నవ్యత కోసం తపించిన కళాధర్‌
చేసే పనిమీద భక్తి, శ్రద్ధ, తపన ఉన్నవాళ్లకి రాణింపులో ఢోకా ఉండదు. తమ వృత్తిలో ముందుకెళ్లగలరు. కళాదర్శకుడు కళాధర్‌ తన పనిమీద చూపించిన అమితమైన శ్రద్ధ ఎలాంటిదో, ఆయన పనిచేసిన చిత్రాలు సాక్ష్యం పలుకుతాయి. ఒక ‘మాయాబజార్‌’, ‘పాతాళభైరవి’లాంటి పురాణ, జానపద చిత్రాలు పరిశీలిస్తే - పాత్రలు ధరించిన వస్త్రాలు, ఆభరణాలు - అన్ని పాత్రోచితంగా కనిపిస్తాయి. అలా కనిపించడానికి కారణం - కళాదర్శకులు, కాస్ట్యూమర్సు. విజయ సంస్థ ఆరంభ కాలం నుంచి గోఖలే, కళాధర్‌ ఇద్దరూ కళా దర్శకులే. పాత్రలకీ, సెట్స్‌కీ, గోఖలే స్కెచెస్‌ గీస్తే - వాటికి ‘రూపం’ ఇవ్వడం - కళాధర్‌ బాధ్యత. అంతే కాదు దుస్తులు, ఆభరణాలు చూసుకోవడం కూడా ఆయన బాధ్యతే. విజయవారి తొలి చిత్రం ‘షావుకారు’ సాంఘికమే అయినా నేపథ్యాల్ని చూపించడంలో కళాదర్శకుల ప్రతిభ కనిపిస్తుంది. ఇళ్లలో ఎలాంటి మంచాలు ఉండాలి? కుర్చీలు ఉండాలి? దగ్గర్నుంచి ప్రతిదీ పరిశీలించి, పరిశోధించి ఏర్పాటు చేశారు. ఇప్పుడంటే రెండు పక్కపక్క ఇళ్లలో సినిమా తీయ్యెచ్చు. అప్పుడు సెట్టు వెయ్యాలి ఫ్లోర్‌లో. రెండుళ్లు పక్కపక్కనే ఉండేలా - పెద్ద ఫ్లోర్‌లో సెట్‌ నిర్మించారు. అయితే, తరువాత వచ్చిన జానపదం ‘పాతాళభైరవి’ పెద్ద పరీక్ష! ఆ చిత్రాన్ని అన్ని విధాలా ‘అద్భుత చిత్రం’గా రూపొందించాలని అందరూ పట్టుబట్టారు. అంతవరకూ వచ్చిన జానపద చిత్రాలకు భిన్నంగా ‘పాతాళభైరవి’ రూపుదిద్దుకుందంటే అందుకు కారణం దర్శక నిర్మాతల దగ్గర్నుంచి అన్ని శాఖలూనూ. ఇందులో మాంత్రికుడి ఆహార్యం, దుస్తులూ; తోట రాముడి దుస్తులూ కొత్తగా కనిపిస్తాయి. కొత్తదనం కోసం పాటుపడిన కళాదర్శకుడు కళాధర్‌.

* కళాధర్‌ అసలు పేరు అది కాదు. వెంకట సుబ్బారావు. ఇంటిపేరు సూరపనేని. చిన్నతనం నుంచి చిత్రాలు గీయడం, బొమ్మలు వెయ్యడం, పెయింటింగ్స్‌ చెయ్యడం మీద ఉత్సాహం ఉండడంతో ‘చిత్రకళ’నే ఆరాధిస్తూ, కళాధర్‌గా పేరు మార్చుకున్నారు. 1915 అక్టోబర్‌ 1వ తేదీన కృష్ణాజిల్లా ఎలుకవాడ గ్రామంలో జన్మించిన సుబ్బారావు - చదువు మీద కంటే బొమ్మలు గీయ్యడం మీదనే శ్రద్ధ పెట్టాడు. పెద్దయ్యాక, ఆ బొమ్మలే ఉపాధి చూపించాయి. డ్రాయింగ్‌ టీచర్‌గా స్కూళ్లలో ఉద్యోగం చేస్తూ - సినిమా మీద అభిలాష పెంచుకున్నాడు. తెలిసిన వాళ్ల దగ్గర లేఖలు పుచ్చుకుని మద్రాసు చేరి, ప్రయత్నాలు సాగిస్తే సారధివారి ‘గృహప్రవేశం’ (1946) ప్రారంభం కానున్నవేళ కళాదర్శకత్వ శాఖలో సహాయకుడిగా ఓ ఉద్యోగం వచ్చింది. తరువాత ‘మనదేశం’ (1949) చిత్రానికి పనిచేశారు. విజయవారు నెల జీతాల మీద నటుల్ని, టెక్నీషియన్లనీ తీసుకున్నప్పుడు కళాధర్‌నీ తీసుకున్నారు. గోఖలే, కళాధర్‌లు ఇద్దరూ ‘షావుకారు’ నుంచి, ‘ఉమా చండీగౌరీ శంకరుల కథ’ వరకూ - ఇరవై సంవత్సరాల పాటు ఆ సంస్థలో పనిచేశారు. డి.