శోభనాచల రాణి... కృష్ణవేణి
నేటి తరానికి కృష్ణవేణి అంటే ఎవరో తెలియదు. కానీ అరవై ఏళ్ళ క్రితమే గొప్ప స్టార్ గా, గాయనిగా రాణించిన కృష్ణవేణి ప్రజాభిమానాన్ని చూరగొన్న విశిష్ట వనిత. ఆరోజుల్లో వచ్చిన ‘గొల్లభామ’ సినిమాలో నటించిన కృష్ణవేణి అందచందాలను చూసి ప్రేక్షకులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. కాంచనమాలతో పోటీగా అందానికి నిర్వచనం చెప్పిన కృష్ణవేణి కేవలం ఒక నటి, గాయనిగానే కాకుండా ‘కీలుగుఱ్ఱం’, ‘లక్ష్మమ్మ’, ‘మనదేశం’ వంటి అద్భుత చిత్రాలు నిర్మించిన నిర్మాతగా వాసికెక్కింది. చిత్రరంగానికి నందమూరి తారకరామారావు ను పరిచయం చేసింది ఆమే. అంతే కాదు గానగంధర్వుడు ఘంటసాలను సంగీత దర్శకుడిగా, పి. లీలను గాయని గా తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన ఘనత క్రిష్ణవేణిదే. మీర్జాపురం రాజా సతీమణిగా శోభనాచల సంస్థకు అధినేతగా రాణించిన కృష్ణవేణి 95వ జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా ఆమెను గురించి కొన్ని విశేషాలు...తొలి రోజుల్లో...
కృష్ణవేణి 26 డిసెంబరు 1924న పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి గ్రామంలో జన్మించింది. ఆమె తండ్రి కృష్ణారావు ఆర్.ఎం.పి. డాక్టరుగా సేవలనందిస్తూ వుండేవారు. ఆమె చిన్నతనంలో స్కూలులో చదువుకుంటున్నప్పుడు ప్రహ్లాదుడు, ధృవుడు వంటి పాత్రలు పోషిస్తూ నాటకాలలో నటిస్తూవుండేది. సంగీతం నేర్చుకోకపోయినా పాటలు కూడా పాడుతూ వుండేది. 1934 ప్రాంతంలో దర్శక పితామహులు చిత్తజల్లు పుల్లయ్య బాలల చిత్రం నిర్మించాలని బాలతారల అన్వేషణలో రాజమండ్రి వచ్చారు. ‘తులాభారం’ నాటకం ఆడుతున్నప్పుడు కృష్ణవేణి ని పుల్లయ్య చూడటం జరిగింది. పుల్లయ్య గారి శిష్యబృందంలో ప్రొడక్షన్ అసిస్టెంట్ గా, కాస్టింగ్ ఏజెంట్ గా పనిచేస్తున్న హాస్యనటుడు రేలంగి వెంకట్రామయ్య కృష్ణవేణిని పుల్లయ్య వద్దకు తీసుకెళ్ళారు. 1936లో ఈస్ట్ ఇండియా కంపెనీ, కలకత్తా వారు పుల్లయ్య దర్శకత్వంలో ‘సతీఅనసూయ’ మరియు ‘ధృవవిజయము’ పేర్లతో ఒక జంటసినిమా నిర్మించారు. అందులో నటించినవారందరూ బాలబాలికలే. తెలుగులో వచ్చిన తొలి బాలల చిత్రం ఇదే కావడం విశేషం. ‘సతీఅనసూయలో’ ఒక్క కృష్ణవేణి మాత్రమే అనసూయ పాత్రను పోషించింది. దాదాపు అరవై మంది బాలబాలికలను ఈ రెండు చిత్రాలకోసం పుల్లయ్య కలకత్తా తీసుకువెళ్ళారు. పిల్లల చదువులకు భంగం కలుగకుండా వారందరికీ క్లాసులు నిర్వహించారు. షూటింగ్ లేనిరోజుల్లో అందరినీ మ్యూజియంలు, సినిమాలు, పార్కులు, జూ లకు పంపేవారు. ఈ బృందానికి రేలంగి నాయకుడు. ఈ చిత్రానికి అడివి బాపిరాజు కళాదర్శకత్వం వహించగా ప్రభల సత్యనారాయణ సంగీతం అందించారు. ఈ సినిమాకు అనుబంధంగా వారణాసి, హరిద్వార్ లో గంగానది కి హారతి పట్టే ఘట్టాలను ప్రత్యేకంగా ప్రదర్శించారు. సినిమా నిర్మాణం పూర్తయిన తరవాత కృష్ణవేణి రాజమండ్రికి వచ్చి మరలా నాటకాలలో పాల్గొంటూ వుండేది. అదే సమయంలో కృష్ణవేణి నానగారు చనిపోవడంతో కృష్ణవేణి ఆలనా పాలనా వారి అమ్మమ్మ సంరక్షణలో సాగింది.


