కలకాలం నిలిచిపోయే కలం

మాటలంటే పంచ్‌ అనుకొంటున్న కాలమిది. ఎంత వెటకారం రాస్తే... అంత గొప్ప మాటైపోయింది. అయితే.. మాటకున్న బలం వేరు. దాని పదును వేరు. ఓ సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్నట్టు... దాని శక్తిని గుర్తిస్తే అద్భుతాలు చేసి, ఆశ్చర్యపోయేలా చేసే సత్తా మాటకు ఉంది. దాన్ని నమ్మిన కలం... ఎంవీఎస్‌ హరనాథరావుది. ఓ డైలాగ్‌తో ప్రశ్నించవచ్చు, నిద్రపోతున్న సమాజాన్ని తట్టిలేపవచ్చు, మాటతో కుళ్లు కుతంత్రాల్ని కడిగి పారేయొచ్చు అని నమ్మిన అభ్యుదయ భావకుడు ఆయన. హరనాథరావు కలం పట్టారంటే.. కచ్చితంగా అభ్యుదయ భావాలున్న సంభాషణలు వినొచ్చని అర్థం. ఆయన జీవితంలో కమర్షియల్‌ సినిమాలూ చేశారు. కానీ... ఎంవీఎస్‌ మార్కు మాత్రం కొరడాలా ఛెళ్లుమనిపించే సంభాషణలే. దాదాపు 150 చిత్రాలకు సంభాషణలు అందించిన హరనాథరావు గురించి ఒక్కసారి ఆయన్ని స్మరించుకొంటే.. ‘ప్రతిఘటన’, ‘దేశంలో దొంగలు పడ్డారు’, ‘భరతనారి’, ‘రేపటి పౌరులు’, ‘దేవాలయం’... ఈ సినిమాల పేర్లే చెబుతాయి రచయితగా హరనాథరావు శైలి ఏమిటో చెప్పడానికి. టి.కృష్ణ దర్శకత్వంలో వచ్చినవన్నీ అభ్యుదయ భావాలున్న సినిమాలే. ఆ తరవాత.. ఆయన వారసుడిగా అడుగుపెట్టిన ముత్యాల సుబ్బయ్య కూడా తొలి నాళ్లలో అలాంటి కథలనే ఎంచుకొన్నారు. వీరిద్దరి సినిమాలకూ పనిచేశారు హరినాథరావు. ఆయన గుంటూరు వాసి. అయితే చదువంతా ఒంగోలులో సాగింది. సినిమా రచయిత అయినా సరే.. ఒంగోలుని వదల్లేదాయన. అక్కడ కూర్చునే 150 సినిమాలకు పనిచేశారు. ప్రజా నాట్యమండలి ప్రభావం హరనాథరావుపై చాలా పడింది. ఆ నాటకాలన్నీ చూసి.. అభ్యుదయ భావాల్ని వంటబట్టించుకొన్నారు. నాటక రచయితగా మారితే... అలాంటి కథలే రాసుకొన్నారు. ఆయన రాసిన తొలి నాటకం ‘రక్తబలి’. ఆ సమయంలో నాటకాలు ఎలా రాయాలన్న విషయంలో తనకు ఎలాంటి అవగాహనా లేదని చెప్పేవారాయన. ‘జగన్నాథ రథ చక్రాలు’ నాటక రచయితగా ఎంవీఎస్‌ని నిలబెట్టేసింది. ఈ నాటకం రాయడానికి దాదాపు రెండేళ్ల సమయం తీసుకొన్నారాయన. అయితేనేం..? దానికి మించిన ప్రతిఫలం దొరికింది. దేవుని అస్తిత్వంపై సంధించిన వ్యంగాస్త్రం అది. ఈ నాటకం అప్పట్లో ప్రకంపనలు సృష్టించింది. దానికి తగ్గట్టు ఎంవీఎస్‌పై విమర్శలూ రేగాయి. అయినా వాటిని పట్టించుకోలేదాయన. ‘జగన్నాథ రథ చక్రాలు’ నాటకంలో తండ్రీ కొడుకుల పాత్రలున్నాయి. తండ్రిగా హరనాథరావు నటిస్తే... ఆయన కొడుకు పాత్రలో టి.కృష్ణ కనిపించేవారు. ఆయనే.. ‘రేపటి పౌరులు’ దర్శకుడు. టి.కృష్ణతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఈ చిత్రానికి సంభాషణలు రాశారు ఎంవీఎస్‌. తొలి అడుగుతోనే ప్రభంజనం సృష్టించిందీ జంట. ఈ చిత్రంలో ప్రతీ మాటా తూటాలా పేలుతూ... రచయితగా ఎంవీఎస్‌ స్థాయి ఏపాటిదో తెలియజెప్పాయి. తొలి అడుగుతోనే నంది అవార్డునీ పట్టేశారు. ఆ తరువాత ‘భరతనారి’, ‘ఇదా ప్రపంచం’, ‘అమ్మాయి కాపురం’, ‘అన్న’ చిత్రాలకు నందుల్ని అందుకొన్నారు. టి.కృష్ణ ఆరు చిత్రాలకు దర్శకత్వం వహిస్తే, అందులో ఐదింటికి మాటలు రాశారు హరనాథరావు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రూపొందిన సినిమాలకూ పనిచేశారు. కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘సూత్రధారులు’ కూడా రచయితగా ఎంవీఎస్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. కథకుడిగా తనపై పడిన ముద్రని చెరిపి వేయాలన్న ప్రయత్నమూ చేశారు. మాస్, కమర్షియల్‌ కథలకు పనిచేయడం మొదలెట్టారు. వాటి ద్వారానూ.. పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొన్నారు. నాటకాలాడిన అనుభవంతో వెండి తెరపై కొన్ని కీలక పాత్రల్లో కనిపించారు. దాదాపు 20 చిత్రాల్లో నటుడిగానూ తనదంటూ ఓ ముద్ర వేశారు. 1948 జులై 20న పుట్టిన హరనాథరావు, 2017 అక్టోబర్‌ 9న మరణించారు.

                                 Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.