మానవత్వం పరిమళించిన మంచి నటుడు -రంగనాథ్‌
సైలెన్స్‌...స్టార్ట్‌ కెమెరా... సాంకేతిక పదాల మధ్య రంగుల ప్రపంచంలో తళుక్కుమనే కొంతమంది తారల తెర వెనుక జీవితాలు గుండెల్ని కలచివేసే దుర్భర స్థితిలో ఉన్నాయన్న నగ్న సత్యం అడపాదడపా వెలుగు చూస్తూనే ఉంటాయి. పైకి ఎంతో నిబ్బరంగా కనిపించినా...లోలోన కృంగి కృశించి చివరాఖరికి బలవన్మరణాన్ని సైతం స్వాగతించడం లాంటి ఘటనల గురించి వింటుంటే... వెండి తెర తారలు కూడా మామూలు మనుషులేనని... వారూ భావోద్వేగాలు తట్టుకోలేని పరిస్థితుల్లో జీవితం నుంచే సెలవు తీసుకునేందుకయినా వెనుకాడరని అర్ధమవుతుంది. ఆత్మహత్య చేసుకోవడం తప్పని... ఆత్మ స్థయిర్యం పెంచుకోవాలని పదే పదే యువతకు బోధించిన వ్యక్తే బలవంతంగా తనువు చాలించడం శోచనీయం. రంగనాధ్‌ పేరు తలచుకోగానే... ఆయన నటించిన సినిమాల కన్నా... విషాదాంతమైన జీవితం గుర్తొచ్చి ప్రేక్షకుల గుండె చెరువవుతుంది. ఎన్ని విజయవంతమైన చిత్రాల్లో ఆయన నటించారో...? ఎన్ని మాధురీభరిత గీతాలకు అభినయనాన్ని అద్దారో...? ఆయనే తిరుమల సుందర శ్రీ రంగనాధ్‌. ఈరోజు ఆయన (డిసెంబర్ 19, 2015)   వర్ధంతి. ఈ సందర్భంగా రంగనాధ్‌ గురించి..


చూడగానే ఆకట్టుకునే రూపం...గంభీరమైన స్వరం... ఏ పాత్రలోనైనా ఇట్టె ఇమిడిపోయే నటనంతో నిన్నటి తరం ప్రేక్షకులను ఆయన ఎంతగానో అలరించారు. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, కేరెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఆయన అటు సినిమా, ఇటు టెలివిజన్‌లో కనిపించి మెప్పించారు. అంతేనా? ఆయన స్వతహాగా కవి. ఎన్నో కవితలు రాసి పుస్తక రూపంలో తెచ్చారు.

రంగనాధ్‌ పేరు చెప్పగానే ‘పంతులమ్మ’, ‘జమీందారుగారమ్మాయి’, ‘అందమే ఆనందం’, ‘అమెరికా అమ్మాయి’, ‘రామచిలుక’, ‘ఇంటింటి రామాయణం’...ఇలా అనేక మంచి చిత్రాలు జ్ఞాపకమొస్తాయి. ఆయా చిత్రాల్లో పాటలన్నీ జనాదరణ పొందినవే.


అవి పాటలా... తేనెల ఊటలు
‘పంతులమ్మ’ చిత్రంలో అన్ని పాటలు సూపర్‌ హిట్‌. ‘మానసవీణా మధుగీతం...మన సంసారం సంగీతం...సాగర మధనం అమృత మధనం... సంగమ, సరిగమ స్వరపారిజాతం...’ అనే వేటూరి పాట ఇప్పటికీ రసజ్ఞులైన శ్రోతల్ని వెంటాడుతుంది. ఇదే పాటకు మొట్టమొదటిసారి వేటూరికి నంది పురస్కారం దక్కింది. తాను నటించిన ఆ పాటకు వేటూరికి దక్కిన ఆ పురస్కారానికి రంగనాథ్‌ ఎంతో సంతోషించారు. అదే సినిమాలో ‘సిరిమల్లె నీవే... విరిజల్లు కావే... వరదల్లె రావే...వలపంటే నీవే... వెన్నెల్లు తేవే...ఏడ మీటి పోవే...’ అన్నపాట లలితంగా హృదయాల్ని తాకుతుంది. అలాగే... ‘ఎడారిలో కోయిలా...తెల్లారని రేయిలా... పూదారులన్నీ గోదారి కాగా... పాడింది కన్నీటి పాట’ అన్న పాట కూడా హృద్యంగా ఉంటుంది. ‘ఇంటింటి రామాయణం’ చిత్రంలో కూడా..‘వీణ వేణువైన సరిగమ విన్నావా? తీగ రాగమైన మధురిమ కన్నావా?’ పాట కూడా జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది. ‘జమీందార్‌గారమ్మాయి’ చిత్రంలో ‘మోగింది వీణా పదే పదే హృదయాలలోనా ... ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే...’ అన్న పాట, ‘అందమే ఆనందం’ సినిమాలో ‘మధుమాసవేళలో... మరుమల్లె తోటలో... మనసైన చిన్నది...లేదేలనో?’ అన్న పాట కూడా జనరంజకమైనది. ‘అమెరికా అమ్మాయి’ చిత్రంలో ‘ఆమె తోటి మాటుంది... పెదవి దాటి రాకుంది... ఏముందో...ఆ చూపులో...?’ అన్న పాట కూడా హిట్‌ అయింది.


