ప్రతినాయకుడిగా...అప్రతిహతంగా!

కొన్ని సినిమాల ద్వారా కొందమంది విశేష ప్రాచుర్యంలోకి వస్తారు. తర్వాత్తర్వాత ...ఆ సినిమానే ఇంటిపేరుగా లబ్ధప్రతిష్టులవుతారు...అచ్చం ‘అంకుశం’ రామిరెడ్డిలా. ‘అంకుశం’ చిత్రం డాక్టర్‌ రాజశేఖర్‌కి యాంగ్రీ యంగ్‌ మాన్‌ ఇమేజ్‌ తీసుకువస్తే...అందులో ప్రతినాయకుడి పాత్రలో పరకాయప్రవేశం చేసి అశేష ప్రేక్షకుల్ని అబ్బురపరిచి ‘ఔరా’ అనిపించుకున్న రామిరెడ్డి ఆనతికాలంలోనే ‘అంకుశం’ రామిరెడ్డిగా పేరు తెచ్చుకున్నారు. ‘స్పాట్‌ పెడతా..’ అంటూ 1990లో ‘అంకుశం’తో ఎంట్రీ ఇచ్సిన రామిరెడ్డి కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 250 చిత్రాల్లో నటించి మెప్పించారు. కరడు కట్టిన విలన్‌గానే కాకుండా కామెడీ పాత్రల్లోనూ తన ప్రజ్ఞ నిరూపించుకున్నారు. ఏప్రిల్‌ 14న ఆయన వర్ధంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వినోద సీమలో ఆయన మిగిల్చి వెళ్లిన ‘కదిలే బొమ్మ’ల కబుర్లు కొన్నిటిని గుర్తు చేసుకుందాం.వాయల్పాడు నుంచి ఫిలిం నగర్‌ దాకా

ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరు జిల్లా వాల్మీకిపురం... ప్రస్తుత వాయల్పాడులో 1959 జనవరి 1న రామిరెడ్డి పుట్టారు. ఇంటిపేరు గంగసాని...కాగా, ‘అంకుశం’ రామిరెడ్డిగా ప్రేక్షకులకు సుపరిచితం. ఉస్మానియా యూనివర్సిటీలో బీసీజే జర్నలిజం చేసి... చిత్రసీమపై మక్కువ ఎక్కువ కాగా తెరపై కనిపించాలనే కోరికతో ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ క్రమంలోనే 1990లో ‘అంకుశం’ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసే అవకాశాన్ని ఆయన దక్కించుకున్నారు. సినిమా రంగానికి రాకముందు జర్నలిస్ట్‌గా కొద్దికాలం పనిచేసారు. ‘అంకుశం’ చిత్రం రొటీన్‌కి భిన్నంగా ఉండడంతో విజయాన్ని చవి చూసింది. ఆ చిత్రంతో వరుస అవకాశాలు రామిరెడ్డిని వరించి వచ్చాయి. 1990లో కన్నడ సీమకి ప్రవేశించి ‘అభిమన్యు’ సినిమా చేసారు. అదే సంవత్సరం తెలుగులో సంచలనం సృష్టించిన రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి, శ్రేదేవి నటించిన ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’ చిత్రంలో అబ్బులు పాత్రలో మెరిశారు. కాస్త కామెడీ టచ్‌ ఉన్న విలన్‌ పాత్ర ఇది. తెలుగు ‘అంకుశం’ హిందీలో ‘ప్రతిబంద్‌’గా రీమేక్‌ అయినప్పుడు... అక్కడ కూడా గ్యాంగ్‌స్టర్‌ ‘స్పాట్‌ నానా’ పాత్రని జనరంజకంగా పోషించారు. 1991లో మలయాళం లో ‘అభిమన్యు’, తమిళ్‌లో ‘నాడు అతయ్‌ నాడు’, తెలుగులో రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘క్షణక్షణం’లో ఇన్‌స్పెక్టర్‌ యాదవ్‌ పాత్రల్లో ప్రశంసా పాత్రంగా నటించారు. 1992లో తెలుగులో ‘420’ ‘బలరామ కృష్ణులు’, ‘పెద్దరికం’, మలయాళంలో ‘మహాన్‌’ చిత్రాల్లో నటించారు. 1993లో మళ్ళీ ఆర్జీవీ దర్శకత్వంలో ‘గాయం’, హిందీలో ‘వక్త్‌ హమారీ హై’ చిత్రాల్లో కీలకభూమికలు పోషించారు. 1994లో తెలుగులో ‘అల్లరి ప్రేమికుడు’, హిందీలో ‘ఇలాన్‌’, ‘దిల్‌ వాలే’, ‘ఖుద్దార్‌’ సినిమాల్లో నటించారు. 1995లో తెలుగులో వచ్చిన ‘అమ్మోరు’ చిత్రం ద్వారా రామిరెడ్డి మరో మెట్టు ఎదిగారు. అదే సంవత్సరం హిందీలో ‘అంగరక్షక్‌’, ‘ఆందోళన్‌’, ‘హాకీకత్‌’, ‘వీర్‌’ చిత్రాల్లో నటించారు. 1996లో హిందీలో ‘అంగారా’, ‘రంగ్‌ బాజ్‌’ చిత్రాల్లో నటించారు. 1997లో ఆర్జీవీ దర్శకత్వంలో ‘అనగనగా ఒక రోజు’, ‘హిట్లర్‌’ చిత్రాల్లో నటించారు. అదే సంవత్సరం హిందీలో ‘జీవన్‌ యుద్ద్‌’, ‘కాలియా’, ‘లోహ’ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు.