వి.యస్‌.వారి ‘గండికోట రహస్యం’ (1969) నుంచి కళాధర్‌ బయటి చిత్రాలకు పని చెయ్యడం ప్రారంభమైంది. దాదాపు 80 చిత్రాకు పనిచేసిన కళాధర్‌ చిత్రాల్లో కొన్ని, ‘జీవనజ్యోతి’, ‘అల్లుడు పట్టిన భరతం’, ‘ముఝే ఇన్‌ సాఫ్‌ చాహీయే’, ‘జమిందారుగారి అమ్మాయి’, ‘పంతులమ్మ’, ‘నాలుగు స్తంభాలాట’, ‘ఇంటింటి రామాయణం’, ‘మహానగరంలో మాయగాడు’, ‘రుద్రతాండవం’, ‘ఓ సీత కథ’, ‘నిప్పులాంటి నిజం’, ‘రాజకోట రహస్యం’.

* ‘‘పెద్ద పెద్ద సెట్లువేసి, భారీగా చూపిస్తేనే కళాదర్శకుడి ప్రతిభ కాదు. కథకి సంబంధించినట్టుగా - సహజంగా ఉన్న సెట్టును రూపొందించినా ప్రతిభే. కానీ, చాలామంది అలా అనుకోరు. ‘మాయాబజార్‌’. ‘జగదేకవీరునికథ’ - చూసి ‘‘ఆర్ట్‌ డైరక్షన్‌ అద్భుతం’’ అన్నారు సామాన్యులు. కానీ, ‘అప్పుచేసి పప్పుకూడు’ ‘గుండమ్మ కథ’, కూడా కళాదర్శకత్వానికి సంబంధించినవే. కళాదర్శకుడికి పరిశీలన, ఆలోచన ఉండాలి. విజయ సంస్థలో కథ అనుకుంటున్నప్పట్నుంచీ - మేము కూడా ఉండేవాళ్లం. ఎలాంటి దుస్తులు? ఆభరణాలూ వస్తువలు? గదలు - అన్ని చర్చలే. జానపద, పౌరాణికాలయితే, ప్రతిదీ స్కెచ్‌ వెయ్యవలసిందే. చెవులకి - చెలికత్తెలకి కూడా - నగలు ఎలాంటివి ఉండాలని స్కెచ్‌లు గీశాను. వేళ్ల ఉంగరాలకీ కూడా స్కెచ్‌వేసి, అలా తయారుచేయించాము. ‘మాయాబజార్‌’లో చినమయ (రమణారెడ్డి) చేతికర్ర వాడతాడు. అది మార్కెట్‌లో ఉన్న కర్ర కాదు. పైన జంతువు ముఖంతో ఉన్న కర్రని డిజైన్‌ చేసి, చేయించినది. పాన్పులు, సింహాసనాలు - ఆసనాలూ అన్నీ చేయించినవే. ‘ప్రియదర్శిని’ (మాయాబజార్‌) అంటే ఎలా ఉండాలని, ఐదారు రకాల స్కెచ్‌ వేస్తే - ఒకటి ఎన్నికయింది! అది, దర్శక నిర్మాతల శ్రద్ధ - వారి అభిరుచి మేరకు అదే శ్రద్ధని కళాదర్శకుడు చూపించాలి’’ అని చెప్పారొకసారి కళాధర్‌.* విజయలో ఉన్నప్పుడు కళాధర్‌ నాకు పరిచయం. ‘సి.ఐ.డి’ (1965) సినిమాలో నేను వేషం వేశాను. అది తమిళ సినిమాకి అనుసరణ. అందులో నేను వేసిన పాత్రకి ఎలాంటి దుస్తులున్నాయో - అవే సిద్ధం చెయ్యమన్నారు కళాధర్‌ - నాకూనూ. అవి వేసుకొని సెట్టుకి వెళితే, నాతో పాటు కళాధర్‌ వచ్చారు. చక్రపాణి చూసి ‘‘ఎందుకీ డ్రస్సు? తమిళ సినిమాలో వేస్తే మనమూ అదే వెయ్యాలా? బావులేదు. మార్చు’’ అన్నారు. అనగానే కళాధర్‌గారే కాస్ట్యూమ్‌ గదికి నన్ను తీసుకెళ్లి - తెలుగుదనంతో వున్న బట్టలు తీయించి - వేయించారు. పైన కండువా కప్పి, మీసం పెట్టించారు. ‘‘ఇప్పుడు పదండీ’’ అన్నారు. చూసి చక్రపాణిగారు ‘‘ఇది బాగుంది కదా’’ అన్నారు. ‘‘ఆయన అభిరుచి తెలుసు కానీ, మూలచిత్రంలో ఉన్నట్టుగానే వెయ్యమంటారేమోనని అలా వేశాం’’ అన్నారు కళాధర్‌. ప్రతి చిన్న వేషాల్ని పెద్ద వేషాల్ని దగ్గరుంచి చూసుకునేవారాయన. మేకప్‌ అయిన తరువాత, ఆయన వేసిన స్కెచ్‌ ప్రకారం మీసంలో గాని, విగ్గులోని గాని తేడా వస్తే ఒప్పుకునేవారు కాదు. ‘జమీందారుగారి అమ్మాయి’ (1975)లో నాది ముఖ్యమైన పాత్ర. శ్రీమంతుడు. విగ్గు, మీసంతో దర్జాగా ఉంటుంది. ఎందుకో మొదటిరోజు మేకప్‌ ఇంటి దగ్గరే వేసుకోవలసి వచ్చింది. డ్రస్‌ కూడా ఇంటికే తెచ్చారు. వాళ్లతో పాటు కళాధర్‌ కూడా వచ్చి, మేకప్‌ అయిన తరువాత చూసి, సూచనలు చేసి, సరిచేయించారు. దుస్తులు వేయించి సరిగ్గా ఉన్నాయే లేవో (కొలతలు) చూసి, ‘ఓకే’ అన్నారు. ఏమిటీ కళాదర్శకుడికి ఇంత శ్రద్ధా? - ‘‘షూటింగ్‌ దగ్గరకే వచ్చి చూడవచ్చుకదా’’ అని అంటే, ‘‘అక్కడ షాట్‌ రెడీ అంటే, అప్పుడు హడావుడయిపోతుంది. ఇప్పుడేమయింది? మన పని మనం ముందే చేసుకుంటే - కచ్చితంగా ఉంటుంది కదా’’ అన్నారు. ఈ శ్రద్ధంతా విజయలో ఉన్నప్పుడు కె.వి.రెడ్డి నుంచి పొందిన శిక్షణ.* అయితే, నేను నటుడినీ, ఆయన కళాదర్శకుడూ కాదు. మేము మిత్రులం. చాలా సౌమ్యుడాయన. పనివాళ్లతో పని చేయించుకోవడం తెలుసు. సెట్టు వేస్తున్నప్పుడు రాత్రీపగలూ దగ్గరే ఉండేవారు. ఎప్పుడూ విజయ సంస్థగురించి, అక్కడ ఉన్న పద్ధతి, క్రమశిక్షణా, నేర్చుకున్నదీ తెలుసుకున్నదీ - అవన్నీ చెప్పేవారు. నేను హైదారాబాద్‌కి మారిన తరువాత, మద్రాసు వెళ్లినప్పుడు ఆయన్ని చూడ్డానికి వెళ్లాను. ఎంత సంతోషించారో! ‘మాయాబజార్‌’ స్వర్ణోత్సవం హైదారాబాద్‌లో చేసినప్పుడు - ఫోనులో ‘‘మీరు రాగలరా? విమాన ప్రయాణం ఏర్పాటు చేస్తాం’’ అంటే ‘‘తప్పకుండా వస్తాను. స్వర్ణోత్సవంలో నేను లేకుండానా?’’ అన్నారు - హాయిగా నవ్వుతూ. అయితే, ఆ వయసులో, నడవలేని స్థితిలో డాక్టర్లు వద్దన్నారని - కళాధర్‌గారి అమ్మాయి చెప్పారు. రాలేకపోయారు. అయినా, ఆ మర్నాడు ఫోన్‌లో మాట్లాడి విషయాలు తెలుసుకొని సంతోషించారు. 98 సంవత్సరాలు (మే 18, 2013) జీవించిన కళాధర్‌గారు - రానురాను సినిమాల్లో కళాదర్శకుడికి ఎలాంటి ప్రాముఖ్యతా లేకుండా పోయిందని బాధపడేవారు. సాంఘిక చిత్రమైన ప్రతి చిన్నపాత్రకీ ఆయన స్కెచ్‌వేసి ఇచ్చేవారంటే ఆశ్చర్యపోవాలి.

- రావి కొండలరావు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.