సీనీ నటనాధురీణ... సత్యనారాయణ
గంభీరమైన వాచకంతో, నవరసభరితమైన నటనతో, అబ్బురపరచే ఆంగికంతో, హావభావాలను చిలికిస్తూ నటనకే భాష్యం చెప్పిన నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ. వీర, రౌద్ర, బీభత్స రసాలను అటు పౌరాణిక జానపదాల్లోను, ఇటు చారిత్రాత్మక, సాంఘిక చలన చిత్రాలలోను తనదైన శైలితో మెప్పించిన గొప్ప నటుడు సత్యనారాయణ. నిలువెత్తు విగ్రహంతో యన్‌.టి.రామరావు కృష్ణుడైతే, సత్యనారాయణే సుయోధనుడు. రామారావు రాముడైతే, సత్యనారాయణ రావణాసురుడు. విఠలాచార్య ప్రోత్సాహంతో ప్రతినాయకునిగా రాణించిన అనుభవశాలి. ‘నాపేరే భగవాన్‌’లో ప్రాణ్‌ను మరపించిన నటనతో, ‘శారద’లో చెల్లెలి కోసం ప్రాణం విడిచేందుకైనా వెరవని అన్నగా, ‘తాత మనవడు’లో నిర్దయుడైన తనయునిగా, ‘యమగోల’లో ‘‘యముండ’’ అనే ట్రేడ్‌ మార్క్‌ డైలాగుతో దయామయుడైన శిక్షకునిగా, ‘వేటగాడు’లో అమాయక చక్రవర్తిగా, ‘సావాసగాళ్లు’లో ఉంగరాల సాంబయ్యగా, ‘సూత్రధారులు’లో సంగీతానికి జీవితాన్నే వెచ్చించిన కళాకారునిగా, ‘సిరిసిరిమువ్వ’లో వికలాంగుడైన చేతగాని తండ్రిగా, ‘గురువును మించిన శిష్యుడు’లో ధర్మపాలునిగా వైవిధ్య నటనకు ఊపిరులూదిన ఈ సార్వభౌముడు ఎనభై రెండేళ్ల వయసుని, ఎనిమిది వందల సినిమాలతో అరవై ఏళ్ల నటనానుభవాన్ని, అన్నిటినీ మించి అసాధారణ జీవితసారాన్ని ఆపోసన పట్టిన మహామేధావి. ఇవాళ ఆయన పుట్టినరోజు. సత్యనారాయణ గురించిన కొన్ని విశేషాలు..