‘ఒసేయ్‌ రాములమ్మ’తో విఖ్యాతి

1997లో ‘ఒసేయ్‌ రాములమ్మ’ రామిరెడ్డి సినీ ఖ్యాతిని మరింత పెంచింది. ఇందులో ల్యాండ్‌ లార్డ్‌ జగనాయక్‌ పట్వారి పాత్రకి రామిరెడ్డి ప్రాణం పోశారు. ఇలా అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటూ చిత్ర చిత్రానికి అంచెలంచెలుగా ఆయన ఎదిగారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో కూడా బాగా గుర్తింపు పొందారు. 2001లో ‘మృగరాజు’, 2003లో ‘రాఘవేంద్ర’, ‘సాంబు’, ‘విలన్‌’, 2004లో ‘అంజి’, ‘శేషాద్రి నాయుడు’, 2005లో ‘పెళ్ళాం పిచ్చోడు’, ‘శ్లోకం’, ‘అతనొక్కడే’, ‘నాయకుడు’, ‘భామాకలాపం’, 2006లో ‘సామాన్యుడు’, 2008లో ‘అదే నువ్వు’, 2009లో ‘జగద్గురు శ్రీ షిరిడి సాయిబాబా’, 2010లో ‘దమ్మున్నోడు’, ‘సందడి’, ‘అనగనగా ఓ అరణ్యం’ చిత్రాల్లో పేరెన్నికగన్న పాత్రలు పోషించారు. చిత్తూరు జిల్లాకు చెందినవాడయినా తెలంగాణా యాసలో మంచి పట్టు సాధించారు. అదే పట్టు ఆయన చిత్ర విజయాలకు ప్రధాన కారణమయ్యాయి.

తిరిగిరాలేని దూర తీరాలకు...

రామిరెడ్డి కిడ్నీ సమస్యలతో 2011 ఏప్రిల్‌ 14న సికింద్రాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చివరి శ్వాస వదిలారు. మరణించేనాటికి ఆయన వయసు 52 సంవత్సరాలు. రామిరెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఆయన మరెన్నటికీ తిరిగి రాలేని దూరతీరాలకు తరలిపోయినా...ఆయన వదిలి వెళ్లిన చిత్రాలు, పోషించిన పాత్రలు...ఆయన్ని గుర్తు చేస్తూనే ఉంటాయి.

- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌ Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.