వరస సినిమాలతో మద్రాసుకు...
1937లో నేషనల్ మూవిటోన్ వారు ‘మోహినీ రుక్మాంగద’ చిత్రాన్ని నిర్మిస్తూ అందులో సంధ్యావళి పాత్రకోసం కృష్ణవేణి ని ఆహ్వానించారు. రుక్మాంగదుడుగా వేమూరు గగ్గయ్య, మోహినిగా రామతిలకం నటించిన ఈ చిత్రానికి చిత్రపు నరసింహా రావు దర్శకత్వం వహించగా భీమవరపు నరసింహారావు సంగీతదర్శకత్వం వహించారు. 1938లో కోయంబత్తూరు సెంట్రల్ స్టూడియో వారు బాలకృష్ణన్ నారాయణ నాయర్ దర్శకత్వంలో ‘తుకారాం’ అనే చిత్రాన్ని తమిళంలో నిర్మించారు. అందులో ప్రముఖ కర్నాటక విద్వాంసుడు ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ తుకారాం గా నటించారు. తుకారాం కూతురుగా రావు బాలసరస్వతి నటించింది. తమిళంలో హిట్టయిన ఇదే చిత్రాన్ని తెలుగులో నిర్మించినప్పుడు సి.ఎస్.ఆర్. ఆంజనేయులు తుకారాం పాత్ర పోషించారు. అందులో తుకారాం కూతురుగా కృష్ణవేణి నటించింది. అయితే తెలుగులో ఈ చిత్రం ఫ్లాపయింది. అదేసంవత్సరం నిర్మాత బి.వి. రామానందం కలకత్తా రాధా ఫిలిం కంపెనీ వారి బ్యానర్ మీద ‘సంజీవని (లేక) కచదేవయాని’ అనే సినిమా నిర్మిస్తూ దేవయాని పాత్రకు కృష్ణవేణిని తీసుకున్నారు. ఇందులో కచుడుగా ఎస్.పి.లక్ష్మణస్వామి, ఇంద్రుడుగా కల్యాణం రఘురామయ్య, నారడుడుగా చిట్టూరి రామకృష్ణారావు నటించారు. ద్రోణంరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయం సాధించడమేకాకుండా కృష్ణవేణికి మంచి పేరుతెచ్చిపెట్టింది. ఈ చిత్ర విజయంతో కె. సుబ్రహ్మణ్యం ‘కచదేవయాని’ చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో తమిళంలో నిర్మించారు. ఇందులో కొత్తమంగళం శీను కచుడు, టి.ఆర్. రాజకుమారి దేవయాని పాత్రలు పోషించారు. తమిళంలో కూడా ఈ చిత్రం విజయవంతమైంది. 1938లో మీర్జాపురం రాజా పేరుతో పిలుచుకునే మేకా వెంకటరామయ్య అప్పారావు బహద్దూర్ సినిమారంగంపై ఆసక్తితో మద్రాసు వచ్చి ‘జయా ఫిలిమ్స్’ పేరిట చిత్రనిర్మాణ సంస్థను స్థాపించి ఆళ్వార్ పేటలోని పెద్ద స్థలంలో ‘జయా ఫిలిమ్స్ స్టూడియో’ నిర్మించారు. అందులో మొదట ‘కృష్ణ-జరాసంధ’ చిత్రాన్ని నిర్మించారు. తరవాత టి. మార్కొని దర్శకత్వంలో ‘మహానంద’ అనే చిత్రాన్ని నిర్మించగా అందులో హీరోయిన్ మహానందగా కృష్ణవేణి నటించింది. అద్దంకి శ్రీరామమూర్తి శివుడుగా, పారుపల్లి సత్యనారాయణ ఇంద్రుడుగా పులిపాటి వెంకటేశ్వర్లు నారడుడుగా, రావు బాలసరస్వతి తుంబగా నటించారు. మోతీబాబు సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం కూడా విజయవంతమైంది. ఈ సినిమాలో నటిస్తుండగా మీర్జాపురం రాజా కృష్ణవేణిని వివాహం చేసుకున్నారు. వీరి వివాహం విజయవాడలో జరిగింది. 