నిర్మాతగా చెరగని ముద్ర

బాపు దర్శకత్వం వహించిన ‘మనవూరి పాండవులు’ చిత్రంతో నిర్మాతగా ప్రస్థానం ప్రారంభించిన జయకృష్ణ పూర్తి పేరు కాగిత జయకృష్ణ. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి ఆయన స్వస్థలం. మేకప్‌మేన్‌గా ఆయన సినీ జీవితం ప్రారంభమైంది. కృష్ణంరాజు, శ్రీదేవి, శోభన్‌బాబు, జయప్రద, విజయశాంతి... ఇలా ఎంతోమంది తారలకు వ్యక్తిగత మేకప్‌మేన్‌గా పనిచేశారు. కృష్ణంరాజుతో ఉన్న అనుబంధంతో ఆయన నిర్మించిన ‘కృష్ణవేణి’, ‘భక్తకన్నప్ప’, ‘అమరదీపం’ చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా పనిచేశారు. 1977లోఓ జె.కె. మూవీస్‌ స్థాపించారు. ‘సీతారాములు’, ‘కృష్ణార్జునులు’, ‘మంత్రిగారి వియ్యంకుడు’, ‘జాకీ’, ‘సీతమ్మ పెళ్లి’, ‘ముద్దుల మనవరాలు’, ‘స్రవంతి’, ‘మిస్టర్‌ భరత్‌’, ‘రాసలీల’, ‘వివాహ బంధం’, ‘నీకూ నాకూ పెళ్లంట’ తదితర చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు జయకృష్ణ. శ్రీదేవితో ఆయనకు మంచి అనుబంధం ఉంది. శ్రీదేవి బాలనటిగా కనిపించిన ‘బడిపంతులు’, ‘బాలభారతం’ చిత్రాలకు శ్రీదేవి వ్యక్తిగత మేకప్‌మేన్‌గా పనిచేశారాయన. ముద్దు ఆర్ట్స్‌ మూవీస్, జయకృష్ణ మూవీస్‌ సంయుక్తంగా నిర్మించిన ఓ చిత్రానికి మెగాస్టార్‌ చిరంజీవి జయకృష్ణ చేతుల మీదుగా వెయ్యినూట పదహార్లు అందుకున్నానని చిరంజీవి చెబుతుండేవారు. మార్చి 29, 2016న హైదరాబాద్‌లో తన స్వగృహంలో కన్నుమూశారు. ఈయనకు ఒక భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.