సాటిలేని నటరత్నం మిక్కిలినేని
తొలుత రంగస్థల కళాకారుడు. ఆపై సినీ సృజనశీలి. అందివచ్చిన ఏ పాత్రలోనైనా యిట్టే ఇమిడిపోయే కళాత్మక వ్యక్తిత్వం... అటు వెండితెర...ఇటు అక్షరాన్ని సమంగా ప్రేమించే తత్త్వం...ఆయన సొంతం. నిజానికి తెలుగు సినిమా తల్లికి దొరికిన గొప్పవరం ఆయన. చారిత్రక, పౌరాణిక, సాంఘికం... ఇలా అన్ని రకాల పాత్రలకూ వంద శాతం న్యాయం చేసిన అతి గొప్ప నటుల పేర్ల జాబితాలో తప్పక ఉండాల్సిన పేరు ఆయినది. ఆయనే...మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి. తన నటనతో తెలుగు సినిమా రంగంతో విడదీయని అనుబంధం ఏర్పరచుకొని ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకొన్నారు మిక్కిలినేని. తెలుగు సినిమాకి తనవంతు సేవలందించిన మిక్కిలినేని జయంతి జులై 7న.  ఈ సందర్భంగా ఆ గొప్ప నటుడికి అక్షర నివాళి.

నష్టజాతకుడనే ముద్ర
మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో లింగాయపాలెంలో 1914 జులై 7న జన్మించారు. సొంతవాళ్లు నష్టజాతకుడు అని అనడంతో కోలవెన్నులో అమ్మమ్మ దగ్గర పెరిగారు. రంగస్థలంపై నటనను మొదలుపెట్టే ముందు పశువైద్య విద్యను అభ్యసించారు. సాంఘిక, జానపద, పౌరాణిక నాటకాలలో పురుష, స్త్రీ పాత్రలను ధరించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జాతీయ స్థాయిలో జరిగిన స్వాత్రంత్ర పోరాటాలలో పాల్గొని ఐదుసార్లు జైలుకు వెళ్లారు. స్వాతంత్య్రం తరువాత నిరంకుశత్వమైన నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. ప్రజారాజ్య మండలిని స్థాపించారు.

అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం
ఆంధ్రప్రాంతపు జమీందారుల అణచివేతను, దేశీయంగా నైజాం - బ్రిటిష్‌ నిరంకుశంను, అంతర్జాతీయ స్థాయిలో ఫాసిస్టులను వ్యతిరేకంగా రూపొందినదే ఈ ప్రజానాట్యమండలి. ఇది ఒక కళా సైన్యం. మిక్కిలినేని ఒక కమ్యూనిస్ట్‌. ఈ కళాసైన్యం ద్వారా జానపద చారిత్రక కళారూపాలను రూపొందించేవారు. అలా ప్రజలను సమీకరించేవారు. అయితే 1940లలో ఈ మండలి నిషేధానికి గురైంది. అందువలన సినిమా రంగాన్ని ఆశ్రయించవలసి వచ్చింది ఈ కళాసైన్యానికి సంబంధించిన కొంతమంది నాటకరంగ నటులకు. అలా సినిమా పరిశ్రమను ఆశ్రయించిన వారిలో తాతినేని ప్రకాశరావు, సుంకర సత్యనారాయణ, కే.బి.తిలక్, గరికపాటి రాజారావు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, వాసిరెడ్డి భాస్కరరావు, సి.మోహనదాసు, వి.మధుసూధనరావు, టి.చలపతిరావులతో పాటు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి కూడా ఉన్నారు. ఇలా నాటకరంగం నుంచి సినిమా రంగంలో దర్శకులు, సాంకేతిక నిపుణులు ఎంతోమంది ఉండడం విశేషం.

