బంగారు బొమ్మ... మంజుల
మాయదారి మల్లిగాడు చిత్రంలో అమాయక పల్లెపడుచుగా, మంచి మనుషులు చిత్రంలో భగ్న ప్రియురాలిగా, చంటి సినిమాలో నాలుగు గోడల మధ్య నలిగే ఉమ్మడి కుటుంబ జమీందారిణి అమ్మగా, జగపతి సంస్థకు ఆస్థాన నాయకిగా రాణించి అందాల తారగా, బంగారు బొమ్మగా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ తార మంజుల. “చిలకపచ్చ చీర కట్టి చేమంతి పూలు పెట్టి సోకుచేసుకొచ్చానురో ఓరయ్యో చుక్కలాంటి చిన్నదాన్నిరో” అంటూ ‘మాదిద్దరి కథ’ సినిమాలో నండూరి యెంకిని మరపించినా, ‘నాపేరే భగవాన్’ చిత్రంలో ‘మన్నించుమా ప్రియా మన్నించుమా... మరుమల్లె నల్లగా వుంటే’ అంటూ ప్రేమలోని వగలు వుబికించినా, ‘నేనీ దరిని నువ్వా దరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ అంటూ ‘బంగారు బొమ్మలు’ చిత్రంలో అక్కినేనిని కవ్వించినా, ‘పడకు పడకు వెంట పడకు’ అంటూ శోభన్ బాబుని ‘మంచి మనుషులు’ చిత్రంలో ఉడికించినా, ‘వస్తా ఎల్లొస్తా, మల్లెప్పుడొస్తా, రేపు సందేళకోస్తా’ అంటూ మాయదారి మల్లిగాడు చిత్రంలో పల్ల్లెపడుచుగా కృష్ణను వూరించినా ఆ సన్నివేశాలను పండించిన మంజులను సినీప్రేక్షకులెవ్వరూ మరచిపోలేరు. అందుకు కారణం ఆమె వెండితెరకు దారాలల్లిన మెరుపుతీగ. హీరోయిన్ గా మాయదారి మల్లిగాడు చిత్రంతోనే ఆమె గ్లామర్ హీరోయిన్ గా నిలిచిపోయింది. ఆమె అందమైన చిరునవ్వు, చిలిపితనం ఉట్టిపడే నటన, ముద్దులొలికే మాటలతో ప్రేక్షక జనాన్ని కట్టిపడేసింది. సెప్టెంబరు 9 మంజుల 66 వ జయంతి సందర్భంగా కొన్ని జ్ఞాపకాలు...


తొలి రోజుల్లో తమిళ చిత్రాల్లో...
మంజుల తొలిసారి నటించిన సినిమా హున్సూరు కృష్ణమూర్తి దర్శకత్వంలో విజయా వారు నిర్మించిన ‘మధువె మాడి నోడు’ (1965) అనే కన్నడ సినిమా. అంతకు ముందు విజయావారు తెలుగులో నిర్మించిన ‘పెళ్ళిచేసిచూడు’ సినిమాని విజయా సంస్థ కన్నడంలో పునర్నిర్మించింది. రాజకుమార్, ఆర్. నాగేంద్రరావు, ఉదయ కుమార్, లీలావతి, వందన నటించిన ఈ చిత్రంలో మంజుల ఒక నృత్య గీతంలో నటించింది. అప్పుడు మంజుల వయసు కేవలం పన్నెండేళ్లే. ఆ చిత్రం ఘనవిజయం సాధించగా శతదినోత్సవ సభలో మంజుల కూడా విజయా నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి ల నుంచి బహుమతి అందుకుంది. దాంతో ఆ చిన్నారి మంజుల సినిమాల్లో ఎక్కువగా నటించి మరిన్ని బహుమతులు అందుకోవాలని ఆశించింది. తమిళ సంగీత దర్శకుడు గణేష్ మంజుల కుటుంబానికి బాగా సన్నిహితుడు కావడంతో మంజులలోవున్న ఉత్సాహాన్ని గమనించి ఆమెను తమిళ సినీ రచయిత ‘చిత్రాలయ’ గోపు కు పరిచయం చేశారు. ఆ రోజుల్లో గోపు జెమిని సంస్థ జి.