రంగనాధ్‌కి ఇష్టమైన చిత్రాలు
‘పంతులమ్మ’, ‘ఇంటింటి రామాయణం’, ‘జమీందారుగారమ్మాయి’, ‘అమెరికా అమ్మాయి’, ‘అందమే ఆనందం’ చిత్రాలు ఎంతో ఇష్టమని రంగనాధ్‌ అప్పట్లో చెప్పారు. ఆ సినిమాల్లో వ్యక్తిత్వం ఉన్న పాత్రల చిత్రీకరణతో పాటు...పాటలు కూడా సూపర్‌ గా వచ్చాయని అనేవారు.

హీరో పాత్రల విషయంలో అసంతృప్తి
హీరోగా తాను నటించిన చిత్రాలన్నీ నాయికా ప్రాధాన్యత ఉన్న చిత్రాలు కావడం వల్ల పూర్తి స్థాయి హీరోగా నిలదొక్కుకోలేకపోయాననే అసంతృప్తి రంగనాథ్‌లో చాలాకాలం ఉంది. తనని హీరోగా నిలబెట్టేందుకు అప్పట్లో తనకు తనకెవరూ లేరని ఒకానొక ముఖాముఖి ఇంటర్వ్యూలో బాధపడ్డారు. ఆలాంటి ఓ వ్యక్తి తనకు అండగా ఉంటే.. .. ఆ సినిమాలు ఆది విజయవంతమైతే... తన కెరీర్‌ మరోలా ఉండేదన్న అభిప్రాయం ఆయనలో ఉండేది. ఇండస్ట్రీలో మద్దతుగా నిలిచేవారు లేకపోవడంతో...అందివచ్చిన అవకాశాలతో సరిపెట్టుకుంటూ... వివిధ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారాయన. ఆ క్రమంలోనే... కేరెక్టర్‌ ఆర్టిస్ట్‌గా అతి తొందరగా మారిపోయారు.


సినీ అరంగేట్రం
బాపు రమణల ‘బుద్దిమంతుడు’ చిత్రంలో చిన్న పాత్ర ద్వారా రంగనాథ్‌ సినీ రంగప్రవేశం చేసారు. ఆ తరువాత హీరోగా ‘చందన’ సినిమాతో పూర్తి నిడివిగల పాత్రలో నటించారు. ‘చందన’ సినిమాలో నటిస్తున్నప్పుడే నటుడిగా మంచి మార్కులు పడ్డాయని రంగనాథ్‌ తరచూ చెప్పేవారు. సినిమా విడుదలకు ముందే ఇండస్ట్రీలో ఆ రకమైన సానుకూల స్పందన రావడంతో... చిత్రసీమలో నిలదొక్కుకోగలననే నమ్మకం రంగనాథ్‌లో కలిగింది. ‘చందన’ విడుదలైన వెంటనే ప్రతాప్‌ ఆర్ట్స్‌ అధినేత రాఘవ చిత్రం ‘చదువు సంస్కారం’ సినిమాకు రంగనాథ్‌ ఓకే చెప్పారు. తరువాత మల్లెమాల చిత్రం ‘రామయ్య తండ్రి’, ఆయన బంధువు నిర్మించిన మరో చిత్రం ‘వైకుంఠపాళి’, నవతా కృష్ణంరాజు ‘జమీందాగారమ్మాయి’...ఇలా వరుస సినిమాలు ఆయన ముందు క్యూ కట్టాయి. అంతే... రంగనాథ్‌ మరి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘అమెరికా అమ్మాయి’, ‘అందమే ఆనందం’, ‘సెక్రెటరీ’, ‘దేవతలారా దీవించండి’, ‘పంతులమ్మ’, ‘రామచిలుక’, ‘తాయారమ్మ బంగారయ్య’, ‘ఇంటింటి రామాయణం’, ‘మావూరి దేవత’, ‘ప్రియబాంధవి’, ‘లవ్‌ ఇన్‌ సింగపూర్‌’, ‘గృహ ప్రవేశం’, ‘ఖైదీ’, ‘ఆలయ శిఖరం’, ‘ఆడవాళ్లు అలిగితే’, ‘ఈ చదువులు మాకొదు’్ద....ఇలా చాలా సినిమాల్లో నట ప్రతిభ కనబరిచారు. ‘మెరుపు దాడి’, ‘విజేత’, ‘అడవి దొంగ’ చిరంజీవి ‘ఎడడుగుల బంధం’, ‘ఇంటికో రుద్రమ్మ’, ‘వేట’, ‘దొంగమొగుడు’, ‘గాంధీ నగర్‌ రెండో వీధి’, ‘భలే మొగుడు’, ‘విశ్వనాధ నాయకుడు’...ఇలా 2015 ‘గోపాల గోపాల’ వరకూ ఎన్నో చిత్రాలు చేసారు.