1940లో జయా ఫిలిం స్టూడియో తరఫున రాజావారు ‘భోజ కాళిదాసు’ చిత్రాన్ని హెచ్.వి. బాబు దర్శకత్వంలో నిర్మించారు. అందులో కృష్ణవేణి చతురికగా నటించగా కన్నాంబ విద్యావతి పాత్రను, అద్దంకి శ్రీరామమూర్తి కాళిదాసు పాత్రను, పారుపల్లి సుబ్బారావు భోజరాజు పాత్రను పోషించారు. ఈ చిత్రానికి కూడా సంగీత దర్శకత్వం మోతీబాబు నిర్వహించారు. తరవాత కలకత్తా ఈస్ట్ ఇండియా ఫిలిం కంపెనీ వాళ్ళు కృష్ణవేణితో నాలుగు సినిమాలకు కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. కాళ్ళకూరి నారాయణరావు వరకట్న పిశాచిని నిరసిస్తూ రచించిన ‘వరవిక్రయం’ నాటకాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి చిత్తజల్లు పుల్లయ్య సినిమాగా నిర్మిస్తే అందులో భానుమతి చెల్లెలు కలమల పాత్రను కృష్ణవేణి పోషించాలి. కానీ కంపెనీ కుదుర్చుకున్న కాంట్రాక్టు సడలిపోవడంతో కృష్ణవేణి నటించాల్సిన పాత్ర పుష్పవల్లికి దక్కింది.


శోభనాచల స్టూడియో చిత్రాలలో అన్నీ తానై...
మీర్జాపురం రాజా మద్రాసులో స్టూడియో నిర్మించిన తొలి తెలుగు వ్యక్తి. జయా ఫిలిమ్స్ స్టూడియో పేరుతో వున్న ఈ స్టూడియోని వారి కులదైవమైన శోభనాచల వ్యాఘ్ర నరసింహస్వామి పేరువచ్చేలా ‘శోభనాచల స్టూడియోస్’ గా మార్చారు. ఈ బ్యానర్ మీద రాజావారు ‘దక్షయజ్ఞం’ (1940),’భక్త ప్రహ్లాద (1942)’, ‘భీష్మ’ (1944), గొల్లభామ’ (1947) చిత్రాలు నిర్మించారు. తరవాత 1949లో ‘మనదేశం’ సినిమా ప్రారంభమైంది. ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ద్వారానే నందమూరి తారకరామారావు తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమయ్యారు. అందులో రామారావుది ఒక పోలీసి ఇనస్పెక్టరు గా చిన్న పాత్ర. జాతీయోద్యమ నేపథ్యంలో నిర్మించిన తొలి తెలుగు సినిమా ‘మనదేశం’. ఒకరకంగా ఈ చిత్రాన్ని నిర్మించాలని తలచడం సాహసమే. రాజాగారికి ఇష్టం లేకున్నా కృష్ణవేణి పట్టుబట్టి ఈ సినిమా నిర్మించాలని నిర్ణయించింది. శరత్ చంద్ర చటర్జీ రచించిన ‘విప్రదాసు’ నవల ఆధారంగా నిర్మించిన చిత్రం ‘మనదేశం’. తొలుత ఈ చిత్రానికి కె.ఎస్. ప్రకాశరావు ను దర్శకునిగా తీసుకుందామని అనుకుంటే ఆయన ‘దీక్ష’ చిత్ర నిర్మాణంలో బిజీగా వుడడంతో ఎల్.వి. ప్రసాద్ పేరును సూచించారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఘంటసాలను తీసుకున్నారు.
