ప్రదీప్‌ శక్తి.... ప్రదర్శనా శక్తి
మారుతున్న కాలాన్ని బట్టీ అన్ని రంగాల్లో మార్పులు సంభవించినట్లే... నటుల అభినివేశంలోనూ మార్పు తప్పనిసరిగా పరిణమించింది. తొలినాళ్ళ నాయకులు, ప్రతినాయకులు ఆహార్యం, ఆంగికం, సంభాషణలు ఉచ్ఛరించడంలో కొత్తదనం వచ్చి చేరింది. విలన్ల వికట్టహాసాలు కూడా మారాయి. కొత్త సిలబస్‌ పుట్టుకొచ్చింది. ఆ ఒరవడిలో ఎందరో సరికొత్త ప్రతినాయకులు తెరపై స్వైరవిహారం చేశారు. చేస్తున్నారు. మనలో వ్యక్తిలాగానే కనిపిస్తూ తడిగుడ్డతో గొంతు కోసే యమా సాత్విక విలన్ల హవాలో ప్రదీప్‌ శక్తి కూడా ఒకరు. 2016 ఫిబ్రవరి 20 తన 61 ఏళ్ళ వయస్సులో ప్రదీప్‌ శక్తి మరణించారు. ఈ రోజు ఈయన వర్ధంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన నటించిన సినిమాల విశేషాలు కొన్ని మీ కోసం.
అనేకరంగాల్లో పరిణతి
నటుడు, దర్శకుడు, వ్యాపారవేత్త ఇలా అనేక రంగాల్లో అభినివేశాన్ని ప్రదర్శించిన ప్రదీప్‌ శక్తి 1954, జులై 12న జన్మించారు. ఆయన అసలు పేరు రాజా వాసిరెడ్డి. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ప్రదీప్‌ శక్తిని దర్శకుడు వంశీ సినిమా పరిశ్రమకు ‘ఆలాపన’ సినిమా ద్వారా పరిచయం చేశారు. ఎన్నో తెలుగు, తమిళ సినిమాలలో ప్రతికూల పాత్రలను పోషించారు ప్రదీప్‌ శక్తి. రాజకీయంగా అనేక వివాదాలకు కేంద్రబిందువైన ‘1990 కలియుగ విశ్వామిత్ర’కు దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమాలో విజయ్‌ చంద్ర, రమ్యకృష్ణ, రాజ్యలక్ష్మి, దీప నటించారు. అనంతరం 1993లో న్యూయార్క్‌లో పూర్తి స్థాయి రెస్టారెంట్‌ నిర్వాహకుడిగా మారారు.


ప్రదీప్‌ శక్తి చిత్రాలు
‘పంతులమ్మ’, ‘ఆలాపన’, ‘లేడీస్‌ టైలర్‌’, ‘లాయర్‌ సుహాసిని’, ‘బజార్‌ రౌడీ’, ‘జానకి రాముడు’, ‘ఆఖరి పోరాటం’, ‘రక్తతిలకం’, ‘టూ టౌన్‌ రౌడీ’, ‘దొంగ కోళ్లు’, ‘మరణ మృదంగం’, ‘ఇంద్రుడు చంద్రుడు’, ‘చెట్టు కింద ప్లీడర్‌’, ‘సింహ స్వప్నం’, ‘ప్రేమ’, ‘వింత దొంగలు’, ‘రాజకీయ చదరంగం’, ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘అశోక చక్రవర్తి’, ‘బొబ్బిలి రాజా’, ‘చిన్నారి ముద్దుల పాపా’, ‘నేటి సిద్దార్థ’, ‘అగ్గిరాముడు’, ‘ఏప్రిల్‌ ఫస్ట్‌ విడుదల’, ‘శ్రీ ఏడుకొండలు స్వామి’, ‘చిత్రం భళారే విచిత్రం’, ‘బ్రహ్మ’, ‘చక్రవ్యూహం’, ‘పరుగో పరుగు’, ‘అన్న’ సినిమాలలో నటించారు.


విరామం తర్వాత రీ ఎంట్రీ
కొంతకాలం పాటు సినిమా పరిశ్రమ నుంచి విరామం అందుకొన్న ప్రదీప్‌ శక్తి 2008లో ‘చింతకాయల రవి’ సినిమా ద్వారా మళ్ళీ ప్రేక్షకులను పలకరించారు. ఆ తరువాత ‘గోపి గోపిక గోదావరి’, ‘చిన్న సినిమా’, ‘సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌’ వంటి సినిమాలలో నటించారు.


తమిళ సినిమాలు
తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, హిందీ, కన్నడంలో ప్రదీప్‌ శక్తి నటించారు. తమిళంలో నటించిన చిత్రాల్లో ‘నాయగన్‌’, ‘జీవ’, ‘కలియుగం’, ‘సత్య’, ‘రాజాధి రాజా’, ‘మైఖేల్‌ మదన కామ రాజన్‌’, ‘గుణ’, ‘తలపతి’, ‘మీరా’, ‘వల్లి’, ‘మధురై మీనాక్షి’ ప్రఖ్యాతిగాంచాయి.

ఒకే ఒక మలయాళ సినిమా
ప్రదీప్‌ శక్తి సినిమాల ఖాతాలో ఒక మలయాళ సినిమా కూడా ఉండడం విశేషం. ఆ సినిమా పేరే ‘చమరం’. భారతన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా కేరళ రాష్ట్ర సినిమా పురస్కారాలు నాలుగింటిని అందుకొంది.

హిందీలో
హిందీలో ప్రదీప్‌ శక్తి ‘ఖత్రోన్‌ కి ఖిలాడీ’ సినిమాలో నటించారు. ధర్మేంద్ర, సంజయ్‌ దత్, మధూరీదీక్షిత్‌ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తెలుగులో ‘సింహ స్వప్నం’గా రీమేక్‌ అయింది.

కన్నడ భాషలోనూ
‘లాకప్‌ డెత్‌’ అనే కన్నడ సినిమాలో నటించారు ప్రదీప్‌ శక్తి. ఇది తెలుగులోకి కూడా ఇదే పేరుతో డబ్‌ అయింది. ఇందులో దేవరాజ్, నిరోషా, ప్రకాష్‌ రాజ్‌ ముఖ్య పాత్రల్లో నటించారు.

దర్శకత్వ శాఖలోకి
‘1990 కలియుగ విశ్వామిత్ర’ అనే సినిమాకు దర్శకత్వం వహించి తన దర్శకత్వ ప్రతిభనూ చూపించారు ప్రదీప్‌ శక్తి.

మరణం
తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన ప్రదీప్‌ శక్తి 20 ఫిబ్రవరి 2016న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అమెరికాలో గుండెపోటుతో మరణించారు. ‘సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌’ సినిమా ప్రదీప్‌ శక్తి నటించిన చివరి సినిమా. ఇందులో ఆయన రెస్టారంట్‌ ఓనర్‌గా నటించారు. ఎంతో మంచి మనిషి గల ఆయన్ని మేము మిస్‌ అవుతున్నట్టు సన్నిహితులు, శ్రేయోభిలాషులు అన్నారు.

- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.