తెలుగు సినిమా విజ్ఞానకోశం ... పేకేటి శివరాం
పేకేటి శివరాం ని తెలుగు సినీ విజ్ఞాన సర్వస్వం అని అంటుంటారు. పేకేటి కి సినిమా నిర్మాణం మీద వివిధ క్రాఫ్టుల పనితీరు మీద లోతైన పరిజ్ఞానముంది. తెలుగు చిత్రసీమలో అగ్రనటులైన ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు లకు అత్యంత సన్నిహిత మిత్రుడుగా, సలహాదారుగా పేకేటి మన్ననలు పొందారు. హిస్ మాస్టర్స్ వాయిస్ సంస్థలో ఆర్కెస్ట్రా ఇన్-చార్జ్ గా పనిచేస్తుండగా, మైక్ కు అమరగాయకుడు ఘంటసాల కంఠం సరిపోదని హెచ్.ఎం.వి యాజమాన్యం నిర్దారించినప్పుడు, ఘంటసాల సంగీత ప్రావీణ్యం మీద అచంచల విశ్వాసమున్న పేకేటి, తెగించి రికార్డులను ముద్రించి, విశేష ప్రచారమిచ్చి, సినీ నేపథ్యగాయకుడిగా నిలదొక్కుకునేందుకు కృషిచేసిన స్నేహశీలి పేకేటి. పేకేటి ఆనాడు ఆ సంచలన నిర్ణయం తీసుకొని వుండకపోటీ ఘంటసాల గళం మనకు వినిపించి వుండేది కాదేమో! కన్నడ కంఠీరవుడు రాజకుమార్ కు కూడా అత్యంత ప్రీతిపాత్రుడైన దర్శకుడు పేకేటి. నటుడుగా రాశిలో తక్కువ చిత్రాలలో నటించినా తనదైన ‘మార్కు’ని ఎప్పుడూ నిలబెట్టుకుంటూనే వచ్చారు. ఈ మేధావి నూరవ (సెంటినరీ) జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు తెలుసుకుందాం...


సినీరంగ ప్రవేశానికి ముందు...
పేకేటి శివరాం అసలుపేరు పేకేటి శివరామ సుబ్బారావు. పుట్టింది అక్టోబరు 8, 1918న భీమవరం దగ్గరలోని పేకేరు గ్రామంలో. ఆయన తల్లిదండ్రులు రాజేశ్వరమ్మ, కృష్ణమోహన్. కాలేజీలో చదివే రోజుల్లోనే పత్రికలకూ శివరాం వ్యాసాలు రాసేవారు. ఆయన రాసిన వ్యాసాలు ‘నెరజణ’, ‘మాధురి’ వంటి పత్రికల్లో ప్రచురితమయ్యేవి. శివరాం మంచి క్రీడాకారుడు కూడా. కాలేజీలో అతడు ఫుట్ బాల్ చాంపియన్. సంగీతం మీద మక్కువ యెక్కువ కావడంతో హార్మోనియం, జలతరంగిణి వంటి వాద్యాలను వాయించడంలో తర్ఫీదు పొందారు. పద్యాలు బాగా పాడేవారు. నాటకాలు వేసేవారు. నాటకాల్లో వేషాలు కట్టినప్పుడు తాపీ ధర్మారావు నాయుడు వంటి నిష్ణాతుల