తొలి ప్రయత్నాలు...
కృష్ణా జిల్లా కౌతవరం సత్యనారాయణ (25 July 1935)  జన్మస్థలం. హైస్కూల్‌ చదువు గుడ్లవల్లేరులో, కాలేజి చదువు విజయవాడ, గుడివాడలో పూర్తిచేశారు. మంచి స్ఫురద్రూపి, రింగుల జుట్టుతో చూపరులకు ఎన్టీఆర్‌లా కనిపించేవారు. దాంతో నాటకాల మీద అభిరుచి పెరిగి ఎప్పటికైనా మంచి సినిమా నటుడిగా ఎదగాలని కలలు కన్నారు. ఇంటర్మీడియట్‌ చదివే రోజుల్లో వివిధ నాటక సంస్థల తరపున రాష్ట్రమంతా పర్యటించి పల్లెపడుచు, బంగారు సంకెళ్లు, ప్రేమలీలలు, కులంలేని పిల్ల, ఎవరుదొంగ వంటి నాటకాల్లో అటు విలన్‌గా ఇటు హీరోగా కూడా నటిస్తూ ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు. 1955 నాటికే డిగ్రీ పూర్తి చేయగలిగినా సత్యనారాయణకు ఉద్యోగం రాలేదు. రాజమండ్రిలో సత్యనారాయణ కుటుంబానికి కలప వ్యాపారం ఉండేది. అక్కడ కొంతకాలం గడిపి, స్నేహితుడు కె.ఎల్‌.ధర్‌ సలహాలపై సినిమాల్లో ప్రయత్నాలు సాగించేందుకు మద్రాసు వెళ్లారు. ఆ స్నేహితుడు ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలో సహాయ కళాదర్శకుడిగా పనిచేస్తుండేవాడు. ‘కొడుకులు-కోడళ్లు’ అనే సినిమా కోసం దర్శక నిర్మాత ఎల్‌.వి.ప్రసాద్‌, సత్యనారాయణకు స్క్రీన్‌ టెస్టులన్నీ చేసి ఓకే చేశారు. దురదృష్టవశాత్తు ఆ సినిమా ప్రారంభం కాలేదు. మొక్కవోని ధైర్యంతో సత్యనారాయణ దర్శకనిర్మాత బి.ఎ.సుబ్బారావును కలిశారు. ఆయన సత్యనారాయణను ప్రముఖ దర్శకనిర్మాత కె.వి.రెడ్డి వద్దకు పంపితే ఆయన మేకప్‌ టెస్ట్‌, వాయిస్‌ టెస్ట్‌, స్క్రీన్‌ టెస్ట్‌ అన్నీ చేయించి కూడా అవకాశం కల్పించలేకపోయారు. అలా ‘దొంగరాముడు’ సినిమాలో తనకు దక్కాల్సిన పాత్ర ఆర్‌.నాగేశ్వరరావుకు దక్కింది. చివరకు దేవదాసు నిర్మాత డి.ఎల్‌.నారాయణ సత్యనారాయణను స్ఫురద్రూపాన్ని చూసి, అతని గెటప్‌ నచ్చి, చందమామ బ్యానర్‌పై చెంగయ్య దర్శకత్వంలో తీసిన ‘సిపాయి కూతురు’లో హీరోగా జమున సరసన నటింపజేశారు. అదే సత్యనారాయణకు మొదటి సినిమా. ఆ సినిమా ఆశించినంత విజయాన్ని సాధించలేదు. డి.ఎల్‌. మూడు సంవత్సరాల అగ్రిమెంటు మీద సత్యనారాయణతో నెలకు మూడువందల రూపాయల జీతం మీద కాంట్రాక్టు కుదుర్చుకోవడంతో, అతనికి ఇతర సంస్థల్లో నటించడానికి అవకాశం లేకపోయింది. ‘సిపాయి కూతురు’ దెబ్బతినడంతో డి.ఎల్‌ కూడా సత్యనారాయణతో మరో సినిమా ప్రారంభించలేకపోయారు. ఎన్టీఆర్‌కు దగ్గర పోలికలుండటం చేత సత్యనారాయణ ఖాళీగా ఉండకుండా ఆయనకు డూపుగా చాలా సినిమాల్లో నటించారు. 1960లో ఎన్టీఆర్‌ చొరవతోనే మోడరన్‌ థియేటర్స్‌ వారి ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’ చిత్రంలో అతిధి నటుడిగా నటించారు. ఈ సినిమా దర్శకుడు ఎస్‌.డి.లాల్‌ విఠలాచార్య శిష్యుడు కావటంచేత, సత్యనారాయణలో ఉన్న ట్యాలెంట్‌ను గుర్తించి విఠలాచార్యకు చెప్పి ప్రతినాయకునిగా ‘కనకదుర్గ పూజామహిమ’లో నటింపజేశారు. అందులో సత్యనారాయణ పోషించిన సేనాధిపతి పాత్ర అతన్ని విలన్‌గా నిలబెట్టింది. అప్పుడే నాగేశ్వరమ్మతో సత్యనారాయణకు వివాహం జరిగింది. ఆపై హీరోగా నిలదొక్కుకోవలసిన సత్యనారాయణ దుష్ట పాత్రలకు పరిమితం కావలసి వచ్చింది. బి.ఎన్‌.రెడ్డి కూడా ‘రాజమకుటం’ సినిమాలో సత్యనారాయణ చేత చిన్న పాత్ర పోషింపజేశారు.


దుష్ట పాత్రల్లో జీవించి...
‘కనకదుర్గ పూజా మహిమ’ సినిమా తర్వాత కొంతకాలం గ్యాప్‌ వచ్చినా 1962లో సత్యనారాయణకు మంచి అవకాశాలు వచ్చాయి. శ్యాం ప్రసాద్‌ మూవీస్‌ వారు వై.ఆర్‌.స్వామి దర్శకత్వంలో నిర్మించిన ‘స్వర్ణగౌరి’లో శివుడి పాత్ర సత్యనారాయణను వరించింది. తర్వాత ‘మదనకామరాజు కథ’లో ధర్మపాలుడుగా, ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లో కర్ణుడిగా, సి.పుల్లయ్య సారధ్యంలో వచ్చిన సంచలన పౌరాణిక రంగుల చిత్రం ‘లవకుశ’లో భరతునిగా, నర్తనశాలలో దుశ్శాసనునిగా, మనాపురం అప్పారావు నిర్మించిన ‘పరువు ప్రతిష్ట’లో ప్రతినాయకునిగా నటించారు. విఠలాచార్య సినిమా ‘అగ్గిపిడుగు’లో రాజనాల ఆంతరంగికునిగా, ‘జిస్‌ దేశ్‌ మే గంగా బెహతీ హై’లోని ప్రాణ్‌ గెటప్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. ‘శ్రీకృష్ట పాండవీయం’, ‘పాండవవనవాసం’లో ఘటోత్కచునిగా, ‘శ్రీకృష్ణావతారం’, ‘కురుక్షేత్రం’లో సుయోధనుడిగా, ‘దానవీరశూరకర్ణ’లో భీమునిగా, ‘చాణక్య చంద్రగుప్త’లో రాక్షస మంత్రిగా, ‘సీతాకల్యాణం’లో రావణాసురునిగా, అసమాన నటనను ప్రదర్శించారు. ఇక సత్యనారాయణ వెనుకకు తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ‘కథానాయిక మొల్ల’లో శ్రీకృష్ణదేవరాయలుగా నటించి మెప్పించారు. ‘ఉమ్మడికుటుంబం’ సినిమాలో ఎన్టీఆర్‌కు జాలిగొలిపే అన్నగా, ‘వరకట్నం’లో కృష్ణకుమారి సోదరునిగా అద్భుతనటన ప్రదర్శించారు. ‘శారద’ సినిమాతో సత్యనారాయణ మంచి కేరక్టర్‌ నటునిగా గుర్తింపు పొందారు. ‘ప్రేమనగర్‌’లో కేశవవర్మ పాత్రలో సత్యనారాయణ జీవించారు. ‘అడవిరాముడు’, ‘వేటగాడు’ సినిమాల్లో విభిన్నమైన విలన్‌ పాత్రలు పోషించి అద్భుతంగా మెప్పించారు.


