ఛాంగ్‌రే... భళారే... సినారే!
ఆ కుర్రా‌డిది తెలం‌గా‌ణలో ఓ మారు‌మూల గ్రామం.‌ కరీం‌న‌గర్‌ జిల్లా‌లోని హను‌మా‌జీ‌పేట.‌ రైతు కుటుంబం.‌ తండ్రిది వానా‌కాలం చదు‌వ‌యితే తల్లికి అదీ లేదు.‌ ఊర్లో సరైన బడీ లేదు.‌ ఓ పంతు‌లు‌గారి దగ్గర ఓన‌మాలు దిద్దు‌కొని దగ్గ‌ర‌లోనే ఉన్న పాఠ‌శా‌లలో చేరాడు.‌ అప్పటి పరి‌స్థి‌తుల మేర ఉర్దూ మాధ్యమం మాత్రమే ఉండేది.‌ అందు‌లోనే చేరాడు.‌ మాతృ‌భా‌షైన తెలు‌గుని ‌‘ఐచ్చికం’‌గా తీసు‌కు‌న్నాడు.‌ పల్లె‌టూరి వాడు కావ‌డంతో ‌‘యాస’‌ ఉండేది.‌ ఓసారి ప్రక్క జిల్లాకు చెందిన ఓ సహ విద్యార్ధి అతడి యాసను గేలి చేశాడు.‌ దానికి అతను బాధ‌ప‌డ‌లేదు.‌ కోపం పెంచు‌కో‌లేదు.‌ తనకి యాస ఉందా లేదా అని ఆలో‌చిం‌చాడు.‌ ‌‘యాస’‌ లేకుండా మాట్లా‌డ‌లేనా అను‌కొ‌న్నాడు.‌ సంక‌ల్పిం‌చు‌కు‌న్నాడు.‌ అంతే! భాషని బట్టీ, యాసని బట్టి ప్రాంతాన్ని పోల్చు‌కో‌వ‌డా‌నికి వీలు లేకుండా మాట్లా‌డ‌సా‌గాడు.‌ ఉర్దూ మాధ్య‌మం‌లోనే చది‌వినా తెలుగు అధ్యా‌ప‌కు‌డిగా, ఆచా‌ర్యు‌డిగా ఎద‌గ‌డమే కాకుండా సాహి‌త్యంలో అత్యంత ప్రతి‌ష్టా‌కర పుర‌స్కా‌ర‌మైన జ్ఞాన‌పీ‌ఠాన్ని వరిం‌చాడు.‌ ‌‘సాను‌కూల దృక్పథం’‌’తో ఆలో‌చించి ఆచ‌రిం‌చాడు.‌ ఆయనే సినా‌రేగా విను‌తి‌కె‌క్కిన సింగి‌రెడ్డి నారా‌య‌ణ‌రెడ్డి.‌