మన్ననలు అందుకున్నారు. పేకేటి శివరాం కాలేజీ చదువులు పూర్తయ్యాక 1937లో మద్రాసు చేరుకున్నారు. అప్పుడు తాపీ ధర్మారావు నాయుడు సహకారంతో మద్రాసు రేడియో స్టేషన్ లో ప్రోగ్రాములు ఇచ్చేవారు. రచనా వ్యాసంగంలో పేకేటికి కాలేజి రోజులనుంచే మంచి అనుభవం ఉండడంతో, ‘శ్రమజీవి’ అనే పత్రిక సంపాదకుడు జైలుకు వెళితే ఆపద్ధర్మంగా ఆ పత్రిక సంపాదకత్వ బాధ్యతలు తన భుజాన మోశారు. అందులో పేకేటి సినిమాల మీద రాసే సమీక్షలు నిష్కర్షగాను, విమర్శనాత్మకంగాను ఉండేవి. టాకీ పులిగా పేరుగాంచిన ప్రముఖ నిర్మాత హెచ్.ఎం.రెడ్డి గారిని ఆ సమీక్షా వ్యాసాలు బాగా ఆకర్షించాయి. అప్పట్లో హెచ్.ఎం. రెడ్డి కి ‘చిత్ర’ అనే సినిమా పత్రిక కూడా వుండేది. ఇంటూరి వెంకటేశ్వరరావు ఆ పత్రికా నిర్వహణ బాధ్యతలు చూస్తుండేవారు. ఇంటూరి తప్పుకున్న తరవాత ఆ పత్రికా సంపాదకత్వ బాధ్యతలను పేకేటి నిర్వహిస్తూ వచ్చారు. 1942లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మద్రాసు నగరం మీద బాంబులు పడతాయనే వార్తలు రావడం, సినిమాల ముడి ఫిలిం దిగుమతికి అవరోధాలు ఎదురవడంతో అక్కడ సినిమా నిర్మాణం కుంటుపడింది. విజయా, వాహినీ వంటి ప్రసిద్ధ సినీ నిర్మాణ సంస్థ యజమానులు కూడా విరామం ప్రకటించి సొంత ఊళ్లకు పయనం కట్టారు. ఆ సమయంలో పనులు లేకపోవడంతో పేకేటి రాజమండ్రికి వచ్చేశారు. అక్కడ కొంతకాలం అగ్నిమాపక కేంద్ర కార్యాలయం లో తాత్కాలిక వుద్యోగం చేశారు. రాజమండ్రిలో ఉండగానే పేకేటికి ప్రభావతి అనే అమ్మాయితో వివాహం జరిగింది. యుద్ధవాతావరణం సద్దుమణిగాక మరలా మద్రాసు చేరుకున్నారు. ఆరోజుల్లో బెంగుళూరు కేంద్రంగా ‘సినిమా ఫ్లేమ్’ అనే సినీ పత్రిక విడుదలయ్యేది. ఆ పత్రికకు మద్రాసు ప్రతినిధిగా పేకేటి పనిచేశారు. పేకేటి రాసే సినీ సమీక్షలు అందరినీ ఆకర్షించేవి. ఆరోజుల్లో డిటెక్టివ్ నవలలకు కూడా మంచి డిమాండ్ వుండేది. పేకేటి ‘భగవాన్’ అనే డిటెక్టివ్ పేరుతో పద్దెనిమిది నవలలు రాశారు.


హెచ్.ఎం.వి గ్రామఫోను కంపెనీలో...
