నటుడిగా, కథకుడిగా విలక్షణ సృజనశీలి డాక్టర్ ప్రభాకరరెడ్డి
నటుడిగా, కథకుడిగా విలక్షణ సృజనశీలి డాక్టర్ ప్రభాకరరెడ్డి
మూడు దశాబ్దాలు.
472 సినిమాలు....
కేరెక్టర్ ఆర్టిస్ట్ గా దిగంతాలకు అంటే కీర్తి కేతనం.
అంతేనా? రచయితగా పలు చిత్రాలకు భావోద్వేగపూరిత కధలను అందించిన సృజన. ఆయనే...మందడి ప్రభాకర రెడ్డి. డాక్టర్ కాబోయి యాక్టర్ని అయ్యానంటారు చిత్రసీమలోకి వచ్చిన ఎంతోమంది నటీనటులు తమని తాము పరిచయం చేసుకుంటూ. ప్రభాకర రెడ్డి డాక్టరయ్యాకే యాక్టర్ గా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ పరీక్షలో ఆయన గెలిచారు. ప్రజా హృదయాల్లో సుస్థిర స్థానం సాధించుకున్నారు.


నల్గొండ జిల్లా తుంగతుర్తిలో ప్రభాకర రెడ్డి జన్మించారు. తల్లి కౌసల్య, తండ్రి లక్ష్మా రెడ్డి సూర్యాపేటలో హై స్కూల్ విద్యను పూర్తి చేసిన ఆయన హైదరాబాద్ సిటీ కాలేజ్లో ఇంటర్మీడియట్, ఉస్మానియా యూనివర్సిటీ లో ఎంబిబిఎస్ చదివారు. చిన్నప్పటినుంచి కళాకారుడు కావాలనే ఆశతో చదువు పూర్తయిన తర్వాత సినీ రంగంలో ప్రవేశించడానికి సన్నాహాలు ప్రారంభించారు.

ప్రభాకర రెడ్డి చిత్రలహరి
ప్రభాకర రెడ్డి ప్రయత్నాలు ఫలించి 1960లో చిత్రపరిశ్రమలో కాలూనే అదృష్టం దక్కింది. మంజీరా ఫిలిమ్స్ పతాకంపై గుత్తా రామినీడు దర్శకత్వంలో నిర్మితమైన ఈ చిత్రంలో సైక్రియాటిస్టు గా ప్రభాకర్ రెడ్డి వేషం వేశారు. సావిత్రి, కాంతారావు, రాజబాబు, బాలయ్య ఇతర తారాగణం. హిందీ చిత్రం ఖామోషి చిత్రానికి ఇది తెలుగు అనువాదం. మొదటి చిత్రంతోనేవిషయమున్న కళాకారుడిగా పరిశ్రమ పెద్దల దృష్టిలో పడ్డారు. ఆ తర్వాత నుంచి తనదాకా వచ్చిన ఏ చిన్ని అవకాశాన్ని ఆయన చేజార్చుకోలేదు. పౌరాణిక, సాంఘీక, చారిత్రాత్మక చిత్రాలనే తేడా లేకుండా అన్ని పాత్రల్లోనూ ప్రతిభ చూపించారు. 1961లో పాండవ వనవాసం చిత్రంలో కర్ణుడిగా నటించి మెప్పించారు. 1962లో భీష్మ లో శంతనుడిగా, అదే సంవత్సరం మహామంత్రి తిమ్మరుసు లో వీరభద్ర గజపతిగా పాత్రోచిత నటనను ప్రదర్శించారు. 1963లో నర్తనశాలలో మరోసారి కర్ణ పాత్రను పోషించారు. 1963లో పునర్జన్మ, అదే సంవత్సరం శ్రీ కృష్ణార్జున యుద్ధం చిత్రంలో శివుడిగా వేషం వేశారు. 1964లో బొబ్బిలి యుద్ధం, 1966లో నవరాత్రిలో పోలీస్ ఇన్ పెక్టర్ గా, పలనాటి యుద్ధంలో కన్నమ్మ దాసుగా నటించారు. 1966లోనే సరస్వతి శపధం లో బ్రహ్మగా నటించారు. 1967లో శ్రీ కృష్ణావతారం లో బలరాముడిగా నటించారు. 1967లో ఉమ్మడి కుటుంబం, 1968లో బందిపోటు దొంగలు, బ్రహ్మచారి, రణభేరి, అదృష్టవంతులు చిత్రాల్లో నటించారు. 1969లో ఆత్మీయులు, భలే తమ్ముడు, నాటకాల రాయుడు సినిమాల్లో నటించారు. 1970లో అక్కాచెల్లెలు, హిమ్మత్, లక్ష్మీకటాక్షం, 1971లో మట్టిలో మాణిక్యం, మోసగాళ్లకు మోసగాడు, పెత్తందార్లు, రామాలయం చిత్రాల్లో నటించగా, 1972లో బాల భారతం, పండంటి కాపురం, పాపం పసివాడు, పిల్లా పిడుగా? చిత్రాల్లో నటించారు. 1973లో మంచివాళ్లకు మంచివాడు, మాయదారి మల్లిగాడు, సంసారం సాగరం, 1974లో అల్లూరి సీతారామరాజు, అందరూ దొంగలే, దీక్ష, భూమి కోసం చిత్రాల్లో నటించారు. 1075లో ఎదురులేని మనిషి, 1975లో భక్త కన్నప్ప, రామరాజ్యంలో రక్తపాతం, 1977లో దానవీర శూర కర్ణ, ఇద్దరు మిత్రులు, కల్పనా, ఖయిదీ కాశిదాసు, యమదొంగ చిత్రాల్లో నటించి మెప్పించారు. 1978లో కటకటాల రుద్రయ్య, సొమ్మొక్కడిది...షోకొకడిది చిత్రాల్లో ప్రతిభ కనబరిచారు. ఇంకా ఆయన గోరింటాకు,. కార్తీక దీపం, రంగూన్ రౌడీ, ఏడంతస్తుల మేడ, నకిలీ మనిషి, జానీ, సర్దార్ పాపారాయుడు, యువతరం కదిలింది, కిరాయి రౌడీలు, పార్వతీ పరమేశ్వరులు, ప్రేమాభిషేకం, తోడు దొంగలు, గృహ ప్రవేశం, బొబ్బిలి పులి, నా దేశం, అల్లుళ్ళు వస్తున్నారు, బులెట్, చట్టంతో పోరాటం, ఓ తండ్రి తీర్పు, విశ్వనాధ నాయకుడు...లాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి.