1931 జులై 29న పుట్టిన సినా‌రేకి కవిత్వం సహ‌జాతం.‌ చిన్న‌ప్పుడు ఆల‌కిం‌చిన బుర్రక‌ధలు, హరి‌క‌థలు అత‌డిని సృజ‌నా‌త్మ‌క‌త‌వైపు నడి‌పాయి.‌ నేర్చు‌కుంటే వచ్చేది కాదు కవి‌త్వ‌మని ఆయనే అంటారు.‌ పాండిత్యం కావా‌లంటే నేర్చు‌కో‌వా‌లట.‌ చిన్న‌ప్పుడు హిందీ పాటలు విన్న‌ప్పుడు వాటిని తెలు‌గులో పాడు‌కొన్నా సినిమా పాటల వైపు దృష్టి‌పె‌ట్ట‌లేదు ఎప్పుడూ.‌ పద్య‌కా‌వ్యాలు, గేయాలు, గజల్స్‌ ఇలా సాగి‌పో‌యాయి తొలి‌రో‌జులు.‌ ‌‘మట్టి‌మ‌నిషి’,‘ఆకాశం’,‘కలం సాక్షిగా’,‘నాగా‌ర్జున సాగరం’,‘విశ్వ‌నా‌థ‌నా‌యుడు’, ‌‘కర్పూర వసం‌త‌రా‌యలు’, ‌‘విశ్వం‌భర’‌ వంటి రచ‌నలు విమ‌ర్శ‌కులు ప్రశం‌స‌ల‌నం‌దు‌కున్నాయి.‌ ఆ పరి‌ణా‌మ‌క్రమంలో సినీ‌రంగ ప్రము‌ఖు‌లైన అక్కి‌నేని, గుమ్మ‌డి‌లతో పరి‌చయం ఏర్ప‌డింది.‌ శభా‌ష్‌రా‌ముడు, పెళ్లి‌సం‌దడి వంటి చిత్రా‌లకు పాటలు రాయ‌మని ఆహ్వానించారు.‌ అయితే కేవలం, చిత్రంలో ఒక్క పాటను మాత్రమే రాయడం ఇష్టం‌లేక తిర‌స్క‌రిం‌చాడు.‌ ‌‘కలిసి ఉంటే కలదు సుఖం’‌ చిత్ర నిర్మాణ సమ‌యంలో ఎన్టీ‌ఆర్‌తో పరి‌చయం ఏర్ప‌డింది.‌ సినారే గురించి విని ఉన్న ఎన్టీ‌ఆర్‌ ఆయ‌నని తమ తదు‌పరి చిత్రం ‘గులే‌బ‌కా‌వ‌ళి‌కథ’‌కు పాటలు రాయ‌మని కోరారు.‌ అయి‌న‌ప్ప‌టికీ సినారే ఒక‌టి‌రెండు పాట‌ల‌యితే రాయ‌నని మొత్తం అన్ని పాటలు రాసే అవ‌కాశం ఇస్తేనే పని‌చే‌స్తా‌నని చెప్పారు.‌ సినారే నిబ‌ద్ధ‌తకు, ఆత్మ‌వి‌శ్వా‌సా‌నికి ఆశ్చ‌ర్య‌పో‌యిన ఎన్టీ‌ఆర్‌ ‌‘‌‘అటు‌లనే కానిండు’‌’‌ అన‌వ‌లసి వచ్చింది.‌


ఆ విధంగా సినారె 1962లో ‌‘గులే‌బ‌కా‌వళి కథ’‌ సినిమా ద్వారా ‌‘రాజ’‌మార్గాన చిత్రరంగ ప్రవేశం చేశారు.‌ తొలి పాట ‌‘నన్ను దోచు‌కుం‌దు‌వటే వన్నెల దొర‌సాని’‌ కూడా ప్రేమ‌గీ‌తమే.‌ అయితే ఆయన ఒక అంశా‌నికే పరి‌మితం కావా‌లని అను‌కో‌లేదు.‌ బహుశ అందు‌కే‌నేమో అంత‌కు‌ముందు ఒకటీ అరా పాటలు రాయ‌మన్నా రాయ‌లేదు.‌ పూర్తి చిత్రం అంటే అన్ని అంశా‌లనూ స్పృ‌శిం‌చ‌వచ్చు.‌ అలా‌గాక ఏదో ఒక సన్ని‌వే‌శా‌నికి పాట రాస్తే ఒక‌వేళ అది ప్రజా‌ద‌రణ పొంద‌క‌పోతే తాను మరు‌గున పడి‌పో‌వచ్చు.‌ ప్రజా‌ద‌రణ పొందా‌లంటే మంచి బాణీ కావాలి.‌ కథ, నటన వగై‌రాలు ఎన్నో కార‌ణ‌భూ‌తా‌ల‌వు‌తాయి.‌ ఇలా ఆలో‌చించి అలా చిత్ర రంగంలో ప్రవే‌శిం‌చటం వెనుక సుని‌శి‌త‌మైన బుద్ధి కని‌పి‌స్తుంది.‌ తను ఏ రంగంలో ప్రవే‌శిం‌చినా అగ్రస్థా‌నంలో ఉండా‌ల‌ను‌కునే పట్టు‌ద‌లతో రాజ‌సా‌నికి ప్రతీ‌క‌యిన ఎన్టీ‌ఆర్‌ ద్వారా చిత్రరంగంలోకి ప్రవే‌శిం‌చారు.‌ ఈ విషయం తెలి‌సిన అక్కి‌నేని ‌‘‌‘ఎన్టీ‌ఆర్‌ సినిమా అంటే ఇంక మీకు తీరి‌కుం‌డదు చూడండి’‌’‌ అనడం, అలాగే సినారే సినిమా పాటల కవిగా కూడా బిజీ అయి‌పో‌వడం జరి‌గింది.‌ శ్రీశ్రీలా, కృష్ణ‌శా‌స్త్రిలా ఎటు‌వంటి ‌‘ఇజా‌నికి’‌ కట్టు‌బ‌డ‌కుండా సంఘంలో జరిగే అన్ని సంఘ‌ట‌న‌లకు ప్రతి‌స్పం‌దిస్తూ రచ‌నలు చేశారు. ‌‘నేను వాక్కుని నమ్ము‌తాను’‌ అనే సినారే, శబ్ద సౌంద‌ర్యా‌నికి ప్రాధాన్యం ఇచ్చే‌వారు.‌ ప్రేమ‌గీ‌త‌మైనా, ప్రబోధాత్మక గీత‌మైనా, విషా‌ద‌మైనా కవి‌తా‌త్మ‌కం‌గానే ఉండేది.‌ ఇటీ‌వల కాలంలో తెలుగు రాష్ట్రా‌ల విభజన సమయంలో అందరూ ఏదో‌ర‌కంగా గుర్తు‌చే‌సు‌కొన్న పాట ఏదైనా ఉందంటే అది సినారే పాటే.‌