బెంగుళూరు సినీ పత్రికకు పనిచేస్తున్నప్పుడే పేకేటికి ‘హిస్ మాస్టర్స్ వాయిస్’ (హెచ్.ఎం.వి) గ్రామఫోను సంస్థలో తెలుగు విభాగం ఆర్కెస్ట్రా ఇన్ చార్జి గా ఉద్యోగం వచ్చింది. కష్టించే తత్వంగలవాడు కావడంతో పేకేటికి అందులో మంచి ఆదరణ లభించింది. అప్పట్లో అమరగాయకుడు ఘంటసాల సినిమాలలో పాటలు పాడేందుకు మద్రాసు వచ్చి ప్రయత్నాలు మొదలుపెట్టారు. సినిమా పాటల రికార్డింగు కోసం ఆరోజుల్లో హెచ్.ఎం.వి వారే తమ ఆర్కెస్ట్రా బృందాలను పంపుతుండేవారు. 1944లో ఘంటసాల సినిమాలో పాటలు పాడాలని మద్రాసు వచ్చి ప్రతిభా పిక్చర్స్ సంస్థ అధిపతి ఘంటసాల బలరామయ్య వద్ద చేరి ‘సీతారామజననం’ చిత్రంలో వేషాలు వేసేందుకు నెలజీతం మీద కుదురుకొని హెచ్.ఎం.వి లో రికార్డులు పాడాలని ప్రయత్నాలు సాగించారు. కానీ, లంకా కామేశ్వరరావు అనే అధికారి అతనికి ఆడిషన్ చేసి గొంతు మైకుకు పనికిరాదని పంపేయడం జరిగింది. కానీ ఆ కంఠం పేకేటికి నచ్చింది. ఘంటసాల కంఠాన్ని తిరస్కరించిన కామేశ్వరరావు సెలవులో వున్నప్పుడు పేకేటి ఘంటసాలను పిలిపించి “నగుమోమునకు నిశానాథ బింబము” అనే చాటు పద్యాన్ని, రతన్ రావు రచించిన “గాలిలో నాబ్రతుకు తేలిపోయినదోయి” అనే పాటను పాడించి రికార్డు చేసి విడుదల చేశారు. శివరాం అంచనాను నిజంచేస్తూ ఆ రికార్డు బాగా అమ్ముడుపోయింది. తన ప్రతిభను గుర్తించిన పేకేటికి ఘంటసాల ఎప్పుడూ కృతఙ్ఞతలు తెలియజేస్తూ వుండేవారు. పేకేటి మద్రాసు వదలి కొంతకాలం ఢిల్లీ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ లో కూడా పనిచేశారు. పండిత జవహర్లాల్ నెహ్రూ పాల్గొన్న రాజకీయ ప్రసంగాలను చిత్రీకరించే అవకాశం పేకేటికి దొరకడం ఆయన చేసుకున్న అదృష్టం!

సినీరంగ ప్రవేశం...
అంజలీ పిక్చర్స్ అధినేత పి. ఆదినారాయణరావు పిలుపుతో పేకేటి ఢిల్లీ నుండి మద్రాసుకు వచ్చి వారి సంస్థలో ప్రొడక్షన్ మేనేజరుగా చేరారు. అప్పట్లో పేకేటికి ఆదినారాయణరావు మూడువందల యాభై రూపాయలు జీతం ఇచ్చేవారు. అంత పెద్ద జీతం అందుకున్న తొలి మేనేజరు పెకేటే. ‘మాతా’ పబ్లిసిటేస్ పేరుతో పబ్లిసిటీ సంస్థను పెట్టి సినీ పబ్లిసిటీ కూడా చేశారు. అప్పుడే వినోదా సంస్థ వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో ‘శాంతి’ (1952) చిత్రం నిర్మించినప్పుడు అందులో పేకేటికి ‘టామ్ టామ్’ అనే జర్నలిస్టు పాత్రను పోషించే అవకాశం వచ్చింది. ఈ చిత్రానికి తన ‘మాతా’ సంస్థ తరఫున పబ్లిసిటీ కూడా పేకేటి అందిచారు. ఈ సినిమాలో సావిత్రి సరసన కామెడీ పాత్ర పోషించిన పేకేటికి మంచి పేరు వచ్చింది. పేకేటికి ఇందులో ‘టామ్ టామ్ చేరుకుంటుంటాం... ఉంటాం చీలిపోతుంటాం’ అనే పాట కూడా వుంది. ‘శాంతి’ సినిమాలో రామచంద్ర కశ్యప, సావిత్రి, గోవిందరాజుల సుబ్బారావు, పేకేటి, హేమలత, కృష్ణవేణి ప్రధాన తారాగణం. ఈ సినిమాకు డి.