అయితే మనదేశం (24-11-1949) సినిమాకన్నా శోభనాచల వారే నిర్మించిన ‘కీలుగుఱ్ఱం’ చిత్రం ముందుగా విడుదల (19-02-1949) కావడంతో ఘంటసాల సంగీతదర్శకుడిగా పరిచయమైన తొలిచిత్రంగా ‘కీలుగుఱ్ఱం’ రికార్డులకెక్కింది. అలాగే పి.లీల కూడా గాయనిగా పరిచయమైన చిత్రం ‘మనదేశం’. ఈ చిత్రంలో కృష్ణవేణి హీరోయిన్ గా నటించగా హీరోగా నారాయణరావు నటించారు. ఇతరపాత్రలను నాగయ్య, రంగారావు, రేలంగి, బాలసరస్వతి, లక్ష్మీకాంతం పోషించారు. తాతినేని ప్రకాశరావు ఈ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు. 1949లోనే కాశీమజిలీ కథల ప్రేరణతో రాజావారు తాపీ ధర్మారావు చేత ఒక జానపద కథను తయారుచేయించి దానికి మాటలు కూడా రాయించారు. ఆ సినిమాకు ‘కీలుగుఱ్ఱం’ అనే పేరు పెట్టారు. ఈలోగా పెందుర్తి సుబ్బారావు నిర్మాణం మొదలుపెట్టి నిలిపివేసిన ‘లక్ష్మమ్మ’ సినిమా హక్కులు కృష్ణవేణి కొనుక్కున్నారు. ఆ చిత్రానికి ఘంటసాల సంగీత దర్శకుడు. ఆయన పాటలను స్వరపరచే విధానం కృష్ణవేణికి నచ్చడంతో, ‘కీలుగుర్రం’ చిత్రానికి కూడా ఘంటసాలను రాజావారికి కృష్ణవేణి సిఫార్సు చేశారు. హీరోగా అక్కినేని, హీరోయిన్ గా సూర్యశ్రీని తీసుకున్నారు. రాజాగారు ‘గొల్లభామ’ చిత్రం ద్వారాపరిచయం చేసిన అంజలీదేవిని వ్యాంప్ లక్షణాలుండే రాక్షసి పాత్రకోసం తీసుకున్నారు. తొలుత అంజలీదేవి ఈ పాత్రపోషణకు ఒప్పుకోకపోయినా కృష్ణవేణి తనకు ఆమెతో వున్న సాన్నిహిత్యంతో ఒప్పించింది. అయితే అంజలీదేవి ఈ చిత్రంలో తన పాటలను కృష్ణవేణి పాడాలని కోరడంతో ఆమె సరేనంది. ‘తెలియ వశమా’, ‘చూసి తీరవలదా’ వంటి పాటలను కృష్ణవేణి పాడింది. ఇందులో కృష్ణవేణి నటించలేదు కానీ నిర్మాణ పర్యవేక్షణ చేసింది. ఈ సినిమా డంకా బజాయించి విజయవాడ మారుతీ సినిమా హాలులో 150 రోజులు ఆడింది. తమిళంలోకి ‘మాయాకుదిరై’ పేరుతో డబ్ చేస్తే అక్కడ కూడా శతదినోత్సవం చేసుకుంది. తమిళ భాషలోకి డబ్ కాబడిన తొలి తెలుగు చిత్రం ‘కీలుగుఱ్ఱం’. ఇక ‘లక్ష్మమ్మ’ సినిమా విషయానికి వస్తే సగంలో ఆగిపోయిన పెందుర్తి సుబ్బారావు చిత్రం ‘లక్ష్మమ్మ’ (1950)హక్కులను త్రిపురనేని గోపీచంద్ సలహాతో కృష్ణవేణి కొన్నారు. అందులో కృష్ణవేణి హీరోయిన్ గా నటించగా, నారాయణరావు హీరోగా నటించారు. అయితే ప్రతిభా సంస్థ అధిపతి ఘంటసాల బలరామయ్య ఇదే కథను ‘శ్రీలక్ష్మమ్మ కథ’ పేరుతో అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి హీరో హీరోయిన్ లుగా పోటీగా నిర్మించారు. దాంతో శోభనాచలవారి సినిమాను త్వరత్వరగా శరవేగంతో పూర్తిచేయాల్సివచ్చింది. మొత్తం మూడు యూనిట్లు ఈ సినిమాకు పనిచేశాయి. గోపీచంద్, ఇంటూరి వెంకటేశ్వరరావు, ముదిగొండ లింగమూర్తి ఒక యూనిట్ గా, పి. పుల్లయ్య మరో యూనిట్ గా, చిత్రపు నారాయణమూర్తి మూడో యూనిట్ గా పనిచేశారు. చివరకు కృష్ణవేణి నిర్మించిన చిత్రమే విజయవంతమైంది. తనకు పూర్తి సంతృప్తినిచ్చిన సినిమాగా ‘లక్ష్మమ్మ’ చిత్రాన్ని ఎప్పుడూ కృష్ణవేణి పేర్కొంటూ వుంటుంది. అందుకు గోపీచంద్ అభినందనీయుడు అంటూ తెలిపేది. తరవాత కృష్ణవేణి గోపీచంద్ నిర్మించిన ‘పేరంటాళ్ళు’ చిత్రంలో మాలతితో కలిసి నటించింది. కానీ ఆ సినిమా గొప్పగా ఆడలేదు.


ఆగిపోయిన కృష్ణవేణి సినిమాలు...
అనివార్య కారణాలవలన కృష్ణవేణి మొదలుపెట్టిన కొన్ని సినిమాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. వాటిలో కమల్ ఘోష్ దర్శకత్వంలో మొదలుపెట్టిన ‘గుడ్ ఈవెనింగ్’ సినిమా ఒకటి. మరొక చిత్రం బి. శ్రీధర్ దర్శకత్వంలో నిర్మించేందుకు అన్ని సన్నాహాలు పూర్తిచేసిన ‘లేడీ డాక్టర్’ అనే సినిమా. ఈ రెండు సినిమాలు మూలపడిన తరవాత ‘కుమ్మరి మొల్ల’ సినిమా మొదలు పెట్టింది. అందులో కృష్ణవేణి మొల్ల గా నటించగా ఆమె తండ్రిగా చిత్తూరు నాగయ్య నటించేవిధంగా ప్రణాళిక సిద్ధమైంది. కానీ కారణంతరాలవలన ఆ సినిమా కూడా ఆగిపోయింది. ఆ చిత్రాన్ని డి.ఎల్. నారాయణ కూడా తీయాలని ప్రయత్నించినా సఫలం కాలేదు. ఆ తరవాత నటుడు పద్మనాభం వాణిశ్రీ హీరోయిన్ గా ‘కథానాయిక మొల్ల’ పేరుతో సినిమా నిర్మించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాలు కాకుండా కృష్ణవేణి మొదలుపెట్టి ఆగిపోయిన మరో రెండుసినిమాలు గోపీచంద్ స్క్రిప్టు పనులు పూర్తిచేసిన ‘పాలేరు’, కన్నడంలో నిర్మిస్తూ ఆగిపోయిన ‘రాజసింహ’ చిత్రాలు. ఈ రాజసింహ చిత్రం ఉదయకుమార్ తో సమస్యలు తలెత్తడంతో ఆగిపోయింది. అందులో కన్నడ రాజకుమార్ హీరోగా నటించగా, లీలావతి కథా నాయికగా నటించింది. సినిమా మధ్యలో ఆపివేసినా కృష్ణవేణి రాజకుమార్ కు పారితోషికం మొత్తాన్ని చెల్లించింది. అందుకు ఆశ్చర్యపోయిన రాజకుమార్ శోభనాచల సంస్థకు మరొక చిత్రాన్ని చేయాలని రాజావారికి కబురెట్టారు. రాజసింహ చిత్రానికి దర్శకుడుగా వ్యవహరించిన ఎన్.