‌‘వచ్చిం‌డన్నా, వచ్చా‌డన్నా వరాల తెలుగు ఒక‌టే‌నన్న.‌.‌.‌ యాసలు వేరుగ ఉన్న మన భాష తెలుగు భాషన్నా’‌ అంటూ సాగే ‌‘తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది’‌ పాట (తల్లా పెళ్లామా) అంద‌రికీ గుర్తొ‌చ్చింది.‌ ఆ తర్వాత ఆయనే ప్రజా‌భి‌ప్రా‌యాన్ని మన్నిస్తూ ఓ ఇంటర్వ్యూ ‌‘‌‘తెలుగు జాతి మనది ‌‘రెండు’‌గ వెలుగు జాతి మనది’‌’‌ అన్నారు.‌ అంటే ఆయన ఉద్దేశం భేద‌భా‌వాలు ఉండ‌రా‌దనే.‌ దీన్ని ఎవరు కాద‌న‌గ‌లరు? ఈ విష‌యాన్ని ఆయన చాలా పాటల్లో చాటారు కూడా.‌ ‘గాలికీ కుల‌మేదీ.‌.‌ మింటికి మరు‌గేదీ.‌.‌’‌ అన్నారు.‌ ‌‘పాలకు ఒకటే వర్ణం.‌ అది తెలి‌వర్ణం.‌.‌ వీరు‌ల‌కెం‌దుకు కుల భేదం? అది మన‌సుల చీల్చెడు మత భేదం’‌ అంటూ నిర‌సిం‌చారు.‌ కర్ణ సిని‌మా‌లోని ఈ గీతం అజ‌రా‌మరం.‌ ‌‘నీది నీది అను‌కొ‌న్నది నీది కాదురా.‌.‌ నీవు రాయ‌న్నది ఒక‌నా‌టికి రత్న‌మ‌వు‌నురా’‌ అంటూ సులు‌వుగా జీవి‌త‌స‌త్యాన్ని బోధిం‌చారు.‌ ‌‘ఏమి చదివి పక్షులు పై కెగు‌ర‌గ‌లి‌గెను? ఏ చదువు వల్ల చేప పిల్ల‌లీ‌ద‌గ‌లి‌గెను’‌ అంటూ ‌‘ఆత్మ‌బం‌ధువు’‌లో హృదయం లేక‌పోతే చదు‌వు‌లున్నా వృథా అని చాటారు.‌ అందుకే ‌‘కాగి‌తంపు పూల‌కంటే గరిక పూవు మేలు’‌ అని పామ‌రు‌లకు కూడా అర్థ‌మ‌య్యేలా చెప్పారు.‌ ‘ఏ దే‌శ‌మే‌గినా.‌.‌ ఎందు‌కా‌లి‌డినా’‌ (అమె‌రికా అబ్బాయి), ‌‘నీ సంఘం.‌.‌ నీ ధర్మం.‌.‌ నీ దేశం నువు మర‌వద్దు’‌ (కోడలు దిద్దిన కాపురం) అని హెచ్చ‌రిం‌చారు.‌‘ఇదేనా మన సాంప్రదా‌య‌మి‌దేనా?’‌ (వర‌కట్నం) అంటూ సమాజ పెడ‌ధో‌ర‌ణు‌లను నిల‌దీసి ప్రశ్నిం‌చారు. ‘‌అందరూ దేవుని సంతతి కాదా... ఎందుకు తరతమ భేధాలు...’ అనిపించారు.

