మహిళా చిత్రాల దర్శకుడు క్రాంతి కుమార్‌
కాసులు కురిపించే కమర్షియల్‌ చిత్రాలను తీస్తూనే... అభిరుచిగల మంచి చిత్రాలను తీయాలనే తపన మెండుగా ఉన్న సృజనశీలి ఆయన. నిర్మాతగా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు హీరోలతో ఫక్తు మాస్‌ మసాలా చిత్రాల్ని నిర్మించినా... తాను నమ్మిన స్త్రీ వాదాన్ని తెరకి ఎక్కించేందుకు శాయశక్తులా కృషి చేసిన దార్శనికుడు. ఆయనే... క్రాంతికుమార్‌. సినిమాల్లో క్షీరనీర న్యాయం తెలిసిన న్యాయవాది. ఔను... ఆయన అసలు సిసలైన న్యాయవాదే. ఎం.ఏ చదివిన తర్వాత ఎల్‌.ఎల్‌.బి., చేశారాయన. అయితే... సినిమాలపై ఉన్న ఆసక్తితో తొలుత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన తర్వాత్తర్వాత దర్శకుడిగా కూడా రాణించారు. చిరకాలం గుర్తుండిపోయేలా కొన్ని మంచి చిత్రాల్ని మధుర జ్ఞాపకాలుగా మిగిల్చి వెళ్లారు.


క్రాంతి కుమార్‌ పేరు తలచుకోగానే ప్రతిఒక్కరి మదిలో కదిలి ఒకానొక చిత్రం ‘సీతారామయ్యగారి మనవరాలు’. అక్కినేని నాగేశ్వరరావుని విగ్గు లేకుండా కేవలం తెరపై సీతారామయ్యగారిలాగానే కనిపించేలా చేశారు. ఆ ప్రయత్నంతో సఫలీకృతమయ్యారు క్రాంతికుమార్‌.

పల్లెసీమల్లోని ఆకుపచ్చతనం, అన్నెం పున్నెం తెలీని అమాయక జనం, అనురాగాలు, ఆత్మీయతల లోగిళ్లయిన తెలుగిళ్లలోని సంస్కృతీ సంప్రదాయాలతోపాటు అతిధి మర్యాదలు, ఆప్యాయతల్ని పరిమళభరిత సుమదళ హారంలా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సినీ జగత్‌ మెచ్చిన దర్శకుడు క్రాంతికుమార్‌. భావోద్వేగాల్ని తెరపై పండించడంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే... ఆయన తీసిన చిత్రాలు ఆత్మీయ బంధువులై జనజీవనంలో చిరంతనం మనగలుగుతున్నాయి. తాను సృష్టించిన పాత్రలకు చిర యశస్సు అందించడంలో ఆయన మనసునే పణంగా పెట్టారంటే అతిశయోక్తి కాదు.


* ఎన్ని చిత్రాలో... ఎన్ని వైనాలో?
ఒక్క ‘సీతారామయ్యగారి మనవరాలు’ మాత్రమే కాదు... ‘శారద’, ‘ఊర్వశి’, ‘జ్యోతి’, ‘కల్పన’, ‘ఆమె కథ’, ‘న్యాయం కావాలి’, ‘ఇది పెళ్లంటారా?’, ‘స్వాతి’, ‘స్రవంతి’, ‘9 నెలలు’, ‘గౌతమి’...ఇలా అనేక చిత్రాలు ఆయన అభిరుచికి అద్దం పడతాయి. ఈ చిత్రాలన్నీ మహిళల మనోభావాలకు పట్టం కట్టే చిత్రాలే. ఆడపిల్లలంటే ఆయనకు అంతులేని గౌరవం. ఆ గౌరవమే ఆయన చిత్రాల్లోనూ కనిపిస్తుంది. ఆకాశంలో సగమైన మహిళా లోకాన్ని నిర్లక్ష్యం చేస్తే సమాజ పురోగతి అసాధ్యమని ఆయన ప్రగాఢ నమ్మకం. అందుకే...వీలు చిక్కినప్పుడల్లా తన ఆలోచనల్ని పంచుకునేందుకు సినీ మాధ్యమాన్ని వారధిగా వినియోగించుకున్నారు. మహిళలని గౌరవించే మన సంస్కృతి సంప్రదాయాల్ని తెరపై ఆవిష్కరించారు. కొత్త తరహా కధాంశాల్ని ఎన్నుకోవడంలో క్రాంతికుమార్‌ ఎప్పుడూ ముందుంటారు. అదే అయన విజయరహస్యమైంది.