టెలివిజన్‌ లోనూ
ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే... బుల్లితెరపై కూడా రంగనాధ్‌ నటించారు. ఈటీవీలో ‘శాంతి నివాసం’, జీ టీవీలో ‘ఇద్దరు అమ్మాయిలు’, జెమిని టీవీలో ‘అత్తో...అత్తమ్మ కూతురో’ సీరియల్స్‌లో నటించారు.


కుటుంబ నేపథ్యం
బాల్యం అమూల్యమని రంగనాథ్‌ చెప్పేవారు. అమ్మమ్మ ఊళ్ళో పెరిగానని... అది చిన్న పల్లెటూరు అని చెప్తూ ఆవులు, మేకలు, పశువులు, పక్షులతో సాన్నిహిత్యం ఉండేదని సంబరపడేవారు. రంగనాథ్‌ 1949 జులై 17న చెన్నయ్‌లో పుట్టారు. తండ్రి టి.ఆర్‌.సుందర రాజు, తల్లి టి.ఆర్‌.జానకీ దేవి. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఆయన బిఎ చదివారు. చిన్నప్పటినుంచి ఆర్టిస్ట్‌ కావాలని ఆశ పడ్డారు. కారణం...ఆయన తల్లి నేపధ్య గాయని కావాలని కోరుకుంది. కానీ... అవలేకపోయింది. తన సంతానంలో ఎవరైనా ఆర్టిస్ట్‌ అయితే బాగుండునని ఆమె కోరుకునేవారట. ఆ సంకల్ప బలమే తనని ఆర్టిస్ట్‌గా చేసిందని రంగనాథ్‌ భావించేవారు. రంగనాధ్‌కి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు. భార్య చైతన్య.

భార్యంటే ఎంతో ప్రేమ
రంగనాథ్‌కి భార్య చైతన్య అంటే విపరీతమైన ప్రేమ. ఒక ప్రమాదంలో చిక్కుకుని నడుం విరిగినందున కదలలేని పరిస్థితిలో ఉన్న భార్యను కంటికి రెప్పలా ఆయన చూసుకున్నారు. అందుకోసం కొన్ని సినిమా అవకాశాల్ని కూడా వదులుకున్నారు. ఆయన భార్య 2009లో మరణించడంతో ఆమె లేని ఒంటరితనం ఆయన్ని బాగా కృంగదీసింది. ఎంతోమందికి చనిపోవద్దని చెప్పిన రంగనాథ్‌ చివరికి... తన మాటల్ని మరిచిపోయి 2015 డిసెంబర్‌ 19న బలవన్మరణంతో శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలి వెళ్లారు.


ఎవరు బండ ...ఎవరు దేవుడు?
రంగనాథ్‌ కవితల్లో సుప్రసిద్ధమైన కవిత .. ఎవరు బండ ...ఎవరు దేవుడు? సామజిక స్పృహ ఉన్న కవిత ఇది. అదేదో ఊరి నుంచి మహాశిల్పి వచ్చాడు... మరేదో ఊరినుంచి బండరాయి తెచ్చారు... ఆరడుగులు పరచాపెట్టి బండను ఖండించాడు...మిగిలిన మూడడుగుల ముక్కను పక్కకు తోసేసాడు... ఆరడుగుల బండేమో విగ్రహమై వెలసింది... మూడడుగుల ముక్క బండ చాకి రేవు చేరింది... కంపు కంపు మనస్సులన్నీ దేవుడి దగ్గరికి చేరాయి... కంపు కొట్టే బట్టలన్నీ బండ చుట్టూ చేరాయి... గొంతెమ్మ కోర్కెల గొంతులన్నీ తీర్థంతో తడిసాయి... మురికి మరకల బట్టలన్నీ నీటిలో మునిగాయి... శఠగోపం పవిత్రంగా ప్రతి తలని తాకుతోంది...పవిత్రత కోసం ప్రతిబట్టా బండను బాదుతోంది... కడకు గుడి నుంచి మనస్సులన్నీ కంపుతోనే వెళ్లాయి... రేవు నుండి బట్టలన్నీ ఇంపుగా వెళ్లాయి... గుడిలోని దేవుడా? రేవులోని బండా? ఎవరు దేవుడు? ఇదీ...రంగనాధ్‌ రాసిన... ప్రముఖులు మెచ్చిన కవిత. ఇంత సామాజిక స్పృహ ఉన్న రంగనాథ్‌ ఓ బలహీన క్షణంలో తనువు చాలించడం...ఆయన అభిమానులు ఎప్పటికీ జీర్ణించుకోలేని ఘటనే.

- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.