కేరక్టర్‌ నటునిగా.. నిర్మాతగా
యస్‌.వి.రంగారావు మరణానంతరం ఆయన పోషించాల్సిన గంభీర పాత్రలు ఎక్కువగా సత్యనారాయణనే వరించాయి. దాంతో కేరక్టర్‌ నటునిగా తనని తాను మలుచుకునే అవకాశం సత్యనారాయణకు దక్కింది. ‘గూండా’, ‘గ్యాంగ్‌లీడర్‌’, ‘సమరసింహారెడ్డి’ వంటి సినిమాల్లో బాధ్యాతాయుతమైన పోలీసు అధికారిగా నటించి ఆ పాత్రలకే వన్నె తెచ్చారు. రామానాయుడు సినిమా ‘సావాసగాళ్లు’లో గుమ్మడితో కలిసి ఒక గ్రూప్‌ డ్యాన్స్‌ పాటలో సత్యనారాయణ నర్తించాల్సి వచ్చింది. నృత్యదర్శకుడు హీరాలాల్‌ వీళ్లిద్దరూ స్టెప్పులు ఎలా వెయ్యాలో వివరించారు. మంగళగిరిలో అవుట్‌డోర్‌లో చిత్రీకరణ రంగం సిద్ధమైంది. జయచిత్రకు సత్యనారాయణ స్టెప్పులు వేయడానికి పడుతున్న ఇబ్బంది అర్థమైంది. ఆ స్టెప్పులు వెయ్యాల్సిన విధానం నెమ్మదిగా వివరించింది. ఇంకేముంది సత్యనారాయణ, గుమ్మడి విజృంభించి నాట్యం చేసి ఒకే షాట్లో ఆ సన్నివేశాన్ని ఓకే చేయించేశారు. ‘తాత మనవడు’, ‘చదువు సంస్కారం’, ‘తూర్పుపడమర’, ‘నేరము శిక్ష’, ‘సిరిసిరిమువ్వ’, ‘బంగారు కుటుంబం’, ‘అన్వేషణ’, ‘తాతయ్య ప్రేమలీలలు’, ‘బొబ్బిలిరాజా’, ‘మంత్రిగారి వియ్యంకుడు’, ‘శ్రుతిలయలు’, ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’, ‘రుద్రవీణ’, ‘అల్లుడుగారు’, ‘ఒంటరిపోరాటం’ వంటి సాంఘిక చిత్రాల్లో సత్యనారాయణ విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు, సోషల్‌ ఫాంటసీ చిత్రాలు ‘యమగోల’, ‘యమలీల’, ‘యముడికి మొగుడు’ వంటి చిత్రాల్లో యముడిగా జీవించారు. వృత్తిమీద సత్యనారాయణకున్న అంకిత భావమే ఆయనను నిర్మాతగా మార్చింది. ‘దరువు’ సినిమాలో చివరిసారిగా కనిపించారు. రమా ఫిలిమ్స్‌ పేరిట చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించి, ‘గజదొంగ’, ‘ఇద్దరు దొంగలు’, ‘కొదమ సింహం’, ‘బంగారు కటుంబం’, ‘ముద్దుల మొగుడు’, వంటి ఎనిమిది ప్రయోజనకరమైన చిత్రాలు తీసి విజయం సాధించారు. కొన్ని చిరంజీవి సినిమాలకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు.