ఎస్. మణి దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘శాంతినిలయం’ (1969) చిత్రానికి రచన చేస్తున్నారు. ఇంగ్లీషు చిత్రం ‘సౌండ్ అఫ్ మ్యూజిక్’ ఆధారంగా నిర్మించిన ఈ చిత్రంలో గోపు సిఫారసుతో మంజుల హీరో జెమినీ గణేశన్ కు కూతురు (బాలతార) గా నటించింది. 1971లో మంజుల కు హీరోయిన్ గా నటించే సువర్ణావకాశం లభించింది. సూపర్ స్టార్ ఎం.జి. రామచంద్రన్ హీరోగా నటించిన సత్య మూవీస్ అధిపతి ఆర్. యం. వీరప్పన్ నిర్మించిన ‘రిక్షాకారన్’ సినిమాలో హీరోయిన్ గా మంజుల నటించింది. ఎమ్జీఆర్ తన సరసన హీరోయిన్ గా జయలలితను సిఫార్సు చేస్తే, నిర్మాత వీరప్పన్ మాత్రం కొత్త తారగా మంజులను ప్రవేశపెడదామన్నారు. మరోవైపు పద్మిని ఎమ్జీఆర్ అక్కగా నటించగా, ఎమ్జీఆర్ ఫాన్స్ నుండి పెద్దపెట్టున వ్యతిరేకత వచ్చింది. అందుకు కారణం ఎమ్జీఆర్-పద్మిని జంటగా కొన్ని విజయవంతమైన సినిమాలలో అంతకుముందు నటించి ఉండడమే. ఏమైతేనేం ‘రిక్షాకారన్’ చిత్రం దేవి పారడైజ్ లో 163 రోజులతోబాటు అనేక కేంద్రాల్లో విజయవంతంగా ఆడి మరో 12 కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. ఎమ్జీఆర్-మంజుల తో అడయార్ నది వంతెన వద్ద చిత్రీకరించిన “కడలోరం వంగీయ కాట్రు” అంటూ సౌందరరాజన్ ఆలపించిన పాట, సుశీలతో సౌందరరాజన్ పాడిన రెండు యుగళగీతాలు బాగా పాపులర్ అయ్యాయి. ఈ చిత్రంలో నటనకు ఎమ్జీఆర్ కు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి బహుమతి లభించింది. ఇదే సినిమాను హిందీలో ‘రిక్షావాలా’ పేరుతో పునర్నిర్మించారు. టి.ఆర్. రామన్న దర్శకత్వంలో నిర్మించిన ‘శక్తి లీలై’ అనే పౌరాణిక సినిమాలో మంజుల ‘పూంగళి’ అనే శాస్త్రీయ నృత్యకారిణిగా నటించింది. తరవాత కృష్ణన్-పంజు దర్శకత్వంలో వచ్చిన ‘ఇదయ వీణై’ (1972) చిత్రంలో ఎమ్జీఆర్ సరసన హీరోయిన్ గా ఆమె రాణించింది. ఈ చిత్రాన్ని ఆరోజుల్లో కాశ్మీర్ లో షూట్ చేయడం విశేషం. ముత్తురామన్ సరసన ‘మరు పిరవై’ సినిమాలో, ఎం.కె. ముత్తు సరసన ‘పూక్కారి’ చిత్రంలో, శివాజీ గణేశన్ సరసన ‘ఎంగళ్ తంగ రాజా’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. తరవాత 1973 లో ఎమ్జీఆర్ ఆర్.