బహుభాషా చిత్రతోరణం..

హస్య సినిమాలతో నవ్వులు పంచారు. థ్రిల్లర్లతో సినీప్రియులను ఉత్కంఠకు గురిచేశారు. యాక్షన్‌ చిత్రాలతో ప్రేక్షకులతో విజిల్స్‌ వేయించారు. ఈ ప్రయాణంలోనే ‘కాలాపానీ’, ‘కాంచీవరం’, ‘మిథునం’ వంటి అనేక అద్భుత దృశ్యకావ్యాలను తెరపై ఆవిష్కరించి ప్రేక్షకులను మైమరపించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా సాగుతున్న తన సినీప్రయాణంలో పలు భారతీయ భాషల్లో 90కి పైగా సినిమాలను రూపొందించి చిత్రసీమలో దర్శకుడిగా మంచి గుర్తింపు సాధించుకున్నారు ప్రియదర్శన్‌. అసలు పేరు ప్రియదర్శన్‌ సోమన్‌ నాయర్‌. చిత్రసీమలో ఆయన కనబర్చిన ప్రతిభకు ఓ జాతీయ అవార్డుతో పాటు కేంద్రప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. 1984లో ‘పూచక్కోరు మూక్కుత్తు’ సినిమాతో మలయాళ చిత్రసీమ నుంచి మొదలైన ప్రియదర్శన్‌ దర్శక ప్రస్థానం.. ఆ తర్వాత క్రమంగా తెలుగు, తమిళ, హిందీల భాషలకు విస్తరించింది. అందుకే ఆయన్ను చిత్ర పరిశ్రమలో బహుభాషా చిత్రతోరణంగా చెప్పవచ్చు. ఆయన దర్శకుడిగా మారడంలో ఆయన స్నేహితులు సురేష్‌ కుమార్, సనల్‌ కుమార్, మోహన్‌లాల్, శంకర్‌లు అందించిన సహకారం ఎంతో ఉంది. ప్రియదర్శన్‌ తెరకెక్కించిన తొలి వినోదాత్మక సినిమా ‘పూచక్కోరు..’ బాక్సాఫీస్‌ వద్ద అనూహ్య విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత కొన్నాళ్లపాటు అదే జోనర్‌లో సినిమాలను తెరకెక్కించి మలయాళ చిత్రసీమలో అగ్రదర్శకుడిగా ఎదిగారు. 90లలో దక్షిణాది భాషలవైపు దృష్టి సారించిన ప్రియదర్శన్‌.. 1992లో మలయాళ సినిమా ‘కిళుక్కుమ్‌’ను హిందీలో ‘ముస్కురహత్‌’ పేరుతో రీమేక్‌ చేయడం ద్వారా బాలీవుడ్‌లోకీ కాలుమోపారు. ఆయన తెలుగులో రెండు సినిమాలు చేయగా.. వాటిలో అక్కినేని నాగార్జునతో చేసిన ‘నిర్ణయం’ మంచి మ్యూజికల్‌ హిట్‌గా నిలవగా, ఏయన్నార్, బాలకృష్ణలతో తీసిన ‘గాంఢీవం’ పర్వాలేదనిపించింది. ప్రియదర్శన్‌ మలయాళంలో తెరకెక్కించిన ‘కాలాపానీ’ (1995) కేరళ రాష్ట్ర ఉత్తమ చిత్రంగా నిలవడంతో పాటు అన్ని భారతీయ భాషల్లోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆయన దర్శకత్వం వహించిన తమిళ సినిమా ‘కాంచివరం’ (2007) ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును దక్కించుకుంది. ప్రియదర్శన్‌ తెరకెక్కించిన మలయాళ చిత్రాల్లో ‘పూచక్కూర్‌ మూకుత్తు’, ‘మజా పెయున్ను మదలమ్‌ కొట్టన్ను’, ‘తలవట్టం’, ‘చిత్రం’, ‘వందనం’, ‘కిళుక్కుమ్‌’, ‘అభిమన్యు’, ‘మిథునం’, ‘తేన్మవిన్‌ కొంబాత్‌’, ‘కాలాపాని’ వంటివి ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఆయన చేసిన హిందీ సినిమాల్లో ‘హేరా ఫేరీ’, ‘హంగామా’, ‘హల్‌చల్‌’, ‘గరం మసాలా’, ‘భాగమ్‌ భాగ్‌’, ‘చుప్‌ చుప్‌కే’, ‘థోల్‌’ వంటివి భారీ హిట్లుగా నిలిచాయి. ప్రస్తుతం మోహన్‌లాల్, సునీల్‌ శెట్టి కథానాయకులుగా ‘మరక్కర్‌’ అనే భారీ చారిత్రక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గానూ 2012లో కేంద్ర ప్రభుత్వం నుంచి భారత నాల్గవ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందుకున్నారు. 1957 జనవరి 30న కేరళలో జన్మించిన ప్రియదర్శన్‌.. నేడు 62వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.