‌‘మారాలి మారాలి మను‌షుల నడ‌వడి మారాలి’‌ (బలి‌పీఠం) అని ప్రభో‌దిం‌చారు.‌‘అను‌బంధం ఆత్మీ‌యత అంతా ఒక బూటక’‌మని (తాత‌మ‌న‌వడు)లో తేల్చేసి బరు‌వైన వేదాం‌తాన్ని సులు‌వుగా చెప్పిందీ ఆయన కలమే.‌ అలా నిర్వే‌దాన్ని ఒలి‌కిం‌చిన కలం‌తోనే ‌‘పగలే వెన్నెల.‌.‌’‌ అంటూ ఊహల్లో తేలి‌యా‌డిం‌చారు.‌ అసలు పగలు వెన్నెల ఎలా అవు‌తుంది?


‌‘కదిలే ఊహ‌లకు కన్ను‌లుంటే.‌.‌ జగమే ఊయ‌ల‌వు‌తుంద’‌ని కూడా (పూజా‌ఫలం) వివ‌రిం‌చారు.‌ అంటే అంతా నీ చూపులో, నీ ఆలో‌చ‌నలో ఉంద‌న్నారు.‌ సాను‌కూల దృక్పథం కావా‌లని చెప్ప‌కనే చెప్పారు.‌ అందు‌కనే ‌‘ఆ నల్లని రాలలో.‌.‌ ఏ కన్నుల కోసమో.‌.‌’‌ (అమ‌ర‌శి‌ల్పి‌జ‌క్కన) వెతి‌కారు.‌ ఆఖ‌రికి ‌‘జీవ‌మున్న మని‌షి‌కన్న శిలలే నయ‌మని’‌పించారు.‌ మని‌షికి కావ‌ల‌సింది ఏమి‌టంటే.‌.‌‘ఉన్న‌వాడు, లేని‌వాడు, ఒకే ప్రాణమై నిలిచే.‌.‌ ఒక్క నేస్తం కావా‌లం‌టాను.‌.‌’‌ అంటూ స్నేహ‌మేరా జీవితం, స్నేహ‌మేరా శాశ్వతం (నిప్పు‌లాంటి మనిషి) అన్నారు.‌ ఆ స్నేహ‌బంధం ఎలాం‌టి‌దట?

‌‘చిలు‌కేమో పచ్చ‌నిది.‌.‌ కోయి‌లేమో నల్ల‌నిది’‌ అయినా.‌.‌ ‌‘గున్న‌మా‌మిడి కొమ్మ మీద’‌ ఉన్న రెండు గూళ్ల కథని (బాల్య‌మి‌త్రుల కథ) పసి‌మ‌న‌సు‌లకు సైతం హత్తు‌కు‌నేలా తెలి‌య‌జె‌ప్పారు.‌ సమా‌జంలో చీకటి బతు‌కు‌లను చూస్తూ ‌‘ఎవరు వీరు? ఎవరు వీరు? ఆక‌లి‌క‌మ్ము‌డు‌బో‌యిన అప‌రంజి బొమ్మలు’‌ అంటూ (మాన‌వుడు దాన‌వుడు)లో వేశ్యల పరి‌స్థి‌తికి ఆవే‌దన చెందారు.‌ అలా అని ప్రేమ, భావు‌క‌తల విష‌యంలో వెను‌కంజ వేయ‌లేదు.‌ ‌‘పాల‌రాతి మంది‌రాన పడతి బొమ్మ అందం.‌.‌ అను‌రాగ గీతి‌లోన అచ్చ తెనుగు అందం’‌ (నేను మని‌షినే) అంటూ ఎక్క‌డేది అందమో హృద్యం‌గ‌మంగా చెప్పారు.‌ ఏ హరి‌విల్లు విర‌బూ‌సినా ఆ దర‌హా‌సమే అను‌కొ‌నేలా చేస్తున్న, ఆమెతో అతని చేత, ‌‘నిను చూడక నేనుం‌డ‌లేను.‌.‌’‌ (నీరా‌జనం) అని‌పిం‌చారు.‌ ఆమె మీద అతడి ప్రేమను ఎంతో అందంగా చెప్పారు.‌ ‌‘కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా?’‌’‌ (చెల్లె‌లి‌కా‌పురం) అని అల‌వో‌కగా చెప్పిం‌చారు.‌

