‘రాళ్లపల్లి’ పేరు వెనుక అసలు కథ

విలక్షణ నటుడిగా తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న రాళ్లపల్లి శుక్రవారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. రంగస్థల నటుడిగా కెరీర్‌ను ఆరంభించి, వెండితెరపై నటుడిగా చెరగని ముద్రవేశారు. అయితే, ఆయన పూర్తిపేరు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు కాగా, ఇంటి పేరుతోనే ఆయన తెలుగువారికి సుపరిచితులు. అసలు ఆయన ఇంటి పేరే ఒంటిపేరు ఎలా అయిందని అడిగితే, గతంలో ఆయన పంచుకున్న విషయాలివి...

* పేరు అలా మార్చేశారు!

‘‘బాపు దర్శకత్వంలో ‘తూర్పు వెళ్లే రైలు’తో నా పేరును రాళ్లపల్లి అని వేయడం ప్రారంభించారు. అంతకు ముందు నటించిన చిత్రాల్లో రాళ్లపల్లి వెంకట నర్సింహారావు అని, ఆర్వీ నర్సింహారావు అని వేసేవారు. ఒకరోజు బాపుగారు ‘ఎందుకండీ ఇంత పెద్ద పేరు. రాళ్లపల్లి బాగుంది కదా’ అని అనడంతో నేనూ సరేనన్నాను. ఆ సినిమా నుంచి టైటిల్స్‌లో అలా వేయడం మొదలు పెట్టారు. చెన్నైలో నన్ను అందరూ ముద్దుగా ‘స్టోన్‌ విలేజ్‌’ అని పిలిచేవారు. ఎన్టీఆర్‌ తనయుడు హరికృష్ణ కూడా ‘స్టోన్‌ విలేజ్‌’ అని పిలిచి ఆటపట్టించేవారు. ఇక నా ఇంటిపేరును అచ్చ తెలుగులో చెప్పాంటే ‘శిలా గ్రామం’’.


* సినిమాలు తీయడం మానేస్తానన్న బాపు

‘‘అప్పుడు నేను రైల్వే కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నా. ‘తూర్పు వెళ్లే రైలు’ సినిమా చేసే అవకాశం వచ్చింది. దీంతో ఉద్యోగానికి వెళ్తూనే ఆ సినిమాలో చేసేవాడిని. ఒకరోజు బాపుగారి దగ్గరకు వెళ్లి ‘సర్‌ నాది అసలే కాంట్రాక్టు ఉద్యోగం. ఈ సినిమా తర్వాత నా ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియదు.’ అని అంటే, ‘ఈ సినిమా విడుదల అయిన తర్వాత మీరు ఉద్యోగం చేయాల్సిన అవసరం రాదు. ఒకవేళ మీరే మళ్లీ ఉద్యోగం చేయాల్సి వస్తే, నేను సినిమాలు తీయడం మానేసి బొమ్మలు వేసుకుంటూ బతుకుతా.’ అని అన్నారు’’



* ‘బొంబాయి’లో అవకాశం అలా వచ్చింది


‘‘నేను చేసిన పాత్రల్లో ‘బొంబాయి’లోని హిజ్రా పాత్ర ప్రత్యేకం. ఆ పాత్రకోసం మణిరత్నంగారు ఒక నటుడిని వెతుకుతున్నారని తెలిసింది. అదే సమయంలో ఆయన దగ్గర కో-డైరెక్టర్‌గా పనిచేసే పాణిగారు నా పేరును సూచించారు. ఆ పాత్రకు నేనైతే న్యాయం చేస్తానని చెప్పారట. దీంతో ఆ సినిమాలో పనిచేసే అవకాశం వచ్చింది. నేను కూడా ఆ పాత్ర చేయడానికి అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే ఒక నటుడికి గుర్తింపు వచ్చిన తర్వాత అదే ఇమేజ్‌లో చూస్తారు. నేను స్టార్‌ని కాదు.. ఆర్టిస్ట్‌ను మాత్రమే. నేను నటించిన వాటిల్లో డిఫరెంట్‌ క్యారెక్టర్లు ఉన్నాయి. నేను కేవలం కమెడియన్‌ను మాత్రమే కాదు. నా అదృష్టం ఏంటంటే.. భారతీ రాజా, మణిరత్నం, రాజీవ్‌మేనన్‌, విశ్వనాథ్‌, జంధ్యాలలాంటి గొప్ప వ్యక్తుల సినిమాల్లో నటించా’’


* భరణి నాకు భగవంతుడు ఇచ్చిన కొడుకు

‘‘కలిసొచ్చే కాలం వస్తే, నడిచొచ్చే కొడుకు పుడతాడని సామెత ఉంది కదా! అలా భగవంతుడు ఇచ్చిన కొడుకు తనికెళ్ల భరణి. 1966-70 మధ్యలో ఇద్దరం కలిసి నాటకాలు వేసే వాళ్లం. తను మా కుటుంబంలో సభ్యుడైపోయాడు. అతనిలో మంచి రచయిత ఉన్నాడని అప్పుడే తెలుసు. ‘ప్రేమించు పెళ్లాడు’ సినిమా నిడివి తగ్గడంతో వంశీగారికి తనికెళ్ల భరిణిని నేనే పరిచయం చేశా. అంతకుముందు తను ‘కంచు కవచం’ సినిమాకు రచయితగా పనిచేశాడు. నాకు, రాజేంద్రప్రసాద్‌, వై. విజయలకు కామెడీ సీన్లు రాస్తే బాగా పండాయి. ఆ తర్వాత ‘లేడీస్‌ టైలర్‌’ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. అలా మా ప్రయాణం సాగింది’’


* ఫోన్‌ చేసి ఉంటే రంగనాథ్‌ బతికి ఉండేవారేమో!

‘‘రంగనాథ్‌ చనిపోయే ఒక్కరోజు ముందు నేను ఏదో మలయాళ సినిమాకు తెలుగు డబ్బింగ్‌ చెబుదామని స్టూడియోకు వెళ్లా. లోపలికి వెళ్లే సమయంలో నా ఫోన్‌ ఒక వ్యక్తికి ఇచ్చి వెళ్లాను. అదే సమయంలో రంగనాథ్‌ ఫోన్‌ చేశారట. అయితే, బయటకు రాగానే ఆ వ్యక్తి రంగనాథ్‌ ఫోన్‌ చేసిన విషయం నాకు చెప్పలేదు. సాయంత్రం ఎప్పుడో చెప్పాడు. ‘తర్వాత మాట్లాడదాం లే’ అన్న ఉద్దేశంతో నేనూ అశ్రద్ధ చేశా! కానీ, మరుసటి రోజు ఆయన మరణవార్త విని దిగ్భ్రాంతికి గురయ్యా. ఆ రోజు నేను ఫోన్‌ చేసి ఉంటే, నాతో ఏం మాట్లాడేవారో.. అందుకు నేను ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నా’’


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.