రావిశాస్త్రి ఏకలవ్య శిష్యుడు!

రచయితగా... నటుడిగా తెలుగు చిత్రసీమపై తనదైన ముద్ర వేశారు కాశీవిశ్వనాథ్‌. ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘మగ మహారాజు’, ‘మగధీరుడు’, ‘గడసరి అత్త సొగసరి కోడలు’, ‘కుర్రచేష్టలు’, ‘ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్‌’, ‘ఘరానా దొంగలు’, ‘సంకెళ్లు’ తదితర చిత్రాలకి రచయితగా పనిచేసిన ఆయన... ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’, ‘గోల్‌మాల్‌ గోవిందం’, ‘నాన్నగారు’, ‘గర్జన’, ‘పెళ్లానికి ప్రేమలేఖ ప్రియురాలికి శుభలేఖ’ తదితర చిత్రాలతో నటుడిగా కూడా అలరించారు. రావిశాస్త్రి ఏకలవ్య శిష్యుడిగా పేరుగాంచిన కాశీవిశ్వనాథ్‌ 1946లో విశాఖపట్నంలో బుచ్చమ్మ, అప్పలస్వామి దంపతులకి జన్మించారు. 1968లో సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన 122 కథలు, 28 నవలలు, 43 నాటికలు రచించారు. 1980లో సినీ రంగ ప్రవేశం చేశారు. ఉత్తమ నాటక రచయితగా ఏపీ సాహిత్య అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పురస్కారాలు అందుకొన్నారు. 2010 ఎన్టీఆర్‌ స్మారక పురస్కారాన్ని కూడా స్వీకరించారు. డిసెంబరు 22, 2015న హైదరాబాద్‌ నుంచి రైలులో విశాఖపట్నం వెళ్తుండగా ఖమ్మం సమీపంలో ఆయన విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించారు. గుండెకి సంబంధించి బైపాస్‌ సర్జరీ చేయించుకొన్న కాశీవిశ్వనాథ్‌ 69 యేళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ఈ రోజు కాశీ విశ్వనాథ్‌ వర్ధంతి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.