‌‘ఆమె కనులు పండు‌వె‌న్నెల గనులు’‌ (తూర్పు పడ‌మర) అని‌పిం‌చారు.‌ ‌‘నిన్న‌లేని అంద‌మేదో నిదు‌ర‌లే‌చె‌నెం‌దుకో’‌ అంటూ అతడి మీద ఆమె ప్రభావం (పూజా‌ఫలం) ఎంత‌టిదో చెప్పారు.‌ ‌‘నేను నిన్ను చూసే‌వేళా.‌.‌ నీవు నన్ను చూడ‌వేళా.‌.‌ నేను పైకి చూడ‌గానే నీవు నన్ను చూతు‌వేళ’‌ అంటూ లేత వల‌పు‌లను నును‌లే‌తగా చెబు‌తూనే, ‌‘తెలి‌సి‌పోయె నీలో ఏదో వలపు తొంగి‌చూ‌చెను’‌ (ఆడ‌బ్రతుకు) అని తేల్చి ప్రేమ‌భా‌వ‌నల్లో ముంచె‌త్తారు.‌ ప్రేమలో ముని‌గి‌పో‌యాక అత‌డికి ఏం చెప్పా‌ల‌ని‌పి‌స్తుందో చక్కగా ఊహిం‌చారు.‌ ‌‘మట్టిని మణిగా చేసిన మమ‌తె‌రి‌గిన దేవత కథ.‌.‌’‌ (ఉమ్మడి కుటుంబం) తప్ప ఇంకేం చెప్పా‌ల‌ని‌పి‌స్తుంది అత‌డికి? ‌‘వల‌దన్న వినదీ మనసు.‌.‌ కల‌నైన నిన్నే తలచు’‌ (బంది‌పోటు) అంటూ తొలి ప్రేమ బల‌మైం‌దని నిరూరపించేశారు. అతడి ప్రేమకు కరి‌గి‌పోతే ఆమె కూడా ‌‘పిలిచే నా మదిలో వలపే నీవు సుమా’‌ (ఆడ‌బ్రతుకు) అంటుం‌దని, ‌‘ఆహా! అందము చిందే హృద‌య‌క‌మలం అదు‌కొనే రాజు’‌ ఎవరో అని ఊహల్లో తేలి‌పో‌తుం‌దని, ‌‘వస్తాడు.‌.‌ నారాజు ఈ రోజు.‌.‌ కలికి వెన్నెల కెర‌టాల మీద’‌ (అల్లూరి సీతా‌రా‌మ‌రాజు) అని ముగ్ధ మనో‌హ‌రంగా ఎదురు చూస్తుం‌దని అందంగా తెలి‌పారు.‌
అంతగా ప్రేమించే ఆమె ఎదు‌రు‌చూ‌స్తుంటే, ‌‘తోటలో తొంగి చూసిన రాజు’‌ నవ్వులు ఎలా కని‌పి‌స్తాయి?‌‘నవ్వులా అవి కావు.‌.‌’‌ అన్నారు.‌ మరే‌మిటి? ‌‘నవ‌పా‌రి‌జా‌తాలు.‌.‌ రవ్వంత సడి‌లేని రస‌రమ్య గీతాలు.‌.‌’‌ (ఏక‌వీర) అని‌పి‌స్తా‌యని చెప్పారు.‌