విజయవంతమైన చిత్రాల కథకుడిగా

నటుడిగానే కాకుండా కథకుడిగా ప్రభాకర రెడ్డి ప్రతిభ చూపించారు. సుమారు 21 సినిమాలకు ఆయన కధలను అందించారు. వాటిలో అత్యధిక సినిమాలు విజయాన్ని సాధించాయి. లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో కృష్ణ, విజయ నిర్మల జోడీగా జమున, బి. సరోజాదేవి, గుమ్మడి, ఎస్ వి రంగారావులాంటి అగ్ర తారలు నటించిన పండంటి కాపురం చిత్రానికి అందించింది ప్రభాకర రెడ్డియే. పచ్చని సంసారం, ధర్మాత్ముడు, గృహ ప్రవేశం, గాంధీ పుట్టిన దేశం, కార్తీక దీపం, నాకూ స్వాతంత్రం వచ్చింది చిత్రాల కథకుడిగా ప్రభాకర్ రెడ్డి మంచి పేరు సంపాదించారు. కుటుంబ విలువలు, ఆత్మీయతానుబంధాలు, భావోద్వేగాలను మిళితం చేసి ఉత్తమాభిరుచిగల కథకుడిగా కీర్తి పొందారు. వామపక్ష భావాల నేపథ్యంలో 1996లో కామ్రేడ్ అనే సినిమాకి ఆయన రచయితగా, దర్శకుడిగా భాద్యతలు నిర్వర్తించారు. ఈ సినిమాకు కె.జి. సత్యమూర్తి, మాస్టార్జీ సైతం పాటలు రాశారు.

జయప్రద పరిచయకర్త
1976లో భూమికోసం చిత్రంలో మూడు నిముషాల పాత ద్వారా జయప్రదను ఇండస్ట్రీ కి పరిచయం చేసింది ప్రభాకరరెడ్డియే. లలితా రాణి అనే ఆమె పేరును జయప్రదంగా మార్చిన వ్యక్తి కూడా ఆయనే.


నంది అవార్డులు

చిత్రసీమకు అందించిన సృజనాత్మక సేవలకు గుర్తింపుగా ప్రభాకర రెడ్డి నంది అవార్డులు సైతం అందుకున్నారు. 1980లో యువతరం కదిలింది, 1981లో పల్లె పిలిచింది లో నటనకు గాను నంది అవార్డులు అందుకున్నారు. 1990లో చిన్న కోడలు సినిమాలో బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నంది పురస్కారాన్ని అందుకున్నారు. గాంధీ పుట్టిన దేశం, గృహప్రవేశం చిత్రాల కథకుడిగా రెండు సార్లు నంది అవార్డులు స్వీకరించారు. 1997 నవంబర్ 25న తన 62వ ఏట ప్రభాకరరెడ్డి చివరి శ్వాస వదిలారు. ఆయన గౌరవ సూచకంగా హైదరాబాద్ మణికొండలో డాక్టర్ ఎం. ప్రభాకరరెడ్డి చలన చిత్ర కార్మిక చిత్రపురి అనే నామకరణం చేశారు. ఇదీ ప్రభాకరరెడ్డి పట్ల సినీ ఇండస్ట్రీ చూపించిన ప్రేమాభిమానం.

-పి.వి. డి. ఎస్. ప్రకాష్


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.