ఆయన ప్రతిభ... బహుముఖం!

అటు గంభీరమైన నటనకు... ఇటు పెద్ద మనిషి తరహా పాత్రలకు కూడా పెట్టింది పేరు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి. ఏ పాత్ర ధరించినా అందులో సహజంగా ఒదిగిపోయి మెప్పించేవారు. నాటకాల నుంచి వెండితెరకు వచ్చిన మిక్కిలినేని, రచయితగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, రాజకీయ నేతగా కూడా ప్రసిద్ధుడు. గుంటూరు జిల్లా లింగాయపాలెంలో 1914 జులై 7న పుట్టిన మిక్కిలినేని తొలుత జానపద కళారూపాలతో ప్రభావితుడయ్యారు. పౌరాణిక, జానపద సాంఘిక నాటకాలలో స్త్రీ పురుష పాత్రలు ధరించారు. జాతీయ స్వాతంత్య్ర పోరాటాలలో పాల్గొని 5 సార్లు జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్రానంతరం నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర వ్యాపిత ఉద్యమంలో ముఖ్య వ్యవస్థాపకుడిగా పనిచేశారు. తెలుగు సినిమాలలో సుమారు 400 పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో భిన్న విభిన్న పాత్రలు ధరించారు. నాటక రంగానికి చెందిన 400 మంది నటీనటుల జీవితాలను ‘నటరత్నాలు’ పేరిట అక్షరాల్లో పొందుపరిచిన రచయిత ఈయన. వీరి భార్య సీతారత్నం కూడా నాటకాలలో పాత్రలు ధరించారు. మిక్కిలినేనిని ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. కె.ఎస్‌.ప్రకాశరావు దర్శకత్వంలో 1949లో వచ్చిన ‘దీక్ష’తో మిక్కిలినేని సినీప్రస్థానం మొదలైంది. బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన ‘భైరవద్వీపం’ వరకూ 400లకు పైగా తెలుగు చిత్రాల్లో నటించారు. కమ్యూనిస్ట్‌గా, గ్రంథాలయ, హేతువాద ఉద్యమాలలో క్రియాశీల కార్యకర్తగా సేవలందిచారు. ‘తెలుగువారి జానపద కళారూపాలు’ అనే పుస్తకాన్ని కూడా మిక్కిలినేని వెలువరించారు. ‘మన పగటి వేషాలు’, ‘ఆంధ్రుల నృత్యకళా వికాసం’ తదితర పరిశోధనాత్మక గ్రంథాల రచయిత. బహుముఖంగా సేవలందించిన మిక్కిలినేని 2011 ఫిబ్రవరి 22న విజయవాడలో తన 95వ ఏట మరణించారు.

Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.