బి. నారాయణ(నిర్మాత)తోబాటు సముద్రాల(గేయరచయిత), బి.ఎస్. రంగా(చాయాగ్రహణం), సి. ఆర్. సుబ్బురామన్ (సంగీత దర్శకత్వం) కూడా భాగస్తులుగా వున్నారు. 1953లో దర్శక నిర్మాత కె.ఎస్. ప్రకాశరావు ప్రకాష్ ఆర్ట్స్ సంస్థ మీద నిర్మించిన ‘కన్నతల్లి’ చిత్రంలో పేకేటి ‘శర్మ’ పాత్రను పోషించారు. అక్కినేని నాగేశ్వరరావు, నంబియార్, ఆర్. నాగేశ్వరరావు, జి. వరలక్ష్మి ప్రధాన తారాగణం కాగా సంగీత దర్శకుడు పెండ్యాల ఇందులో ‘పెరుమాళ్ళు’ అనే పాత్ర పోషించడం విశేషం. అలాగే యక్షగానం లో నృత్యం చేసిన రాజసులోచనకు, గాయని సుశీలకు కూడా ఇది తొలి చిత్రమే. అదే సంవత్సరం వినోదా పిక్చర్స్ వారు నిర్మించిన ‘దేవదాసు’ చిత్రం విడుదలైంది. అందులో అక్కినేనికి స్నేహితుడు ‘భగవాన్’ గా పేకేటి అపూర్వంగా నటించాడు. భగవాన్ దేవదాసుకి ధైర్యం నూరిపోస్తాడు. కలత చెందిన మిత్రునికి ఆనందాన్ని పంచాలని వేశ్య వద్దకు తీసుకు వెళ్తాడు. నిద్ర రావడానికి బ్రాంది అందిస్తాడు. అనూహ్యంగా అది దేవదాసుకి అలవాటుగా మారుతుంది. చంద్రముఖి (లలిత) వద్ద తను చేసినది తప్పని ఒప్పుకుంటాడు. తగిన ప్రాయశ్చిత్తం చేసుకుంటానని వెళ్తాడు. ఇది ఒక ఉదాత్తమైన పాత్ర. ఆ సన్నివేశంలో పేకేటి నటన అద్భుతంగా వుంటుంది. తరవాత 1954లో ప్రతిభా సంస్థ అధిపతి ఘంటసాల బలరామయ్య కుమారుడు కృష్ణమూర్తి పి. పుల్లయ్య దర్శకత్వంలో నిర్మించిన ‘రేచుక్క’ చిత్రంలో అన్నయ్య పాత్రలో పేకేటి నటించారు. అప్పుడే నిర్మాత హెచ్.ఎం. రెడ్డి నిర్మించిన ‘వద్దంటే డబ్బు’ చిత్రంలో పేకేటి ఎన్.టి. రామారావు ప్రాణమిత్రుడు ‘రామ్’ అనే కవి పాత్ర పోషించారు. జమున పేకేటికి జంటగా నటించింది. తరవాత వినోదా వారి ‘కన్యాశుల్కం’ (1955)లో పోలీసు కానిస్టేబుల్ గా; అదే సంస్థ నిర్మించిన ‘చిరంజీవులు’ చిత్రంలో ‘రత్నం’ అనే విలన్ పాత్రలోను నటించి తన ప్రతిభను చాటుకున్నారు. అంజలీ పిక్చర్స్ వారు వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో నిర్మించిన ‘అనార్కలి’ చిత్రంలో, ‘సువర్ణసుందరి’ లోకూడా పేకేటి హాస్యపాత్రలో నటించారు. చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వం వహించిన సోషియో ఫాంటసీ చిత్రం ‘దేవాంతకుడు’ లో పేకేటి (వి)చిత్రగుప్తుడు పాత్ర పోషించి మెప్పించారు. ‘భీష్మ’ (1962) చిత్రంలో విచిత్రవీర్యుడుగా నటించారు. ఇవి కాక భాగ్యరేఖ, పాండురంగ మహాత్మ్యం, పెళ్లినాటి ప్రమాణాలు, ఇల్లరికం, జయభేరి, గులేబకావళి కథ, గాలిమేడలు, బబ్రువాహన, మురళీకృష్ణ, వెలుగునీడలు వంటి చిత్రాలలో మంచి మంచి పాత్రలు పోషించారు. తరవాత పేకేటి శివరాం కన్నడ సినిమాలలో బిజీ అయిపోయారు. తెలుగు, కన్నడ, తమిళ చిత్రాలలోఅటు హాస్యనటుడిగా, ఇటు క్యారక్టర్ నటుడిగా వంద సినిమాలకు పైగా నటించారు.