ఎం. వీరప్పన్ తో కలిసి స్వీయ దర్శకత్వంలో ‘ఉలగమ్ సుట్రుమ్ వాలిబన్’ చిత్రం నిర్మిస్తూ అందులో మంజులను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా మద్రాస్ లోని దేవి పారడైజ్ లో 217 రోజులు ఆడి బ్లాక్ బస్టర్ గా చరిత్ర సృష్టించింది. దేవి పారడైజ్ లో అంతకు ముందు చరిత్ర సృష్టించిన ‘మెకన్నాస్ గోల్డ్’ సినిమా రికార్డులను ఈ చిత్రం చెరిపివేసింది. జపాన్ వంటి దేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రానికి పెద్దగా పోస్టర్ల వంటి ప్రచార సామాగ్రిని వాడలేదు. వరసగా 100 షో లకు మూడు గంటల ముందుగానే టికెట్లు అమ్ముడై పోయేవి. ఈ చిత్రానికి ఫిలింఫేర్ వారి ప్రాంతీయ బహుమతి లభించింది. మంజులతో కలిసి ఎమ్జీఆర్ ఆలపించే “కళ్యాణ ఆశై వందా” అనే యుగళగీతం నేటికీ తమిళనాడులో ఎక్కువగా వినిపిస్తూనే వుంటుంది. 70 వ దశకంలో మంజుల తమిళ చిత్రరంగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది.


తెలుగు చిత్రపరిశ్రమలో...
అచిరకాలంలోనే కథానాయకిగా మంజుల తెలుగు చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టింది. అన్నపూర్ణ వారి ‘జై జవాన్’(1970) చిత్రంలో మొదటిసారి కస్తూరి అనే చిన్న పాత్రను పోషించింది. తరవాత ఎన్.ఎన్. భట్ తాతినేని రామారావు దర్శకత్వంలో నిర్మించిన ‘మరపురాని మనిషి’ చిత్రంలో అక్కినేనికి జంటగా మంజుల నటించింది. ‘ఒడయిల్ నిన్ను’ (1965) అనే మళయాళ చిత్రం ఆధారంగా ఈ సినిమా నిర్మించారు. ఈ చిత్రంలో నటనకు అక్కినేని ఫిలింఫేర్ సంస్థ నుంచి ఉత్తమ నటుడి బహుమతి అందుకున్నారు. 1973లో రవికళా కళామందిర్ బ్యానర్ మీద ఆదుర్తి సుబ్బారావు సొంతంగా నిర్మించిన ‘మాయదారి మల్లిగాడు’ చిత్రంలో కృష్ణ సరసన మంజుల హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా పెద్ద హిట్టయింది. ‘తాళికట్టినదాని తలమీద చెయ్యేసి ఏ మొగుడు అబద్ధం చెప్పడు’ అనే సిద్ధాంతాన్ని నమ్మిన అమాయకమైన తెలుగు దేశపు ఆడపిల్ల ‘చంద్రి’ పాత్రలో మంజుల రాణించింది. ఈ చిత్రంలో మహదేవన్ స్వరపరచగా బాలు, సుశీల ఆలపించిన ఆత్రేయ గీతం “వస్తా ఎళ్ళొస్తా” అద్భుతంగా ఉండడమే కాదు ఆ పాట చిత్రీకరణ యెంతో గొప్పగా వుంటుంది. ఈ పాటలో ఒక నీతి, నియమం వుంది. “అందరినీ ఓ కంట సూసే దేవుడున్నాడు... ఆడిముందు రేపే నీకు తాళి కడతాను. మేము ఆలుమగలం పొండిరా అని అరిచి చెబుతాను... ఒప్పినోళ్ళు మెచ్చనీ, ఒప్పనోళ్ళు చచ్చనీ” అంటూ అమాయకపు రౌడీ మల్లిగాడు చెప్పడం అతడి నిజాయితీని గుర్తు చేస్తుంది. అదే సంవత్సరం నిర్మాత రామబ్రహ్మం యోగానంద్ దర్శకత్వంలో నిర్మించిన ‘వాడే వీడు’ చిత్రంలో మంజుల ఎన్.టి.