పురస్కారాలు.. సత్కారాలు
సత్యనారాయణ నటించిన 800 పైచిలుకు చిత్రాల్లో 223 సినిమాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. దాదాపు 200 మంది దర్శకులతో సత్యనారాయణ కలిసి పనిచేశారు. పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సాంఘిక చిత్రాల్లో వైవిధ్య భరితమైన నటన ప్రదర్శించినందుకు సత్యనారాయణకు అనంతపురం, గుడివాడ పట్టణాలలో ‘నటశేఖర’ బిరుదు ప్రదానం చేశారు. కావలి విశ్వోదయ సాంస్కృతిక సంస్థ వారు ‘కళాప్రపూర్ణ’ బిరుదుతో సత్కరించారు. ఇక ‘నవరస నటనా సార్వభౌమ’ బిరుదు సార్వజనీనకంగా అమరినదే. ‘తాత మనవడు’, ‘సంసారం సాగరం’, ‘కచదేవయాని’ సినిమాలకు ఉత్తమ నటునిగా నంది బహుమతులను అందుకున్నారు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలం సత్యనారాయణకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డునిచ్చి గౌరవించింది. తెలుగుదేశం పార్టీ తరపున మచిలీపట్నం పార్లమెంటు సభ్యునిగా కైకాల సత్యనారాయణ వ్యవహరించారు. సొంతవూరు కౌతవరంలో తన తాతగారి పేరుతో ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని సత్యనారాయణ కట్టించారు. అలాగే గుడివాడలో ఒక కళామంటపం నిర్మించారు. పేద విద్యార్థులకు చదువుతోబాటు పెళ్లిళ్లు, ఉపాధి అందిస్తున్నారు. సామాజిక సేవలో తరిస్తున్న విశ్రాంత నవరస నటనాసార్వభౌమునికి నిండు నూరేళ్ల ఆయుషు ఆ భగవంతుడు ఇవ్వాలని సితార కోరుకుంటోంది.


సత్యనారాయాణ అభిప్రాయాలు..

* ‘‘నేను, ఎన్టీఆర్‌ అన్నయ్య (ఎన్టీఆర్‌) ఒకే ఫ్రేములో ఉంటే ఒక సింహం, ఒక ఏనుగు డీకొన్నట్లు ఉండేది. నన్ను ‘నంబర్‌ వన్‌ విలన్‌వి’ అని అన్నగారు మెచ్చుకునేవారు. ఉమ్మడి కుటుంబం సినిమాలో నాకు మంచి సెంటిమెంట్‌ పండించే రైతు పాత్రను ఇస్తే, విలన్‌గా చేసేవాడికి సెంటిమెంట్‌ క్యారక్టరా అన్నవాళ్లు ఉన్నారు. ఆ పాత్ర ప్రేక్షకులచేత కన్నీరు పెట్టించింది. ఆ సినిమా తర్వాత ‘జీవితంలో మాకు మీలాంటి అన్నయ్య లేడనే కొరతగా ఉందండీ’ అంటూ ఉత్తరాలు వచ్చాయి. ‘శారద’ సినిమా నా జీవిత గమనాన్నే మార్చేసింది’’
* ‘‘దర్శకనిర్మాత సుభాష్‌ ఘాయ్‌ నన్ను ‘కర్మ’ సినిమాలో పరిచయం చేసినప్పుడు నా నటనకు ముగ్దుడై ‘నీలో ఒక అశోక్‌కుమార్‌, సంజీవ్‌ కుమార్‌, శివాజి గణేశన్లు ముగ్గురూ ఉన్నారు’ అని ప్రశంసించారు’’

* ‘‘సూర్యకాంతం అక్కయ్య సెట్లోకి తెచ్చే బొబ్బట్లు, పులిహోర, నిర్మలమ్మ వడ్డించే కోడిగుడ్లు, ఉవలచారు, కోడిమాంసం జీవితంలో మరచిపోలేను. చెట్లనీడల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తినేవాళ్లం’’

* ‘‘మా రోజుల్లో సినిమా నిర్మాణం పూర్తయ్యాక పరిశ్రమలో ఉన్న దర్శకుల్ని, నిర్మాతల్ని, నటీనటుల్ని పిలిచి ప్రీవ్యూ వేసేవారు. అభిప్రాయాలు తెలుసుకునేవారు. ఇప్పుడు ఆ ఊసే లేదు. ఇప్పుడొస్తున్న సినిమాల్లో పాటలు ‘హాల్‌ టైం గ్రేట్స్‌’. హాలు బయటకు వచ్చాక గుర్తుండవు. సినిమాల్లో హింస అనే అంశానికి ప్రాధాన్యత పెరుగుతోంది..కథకు తగ్గుతోంది’’

- ఆచారం షణ్ముఖాచారి  


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.