సినీ వినీలాకాశంలో రేవతీ నక్షత్రం
క్కడ ఫ్యాషన్ షో జరుగుతోంది. చక్కగా మేకప్ వేసుకున్న స్కూల్ విద్యార్థినులు వేదికపై హొయలు పోతున్నారు. కెమెరాలు క్లిక్ మంటూ ఛాయాచిత్రాల్ని చక చక తీసేస్తున్నాయి. తమిళ నాట అత్యధిక జనాదరణ ఉన్న ఓ పత్రిక ఫోటోగ్రాఫర్...ఫ్యాషన్ షో లో పాల్గొన్న గ్రూప్ ఫోటో కవర్ పేజీగా ఎంపిక చేసారు.
కట్ చేస్తే... తన చిత్రాల ద్వారా సరికొత్త ట్రెండ్ సృష్టించిన ఓ దర్శకుడు ... త్వరలో తీయబోయే చిత్రం కోసం కొత్త తారల అన్వేషణ చేస్తున్నారు. అదే సమయంలో ఆ పత్రిక ముఖ చిత్రంగా ప్రచురితమైన ఫ్యాషన్ షో ఆయన కంటపడింది. గ్రూప్ ఫోటో లో చాలామంది ఉన్నా ఒక అమ్మాయి మాత్రమే ఆ దర్శకుడిని ఎంతగానో ఆకర్షించింది. వెంటనే... తన హీరోయిన్ దొరికిందని ఎగిరిగంతేశాడు.


ఒక్క ఫ్యాషన్ షో ఓ అమ్మాయిని రంగుల ప్రపంచానికి పరిచయం చేస్తుందని... ఆ అమ్మాయితో పాటు ఆ ఫ్యాషన్ షో లో పాల్గొన్న సహా విద్యార్థినులకు ఎంతమాత్రం తెలీదు.
ఆ షో ద్వారా సినీవినీలాకాశంలోకి ఓ కొత్త తార పుట్టుకొచ్చింది. ఆ తారక రేవతి... ఆమెని తెరకు పరిచయం చేసిన దర్శకుడు ది గ్రేట్ డైరెక్టర్ భారతీ రాజా.

భారతీ రాజా సినీ వ్యాకరణాన్ని సమూలంగా మార్చేశారు. పల్లె సీమల్లోని మట్టి పరిమళాన్ని వెండితెర కి అద్దుతూ ...సహజత్వానికి అతి దగ్గరగా ఉన్న పాత్రల్ని కళ్ళముందు ఆవిష్కరిస్తూ ప్రేక్షకుల హృదయాల్ని తడిమే భావోద్వేగాల సమ్మేళనంతో ఆయన తీసిన చిత్రాలు ఔత్సాహిక దర్శకులకు పాఠాలు. భారతీ రాజా స్కూల్ నుంచి ఓ ఆర్టిస్ట్ వచ్చిందంటే... కొన్ని దశాబ్దాల భవిష్యత్ భరోసా ఉన్నట్లే. అంతెందుకు...? భారతీ రాజా తీసిన 16 వయతినిలే సినిమా భారతీయ భాషల్లో ఎంత పేరు గడించిందో తెలిసిన విషయమే. అలాంటి దర్శకుడి చిత్రం మన్ వాసనై చిత్రం ద్వారా రేవతి పరిచయం అయ్యారు. ఇక... అప్పటినుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు.


* బహుముఖ సృజన..
రేవతి ఏ ముహూర్తంలో సినీ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యిందో... తన ముద్రతో ప్రత్యేకతను సాధించుకుంది. మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో నటించి మెప్పించడమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, డైరెక్టర్ గా ప్రతిభ చాటుకున్నారు. టెలివిజన్ స్క్రీన్ పై కూడా సత్తా చాటుకుని పలు ప్రోగ్రామ్స్ కి సృజన అద్దారు. కథానాయికగా ఓ పక్క గ్లామర్ పాత్రలు పోషిస్తూనే...మరో పక్క అభినయం ప్రాధాన్యం గల పాత్రల్లోనూ మకుటం లేనే రారాణిగా రాణించారు. ప్రతిభకు గుర్తింపుగా ఆమెకి అనేక అవార్డులు, రివార్డులు వచ్చాయి. క్లిష్టతరమైన పాత్రల్ని పోషించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. జాతీయ స్థాయిలో సినిమా రంగానికి చెందిన మూడు విభిన్న విభాగాల్లో అవార్డులు స్వీకరించారు. ఫిలిం ఫేర్ అవార్డులతో పాటు అనేక సాంస్కృతిక సంస్థల నుంచి గౌరవ పురస్కారాలంలు ఆమె అందుకున్నారు.

