాశక్తి, ఆలోచన, దృశ్యకల్పన - అన్నీ వేమన చూపించింది. ‘‘నిస్సందేహంగా కె.వి.రెడ్డి తీసిన అన్ని చిత్రాల్లోనూ ‘యోగివేమన’ మిన్న’ అని మేధావులు, సినిమా విశ్లేషకులూ కీర్తించారు. వేమన వల్ల వాహినికి ధనదృష్టి కలగకపోవడంతో, అప్పుడు జానపద చిత్రాలు ముమ్మరంగా ఉన్నాయి గనక, అలాంటి చిత్రం తియ్యాలని వాహినికి ‘గుణసుందరికథ’ (1949) నిర్మించారు కె.వి.రెడ్డి. కొత్తకథతో, సెంటిమెంట్‌తో ‘గుణసుందరికథ’ ఆపామర పండితాన్ని మెప్పించి కాసులు పండించింది. భక్తి తియ్యాలన్నా, వేదాంతం తియ్యాలన్నా, వినోదం తియాలన్నా కె.వి.రెడ్డి సర్వసమర్థుడు అని పరిశ్రమ చెప్పుకుంది. వేమనకీ, గుణసుందరికీ రామ్‌నాథ్‌ లేరు. కె.వి., కమలాకర కామేశ్వరరావు కథా చర్చలు చేసి, స్క్రీన్‌ప్లే రచించారు. ]విజయవారి ‘షావుకారు’ (1950) ఆర్థిక లాభాలు పొందకపోవడంతో వాళ్లు కూడా కె.వి.రెడ్డితో జానపదం చేయించారు. అది ‘పాతాళభైరవి’ (1951). ఘనవిజయం సాధించి, విజయసంస్థకి పెట్టుబడి పెట్టించింది. వాహినికి తీసిన ‘పెద్దమనుషులు’ (1954) ఆరోజుల్లో ‘నభూతో నభివిష్యతి’ అనిపించకున్న సినిమా. ఏ విధమైన సినిమా అయినా కె.వి. తియ్యగలరన్న నమ్మకం ఏర్పడింది. ఆయన నిర్మాణ విధానం, పద్ధతి, ప్రణాళిక తక్కిన వారికి ఆదర్శం. ఆయనతో తమ మొదటి చిత్రం తీయించుకోవాలని అన్నపూర్ణ సంస్థ మూడు సంవత్సరాలు నిరీక్షించింది! కె.వి ఒక్కసారి ఒకే చిత్రం తీసేవారు. తక్కినవాళ్లలాగా రెండు మూడు సినిమాలు ఒకేసారి చెయ్యడం తనకి తెలీదనేవారు. ‘ఐ డోన్ట్‌ హేవ్‌ టూ బ్రెయిన్స్‌’ అనేవారాయన.కె.వి.రెడ్డి తీసిన అన్ని చిత్రాలూ విజయం సాధించ లేకపోవచ్చు. కానీ, ఆయన దర్శకత్వ లోపం కనిపించదు. ‘భాగ్యచక్రం’ (1968) సినిమా ఆయన పేరుతో వచ్చింది గాని, కథలోగాని దర్శకత్వంలోగాని ఆయన ప్రమేయం తక్కువ. నిర్మాతతో గొడవలు పడి, మధ్యలో ఆయన తప్పుకున్నారు.
కె.వి.రెడ్డి ద్వారా ఇద్దరు మహా రచయితలు పరిచయమైనారు. పింగళి నాగేంద్రరావు, డి.వి.నరసరాజు. పురాణం, చరిత్ర, సాంఘికం వంటి అన్ని రకాల చిత్రాలూ తీశారు కె.వి.రెడ్డి. పూనా ఫిలిమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కె.వి చిత్రాలు విద్యార్థులకు పాఠాలు. ఆ సినిమాలు ఎన్నో విషయాలు బోధిస్తాయి, నేర్పుతాయి.

                                                                                                                                                             - రావి కొండలరావు
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.