* క్రాంతికుమార్‌ సినీ యానం
సినిమాల్లోనే ఉపాధి వెతుక్కోవాలనే అభిరుచితో కొందరు మిత్రులతో కలసి రామకృష్ణ ఫిలిమ్స్‌ పతాకంపై గుత్తా రామినీడు దర్శకత్వంలో తొలుత శోభన్‌బాబు హీరోగా ‘తల్లీ కూతుళ్లు’ నిర్మించారు. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోవడంతో కాస్త నిరాశలో మునిగినా... తేరుకుని సినీ యానాన్ని కొనసాగించేందుకే నిర్ణయించుకున్నారు. ఆ సందర్భంలో విజయవాడకు చెందిన హనుమాన్‌ ప్రసాద్‌తో కలసి చిత్ర నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్లాలని భావించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘శారద’ సినిమా వచ్చింది. కన్నడలో సూపర్‌ హిట్‌ అయినా ‘యావద్‌ జన్మ మైత్రి’ సినిమాకు అనువాదం. ఆ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో సినీ చరితకు తెలిసిన విషయమే. ఈ చిత్ర విజయం తరువాత క్రాంతి కుమార్‌ మరి వెనక్కి తిరిగి చూసుకోలేదు.


* క్రాంతి కుమార్‌ నిర్మాణ సంస్థ దర్శకులకు స్కూల్‌
రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డిలాంటి దర్శకులెందరో క్రాంతికుమార్‌ నిర్మాణ సంస్థ ద్వారా ఎదిగినవారే. దర్శకులుగా కమర్షియల్‌ ముద్ర పడి బిజీ కానంతవరకూ క్రాంతికుమార్‌ చిత్రాలను చేసి... ఆ తరువాత సూపర్‌ డూపర్‌ హిట్లతో ముందుకు దూసుకుపోతుండగా క్రాంతి కుమార్‌ దృష్టి మరో కొత్త దర్శకుడి మీదకు మళ్లేది. అలా...అలా నిర్మాతగా సినీ ప్రయాణం జరుగుతున్న వేళలో...అనివార్య పరిస్థితుల్లో క్రాంతి కుమార్‌ కూడా దర్శకుడిగా మారి సంచలనాలు నమోదు చేశారు. రాఘవేంద్రరావు సినీ కెరీర్‌లో మెచ్చు తునకగా ఇప్పటికీ చెప్పుకునే ‘జ్యోతి’ సినిమా క్రాంతికుమార్‌ నిర్మాణ సంస్థ నుంచి వచ్చినదే. ఈ సినిమా ఇటు ప్రేక్షకుల ఆదరణతో పాటు ఉత్తమ నటిగా జయసుధకు నంది అవార్డు, ఫిలిం ఫేర్‌ అవార్డు తెచ్చి పెట్టింది. ‘శారద’ సినిమా విజయం తరువాత నటి శారదతో ‘ఊర్వశి’ తీశారు. ఈ సినిమాలో నాయిక అందవిహీన. పాత్ర పరంగా ఆమె పడే పాట్లే సరికొత్త ఘర్షణగా మారి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సమాజం అందానికి ఇచ్చిన ప్రాధాన్యత, గౌరవం అందవిహీనలకు లేదని... అందం కన్నా మనిషితనం, మంచితనం ముఖ్యమనే సందేశాన్ని ఈ చిత్రం అందిస్తుంది. కథను నమ్ముకుని సినిమా తీస్తే జనం ఆదరిస్తారని ఆయన తరచూ చెప్పుకునేవారు. ‘ప్రాణం ఖరీదు’ సినిమా ద్వారా చిరంజీవిని చిత్రసీమకి పరిచయం చేశారాయన. ఈ చిత్రంలో ‘‘యాతమేసి తోడినా ఏరు ఎండదు...’’ అనే పాట ఇప్పటికీ జనం గుండెల్లో ఉండిపోయింది. చిరంజీవిని హీరోగా చేసిన క్రాంతి కుమార్‌ అదే చిరంజీవిని విలన్‌గా కూడా చూపించారు. ఆ సినిమా ‘మోసగాడు’. కోదండరామిరెడ్డితో కొన్ని సినిమాలు తీసిన క్రాంతి కుమార్‌ దర్శకుడు దాసరి నారాయణరావుతో ‘సర్దార్‌ పాపారాయుడు’ సినిమా తీసి మరో సంచలనం సృష్టించారు. పాపారాయుడు సినిమా స్పూర్తితో తీసిన చిత్రం ‘స్వాతి’. పాపారాయుడు చిత్రంలోని శారద, ఎన్ఠీఆర్‌ పాత్రల్ని తీసుకుని రూపొందించిన చిత్రం ‘స్వాతి’. ఈ చిత్రంలో భర్త ఎవరో చెప్పలేని తల్లి, తండ్రి ఎవరో చెప్పలేని కూతురు పాత్రల మధ్య సంఘర్షణని తెరకెక్కించారు. ఈ చిత్రం విజయంతో క్రాంతికుమార్‌కి దర్శకుడిగా మంచి గుర్తింపు, సుహాసినికి స్టార్‌ ఇమేజ్‌ వచ్చాయి.