సినా‌రేలో చిలిపి తనమూ తక్కువ లేదు.‌

‌‘గుత్తపు రైక.‌.‌ ఓయమ్మా.‌.‌ చెమట చిత్త‌డిలో తడిసి ఉండగా.‌.‌’‌ ఎంత‌సేపు నీ తుంటరి చూపు? అని ప్రశ్ని‌స్తూనే, ‌‘ఎంతటి రసి‌కు‌డివో తెలి‌సెరా.‌.‌’‌ (ముత్యా‌ల‌ముగ్గు) అని‌పిం‌చారు.‌

‌‘మాయ‌దారి చిన్నోడు మనసు లాగేసి’‌.‌.‌ ‌‘లగ్గం మాత్రం పెట్ట‌క‌పోతే.‌.‌’‌ ఎలా? అందుకే ‌‘ఆగే‌దె‌ట్టాగా.‌.‌ అందాకా వేగే‌దె‌ట్టాగా?’ అని ఘాటు‌గానే ప్రశిం‌చారు.‌ (అమ్మ‌మాట)

కుటుంబ సంబం‌ధాల్లో నాన్న, అన్నల మీద అను‌రా‌గా‌లను అంద‌మైన చర‌ణాల్లో బంధిం‌చారు సినారే.‌ ‌‘అన్నయ్య సన్నిధి.‌.‌ అదే నాకు పెన్నిధి’‌ (బంగా‌రు‌గా‌జులు) అనే చెల్లెలు ప్రేమకు అగ్రస్థా‌నాన్ని అందిం‌చారు.‌

ఇంక అమ్మ గురించి అందరూ చెబు‌తారు కానీ, నాన్న గురించి ఎవరు పట్టిం‌చు‌కోరు.‌ అందుకే నాన్న త్యాగాన్ని కూడా చక్కగా చాటి చెప్పారు.‌

‌‘ఉన్న‌నాడు ఏమి దాచు‌కొ‌న్నావు.‌.‌ లేని‌నాడు చేయి‌చాచనన్నావు.‌.‌ ఏపూట తిన్నావో, ఎన్ని పస్తు‌లు‌న్నావో.‌.‌ పర‌మాన్నం మాకు దాచి ఉంచావు.‌.‌’‌ అని తండ్రి ప్రేమను చెప్పి, ‌‘ఓ నాన్నా! నీ మనసే వెన్నా.‌ అమృ‌తము కన్నా, అది ఎంతో మిన్న!’‌ (ధర్మ‌దాత) అని గుర్తిం‌చిన కొడు‌కుల ప్రేమ‌నంతా పాటలో రంగ‌రిం‌చారు.‌

అలాగే సినారే ‌‘శబ్ద సౌందర్యం’‌తో ఆక‌ట్టు‌కొన్న పాట‌లెన్నో.‌

‌‘చర‌ణ‌కిం‌కి‌ణులు ఘల్లు‌ఘ‌ల్లు‌మన’‌ (చెల్లెలి కాపురం) పాటలో పదాల చేత కద‌ను‌తొ‌క్కిం‌చారు.‌
‘స్వాగతం.‌.‌ సుస్వా‌గతం’‌ (శ్రీకృ‌ష్ణ‌పాం‌డ‌వీయం) పాటలో సుదీర్ఘ సమా‌సాలు సైతం సామా‌న్యులు అర్ధ‌మయ్యే రీతిలో.‌.‌ ‌‘ధర‌ణి‌పాల శిరో‌మ‌కుట మణి‌త‌రుణ కిరణ పరి‌రం‌జిత చరణా.‌.‌’‌ అంటూ అభి‌మా‌న‌ధ‌ను‌డైన సుయో‌ధ‌నుడి ప్రాభ‌వాన్ని అందాల భామలు నాట్య‌మా‌డి‌నంత మనో‌హ‌రంగా తెలి‌పారు.‌ అంతేనా? ‌‘విజ‌యీ‌భవా’‌ (దాన‌వీ‌ర‌శూ‌ర‌కర్ణ), ‌‘శృతి నీవు.‌.‌ గతి నీవు.‌.‌ శర‌ణా‌గతి నీవు భారతీ.‌.‌’‌ (స్వాతి‌కి‌రణం), ‌‘సరి‌లేరు నికె‌వ్వరు’‌ (కంచు‌కోట) లాంటి పాటల్లో భాషా‌సౌం‌ద‌ర్యా‌నికి నీరా‌జ‌నాలు పట్టారు.‌

వన‌వా‌సంలో భీముని చూసి మనసు పారే‌సు‌కున్న మాయ‌లాడి హిడింబి ప్రేమ‌గీతం పాడితే ఎలా ఉంటుంది?