రామారావు కు జంటగా నటించింది. “అటు చల్లని వెన్నెల జాబిలీ” అనే పాటలో మంజుల అందం ఇనుమడిస్తుంది. మాయదారి మల్లిగాడు, వాడే వీడు రెండు చిత్రాలూ విజయవంతం కావడంతో తెలుగులో మంజులకు మార్కెట్ డిమాండ్ పెరిగింది. కన్నడంలో హిట్టయిన ‘నాగరహావు’ చిత్రాన్ని తమిళంలో ‘రాజా నాగమ్’ (తెలుగులో కోడెనాగు)పేరుతో నిర్మించగా అందులో శ్రీకాంత్ సరసన మంజుల నటించింది. ఈ సినిమా వందరోజులు ఆడింది. కృష్ణ నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలో చంద్రమోహన్ కు జంటగా ఆదివాసి పడుచు గా మంజుల నటించింది. ఒకవైపు తెలుగులో నటిస్తూనే తమిళంలో కూడా అంతే డిమాండ్ తో మంజుల నటించడం విశేషం. 1974లో తమిళంలో ఆమె నటించిన చిత్రాలు ...’డాక్టరమ్మ’, ‘ఎన్ మగన్’, ‘నేట్రు ఇంద్రు నాలై’ కాగా, తెలుగులో శోభన్ బాబు సరసన జగపతి పిక్చర్స్ వారు నిర్మించిన ‘మంచి మనుషులు’ చిత్రంలో నటించడం మరో ఎత్తు. ఈ సినిమా మెగా హిట్టయింది.


శోభన్ బాబు తో హిట్ పెయిర్ గా...
తెలుగులో ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ వంటి అగ్రశ్రేణి నటులతో నటించినా శోభన్ బాబుతో మంజుల హిట్ పేయిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మంచి మనుషులు’ సినిమా సిమ్లా ప్రాంతంలో చిత్రీకరణకు నోచుకున్నప్పుడు మంజుల శోభన్ తో కలిసి స్కేటింగ్ నేర్చుకుంది. ఇందులో పాటలన్నీ సూపర్ హిట్లే. తరవాతి సంవత్సరం ఆమె ‘అందరూ మంచివారే’, ‘గుణవంతుడు’, ‘పిచ్చిమారాజు’ సినిమాల్లో శోభన్ సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరవాత వరసగా ‘ఇద్దరూ ఇద్దరే’, ‘మొనగాడు’, ‘గడుసు పిల్లోడు’ సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. అప్పట్లో ‘ఉన్నిడం మయం గుగిరేన్’ అనే తమిళ చిత్రంలో నటిస్తుండగా మంజుల ఆ చిత్ర హీరో విజయకుమార్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. విజయకుమార్ అంతకు ముందే వివాహితుడు. అతని మొదటి భార్య ముత్తు అంగీకారంతో ఈ పెళ్లి జరిగింది. అందరూ కలిసే వుండేవారు. మంజుల ముత్తుతో సఖ్యతగా ఉంటూ దేవాలయాలకు, విహారయాత్రలకు ఆవిడను వెంటబెట్టుకొని వెళ్ళేది. మంజుల-విజయకుమార్ లకు ముగ్గురు కూతుళ్ళు. వారు ప్రీతి, వనిత , శ్రీదేవి. వారిలో శ్రీదేవి తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తోంది. అదృష్టవశాత్తు తెలుగు, తమిళంలో నటించిన తొలి చిత్రాలు విజయవంతం కావడంతో మంజుల వెనుకకు చూసుకోలేదు. దాదాపు 100 చిత్రాల్లో నటించిన మంజుల 70 