కన్నడ సినీరంగంలో రాణించి...
1967లో ఎన్.ఎన్. పాల్ అనే బెంగాలి బాబు భగవతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం మీద ‘చక్రతీర్థ’ అనేకన్నడ నవలను సినిమాగా నిర్మిస్తూ పేకేటిని దర్శకుడిగా నియమించారు. అందులో కన్నడ రాజకుమార్, ఉదయకుమార్, జయంతి, బాలకృష్ణ, ముఖ్య తారాగణం. ఆ సినిమాకు రాష్ట్రపతి ప్రశంసాపత్రం లభించదమేకాక మరెన్నో బహుమతులు వచ్చాయి. అలా తొలి చిత్రంతోటే పేకేటి కన్నడ సినీరంగంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇదే చిత్రాన్ని తెలుగులో తోట సుబ్బారావు శ్రీదేవి కంబైన్స్ పతాకం మీద ‘చుట్టరికాలు’ (1968) పేరుతో పునర్నిర్మించారు. ఈ చిత్రానికి కూడా పేకేటి శివరాం స్క్రీన్ ప్లే సమకూర్చి దర్శకత్వం వహించారు. ఇందులో శోభన్ బాబు, జగ్గయ్య, గుమ్మడి, రేలంగి, జయంతి, లక్ష్మి, హేమలత నటించారు. ఇదే చిత్ర నిర్మాణ సంస్థ 1969లో ‘పునర్జన్మ’ అనే చిత్రాన్ని నిర్మించగా, ఆ చిత్రానికి కూడా పేకేటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రాజకుమార్, జయంతి, చంద్రకళ, బాలకృష్ణ, రంగా నటించారు. ఇందులో నటించిన రంగా కు కర్నాటక రాష్ట్ర ఉత్తమ సహాయనటుడి బహుమతి లభించింది. 1971లో ఎన్. వీరస్వామి ‘కులగౌరవ’ అనే చిత్రాన్ని నిర్మించగా ఆ సినిమాకు స్క్రీన్ ప్లే, దర్శకత్వం పేకేటి వహించారు. ఇందులో రాజకుమార్, భారతి, జయంతి, నరసింహరాజు, బాలకృష్ణ ముఖ్య తారాగణం. టి.జి.లింగప్ప సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం ఏకంగా ఐదు కన్నడ రాష్ట్ర ఫిలిం బహుమతులు గెలుచుకుంది. వాటిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు (రాజకుమార్), ఉత్తమ సంభాషణలు (ఉదయశంకర్), ఉత్తమ కూర్పు (భక్తవత్సలం), ఉత్తమ శబ్దగ్రహణం (శ్రీనివాస్) శాఖలున్నాయి. ఇదే చిత్రాన్ని ఎన్.టి. రామారావు ఎన్.ఎ.టి బ్యానర్ మీద 1972లో ‘కులగౌరవం’ పేరుతో తెలుగులో పునర్నిర్మించగా, ఆ చిత్రానికి పేకేటి శివరాం దర్శకత్వం వహించారు. ఇందులో జయంతి కన్నడ సినిమాలోని సీత పాత్రనే పోషించగా, ఇతర పాత్రలను ఆరతి, నాగయ్య, పద్మనాభం, రావి కొండలరావు పోషించారు. రామారావు రాజా రామచంద్రప్రసాద్ గా, రఘునాథ్ ప్రసాద్ గా, శంకర్ గా మూడు పాత్రలు పోషించారు. తెలుగు వర్షన్ కు కూడా టి.జి.లింగప్ప సంగీత దర్శకత్వం వహించారు. మార్కస్ బార్ట్ లీ సినిమాటోగ్రఫీ పర్యవేక్షించడం విశేషం. 1971లోనే ఎ.