‌‘ఛాంగ్‌.‌.‌ ఛాంగ్‌ రే’‌లా ఉంటుంది.‌ మరి ఆమె వలపు భావాలు? ‌‘కైపున్న మత్స్య‌కంటి చూపు.‌.‌ అది చూపు కాదు పచ్చల పిడి బాకు.‌.‌’‌ (శ్రీకృ‌ష్ణ‌పాం‌డ‌వీయం) అని‌పిం‌చారు.‌

ఇవన్నీ సరే.‌.‌ దుర్యో‌ధ‌ను‌డికి కూడా ‌‘వగ‌ల‌రాణి’‌ ఉంటుంది కదా! ఏకాం‌తంగా అంతః‌పు‌రంలో ఆమెతో యుగ‌ళ‌గీతం పాడా‌లంటే ఎలా? అందు‌కనే ‌‘చిత్రం.‌.‌ భళారే విచిత్రం.‌.‌’‌ (దాన‌వీ‌ర‌శూ‌రకర్ణ) అనిపించారు. ఇలా ఎన్నో సందర్భాలకి తగినట్లుగా వ్రాసిన పాటలలో ఉత్తమ శ్రేణికి చెందిన పాటోకటి ఉంది. అది... ‘లలిత కళారాధనలో వెలిగె చిరుదివ్వెను నేను.. మధుర భారతి పదసన్నిధిలో ఒదిగే తొలిపువ్వును నేను’. కళ ‘ఆత్మానందం కోసమా? కాసుల కోసమా?’ అనేది చర్చిస్తూ సాగే ఈ పాట కళ్యాణి చిత్రంలోనిది. ‘ఏ సిరి కోరి పోతన భాగవత సుధులు చిలికెంచెను? ఏ నిధి కోరి త్యాగయ్య రాగజల సుధలు పొంగించెను?’ ‘రమణీయ కళావిష్టుతికి రసానందమే పరమార్థం...’ అని ఒక వైపు వాదన వినిపించారు. మరి ఆత్మానందం కోసమే పరిశ్రమించటం అందరి కళాకారులకు సాధ్యం కాదు.


అందుకనే... ‘కృతిని అమ్మని పోతన్నకు మెతుకే కరువైపోలేదా? బ్రతికి ఉండగానే త్యాగయ్యకు బ్రతుకే బరువైపోలేదా? కడుపునింపని కళలెందుకు? తనకు మాలిన ధర్మమెందులకు?’ అని మరో వాదనను పలికించారు. నిజమే కదా? కళాకారుల కడుపులు నిండకపోతే ఆత్మానందం ఆవిరై పోదా? ఇలా ఒక పాటలో మూలాలని స్పృశించటం, చర్చించటం ఆయన ప్రత్యేకత. ఈ విధంగా ఒక పక్క చందోబద్ధమైన రచనలు, మరో పక్క జనరంజకమైన చిత్ర గీతాలను అందించిన సినారేకి ఆయన పాట పలుకులోనే... ‘సరిలేరు నీకెవ్వరు’ అని జోహార్లు అర్పించాల్సిందే ఎవరైనా! ‘పుట్టిన రోజు పండుగే అందరికీ... మరి పుట్టంది ఎందుకు తెలిసేది ఎందరికి?’ (తాత మనవడు) అని ఆయనే ప్రశ్నించి, ‘తానున్నా లేకున్నా, తన పేరు మిగలాలి’ అని రాసి...అలాగే ‘మిగిలేలా’ జీవించిన సినారే మరిన్ని జూన్‌ 12, 2017లో కనుమరుగవడం సినీ అభిమానులకు బాధాకరమే.

− పొన్నాడ సత్యప్రకాశరావు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.