దశకంలో తిరుగులేని నాయికగా వెలుగొందింది. ‘నేరం నాది కాదు ఆకలిది’, ‘మగాడు’, ‘మనుషులంతా ఒక్కటే’ ,’పల్లెటూరి చిన్నోడు’, ‘చాణక్య చంద్రగుప్త’ వంటి విజయవంతమైన చిత్రాల్లో రామారావు సరసన, ‘బంగారు బొమ్మలు’, ‘దొరబాబు’, ‘మహాకవి క్షేత్రయ్య’ సినిమాలో అక్కినేని సరసన నటించి మంజుల మంచి పేరు గడించింది. తమిళంలో వచ్చిన ‘ఎల్లరు నాళ్ళవారే’, ‘అన్బే ఆరు ఇరే’, ‘నినై తట్టే ముడిప్పవన్’, ‘కుప్పట్టు రాజా’, ‘చేరన్ పాండ్యన్’ తమిళ చిత్రాలు మంజులకు మంచి పేరు తెచ్చాయి. అలనాటి ప్రసిద్ధ తారలు ఏ.ఎన్.ఆర్, ఎన్.టి.ఆర్, శోభన్ బాబు, కృష్ణ, ఎం.జి.ఆర్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, కమల్ హసన్, రజనికాంత్ లతో నటించడమే కాకుండా కన్నడలో విష్ణువర్దన్ తో ‘సిరి తనక్కే సవాల్’ చిత్రంలో మంజుల కథానాయకిగా రాణించింది. 80 దశకంలో మంజుల సహాయ పాత్రలకు పరిమితమై ‘చంటి’ వంటి చిత్రాల్లో కనిపించింది. వెంకటేష్ నటించిన ‘వాసు’ ఆమె చివరిసారి నటించిన చిత్రం. మంజుల పరభాషా చిత్రాల్లో నటించేటప్పుడు ఆయాప్రాంతాల ఆచార వ్యవహారాలని నిశితంగా గమనించి నటించేది. అందుకే మంజుల ఉచ్చారణ, కట్టుబొట్టు, భావ ప్రకటన ఆ ప్రాంతాలకు తగినట్టు వుండేది. ‘అమరశక్తి’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నప్పుడు ఆమె ఉత్తర భారత సంప్రదాయం ప్రకారం పాదాభివందనం చెయ్యడంతో, దర్శకుడు హర్మేష్ మల్హోత్రా ఆశ్చర్యపడి ఆమె పరిశీలనా శక్తిని మెచ్చుకున్నారు. మంజుల మంచి నర్తకి కూడా! మంజుల అభిమానులు ఆమెను వినోదం పంచే పాత్రల్లోనే నటించమని ఉత్తరాలు రాసేవారు. ఆమెకు కొన్ని నిర్దుష్టమైన అభిప్రాయాలు ఉండేవి. గ్లామర్ పాత్రలు చేసే తారలు క్యారెక్టర్ పాత్రల్లో అవలీలగా రాణిస్తారని. కానీ క్యారెక్టర్ పాత్రల్ని పోషించే తారలు గ్లామర్ పాత్రల్లో ఇమడలేరని ఆమె అనేవారు.

అకాల మరణం...
చాలాకాలంగా మంజుల ఉదర సంబంధ వ్యాధితో బాధపడుతూ వుండేది. ఒకరోజు మైలాపూర్ కస్తూరి రంగ అయ్యంగార్ వీధిలోని స్వగృహంలో నిద్రలో మంచం మీదనుంచి ప్రమాదవశాత్తు కిందపడి కాలికి గాయం కావడంతో శ్రీరామచంద్ర మెడికల్ ఆసుపత్రిలో చేరింది. పచ్చ కామెర్ల వ్యాధి వున్నట్లు ఆసుపత్రి సిబ్బంది గుర్తించి వైద్యసేవలు అందిస్తూ వుండగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ తన 59 వ ఏట 23 జూలై 2013 న ఆకస్మిక మరణం చెందింది.

ఆచారం షణ్ముఖాచారి


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.