* భరతనాట్య కళాకారిణిగా..
చిన్నతనం నుంచే ఆమె కి కళలంటే మక్కువ ఎక్కువ. చదువుకుంటూనే... తనకెంతో ఇష్టమైన భరతనాట్యంలో సుశిక్షణ పొందారు. ఏడేళ్ల వయసులోనే చెన్నయ్ లో ఆమె భరత నాట్య అరంగేట్రం చేసారు. పెరిగి పెద్దయి సినిమాల్లో గుర్తింపు పొందిన తర్వాత సామాజిక భాద్యతగా పలు సేవ కార్యక్రమాలు ఆమె నిర్వహించారు. ఆ క్రమంలో బనియన్, ఎబిలిటీ ఫౌండేషన్, ట్యాంకర్ ఫౌండేషన్...లాంటి సేవాసంస్థలతో అనుసంధానం అయ్యారు. అంతే కాకుండా..పలు చిత్రోత్సవాల నిర్వహణ కమిటీలో సభ్యురాలుగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె భారత్ లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలోనూ, చెన్నయ్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లోనూ భాగస్వామ్యం అయ్యారు.


* రేవతి గా మారిన ఆశ కెలున్నీ..
ఆశ కెలున్నీ అసలు పేరు. వెండితెర పేరు రేవతి. 1966 జులై 8న కేరళ కొచ్చి లో ఆమె జన్మించారు. మలన్ కట్టి కేలున్నీ, లలిత కెలన్నీ ఆమె తల్లి తండ్రులు. తండ్రి ఆర్మీలో పనిచేసేవారు. కూతురు కళల్లో రాణించాలని చిన్నతనంలోనే వారు భరతనాట్యం నేర్పించారు. సినీ రంగంలో విజయాలు చవి చూసినా...వ్యక్తిగత జీవితంలో కొన్ని ఆటుపోట్లను రేవతి ఎదురుకొన్నారు. సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ సురేష్ చంద్ర మీనన్ ను రేవతి 1986లో వివాహమాడారు. వారిద్దరికి పిల్లలు లేరు. అభిప్రాయభేదాల కారణంగా 2002 నుంచి విడివిడిగా ఉండేవారు. చెన్నై అడిషనల్ ఫ్యామిలీ కోర్టు 2013 ఏప్రిల్ 23న వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. కాగా, 2018లో రేవతి కృత్రిమ ఫలదీకరణ ద్వారా తనో కూతురికి జన్మనిచ్చినట్లు...ఆ అమ్మాయికి ఐదేళ్లు అంటూ బహిరంగంగా ప్రకటించారు. ఈ ప్రకటన ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. రేవతి కూతురు పేరు మహి.

* తెలుగులో రేవతి చిత్రాలు..
వివిధ భాషల్లో నటించిన రేవతి తెలుగువారికి కూడా సుపరిచితం. మానస వీణ, సీతమ్మ పెళ్లి, రావుగారిల్లు, ప్రేమ, లంకేశ్వరుడు, అంకురం, గాయం, గాయం -2, గణేష్, ఈశ్వర్, అనుక్షణం, లోఫర్, సైజ్ జీరో, బ్రహ్మోత్సవం, యుద్ధం శరణం...లాంటి సినిమాల్లో నటించారు. ప్రేమ చిత్రంలో ఆమె యువతకు దగ్గరయ్యారు. ఆ సినిమాలోని పాటలు ఇప్పటికీ జనం నాలుకలపై నర్తిస్తూనే ఉన్నాయి. గాయం, గాయం -2 చిత్రాల్లో సామాజిక స్పృహ కలిగించే పాత్రల్లో ఆమె కనిపించి ప్రజాదరణ పొందారు.