ఎల్. శ్రీనివాసన్ పేకేటి శివరాం దర్శకత్వంలో ‘బాల బంధన’ చిత్రం నిర్మించగా అందులో రాజకుమార్, జయంతి హీరో హీరోయిన్లు గా నటించారు. ఇది తమిళంలో ఎ. భీంసింగ్ దర్శకత్వంలో వచ్చిన ‘పడిక్కాద మేడై’ చిత్రానికి రీమేక్. తమిళ చిత్రానికి కూడా ఎ.ఎల్. శ్రీనివాసనే నిర్మాత. ఇదే చిత్రాన్ని ‘ఆత్మబంధువు’ పేరుతో తెలుగులో కూడా నిర్మించారు. తమిళ, తెలుగు వర్షన్లలో ఎస్.వి. రంగారావు అద్భుత నటనను చూపగా, కన్నడ వర్షన్ లో ఆ పాత్ర పోషించిన సంపత్ ప్రేక్షకలను ఆకట్టుకోలేక పోయాడు. తెలుగు, తమిళ వర్షన్లు అద్భుత విజయాన్ని నమోదు చేశాయి. తెలుగు వర్షన్ కు రామకృష్ణ దర్శకత్వం వహించారు. మహదేవన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘అనగనగా ఒకరాజు అనగనగా ఒకరాణి’; ‘చదువు రానివాడవని దిగులు చెందకు’; ‘చీరగట్టి సింగారించి’ వంటి హిట్ పాటలు ఇందులోనివే. తరవాత పేకేటి ‘దారి తప్పిద మగ’ (1975) ‘సూత్రాద బోంబే’ (1976), ‘మాతు తప్పద మగ’ (1978) వంటి కొన్ని కన్నడ చిత్రాలకు దర్శకత్వం వహించారు. పేకేటి దర్శకత్వం వహించిన కన్నడ చిత్రాల్లో ఏడు సినిమాలు సిల్వర్ జుబిలీలు, గోల్డన్ జుబిలీలు జరుపుకున్నాయి. అలాగే తెలుగులో ‘భలే అబ్బాయిలు’ చిత్రానికి కూడా పేకేటి దర్శకత్వం వహించారు.

వ్యక్తిగతం...
పేకేటి శివరాం మొదటి భార్య ప్రభావతి కాగా నటి జయంతిని రెండవ భార్యగా స్వీకరించారు. ఇద్దరికీ ఐదుగురు మగ సంతానం కలిగింది. వారిలో కృష్ణమోహన్, రంగా, వేణు, గోపాల్ తొలిభార్య సంతానం కాగా, కృష్ణకుమార్ రెండవ భార్య జయంతి సంతానం. వీరు కాక పేకేటికి నలుగురు కూతుళ్లు. శాంతి, లక్ష్మి, రాణి, పూర్ణిమ అందరూ తొలి భార్య సంతానం. పేకేటి రంగా ఆర్ట్ డైరెక్టర్ గా స్థిరపడగా అల్లుడు త్యాగరాజన్ నటుడు, దర్శకుడు కూడా. త్యాగరాజన్ కుమారుడు ప్రశాంత్ తమిళ సినిమాల్లో నటుడుగా వున్నాడు. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్.టి. రామారావు లకు పేకేటి అత్యంత సన్నిహిత మిత్రుడుగా కొనసాగారు. 1975లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ‘తెలుగుతల్లి’ పేరుతో ప్రభుత్వం తరఫున పేకేటి డాక్యుమెంటరీ నిర్మించారు. 2002లో పేకేటి శివరాం కు హెచ్.ఎం.రెడ్డి అవార్డును ప్రదానం చేశారు. డిసెంబర్ 30, 2006న 88 ఏళ్ళ వయసులో ఉబ్బసం వ్యాధితో బాధపడుతూ పేకేటి శివరాం చెన్నైలో చనిపోయారు.

- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.