* అగ్ర హీరోలతో కమర్షియల్‌ చిత్రాలు
అగ్ర హీరోలతో కమర్షియల్‌ చిత్రాలు కూడా నిర్మించారు. నిర్మాతగా చిరంజీవితో ‘పునాదిరాళ్ళు’, ‘కిరాయి రౌడీలు’, ‘శివుడు శివుడు శివుడు’, ‘అగ్ని గుండం’, ‘రిక్షావోడు’ చిత్రాలను నిర్మించారు. నాగార్జునతో ‘నేటి సిద్దార్థ’ తీశారు. ‘అరణ్య కాండ’కు దర్శకత్వం వహించారు. అలా కొన్ని కమర్షియల్‌ చిత్రాలు తీసినా మహిళా చిత్రాల దర్శకుడిగానే క్రాంతికుమార్‌ ప్రఖ్యాతి గడించారు. ఆయన చిత్రాలకు అనేక అవార్డులు, పురస్కారాలు లభించాయి.
 

* ‘స్రవంతి’కి జాతీయ పురస్కారం
1986లో క్రాంతి కుమార్‌ దర్శకత్వం వహించిన ‘స్రవంతి’ చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం అందింది. 1984లో ‘స్వాతి’ చిత్రానికి ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్‌ అవార్డు దక్కింది. 1991లో ‘సీతారామయ్యగారి మనవరాలు’ చిత్రానికిగాను ఉత్తమ దర్శకుడిగా క్రాంతి కుమార్‌ ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్నారు. 1979లో ‘పునాదిరాళ్ళు’ చిత్రానికిగాను రాష్ట్ర ప్రభుత్వ కాంస్య నంది పురస్కారం అందుకున్నారు. 1984లో ‘స్వాతి’ చిత్రానికి బంగారు నంది, 1991లో ‘సీతారామయ్య గారి మనవరాలు’ చిత్రానికిగాను వెండి నందితో పాటు ఉత్తమ దర్శకుడిగా మరో నందిని క్రాంతి కుమార్‌ అందుకున్నారు. 1985లో ‘శ్రావణ మేఘాలు’ చిత్రానికిగాను ఉత్తమ స్కీన్ర్‌ప్లే రైటర్‌గా నంది పురస్కారాన్ని అందుకున్నారు.


* దర్శకుడిగా...
నిర్మాతగా పలు చిత్రాలు రూపొందించిన క్రాంతి కుమార్‌ దర్శకుడిగా కూడా సృజన చాటుకున్నారు. బయట సంస్థల చిత్రాలకు కూడా పనిచేసారు. క్రాంతి కుమార్‌కి ఎంతో పేరు తెచ్చిన ‘సీతారామయ్యగారి మనవరాలు’ చిత్రం కూడా విఎంసి ప్రొడక్షన్‌ పతాకంపై నిర్మాత దొరస్వామి రాజు కోసం పనిచేసినదే. ‘స్వాతి’, ‘అగ్నిగుండం’, ‘స్రవంతి’, ‘హీరో బాయ్‌’, ‘అరణ్యకాండ’, ‘శారదాంబ’, ‘గౌతమి’, ‘నేటి సిద్దార’్ధ, ‘సీతారామయ్యగారి మనవరాలు’, ‘అక్కమొగుడు’, ‘రాజేశ్వరి కళ్యాణం’, ‘భలే పెళ్ళాం’, ‘సరిగమలు’, ‘పాడుతా తీయగా’, ‘అరుంధతి’, ‘9 నెలలు’ చిత్రాలకు దర్శకుడిగా పనిచేసారు. ఖ్యాతి గడించారు.

- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.