ఎస్. మూర్తి దర్శకత్వంలో ‘భక్త కుంభార’ అనే చిత్రనిర్మాణానికి ప్లాన్ చేశారు. ఎం.ఆర్.ఎ (మేకా రాజ్యలక్ష్మి అనూరాధ- కృష్ణవేణి, రాజావారి ఏకైక కుమార్తె) ప్రొడక్షన్స్ బ్యానర్ మీద మొదట తెలుపు-నలుపు లో మొదలు పెట్టిన ఆ సినిమాను తరవాత కలర్ లో నిర్మించాలని రీషూట్ చేశారు. దాంతో నిర్మాణ వ్యయం పెరిగిపోయింది. నిర్మాతగా ఆ చిత్రానికి తన కూతురు ఎం.ఆర్. అనూరాధాదేవి పేరు పెట్టారు. ఈ చిత్రం 1974లో విడుదలై ప్రభంజనాన్ని సృష్టించింది. అంతే కాదు ‘భక్త కుంభార’ సినిమాకు ఏకంగా ఏడు అవార్డులు వచ్చాయి. ఈ చిత్రం ఆధారంగానే తెలుగులో అక్కినేని నటించిన చక్రధారి సినిమా నిర్మితమైంది.

నటిగా, నిర్మాతగా చివరి సినిమా...
కృష్ణవేణి నటించిన చివరి సినిమా ‘సావాసం’ (1952). శోభనాచల బ్యానర్ మీద నిర్మించిన ఈ చిత్రానికి మీర్జాపురం రాజా దర్శకత్వం వహించారు. కోన ప్రభాకరరావు హీరోగా నటించగా కృష్ణవేణి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి తాపీ ధర్మారావు నాయుడు కథ, మాటలు, పాటలు రాయగా వెంకట్రామన్, కొండయ్యలు రాజావారికి దర్శకత్వంలో సహకరించారు. ఈ సినిమా పూర్తయ్యాక కృష్ణవేణి సినిమాలలో నటించడం విరమించుకుంది. కృష్ణవేణి నిర్మాతగా రాజశ్రీ ఫిలిమ్స్ బ్యానర్ మీద 1957లో ‘దాపత్యం’ అనే చిత్రాన్ని నిర్మించింది. అనిసెట్టి కథ, మాటలు సమకూర్చిన ఈ చిత్రానికి ఎర్రా అప్పారావు దర్శకత్వం వహించారు. ఆరుద్ర పాటలు రాయగా రమేష్ నాయుడు సంగీతం సమకూర్చారు. ఇందులో విజయకుమార్ ను హీరోయిన్ గా పరిచయం చేశారు. ఇతర ముఖ్య పాత్రల్లో జి.వరలక్ష్మి, రేలంగి, గుమ్మడి, పెరుమాళ్ళు నటించారు. సినిమాలలో విరమించుకున్న తరవాత నాటకాలమీద మక్కువతో కృష్ణవేణి సూరవరపు వెంకటేశ్వర్లు, కస్తూరి శివరావు, ఘంటసాల బృందంతో కలిసి ‘సక్కుబాయి’ నాటకాన్ని కొంతకాలం ప్రదర్శించారు. 2004లో కృష్ణవేణికి ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రదానం చేసింది. ఇటీవలే 95 వసంతాలు పూర్తిచేసుకున్న కృష్ణవేణి ఆరు దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రకు ప్రత్యక్ష సాక్షి.

- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.