* దర్శకురాలిగా అసమాన ప్రతిభ..
దర్శకురాలిగా రేవతి అనుపమానమైన ప్రతిభ కనబరిచారు. దర్శకత్వం వహించినవి నాలుగు సినిమాలే అయినా...వాటిలో ఓ ఆంగ్ల చిత్రం, రెండు హిందీ చిత్రాలు, ఒక మలయాళ చిత్రం ఉన్నాయి. ఆంగ్ల చిత్రం ... మిత్ర్ ...మై ఫ్రెండ్ ఆమెకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చింది. ఉత్తమ ఆంగ్ల చిత్రం గా జాతీయ పురస్కారం రేవతి స్వీకరించారు. కుటుంబం పట్ల బాధ్యత గా తపన పడే ఓ చిన్న పల్లెటూరు అమ్మాయి ఎదుర్కొన్న సవాళ్లు, సమస్యల చిత్రీకరణే మిత్ర్ ... మై ఫ్రెండ్ కధ. తమిళనాడు చిదంబరం అనే వూళ్ళో నుంచి పెళ్లి తర్వాత కాలిఫోర్నియా కి వెళ్లిన కధానాయిక లక్ష్మి .. తను పుట్టి పెరిగిన సంస్కృతికి దూరంగా మరో అత్యాధునిక సంస్కృతి కి దగ్గరైన సందర్భంలో ఎదురైన సంఘటనల సమాహారమే ఈ చిత్రం. కొత్తగా పరిచయమైన సంస్కృతిలో ఇమడలేక, వివాహ కారణంగా అలవాటయిన తన సంస్కృతిలోకి తిరిగి వెళ్లలేక నాయిక పడే మానసిక క్షోభ కి ఈ చిత్రం అద్దం పడుతుంది. పెళ్లి తర్వాత ఈ దంపతులకు ఆడపిల్ల పుడుతుంది. ఆ పాప పేరు దివ్య. తను పెరిగి పెద్దవుతూ తల్లికి సమస్యగా మారుతుంది. పార్టీలకు తరచూ వెళ్తూ కాదని వారించే తల్లిని ఎదిరిస్తుంటుంది. ఈ నేపథ్యంలో తల్లీ కూతుర్లకు నడుమ ఘర్షణ తలెత్తుతుంది. ఒకానొక సందర్భంలో దివ్య తన బాయ్ ఫ్రెండ్ ని ముద్దాడుతుండగా తల్లి లక్ష్మి చూస్తుంది. తాను పెరిగిన సంప్రదాయ నేపథ్యం పెళ్ళికి ముందు ఈ తరహా దగ్గరితనాన్ని అంగీకరించదు. దాంతో...మళ్ళీ తల్లి కూతుర్ల మధ్య యుద్ధ వాతావరణం మొదలవుతుంది. దివ్య ఇంటి నుంచి వెళ్ళిపోయి తన బే ఫ్రెండ్ తో ఉండిపోవడం... లక్ష్మి భర్త ఈ పరిణామాలకు లక్ష్మిని భాద్యురాలిని చేయడం... ఆ సమయంలో ఇంటర్నెట్ ద్వారా మిత్ర్ పరిచయం కావడం... తనతో భావావేశాలన్ని వ్యక్తం చేయడం... సంభాషణల్లో ఉపశమనం కలిగించడం... దివ్య బాయ్ ఫ్రెండ్ తో బ్రేక్ అప్ కావడం... తాను చేసిన పనులకు ప్రశ్చాత్తాపపడడం... ఈ చిత్ర కధ నడిచిన తీరు. నాయిక లక్ష్మి పాత్రలో శోభన నటించగా రేవతి దర్శకత్వం ఈ చిత్రాన్ని అర్ధవంతం చేసింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పలు చిత్రాల్లో పనిచేసారు. టెలివిజన్ షోలలో కూడా ప్రతిభ కనబరిచారు.


* అందుకున్న అవార్డులు
చలన చిత్ర సీమకి అందించిన సేవలకు గుర్తింపుగా రేవతి పలు అవార్డులు అందుకున్నారు. ముచ్చటగా మూడుసార్లు జాతీయ పురస్కారాలు స్వీకరించారు. 1992లో తేవర్ మగన్ చిత్రానికిగాను ఉత్తమ సహాయ నటిగా, 2002లో మిత్ర్ ...మై ఫ్రెండ్ ఉత్తమ ఆంగ్ల చిత్రంగా, 2011లో రెడ్ బిల్డింగ్ వేర్ ది సన్ సెట్స్ అనే నాన్ ఫీచర్ ఫిలిం విభాగంలో జాతీయ అవార్డులను రేవతి అందుకున్నారు. 1990లో కిజక్కు వాశల్ చిత్రానికిగాను ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర అవార్డు అందుకున్నారు. 1998లో తలై ములై చిత్రానికిగాను ఉత్తమ నటిగా ప్రత్యేక అవార్డును తమిళనాడు ప్రభుత్వం రేవతికి అందించింది. 2012లో మోలీ ఆంటీ రాక్స్ అని చిత్రానికిగాను సెకండ్ సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ కి ఉత్తమ నటిగా నామినేట్ అయ్యారు.


* ఫిలిం ఫేర్ సౌత్ అవార్డులు
1983లో మన్ వాసనై చిత్రానికిగాను ప్రత్యేక అవార్డు స్వీకరించారు. 1988లో కక్కోతికవిలె అప్పూపన్ తాడికల్ మలయాళ చిత్రానికిగాను ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. 1992లో అంకురం తెలుగు చిత్రంలో ఉత్తమనటి అవార్డును స్వీకరించారు. అదే సంవత్సరం తేవర్ మగన్ చిత్రానికిగాను బెస్ట్ తమిళ్ ఆర్టిస్ట్ గా అవార్డు తీసుకున్నారు. 1993లో మరుపధియమ్, 1994లో ప్రియాంక చిత్రంలో బెస్ట్ తమిళ్ ఆర్టిస్ట్ గా అవార్డు స్వీకరించారు. అదే వరుసలో సినిమా ఎక్స్ ప్రెస్, ఫిలిం ఫాన్స్ అసోసియేషన్, ది మైలాపూర్ అకాడమీ బర్కిలీ డ్రామా అవార్డులు ఆమె అందుకున్నారు.

-పి.వి.డి.ఎస్. ప్రకాష్Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.