నాలుగొందల సినిమాల నటవైభవం
1949లో ‘దీక్ష’ సినిమాతో సినిమా కెరీర్‌ని మొదలుపెట్టారు మిక్కిలినేని. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తండ్రి కె.ఎస్‌.ప్రకాశరావు. ఆ తరువాత 400పైగా చలన చిత్రాలలో నటించి ప్రేక్షకుల మదిలో చెదరని ముద్ర వేశారు మిక్కిలినేని. సుమారు 150 సినిమాలలో నందమూరి తారక రామారావుతో ఎక్కువగా వర్క్‌ చేశారు మిక్కిలినేని. ఇక జానపద బ్రహ్మ విఠలాచార్య తీసిన దాదాపు ప్రతి చిత్రంలో నటించారు మిక్కిలినేని. 1950 నుంచి 1970 మధ్య వచ్చిన ఎన్నో సినిమాలలో నటించారు మిక్కిలినేని. మిక్కిలినేని ఆఖరి సినిమా ‘భైరవద్వీపం’.

వివాహం
మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి భార్య పేరు సీతారత్నం. ఈవిడ కూడా నాటకాలలో నటించారు. వీరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.


మిక్కిలినేని సినిమాలు
‘దీక్ష’, ‘పల్లెటూరు’, ‘పుట్టిల్లు’, ‘కన్నతల్లి’, ‘పరివర్తన’, ‘మేనరికం’, ‘సంతానం’, ‘తెనాలి రామకృష్ణ’, ‘మాయ బజార్‌’, ‘సారంగధర’, ‘అప్పు చేసి పప్పు కూడు’, ‘రేణుకాదేవి మహత్యం’, ‘శ్రీ సీతా రామ కళ్యాణం’, ‘జగదేక వీరుని కథ’, ‘దక్షయజ్ఞం’, ‘గుండమ్మ కథ’, ‘మహామంత్రి తిమ్మరసు’, ‘కుల గోత్రాలు’, ‘శ్రీ కృష్ణార్జున యుద్ధం’, ‘పరువు ప్రతిష్ట’, ‘బందిపోటు’, ‘లక్షాధికారి’, ‘తిరుపతమ్మ కథ’, ‘నర్తనశాల’, ‘రాముడు భీముడు’, ‘పూజా ఫలం’, ‘మంచి మనిషి’, ‘బభృవాహన’, ‘పాండవ వనవాసం’, ‘సి.ఐ.డి’, ‘అంతస్తులు’, ‘పిడుగు రాముడు’, ‘పల్నాటి యుద్ధం’, ‘కలిసొచ్చిన అదృష్టం’, ‘దేవకన్య’, ‘బాలరాజు కథ’, ‘సంపూర్ణ రామాయణం’, ‘బాల భారతం’, ‘పల్లెటూరి చిన్నోడు’, ‘సీతా కళ్యాణం’, ‘సీత స్వయంవర’, ‘దాన వీర శూర కర్ణ’, ‘సీతా రాములు’, ‘రామ్‌ రాబర్ట్‌ రహీం’, ‘పులి బెబ్బులి’, ‘రుస్తుం’, ‘ధర్మపత్ని’, ‘శ్రీ కృష్ణార్జున విజయం’, ‘భైరవ ద్వీపం’.

మరణం
2011 ఫిబ్రవరి 22న మంగళవారం నాడు విజయవాడలో మరణించారు మిక్కిలినేని. అప్పుడు ఆయన వయసు 96 సంవత్సరాలు. మూత్ర సంబంధమైన అనారోగ్యంతో బాధపడుతూ విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చనిపోయారు మిక్కిలినేని.

పురస్కారాలు
ఆంధ్ర విశ్వవిద్యాలయం మిక్కిలినేనిని కళాప్రపూర్ణ బిరుదుతో గౌరవించింది. అలాగే భారత ప్రభుత్వం రాష్ట్రపతి పురస్కారం కూడా ఇచ్చి సత్కరించింది. ఇంకా ఎన్నో పురస్కారాలు, గౌరవాలు అందుకొన్నారు మిక్కిలినేని.

అక్షరసేవ
తెలుగువారి చలన చిత్ర కళ, ఆంధ్రుల నృత్య-కళావికాసం, ప్రజాపోరాటాల రంగస్థలం, తెలుగువారి జానపద కళారూపాలు, ఆంధ్ర నాటకరంగ చరిత్ర, నటరత్నాలు వంటివి రచనలు చేశారు. 

 


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.